అయినా మనం మనుషులం, నమ్ముతుంటాము. ఏదైనా జరగరానిది జరిగిందాకా నమ్ముతుంటాము.
శివుడు బిచ్చగాడిని నమ్మాడు.
"నీయవ్వ నిప్పుకోసం కుంటివెధవ కాలీడ్చుకుంటూ, పైదాకా రావాలిరా!" అని తిడుతూనే జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు శివుడు.
బిచ్చగాడు జోలెలోంచి బీడీకట్టతీసే నెపంతో జోలెలో చెయ్యిపెట్టి "వెధవబీడీ కనపడి చావదు" అని పైకే అంటూ బీడీ బదులు చిన్న రివాల్వర్ తీసి సూటిగా వాళ్ళకు గురిపెడుతూ "హాండ్సప్" అన్నాడు.
శివుడి చేతిలో అగ్గిపెట్టె జారి కిందపడింది.
పుట్టన్న చేతిలోని కర్ర పక్కకు పడిపోయింది.
"ఇది టాయ్ పిష్టల్ అనుకునేరు. అనవసరంగా చచ్చి వూరుకుంటారు. నెంబర్ వన్ రివాల్వర్ ఇది నేను చెప్పినట్లు విన్నారా, బతికి పోతారు. కాదంటే చచ్చిపోతారు. చావటంకన్నా బతకటమే మంచిదికాబట్టి బతకటానికి ప్రయత్నించండి......బిచ్చగాడు మాటలు చెపుతూనే బెదిరింపుగా రివాల్వర్ ను శివుడివేపు, పుట్టన్న వేపు తిప్పుతూనే ఉన్నాడు.
అయితే అది నిజం రివాల్వర్ కాదు, టాయ్ పిష్టలు కాదు. కొద్ది కాలంనుంచీ మార్కెట్ లోకి వచ్చిన "సైలన్స్ త్రీ" రివాల్వర్. చాటు మాటుగా మారకద్రవ్యాలు అమ్మే బడాస్మగ్లర్ల దగ్గర బహు అరుదుగా దొరికే ఒకరకమైన ఆయుధం.
"సైలన్స్ త్రీ" చూడడానికి ముమ్మూర్తులా రివాల్వర్ లాగా ఉంటుంది రివాల్వర్ పట్టుకునే విధానంలోనే చూపుడువేలు కిందకి చిన్న బటన్ వస్తుంది. వేలితో బటన్ ని ప్రెస్ చేస్తే వాసనగాని, పొగగాని (రూపంలో) కానరాకుండా ఒక విషవాయువును రివాల్వర్ కక్కుతుంది.
వాసన అంటూ తెలియదుకాబట్టి ఎదుటివారు తెలియకుండానే మామూలుగా ఆ మత్తుగాలిని పీలుస్తారు. అలా పీలుస్తూనే స్పృహతప్పిపోతారు. నాకు మైకం కమ్ముతున్నది అన్న విషయంకూడా వాళ్ళ బ్రెయిన్ లోకి రాదు.
బిచ్చగాడు వాళ్ళతో మాట్లాడుతూనే 'సైలన్స్ త్రీ' రివాల్వర్ బటన్ మీద రెడీగా వున్న తన చూపుడు వేలుకి పనికల్పించాడు.
చెరో పక్కకి కాకుండా శివుడు పుట్టన్న వకరిమీద కొకరు వరిగి అలాగే కింద కుప్పలా కూలిపోయారు.
బిచ్చగాడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వాళ్ళజేబులో చెయ్యి పెట్టి తాళంచెవి తీసుకున్నాడు.
ఆ తర్వాత.
బిచ్చగాడు వేషంలోవున్న కురైపతి రివాల్వర్ ని జోలెలో పడేసుకొని టార్చీలైటు తీశాడు. దానిని మెట్లదిగువకి కుడివైపుగా చూసి మూడు సార్లు వేసి ఆర్పాడు.
కిందనుంచి కూడా మూడుసార్లు మరోలైటు వెలిగి ఆరింది.
కిందనున్న తనవాళ్ళు లోపలికి వచ్చేలోపల కురైపతి శివుడుని పుట్టన్నని వాళ్ళు కూర్చున్న విధంగా గోడకిఆన్చి కూర్చోపెట్టాడు. టార్చీలైటులోని బ్యాటరీలుతీసి దూరంగా చెట్లగుబురుల్లోకి విసిరేశాడు.
పావుగంట తర్వాత
సరీగా పదిమంది బిచ్చగాళ్ళు కూలీనాలీ చేసుకునేవాళ్ళ వేషాలతో ఉన్నవారు. గుడి ఆవరణలో ప్రవేశించి గుడిచుట్టూ తవ్వటం ప్ర్రారంభించారు.
గంట
టంగ్ టంగ్..... టక్ టక్
విరామం లేకుండా గడ్డపలుగులు ఈతఫా పెద్దసైజు గునపాలు నేలను త్రవ్విపారేస్తూనే ఉన్నాయి.
రాత్రంతా సరీగా నిద్రపట్టక అటూయిటూ కదిలే కొందరు బిచ్చగాళ్ళు ఇంతజరుగుతున్నా ఈరాత్రి మాత్రం కదలక మెదలక మన్నుతిన్న పాముల్లా అలా పడుకుండిపోయారు.
రెండోగంట
టంగ్ టంగ్.....టక్ టక్
గుడిలో తవ్వకంపని జరుగుతూనే వుంది.
కురైపతి తాలూకా మనుషులు యిద్దరు గుడి మెట్ల క్రిందవున్నారు. వాడుగాక మూడోవాడు మధ్యమధ్య కిందికి పైకి తిరుగుతూ "ఊరు నిద్రపోతున్నది అనుమానాస్పదంగా ఏమీలేదు." అని వార్త అందించి వెళుతూనే ఉన్నాడు.
మూడోగంట.
అప్పటికే అంతా అలసిపోయారు. అయినా సమయం తక్కువగా ఉంది, పని నిదానంగా చేయటానికి లేదు. కురైపతి తిట్లువింటూ యింకా యింకా వేగంగా పనిచేయటం మొదలుపెట్టారు.
ఇంకా అరగంటపని మిగిలిపోయి ఉందనగా.
గుడికింద వున్న షాపుల్లోని ఓ కుటుంబంలోని పెద్ద ఆరాత్రంతా యింట్లోవాళ్ళని నిద్రపోనీయకుండా తన మూలుగులతో చంపి ఆఖరికి తను చచ్చి ఊరుకున్నాడు.
ఆ యింటివాళ్ళు.
శవాన్ని వాకిట్లోకిచేర్చి ఎవరియధాశక్తి వారు స్వరంపెంచి ఆరున్నొక్క రాగాలు అందుకున్నారు. దాంతో మరోగంట తర్వాత నిద్దరలేచే ఆ చుట్టుపక్కలవారు ముందే లేచికూర్చున్నారు.
