Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 9


    అదేం ప్రశ్న? భర్త వెనుకనే భార్య రాదా ఏమిటి?"
    "ఎవడు భర్త?" కోపంగా అడిగాడు కిరణ్.
    "ఓహ్ నీకు తెలియదు కదూ! నా హౌస్ బండ్ పేరు కిరణ్ చాలా అందగాడు, చాలా చక్కగా మాట్లాడుతాడు కూడా చాలా మంది ఆడపిల్లలు ఆయనంటే పడి ఛస్తారు. అఫ్ కోర్స్ ఆయనా అంతే ననుకో..."
    "కామినీ" గట్టిగా అరిచాడు కిరణ్.
    "తొందరపాటు, కోపం అనర్ధకాలకి మూలం కిరణ్! కోపంలో బుర్రకూడా పనిచేయదు తెలుసా? ఆవేశంలో తొందరపాటులో ఎన్నో జరిగిపోతాయి. తిరిగి చూసుకుంటే అంతా హుళక్కి. అంతే కదూ!" వ్యంగ్యంగా అంది కామినీదేవి.
    ఒకనాడు కిరణ్ ఇవే మాటలు కామినీదేవితో అన్నాడు. ప్రస్తుతం తనున్న విషమస్థితిలో ఆ మాటలేవీ గుర్తు రాలేదు.
    "జరిగిందంతా కామినీ చూసిందా? లేకపోతే ఇలా ఎందుకంటుంది? ఈ నీతి పాఠాలు ఏమిటి? ఇపుడు తనేం చేయాలి?" కిరణ్ ఆలోచనలో పడ్డాడు.
    "పాపం, ఆ పిల్లేమిటి ఒళ్లెరగకుండా నిద్రపోతున్నది. నిజంగా నిద్రా? లేక...." మందు పుచ్చుకుందా అన్నమాట అనబోయి, ఆ మాటను సగంలో మ్రింగేసింది కిరణ్ తన మాటకు అడ్డు రావడంతో.
    "లేదు, నిజంగా నిద్రే, బాగా గాఢంగా నిద్రపోతోంది" కంగారు కంగారుగా అన్నాడు కిరణ్.
    "నిజం నిద్రా, అబద్దం నిద్రా అని నేను అడగలేదు. నిద్రపోతుందా? అని మాత్రమే అడిగాను. పాపం రాత్రంతా నిద్రలేదు కాబోలు."
    "అవునవును లేదు."
    "బాగా మొద్దు నిద్రపోయే రకం అనుకుంటాను?"
    "అవునవును బాగా మొద్దునిద్ర. ఏనుగులను తెచ్చి త్రొక్కించినా లేవదు."
    "ఏనుగులను ఎక్కడనుంచి తెప్పిస్తాం కానీ, ఆమె నిద్ర లేవకపోతే నీతో కొంచెం మాట్లాడాలి."
    "ఏం మాట్లాడాలి?" కిరణ్ అనుమానంగా అడిగాడు.
    "అదేం మాట? మన పెళ్ళి విషయం మాట్లాడొచ్చు. బిడ్డకు ఏంపేరు పెట్టాలో దాని గురించి మాట్లాడొచ్చు. సరదాగా సవాలక్ష మాటలు మాట్లాడుకోవచ్చు. నీతో మాట్లాడుతుంటే పొద్దే తెలియదని గతంలో అనేవాడిని. ఇంతలో ఇంత మరుపైతే ఎట్లా?" అంటూ వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుంది, కామినీదేవి.
    "కామినీ వచ్చి కూర్చుందంటే ఇక కదలదని కిరణ్ కు బాగా తెలుసు. తక్షణం ఇక్కడనుండి కామినీని పంపించడం చాలామంచిది. లేకపోతే వ్యవహారం చాలా దూరం పోతుంది. కిరణ్ ఎన్నో రకాలుగా ఆలోచించాడు. కానీ ఒక్కటీ సరిగ్గా కుదరలేదు. తనిపుడు తొందరపడ్డా కఠినంగా వ్యవహరించినా మంచిది కాదు. మంచి మాటలతో ఈ పిశాచాన్ని ఇక్కడనుంచి పంపించాలి." అనుకున్నాడు కిరణ్.
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
    "నీ గురించే!"
    "దాన్ని ఎలా వదిలించుకుందామనేనా?" నవ్వుతూ అడిగింది కామినీదేవి.    
