Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 10

    "చెప్పు డాడీ...ఆమాత్రం చెప్పలేవా? నువ్వేం రైటర్ వి. ఇంతసేపు ఆలోచించాలా? వ్వె....వ్వె" అన్నాడు బాబీ ఎగతాళిగా.

    భార్గావకు ఏం చెప్పాలో తెలీక చివరికి "మమ్మీ అంటే....అమ్మ" అన్నాడు నెమ్మదిగా.

    "షేమ్...షేమ్ డాడ్. ఈసారి కూడా ఓడిపోయావ్"

    "మరేమిట్రా?"

    "ఈజిప్టియన్ల ఆచారం ప్రకారం మమ్మీ అంటే భద్రపర్చబడిన శవం!" అన్నాడు గట్టిగా నవ్వుతూ.

    'థాంక్ గాడ్' అనుకున్నాడు భార్గవ బాబీ తెలివికి లోపల్నే అభినందిస్తూ.

    "డాడ్....మరో ప్రశ్న"

    "బాబీ....మూడ్ లో వుండగా విసిగించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. నువ్వు ముందు స్నానం చేసి రెడీ అవ్వు....స్కూల్ కెళ్దువుగాని" అన్నాడు భార్గవ చిరాకుగా.

    బాబీ మూతి ముడుచుకొని బాత్ రూం కెళ్ళిపోయాడు.

    చేతిలో రెపరెపలాడిన ఉత్తరంలో ముత్యాల్ని పేర్చినట్లున్న అక్షరాల వెంట అతడి చూపులు ప్రసరించాయి.

    "డియర్ భార్గవా!

    నేనెవరో తెలీదు కదూ! నీ నవలలోని నాయికని!! మౌనికని!!!

    ఇన్నాళ్ళటి నీ సాంగత్యంలో నా కెంతటి ఆదరణ...కాని నీచమైన నీ ఆలోచనలకు, అందరూ అపురూపంగా ఆదరిస్తున్న నన్ను....ఆఖరి క్షణంలో చంపాలనుకున్న నీ నిర్ణయం ఎంత నిర్ణయది? ఒక కురూపిగా సృష్టించి, చిత్ర విచిత్ర మలుపులతో చిత్రహింసలు చేసి....పాఠకుల గుండె గుడుల్లో నువ్వే దేవుడివై నిలువడానికి నన్నొక మెట్లరాయిగా మలుచుకున్నావు.

    అభిమానాన్ని అంచెలంచెలుగా పేర్చుకోవడానికి నన్నెంతగా వాడుకున్నావో నీకు తెలీదా? భార్గవా! చివరి ముగింపులో నన్ను చంపటం నీకు భావ్యమా?? నీకీ ఆలోచన వచ్చినప్పటి నుండి నేనెంత క్షోభకు గురవుతున్నానో తెల్సా?

    నువ్వు రచయితవు కావచ్చు! నువ్వు సృష్టించిన పాత్రని చంపేహక్కు నీకు వుండొచ్చు. అలక్ష్యం ఎక్కువై నువ్వే నన్ను చంపాలను కున్నప్పుడు...నీ ఆదరణ కరువై ఆ పాత్రలకే ప్రాణం వచ్చి రచయిత లపై తిరగబడితే...??

    నీ నవల్లో జరిగేది ఇదే అయితే...నీ జీవితంలో చివరికి జరిగేది అదేనేమో?

    నీ మౌనికను చంపిన కొద్ది నెలల్లోనే నువ్వు చంపబడతావ్. అదీ ఈ మౌనిక చేతి ద్వారానే_
   
                                                                                                                                          ఇట్లు
                                                                                                                                       నీ మౌనిక.

    అది చదివి భార్గవ కొద్ది నిమిషాలు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. హెచ్చరికల్లో కూడా వెరయిటీ...ఎవరో పాఠకుడు (రాలు) సస్పెన్స్ కోసం ఇలా రాసివుండొచ్చని తేలిగ్గా తీసుకున్నాడతను. అదే మరణ శాసనం కానుందని వూహించలేదు.

    కాని...కాని....నవల చివర్లో మౌనికను చంపుదామనుకున్న తన ఆలోచన మరెవరికి తట్టి వుంటుంది??? నవల చదువుతున్న లక్షల మందిలో తన ఆలోచనే ఒకరికి తట్టడంలో ఆశ్చర్యమెందుకులే అని సరిపెట్టుకున్నాడు.

    అయినా ఏదో అనుమానం....!! మరోసారి చదివాడు. లేత గులాబీ రంగు కాగితం మీద ఎర్రటి అక్షరాలు....పగడాల్లా.

    మెదడు పొరల్లోకి తొలుచుకుంటూ పోయిన పురుగులాంటి అనుమానానికి గుండె కవాటాలు క్షణంపాటు స్తంభించాయి. అదే అతనికి తెలీకుండా అతనిలోని అంతర్గత భయానికి నాంది. బెదిరింపుని తేలిగ్గా తీసుకొని....మిగతా ఉత్తరాలు చదివాడు.

    "డాడ్...స్నానం చేసి రెడీ అయ్యాను గాని....నువ్వేమిటి? టిఫిన్ ఇంకా రెడీ చెయ్యలేదా?" ఆర్డర్ వేస్తూ అన్నాడు బాబీ, పుస్తకాలు సర్దుకుంటూ.

    "ఈ రోజు టిఫిన్ హోటల్ లోనేగాని....తొందరగా పద. టైమయింది" అంటూ లేచాడు భార్గవ. అంతలో ఫోన్ రింగయింది.

    "హలో...భార్గవ హియర్"

    "....."

    "అవున్సార్! నిన్నరాత్రే వచ్చాను. బాబీని స్కూల్లో దింపి మీ ఇండస్ట్రీకే వచ్చేద్దామనుకుంటున్నాను."

    "......"

    "అలాగంటారా? నిఖిల్ ఇంటికి వచ్చాక మీ ఇంటికి కూడా రావాలనుకున్నాను గాని...నేను విజయవాడ నుండి వచ్చేసరికే పొద్దుపోయింది. బాబీని తీసుకొచ్చేసరికి మరింత రాత్రయింది."

    "....."

    "తప్పకుండా! పదకొండు గంటల వరకు మీ దగ్గరుంటాను. సరేనా....ఓకే" అని ఫోన్ పెట్టబోతుంటే...

    "డాడీ ఆ ఫోనెవరు చేశారు? ఓసారిలా ఇవ్వండి" అన్నాడు బాబీ.

    "ఆయన నీకు తెలీదులే! శరత్ గారని పెద్ద కోటీశ్వరుడు. ఆయనతో నీకేం పని?" అన్నాడు.

    "నాకు తెల్సు డాడీ! ఓసారి ఫోనివ్వమంటుంటే..." అని అందుకొని 'హల్లో' అన్నాడు స్టయిల్ గా.

    "గుడ్ మానింగ్ బాబాయ్....టిఫిన్ చేసారా?" అన్నాడు.

    "...."

    "ఇంకా చేయలేదా? నేను కూడా చేయలేదు గాని, మీరు చిక్కు ముళ్ళు తొందరగా విప్పుతారుగదా బాబాయ్...నేనొకటి వెయ్యనా?"

    "ఒరేయ్ బాబీ! ఆయన్ని కూడా నీ జి.కె.తో చంపకు" అన్నాడు భార్గవ.

    "వినండి బాబాయ్ సరిగ్గా-   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS