"ఇప్పుడు అలవాటు అయిపోయింది, మంచం మీద పడుకోటం ఇంట్లో మంచం యిక్కడ మంచం.....
"ఓ పనిచెయ్యి"
"ఏంటీ?"
"మంచం తీసుకు వెళ్ళి గుడిముందు వేసుకుని దర్జాగా పడుకో"
"డ్యూటీ చేస్తున్నప్పుడు పడుకోకూడదు"
"ఇదిగో శివుడూ మంచిగా చెప్పాను. వింటేవిను లేకపోతే లేదు. ఇలా వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి ముడెయ్యకు. ఆ తర్వాత నీయిష్టం అంది మాలక్ష్మమ్మ విసిగిపోయి.
"నా యిష్టం అన్నావుకదా సరే ఇలా రెండు చేతులూ నీ మెడ చుట్టూతావేసి దగ్గరకు లాక్కోటం నా కిష్టం. యింకా యింకా ఏమేమి యిష్టమంటే......
"చాల్లే" అంటూ శివుడి నోరు తనచేత్తో మృదువుగా మూసింది మాలక్షమ్మ.
ఆ తర్వాత.
వాళ్ళ మధ్య డ్యూటీ మాటలు సాగలేదు. వాళ్ళ సరస సంభాషణ తప్ప.
శివుడు నిద్ర కుపక్రమించేముందు మరోసారి మాలక్షమ్మ శివుడిని బ్రతిమిలాడి చెప్పింది. గుడి దగ్గరకెళ్ళి పడుకోమని.
"కావాలంటే నువ్వెళ్ళి పడుకో అంతేగాని నా బంగారంలాంటి నిద్ర చెడగొడుతూ రాత్రంతా నా పక్కనే పడుకుని నల్లిలా కుట్టకు" అని శివుడు ముసుగుతన్ని పడుకున్నాడు.
కొన్ని విషయాలలో ఆడదానికున్నంత ముందుచూపు మగవాడికిఉండదు.
శివుడికి ముందుచూపు ఆ సమయంలో బొత్తిగా లేకపోయింది.
అదే సమయంలో.
గుడిలో ప్రవేశించిన దొంగలు తొవ్వటం ప్రారంభించారు.
5
గతంలో వలెనె
గుడిలో ఓ పక్క తొవ్వటం జరిగింది. తొవ్వినచోటే తొవ్వటం గాక ఈ తఫా గుడికి వెనుకవేపు తవ్వటం జరిగింది,
క్రితంసారి సింహాచలం అనే భక్తుడు తొవ్వుతున్న చప్పుళ్ళు విని దొంగలు అని కేకలు వెయ్యటం దాంతో దొంగలు పారిపోవటం మాలక్షమ్మ ఇంట్లో పడుకున్న శివుడి ఉద్యోగం వూడకుండా ఉండటం జరిగింది, క్షేమంగా బయటపడ్డాడు,
అలాగే
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అంతే చివాట్లతో బయటపడ్డాడు.
వేసిన తాళాలు వేసినట్టు ఉండటం గుడి లోపల కాకుండా ఓసారి గుడికి ఎడమపక్క మరోసారి గుడికి వెనుకవేపు దొంగలు తవ్వటం తప్ప పోయిన వస్తువులు అంటూలేవు.
అలా అని నిర్లక్ష్యం చేయటానికి లేదు.
ఇలా తొవ్వేవారు ఏదో ఆసించి చేస్తున్నాడన్నది ఖాయం.
అందరిని ఏడిపించి తను నవ్వుకోటానికి ఎలుక కొరుకుడులా యిలా ఎవడూ అర్దరాత్రి పని గట్టుకుని గుడిలోదూరి తవ్వడు కదా!
ఏదో కారణం ఉన్నది, అన్నది మాత్రం ఖాయం.
"గోడమీదకి వాలిన ఈ చెట్టుని కొట్టించమని ఇదివరకే నేను చెప్పాను. దొంగలు నిచ్చనతో గోడఎక్కి చెట్టుమీదనుంచి కిందకు అంటే లోపలికి దిగుతున్నారు. నేను చెప్పింది ఎవరూ చేయలేదు" అంటూ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తప్పుకున్నాడు.
"నేను ద్వారంముందు కూర్చుని రోజూలాగానే కాపలాకాస్తున్నాను ఉన్నట్టుండి నా ముక్కులకి గుప్పున చెడువాసన తగిలింది ఇదేంవాసనబ్బా ఏపందికొక్కో చావలేదుకదా అని గట్టిగా పీల్చాను, తల తిరిగినట్లయింది, ఆ తర్వాత నాకేమీ తెలియలేదు. తెల్లారి మెలకువ వచ్చింది. నిద్ర ఆపుకునే నేను ఇంతనిద్ర ఎలాపోయానో నాకే అర్ధంకావటంలేదు." శివుడు ఓకధ అల్లి చెప్పి తనూ తప్పుకున్నాడు.
అయితే.
వీళ్ళిద్దరూ ఇలా తప్పుకున్నందువల్ల పైఅధికారులు కళ్ళు చెవులు మూసుకోలేదు.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పైఅధికార్లు కొందరు బైలుదేరివచ్చారు పరిశోధన ప్రారంభించారు.
పరమేశ్వరీ ఆలయం చుట్టూ వున్న ప్రహరీగోడ ఎత్తు దాదాపు పదిహేను అడుగుల ఎత్తు ఉంది. నిచ్చెన వేసుకుని ఎక్కాలంటే అన్ని అడుగుల నిచ్చెన కావాలి. అంతపెద్ద నిచ్చెనని కొండమీదకి అదైనా ఎవరూ చూడకుండా తీసుకురావటమనేది జరగనిపని.
వకవేళ.
అలా నిచ్చెన తేవటం సాధ్యమైనా గోడకి వెయ్యటానికి వీల్లేదు. చెట్టు వున్న వేపు గోడకి అవతలవేపు నిలువునా జారుడుబండ వుంది.
అలాకాకుండా.
