Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 10


    "అనితను ఇక్కడ ఎవరూ చంపలేదు. ఆమె చావనూలేదు. కాంపోజ్ వేసుకుంది. అందుకనే బాగా నిద్రపోతోంది. అంతే."
    "అనితను చంపావా? చచ్చిందా? నిద్రపోతుందా? అని నేను అడగలేదు. అనవసరంగా నోరు జారుతున్నావ్. అవునా? కామినీదేవి నవ్వుతూ అడిగింది.
    "ఎలా తెలిసిందో తన కనవసరం. తను అనితను చంపడం కామిని తెలుసుకుంది. కామినీ బ్రతుకంటే తను శవం కావాల్సిందే. కనుక తక్షణం చంపేయాలి..." కిరణ్ మనస్సులోని నరరూప రాక్షసుడు నిద్ర మేల్కొనటం మొదలుపెట్టాడు.
    కిరణ్ మొహంలో కదులాడే భావాల్నీ చక్కగా కనిపెట్టింది కామిని. "నువ్వు నన్ను చంపలేవు కిరణ్?" కఠినంగా అంది.
    "నేను....నేను...."
    "అదే నేను అనేది నీవు చంపలేవు అని."
    "చంపుతాను" పైకిలేస్తూ అన్నాడు కిరణ్.
    "నేను చాలా ముందు జాగ్రత్తతో వచ్చాను. నీకంత కోరికగా వుంటే చంపు తెల్లారి పేపర్ లో 'అతివలిద్దరి మధ్యా హంతకుడు' చక్కగా నీ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో పడుతుంది." అంది కామిని.
    ఆవేశంతో లేచిన కిరణ్ నిస్సత్తువగా మరల సోఫా లోకి జారి అలా కూర్చుండి పోయాడు.
    "ఇదంతా నీకెలా తెలుసు కామినీ?"
    "ముందే చెప్పాగా నా మార్గం నాకుంది."
    కామినీ నోరు శాశ్వతంగా మూస్తే! ఏ మూలో చిన్న ఆశ మిణుక్కు మిణుక్కు మంటుంటే కిరణ్ అడిగాడు.
    "నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకుని వచ్చావ్?"
    "జాగ్రత్తలు మాత్రం చెప్పను. నన్ను చంపిన మరుక్షణం ఈ వార్త దావానలంలాగా పైకి పొక్కుతుంది రూమ్ నెం 44. కామినీదేవి హత్య. హంతకుడు కిరణ్. ఈ వార్త బయటపడే జాగ్రత్త మాత్రం గట్టిగా తీసుకున్నాను. మనం ఆ రోజు కలుసుకున్నపుడు ఏ మన్నావ్? నీవు మళ్ళీ నాకంత పడితే చంపేస్తాను అన్నావ్. అవునా? ఆ మాట నువ్వు చెప్పిన తరువాత, నేను ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా వస్తాననుకున్నావ్! నిన్ను నీడలా ప్రతిక్షణం వెంటాడుతుండటంవల్ల నువ్వు ఎవరికంటా పడకుండా చేశాననుకున్న ప్రతి పని నాకు తక్షణం తెలిసిపోతూనే వున్నది. నువ్వు ఎలాంటివాడివో బాగా తెలిసిన నేను తగుజాగ్రత్త వహించే వచ్చాను." కామినీదేవి మరోసారి గాలిలో బాణాలు వేస్తూ అంది.
    "నువ్వు నిజమే చెబుతున్నావ్ కదూ!" డగ్గుత్తికతో అడిగాడు కిరణ్.
    "కావాలంటే అనిత డెడ్ బాడీమీద ఒట్టు."
    అప్పుడు అన్నాడు కిరణ్ "అనితను నేను చంపాలని చంపలేదు...!"
    "కానీ, చచ్చింది మాత్రం నీవల్ల, అంతేకదూ? అంది వ్యంగ్యంగా కామినీదేవి.
    కిరణ్ మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని భోరుమన్నాడు. ఆడపిల్లల్ని ఏడిపించటమే తప్ప ఎప్పుడూ ఏడవని కిరణ్, కన్నీళ్లు ఆడవాళ్ళు మాత్రమే కారుస్తారని అనుకున్న కిరణ్ ఆడపిల్లకన్నా అద్వానంగా ఏడవటం మొదలుపెట్టాడు.
    కామినీదేవి తీవ్రాలోచన చేస్తూ కూర్చుంది.
    
                               7
    
    5 నిముషాల తరువాత.
    కామినీదేవి లేచి కిరణ్ దగ్గరకు వెళ్ళింది. అతని తలమీద చెయ్యివేసి నిమిరింది. "నీకు ఏడిపించటమే కానీ ఏడవటం కూడా తెలుసా కిరణ్?" చాలా నెమ్మదిగా అడిగింది.
    "నీవు నా మాట నమ్ముతావు కదూ?" కిరణ్ డగ్గుత్తికతో అడిగాడు.
    "నీ మాటలు నిజాలనుకుని చాలాసార్లు నమ్మాను. అప్పటి ఆ కామిని వేరు. ఇప్పటి ఈ కామిని వేరు. నీవు చెప్పేది నిజమో అబద్దమో వెంటనే గ్రహించగలను. ఇంక నీ యిష్టం. నువ్వు ఎలా చెప్పాలనుకుంటే అలాగే చెప్పు."
    "నేను అనితను చంపాలని చంపలేదు. నన్ను మాటలతో రెచ్చగొడుతూంటే ఆవేశం పట్టలేక విసురుగా తోశాను. అనిత వెళ్ళి మంచం దగ్గర పడింది. మంచం కణతకి తగలటం వల్ల వెంటనే ప్రాణం పోయింది. ఇది హత్యా? నువ్వు చెప్పు కామినీ ఆఇది హత్యా?"
    "కత్తిపెట్టి పొడిచానా! రివాల్వర్ పెట్టి కాల్చానా, ఇవతల మనిషి వలన అవతల మనిషి చస్తే అది హత్యే అంటారు మరి. తల పగులగొట్టినా, తలకాయ గోడకేసి కొట్టినా ఛస్తే చచ్చారు అనరు. చంపబడ్డారు అనే అంటారు. కనుక నువ్వు ఎలా చేసినా లోకం దీన్ని హత్య అనే అంటుంది. నాకు తెలిసింది అంతవరకే." కామినీదేవి ఒక్కో మాట తుపాకీ గుండ్లులాగా వదిలింది.
    మరోసారి కామినీదేవిని పీకనులిమి చంపేద్దామన్నంత కోపం వచ్చింది కిరణ్ కి. కానీ తనున్న విషమ పరిస్థితి గుర్తుకువచ్చి తగ్గిపోయాడు. ఇప్పుడు తాను చాలా వివేకంగా ప్రవర్తించకపోతే తనకు ఆ జన్మ ఖైదు తప్పదనుకున్నాడు. నిదానంగా అడిగాడు "కామినీ ఇప్పుడు ఏం చేద్దాం?"
    "డ్యూయట్లు పాడుకుందాం" అంది కామిని.
    "కామినీ సీరియస్ గా అడుగుతున్నాను. ఇది నవ్వటానికి సమయం కాదు. ఇప్పుడేం చేద్దాం?"
    "అయితే మనం బిజినెస్ వ్యవహారం లాగా మాట్లాడవలసి వుంటుంది."
    ఆమాట వినంగానే కిరణ్ కి చాలా సంతోషం కలిగింది. కామిని తనని బ్లాక్ మెయిల్ చేస్తుందనుకున్నాడు "చెప్పు ఎంత డబ్బు కావాలో చెప్పు. ఈ రహస్యం దాయడానికి మరింత డబ్బు ఇస్తాను. జరిగింది ఎలాగూ నీకు తెలిసిపోయింది. దాచి ప్రయోజనం లేదు. అందుకనే నీవు కోరినంత డబ్బు ఇవ్వదలచుకున్నాను. చెప్పు ఎంత కావాలి?" అన్నాడు.
    నేను బ్లాక్ మెయిలర్ ని కాను."
    "మరి...?" కిరణ్ తెల్లబోయాడు.
    "బిజినెస్ లాగా మాట్లాడుకుందాం. నీ కిష్టమో కాదో చెప్పు."
    "నువ్వు చెప్పే దేమిటో నాకు అర్ధంకావటం లేదు కామినీ."
    "అర్ధమయ్యేలా చెప్పనా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS