Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 9


    మరోపక్కన గోడకు నిచ్చెనవేసుకుని దొంగలు  గోడయెక్కి, గోడమీదనే ముందుకు పాకుతూవచ్చి, చెట్టుదగ్గరదాకా అలావచ్చి చెట్టు మీదనుంచి కిందకు దిగారు అనుకుందామా అంటే అది అనుకోవటం వరకే గాని ఎంతమాత్రం కుదరని పని.
    కారణం!
    గుడి ప్రహరీగోడమీద పాకటానికి లేదు. గోడపై వత్తుగా ముళ్ళ తీగ బిగించి ఉంది. కాలువేస్తే కైలాసానికి వెళ్ళటం ఏమోగాని కాళ్ళలో ఇనపముళ్ళు తీగతాలూకా మేకులులాంటివి కసుక్కుమని సరీగా అంగుళం లోతున కాళ్ళలో దిగటం ఖాయం.
    కనుక___
    గోడకు నిచ్చెనవేయటం ..... దొంగలు గడ్డపలుగులతో గోడ ఎక్కటం .... గోడమీద పాకటం .... గోడమీదకు వరిగిన చెట్టుద్వారా కిందకుదిగటం .... ఇదంతా ఊహాగానం. అణుమాత్రమైనా నమ్మటానికి వీలులేని కథ.
    పోనీ దొంగలు రెండుచోట్ల తవ్వారు ఏమిటా అని పరిశీలించి చూస్తే మొదటిసారి తవ్విందానికన్నా మరో అరడుగులోతు తవ్వారుగాని ఏకంగా బారెడులోతు తవ్విందిలేదు.
    పరమేశ్వరీ ఆలయంలో ఉద్దరిణికూడా పోలేదు. అయినా చిత్రంగా ఈ తవ్విన తీరుచూసి చాలా ముందు జాగ్రత్తతో అధికార్లు కొన్ని ఏర్పాట్లుచేసివెళ్ళారు.
    శివుడు గుడిబైట వాకిలిముందు ఎప్పటిలాగానే కాపలా ఉంటాడు: వకవారం శివుడు. మరోవారం పుట్టన్న అనే ఇంకొకతను ఆ గుడిదగ్గర నైట్ డ్యూటీలు చేస్తుంటారు.
    ఇప్పుడు_____
    నైట్ డ్యూటీకి రోజుకి వకడు అవిగాక ఇద్దరు ఉండేలా నియమించారు. అదనంగా మరో ఇద్దరిని డ్యూటీలోకి తీసుకున్నారు. ఈ వారమంతా శివుడు, పుట్టన్న నైట్ డ్యూటీ చేస్తే, రెండోవారం రాజయ్య అవతారం నైట్ డ్యూటీ చేయాలి.
    గర్భగుడి తాలూకా అన్ని తాళాలూ దేవాలయం అధికారి పూజారి దగ్గర ఉంటే, ఆలయ ముఖద్వారంకివేసే తాళంయొక్క తాళంచెవి నైట్ వాచ్ మన్ దగ్గర ఉంటుంది.
    వక వాచ్ మాన్ గుడిబైటనే ఉంటే, రెండో వాచ్ మాన్ తాళం తీసి గుడి ఆవరణలోకి వెళ్ళి ఓసారి గుడిచుట్టూ తిరిగి వాచ్ చేసి రావాలి. ఇలా గంటకొకసారి చేయాలి. దాంతో దొంగల ఆట కట్ అవుతుంది.
    వాచ్ మాన్ లకి తుపాకులు ఇవ్వలేదుగాని, పవర్ ఫుల్ టార్చిలైటు కత్తి, కర్ర ఇచ్చారు. ఏదైనా ఆపద ఎదురైతే ఏంచేయాలి అన్నది వాళ్ళకి చెప్పారు.
    ఆలయానికి మరికొన్ని పకడ్భందీ ఏర్పాట్లు చేయటం జరిగింది. వాటిని అధికార్లు గుట్టుగానే ఉంచారు.
    ఇప్పుడు____
    ఇంక__
    పరమేశ్వరీ ఆలయం జోలికి దొంగలు రారు.
    అలా అని అధికార్లు____
    అలా అని భక్తులు (ప్రజలు) అనుకున్నారు.
    అలా అనుకుంటూండగానే.....
    
                         6
    
    మరోసారి____
    అనగా ముచ్చటగా మూడోసారి.....
    దొంగలు గుడిలోకి రానూవచ్చారు, గుడిచుట్టూ అంగుళంకూడా వదలకుండా తవ్వనూ తవ్వారు.
    ఈ తఫా___
    దొంగలు నిచ్చెన తెచ్చారా! గోడకు వేశారా? చెట్టు అందుకున్నారా! లాంటి అనుమానాలు రాకుండా చాలా గొప్ప ప్లానుతో గుడిలోపలికి దూరటం జరిగింది.
    ఓ బిచ్చగాడు మెట్ల మీదనుంచి రాత్రి వంటిగంటవేళ మెట్లుయెక్కి పైకివస్తుంటే "ఏయ్! ఎవడురా అది! ఇప్పుడు పైకివస్తున్నావు ఏమిటి?" అంటూ శివుడు వాడి ముఖాన టార్చీలైటు ఫోకసువేసి పెద్దగొంతుకతో అడిగాడు.
    "నిద్రపట్టి చావటంలేదయ్యా అగ్గిపెట్టెయిస్తే బీడీ ముట్టించుకెళతాను" ఈమాట అంటూనే బిచ్చగాడు ఒక్కో అడుగు ముందుకువేస్తూ మెట్లు పైకెక్కి వస్తున్నాడు.
    వస్తున్నవాడు బిచ్చగాడుకాదు. కాని వాడు ముమ్మూర్తులా బిచ్చగాడి వేషంతోనే ఉన్నాడు.
    వాడినిచూసి శివుడుగాని, పుట్టన్నగాని అనుమానించలేదు ఈ దేశంలో నమ్మకద్రోహులను. అంగరక్షకులను ఎవరూ అనుమానించరు. కనుకనే ఇందిరమ్మని అంగరక్షకులే నమ్మకద్రోహం చేస్తూ పొట్టన పెట్టుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS