ఎంతటి అంతర్వేదనతో ఈ ఆడదాన్ని జాలిగా చూసే అన్నాడెమో జాలాది.
"పసుపుతాడు తగిలిస్తే పాడి ఆవురా__
పసుపుతాడు ముడులేస్తే ఆడదాయెరా__" అని.
అవునూ! ఆవు లేగని ఈనకపోతేనే గొడ్డు!
ఆడది పాపని ఇవ్వలేకపోతేనే గొడ్రాలు!
కాని ఇక్కడ లోపం__శరత్ ది! నింద...సుగాత్రిది.
రహస్యంగా కామాన్ని పంచుకొని__కడుపుని సమాధిగా పెంచుకొని కన్నబిడ్డల్ని తుంచుకోడానికి కడుపు చెత్తకుప్పలకు కేరింతల్ని అంకితము చేస్తున్న "కన్నె తల్లుల్ని" సృష్టించాడు ఆ దేవుడు. భర్త సౌఖ్యంతో క్రొవ్వొత్తిలా కరిగి కరిగి- ఎవరో రక్తం పంచుకోబోతున్నాడని, ప్రేగు తెంచుకోబోతున్నాడని...పెరిగే కడుపును ఆశగా నిమురుకోవాలని ఆశించే వారికీ ఆ అవకాశం లేని మాతృమూర్తుల్ని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు.
కని మర్చిపోతుంది-కన్నెతల్లి! కనడానికి అవకాశం లేక క్రుంగిపోతుంది-కన్నతల్లి!
"సుగా..." అన్నాడు శరత్.
"ఏదో చెప్పాలనుకుంటున్నారు..." సుగాత్రి మండే కళ్ళకు వెచ్చటి నీరు తగిలి ఆర్ద్రమయ్యాయి.
"నీ కడుపునా బాబు పుట్టబోతున్నాడు."
ఆమె చప్పున అతని ముఖంలోకి చూసింది. అశ్రునయనాలతో అతడు మసక మసగ్గా కన్పించాడు అతి దగ్గర్లోనైనా. తన చెవులను తానే నమ్మలేనట్టుగా- అతడేమన్నాడో అర్ధంగానట్టు చూసింది సుగాత్రి. కన్రెప్పల గుమ్మందాటి వెచ్చటి నీరు జలపాతంలా జారిపోయాక అడిగింది.
"జోక్ చేస్తున్నారా?"
"లేదు__ప్రామిస్ చేస్తున్నాను" అతని మాటల్లోని దృడాభిప్రాయంకు ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది. శరత్ మృదువుగా నవ్వాడు.
"నిజం సుగాత్రి__నీ కడుపున బాబు పుట్టబోతున్నాడు."
అది నిజమే అనుకుందో, అబద్దమే అనుకుందో అతనికి అర్ధం కాలేదు గాని, ఒక్కసారిగా ఆమె శరత్ ఒడిలోవడి బావురుమంది. శరత్ ఆలోచిస్తున్నాడు ఆమె చాలాసేపు ఏడ్చింది. క్రింది గదిలోంచి ముసలాయన దగ్గు విపరీతంగా విన్పిస్తోంది సుగాత్రికి చాలా విచిత్రంగా వుంది.
"నిజంగానా?" అంది.
"నిజం__పుట్టబోయే బాబుమీద ఒట్టు!" అన్నాడు నవ్వుతూ.
"జోక్ కాదుగదా" అంది మళ్ళీ.
"కాదు. కానే కాదు." ఆమెలో ఏదో అనుమానం. శరత్ సీరియస్ గా ఆటబట్టిస్తున్నాడేమో అనుకుంది 'తనకు తెలీకుండా తనకు పాపెలా పుడుతుంది? నా పిచ్చిగాని' అనుకుంది మనసులో.
అయినా "ఎలా" అంది చప్పున.
"ఎలాగో చెప్పనా?" అతడేదో చెప్పబోతుంటే గుమ్మం దగ్గర చప్పట్లు విన్పించాయి.