    "అదికాదు..." అన్నాడు కిరణ్.
    "ప్రతి మాటకీ కంగారు పడుతున్నావేమిటి?"
    "కంగారా? అబ్బే అదేం లేదు." మరింత కంగారుగా అన్నాడు కిరణ్.
    "నాకలా అనిపించిందిలే!"
    "మన మాటలు అనిత వింటే బావుండదు. మరోచోట కలుసుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది. నువ్వు ఎక్కడకు రమ్మంటావో చెప్పు. అక్కడకు వస్తాను."
    "అనిత? అనితెవరు? ఓహో! మొద్దునిద్రపోయే ఈ కోమలాంగా?" అంది కామినీదేవి.
    "మొద్దునిద్రే! అయినా ఒకవేళ లేస్తే బాగుండదు కదా!"
    "ఎవరికి బాగుండదు కిరణ్? నీకా? నాకా? అనిత కా?"
    "ప్లీజ్ కామినీ, అసలే నేను చిరాగ్గా వున్నాను. మనసు కూడా బాగుండలేదు. ఈ సమయంలో వేధించకు."
    "చాలా చిరాగ్గా వున్నానన్నమాట."
    "అవును, చాలా చిరాగ్గా వున్నాను."
    "అయితే మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకుంది?"
    "నీ యిష్టం నువ్వు ఎప్పుడు? ఎక్కడ? ఎలాగంటే అలాగే చేద్దాం. ఎక్కడికి రమ్మంటావో చెప్పు, అక్కడికి వచ్చి కలుసుకుంటాను."
    "అబ్బ ఏం ఓర్పు ఏం శాంతం. అసలు నువ్వు కిరణ్ వేనా అని ఆశ్చర్యం వేస్తోంది. ఓహో ఇదంతా మొద్దునిద్ర కోమలాంగి మహత్యం అన్న మాట. ఈ పిల్ల ఎవరో కాని మొత్తానికి నిన్ను భలే భయపెడుతోందే? ఒకసారి ఆమెని లేపి అభినందలు తెలుపువా?"
    "కిరణ్ చాలా సంకట పరిస్థితిలో పడ్డాడు. తనతో మాట్లాడుతున్నంతసేపు కామినీ చూపులు మాటి మాటికీ అనితమీద పడటం, చేసినదంతా చూసినట్లుగా మాటలలో వ్యంగ్యము. ఈ పరిస్థితులలో కిరణ్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. అమిత ధైర్యము, పొగరు, వుండికూడా, ఆ క్షణాన చేతులు కట్టుకుని నోరు మూసుకొని కూర్చోవాల్చొచ్చింది. కారణం చిన్నదే. మంచం మీద వున్నది డెడ్ బాడీ అని కామినీ తెలుసుకున్న మరుక్షణం, లోకం దృష్టిలో చట్టం దృష్టిలో హంతకుడై పోతాడు ఆలోచిస్తున్నాడు కిరణ్.
    "అనిత మొహం ఒకసారి నేను చూడవచ్చా-" సోఫాలోనుండి పైకి లేస్తూ అంది కామిని,
    "చూడకు!" ఒక్క అరుపు అరిచాడు కిరణ్.
    "చూస్తే?" కవ్వింపుగా అంది కామిని.
    "చంపేస్తాను" గబుక్కున అన్నాడు కిరణ్.
    "అవును చంపటం చాలా తేలిక. ముఖ్యంగా ఒక హత్య చేసిన వాడికి రెండవ హత్య చేయటం చాలా తేలిక."
    కిరణ్ మొహం పాలిపోయింది. బలవంతాన నోరు పెగల్చుకుని "ఏమిటి నీవనేది?" అన్నాడు.
    కామినీదేవికి పూర్తిగా అనుమానం వచ్చేసింది. గాల్లోకి బాణం వదులుతూ "కొన్ని విషయాలు ఎవరూ చెప్పకుండానే తెలుస్తాయ్. ఎలా అంటే ఏం చెబుతాను? ప్రతి దానికీ ఒక మార్గం వుంటుంది. అలాగే ప్రతి తప్పుడు పనికీ కూడా డొంకదారి అంటూ ఒకటి వుంటుంది. నేనెలా తెలుసుకున్నాను అన్నది కాదు. ఏం చేద్దాం? అని అడుగు" ఈ మాటలు నిదానంగా అంది.
    "ఇంపాజిబుల్!"
    "ఏమిటి ఇంపాజిబుల్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS