"బాబాయ్! మగాడికి ఆడది అన్నీ ఇస్తుంది..ఒక్కటి తప్ప, ఏమిటది?"
అప్పుడే అక్కడికి ఆదుర్దాగా వచ్చిన నిర్లిప్త బాబిగాడి చెవిపట్టి "వెధవా! నువ్వెక్కడ తప్పిపోయావోనని వీధంతా తిరిగొస్తున్నాను. ఇక్కడ మెక్కుతున్నావా? నీకు బుద్దుందా? అసలు....వాళ్ళు నీకు తెల్సా?" అంది కోపంగా.
"పరిచయం చేసుకున్నాను ఆంటీ..." అన్నాడు భయంగానే.
"ఏమనుకోకండి సుగాత్రిగారు. వీడిలాంటి గడుగ్గాయే. మాటల్తో బోల్తా కొట్టిస్తాడు" అంది నిర్లిప్త వాడి చెవి మెలిపెడుతూ.
"వూరుకో నిర్లిప్తా! వాడు, వాడి మాటలు మొద్దొస్తున్నాయి. చిన్న పిల్లలకు అవేం తెలీవుకదా!" అంది సుగాత్రి.
"పర్లేదు నిర్లిప్తా! తిననీలే! నిఖిల్ ఆఫీస్ కెళ్ళిపోయాడా..ఈ రోజుకు బాబీ ఇక్కడే వుంటాడు" అన్నాడు శరత్ తినటం ముగించి వాష్ బేసిన్ దగ్గరికెళ్తూ.
"అవును...ఈ రోజు వాడిని ఇక్కడే వుండనీ" అంది సుగాత్రి.
"వాడు ఒక్కరోజుకే మీ ముక్కుపిండి ముప్పతిప్పలు పెడతాడు. మీ ఇష్టం మరి" అంది నిర్లిప్త.
"తప్పకుండా వుంటానుగాని...ఇప్పటి క్వొశ్చన్ కు ఆన్సర్ చెప్పండి" అన్నాడు బాబీ ధీమాగా.
"ఆడది మగాడికి అన్నీ ఇస్తుంది...ఒక్కటి తప్ప, అదే కదూ" అంది సుగాత్రి.
"అవును. నిఖిల్ అంకుల్....ఆంటీకి వేసిన ప్రశ్న."
"అవునండీ...ఇప్పటి వరకూ బుర్ర బద్దలు కొట్టుకున్నా జవాబు తట్టలేదు. ఆయన ఆఫీసు నుండి వచ్చేసరికి చిక్కుముడి విప్పాలి...చాలెంజిగా..." అంది నిర్లిప్త.
"ఏమండీ....మీకేదైనా ఆన్సర్ తట్టిందా?" అంది సుగాత్రి శరత్ వైపు చూస్తూ.
వెళ్ళబోతున్న శరత్ ఆగి నవ్వాడు.
"ఆడవాళ్ళు కాబట్టి ఆ జవాబేదో మీకే తెలుసుండాలి" అన్నాడు.
"భలేవారే! ఆడవాళ్ళు గురించి మగాళ్ళకే ఎక్కువ తెలుసు ఈ రోజుల్లో అందులో భార్యా భర్తలయినపుడు ...భార్య గురించి భర్తకే ఎక్కువ తెలుసుండాలి." అంది సుగాత్రి.
"ఇది భార్యా భర్తల ప్రశ్నా పిన్నీ? అందుకేనేమో నాకు జవాబు తట్టలేదు. నాకు భార్య లేదుగా మరి" బాబిగాడు బుంగమూతి పెడుతూ అన్నాడు.
"ఛస్....నువ్వు నోర్మూసుకో" అంది నిర్లిప్త. శరత్ మరోసారి నవ్వాడు.
"నిఖిల్ కి ఇలాంటి ఛాలెంజ్ లంటే చాలా ఇష్టమా? అయినా ఆడది మగాడికి అన్నీ ఇచ్చి.... ఇవ్వలేనిదేముంటుంది? ఒక్క తన ఇంటిపేరు తప్ప" అన్నాడు శరత్.
మిగతా ఆ ముగ్గురి మెదళ్ళలో ట్యూబ్ లైట్ వెలిగింది.
"కరెక్ట్ అన్నయ్యా! ఆడది 'ఇంటిపేరును' మాత్రం ఇంటిదగ్గరే విడిచిపెట్టి వస్తుంది. వరకట్నం నుండి వయసు సొగసుల వరకు అన్నీ తెచ్చి ఇచ్చినా, ఇవ్వలేనిది అదొక్కటే అయివుంటుంది....థాంక్స్" అంది నిర్లిప్త సమాధానం దొరకి నందుకు ఆనందంగా.
"నిజం సుమండీ...ఇంటి పేరే అయ్యుండాలి" అంది సుగాత్రి కూడా.
"ఆంటీ...ఈ సమాధానం చెప్పి అంకుల్ తో గెల్చి స్వీట్ తినొచ్చు ఎంచక్కా" అన్నాడు బాబీ. శరత్ అక్కన్నించి ఇండస్ట్రీస్ కు వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు.
* * * *
ఆ రోజు వచ్చిన అభిమానులకు ఉత్తరాల్ని చూస్తున్నాడు భార్గవ. అసంఖ్యాకంగా సీరియల్ కు సంబంధించి..ఆంద్రదేశం నలుమూలల నుండే గాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చి పడిన ఉత్తరాలు_ మీ నవల్లో చివరికి మౌనిక ఏమవుతుంది? అందరూ అడుగుతున్న ప్రశ్న. ఒక కురూపి నాయికను సృష్టించి...ఆమె ఆత్మసౌందర్యాన్ని చూడలేని సమాజం బాహ్య సౌందర్యం పట్ల చూసే అసహ్యతను సృష్టీకరిస్తూ...చిత్ర విచిత్ర మలుపు లతో సంచలనం సృష్టిస్తున్న పాత్ర మౌనిక!!
అలాంటి పాత్రను అంతం చేయాలన్న అతని ఆలోచన ముగింపుగా తుదిరూపాలు దిద్దుకొనేలేదు.
భార్గవ ఇంకా ఉత్తరాల్ని పరిశీలిస్తూనే వున్నాడు.
"హాయ్....డాడీ! గుడ్ మానింగ్" అన్నాడు బాబీ. మంచం మీదినుండి లేస్తూ.
"వెరీ గుడ్ మానింగ్...మరీ ఇంత ఆలస్యంగా లేస్తారా ఏ గుడ్ బోయ్ అయినా? స్కూల్ కు టైమవుతోంది రెడీ అవ్వాలి" అన్నాడు భార్గవ ఒక గులాబీరంగు కవర్ ను చించుతూ.
"డాడ్..."
"ఏమిట్రా..?" భార్గవ కంఠంలో విసుగు.
"డాడ్...తులసీదళం ఎవరు రాసారు?" 'సీ' అన్న అక్షరం దీర్ఘం పలుకుతూ.
భార్గవ నవ్వుకొని "ఆమాత్రం తెలీదా? యండమూరి రాసారు" అన్నాడు తల త్రిప్పకుండానే.
"షేమ్ డాడ్..షేమ్...'తులసీదళం' యండమూరి రాయలేదు. మైనంపాటి భాస్కర్ రాసాడు. వీరేంద్రనాద్ రాసింది "తులసిదళం."
"అవునవునురా బాబీ. మర్చేపోయాను. తులసిదళం కంటే ముందు రాసింది__తులసీదళం.
యండమూరిది బాగా ఫ్లాషవటంవల్ల మైనంపాటిది అంతగా గుర్తుండటం లేదెవరికీ" అన్నాడు తప్పును ఒప్పుకుంటూ భార్గవ.
కవర్ లోపలి కాగితాన్ని తీశాడు. ముత్యాల్లాంటి అక్షరాలు! చూడగానే తెలుస్తుంది ఎవరికైనా ఆడపిల్ల రైటింగని!!
"డాడ్...మరో ప్రశ్న" అన్నాడు బాబీ
"ఏమిట్రా?" అన్నాడీసారి మరింత విసుగ్గా.
"మమ్మీ అంటే ఏమిటి?"
భార్గవ చప్పున తలెత్తి చూశాడు. ఇంతవరకూ తల్లిలేని లోటు రానీయలేదు. 'తల్లి అనే' పధం గురించి వాడు డీప్ గా తెలుసుకుంటే....మానసికంగా దెబ్బతినొచ్చు. తనుండగా అమ్మ అనే పదంవైపు వాడిని ఆలోచించనీయకూడదు. అయిదేళ్ళుగా లేనిది అమ్మను తెమ్మని యిప్పుడు మారాం చేస్తే....?