ఇద్దరూ అటు చూసారు.
"కంగ్రాట్స్ పిన్నీ_తమ్ముడొస్తున్నాడన్న మాట. అందరూ నేను చిన్నవాన్నని తిడుతుంటారు. నేనేమో తిట్టడానికి నాకన్నా చిన్నవాళ్ళెవరూ లేరే అని బాధపడేదాన్ని. తొందరగా తమ్ముడ్ని కను పిన్నీ" గుమ్మంలో అయిదేళ్ళ కుర్రాడు.
గుమ్మంలో స్టయిల్ గా నిల్చొని ఉపన్యాసం దంచేస్తున్న అందమైన కుర్రాడ్ని చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. "ఎవరీ కుర్రాడు" అన్నాడు శరత్. సుగాత్రి లేస్తూ "చాలా అందంగా వున్నాడు కదూ!" అంది.
"నా పేరు బాబీ....ప్రక్కింటి నిర్లిప్త ఆంటీ వాళ్ళింటికి వచ్చిన గెస్ట్ ని. మీ ఇల్లు అందంగా కన్పిస్తే వచ్చేశానంతే" అన్నాడు లోపలికొస్తూ.
"రా బాబూ....బెడ్ మీద కూచో" అంది సుగాత్రి.
"మా నాన్న పేరెప్పుడూ వినలేదా? గొప్ప రైటర్.....భార్గవ."
శరత్ త్రుళ్ళిపడ్డాడు. "ఓహో...అలాగా....నాకు బాగా పరిచయం" అన్నాడు శరత్.
అయితే నువ్వు మాకు చీఫ్ గెస్ట్ వన్నమాట" అంది సుగాత్రి. శరత్ బాబీ భుజం తట్టి "నాన్నగారు విజయవాడ వెళ్ళిపోయారా" అన్నాడు.
"నన్ను నిర్లిప్త ఆంటీ వాళ్ళింట్లో దించి మార్నింగే వెళ్ళారు. వాళ్ళింట్లో టిఫినయింది....మీ ఇంట్లో మీల్స్ చేద్దామని..." అన్నాడు కళ్ళు గుండ్రంగా త్రిప్పుతూ...కాలిమీద కాలేసుకుంటూ.
సుగాత్రి రెప్పలార్పకుండా చూస్తోంది.
"చీఫ్ గెస్ట్ అన్నపుడు ఓ చోట టిఫినూ....ఓచోట మీల్సూ చేస్తారా" అంది సుగాత్రి నిష్టూరంగా.
"అన్నీ ఒకరింట్లోనే చేస్తే చీఫ్ గెస్ట్ ఎలా అవుతాడు? చీఫ్ గెస్ట్ అవుతాడుగాని" అన్నాడు బాబీ గబుక్కున.
బాబిగాడి మాటలకు వాళ్ళిద్దరూ నవ్వుల ప్రతి కలిపారు.
* * * *
భోజనాల దగ్గర బాబీ అడిగాడు-
"పిన్నీ - ఈ వంటలన్నీ మీరే చేస్తారా?" అతి విశాలమైన డైనింగ్ టేబుల్ మీది రకరకాల వంటకాలవైపు చూస్తూ అన్నాడు.
"లేదు! వంట మనుషులున్నారు కదా! బోర్ కొట్టినపుడు మాత్రమే నేను చేస్తాను" అంది సుగాత్రి.
"మా యింట్లో మాత్రం రోజూ మా నాన్నే చేస్తాడు. ఎందుకంటే.. నాకు అమ్మలేదుగా" అన్నాడు బాబీ మొహం ఎలాగోపెట్టి.
శరత్ తింటూ అన్నాడు. "నీకు అమ్మ లేకపోతేనేం? మేమంతా వున్నాంగదా...."
సుగాత్రి వాళ్ళిద్దరికీ వడ్డిస్తూంది.
"అమ్మలా మీరు అన్నీ ఇవ్వలేరుగదా.." అని ఏదో గుర్తొచ్చి ఠక్కున అడిగాడు బాబి.
