Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 8


    శవాన్ని చూసి తనూ నలుగురితోపాటు ఆశ్చర్యపోవటం, ప్రక్కగదిలో అతనిని తను చూసానని గుర్తులు చెప్పటం, నోటికి వచ్చిన అబద్దాలు ఆడేస్తాడు.
    రెండు రోజులకి శవం బయట పడకపోతే తను మామూలుగా హోటల్ రూమ్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తాడు. అక్కడితో చాప్టర్ క్లోజ్.
    తనను ఎవరు అనుమానించరు. హోటల్ లో శవం బయటపడి, ఎప్పటికో తెలుసుకున్నపుదు హోటల్ సిబ్బంది మొత్తం లబలబ లాడాల్సిందే. ఎవరు ఎలా ఛస్తే తనకెందుకు? తను క్షేమంగా బయటపడుతున్నాడు అది చాలు. తన ప్లాన్ అద్భుతమైనది. తన అదృష్టం చాలా గొప్పది.
    "బ్లడీ బీచ్ నాకే ఎదురు తిరుగుతుందా! అనితలోని వగరూ, పొగరు చూసే తను ఆమెమీద వల విసిరాడు. చేపపిల్ల గాలానికి తొందరగానీ చిక్కింది కాని, అది చేపపిల్ల కాదు మొసలిపిల్ల అని తన అనుభవంలో తొందరగానే గ్రహించగలిగాడు. అవసరంవస్తే అందరి ఆడపిల్లల్ని బెదిరించినట్లే బెదిరించవచ్చు అనుకున్నాడు. అప్పుడు అనిత నాలుగుతిట్టి తన జీవితం నుండి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ శాశ్వతంగా పైకి పంపించక తప్పలేదు. తను ఆడపిల్లల జీవితాలతో చాలా తేలికగా ఆటలు ఆదుకున్నాడు. అలానే చాలా తేలికగా వదుల్చుకున్నాడు. తను చాలా మందిని చావగొట్టి చెవులు మూసినంతపని చేశాడు. కానీ ఎవరిని చంపలేదు.
    కానీ ఇప్పుడు అనితను కూడా చంపలేదు. అనితే తన మృత్యువుని చేజేతులారా ఆహ్వానించుకుంది. తనని రెచ్చగొట్టింది. దాంతో విసురుగా అవతలకి త్రోశాడు. దెబ్బ తగులుతుందనుకున్నాడు గాని, చస్తుందని అనుకోలేదు. చచ్చివూరుకుంది.
    తను కావాలని చెయ్యకపోయినా, హత్య హత్యే, హంతకుడు హంతకుడే. హత్య చేసినాకూడా తను తప్పించుకు తిరగగలనని నిరూపించుకోవాలి. ఇది తను ఛాలెంజ్ గా తీసుకోవాలి."
    ఛాలెంజ్ గా తీసుకోవాలి అనుకోగానే కిరణ్ కి ఎందుకో తృప్తిగా అనిపించింది. బహుశా అతని మనస్తత్వం అలాంటిది కావటంవల్లనేమో.
    ముందు కార్యక్రమం బయటకు వెళ్ళి అదే హోటల్ కి ఫోన్ చెయ్యడం. కిరణ్ ట్రీమ్ గా తయారయ్యాడు.
    రూమ్ లోనుండి బయటకువచ్చి తలుపు లాక్ చేశాడు. మరికొద్దిసేపట్లో కిరణ్ రోడ్ మీద నడుస్తున్నాడు.
    కిరణ్ విసురుగా రూమ్ లోకి వచ్చాడు.
    ఆలోచిస్తూ చిరాకుగా అతి ఇటు తిరుగసాగాడు. ఛీ, లేచిన వేళ మంచిది కాదు అనుకున్నాడు. తన ఆలోచనకు వెర్రిగా నవ్వుకున్నస్డు. కిరణ్ నవ్వుకోటానికి కారణం వుంది.
    కారణం కిరణ్ ఎటువంటి సెంటిమెంట్లు లేని మనిషి.
    తన పధకాన్ని అమలుపెట్టే ప్రయత్నంగా హోటల్ నుండి బయటకు వెళ్ళి రోడ్ ఎక్కాడు. దూరంనుంచి వస్తూ అతని పాత శత్రువు కనబడ్డాడు. ఒకరి ఎదుట ఒకరు పడటం వారిరువురికి ఇష్టంలేదు. కిరణ్ గిరుక్కున వెనుతిరిగి చకచకా నడుచుకుంటూ మళ్ళీ హోటల్ వైపు వచ్చాడు.
    కిరణ్ కి శకునాల మీద నమ్మకం లేదు. చాదస్తాన్ని లెక్కచెయ్యడు. అయినా ఎందుకో మనస్కరించలేదు. కొద్దిసేపు ఆగి వెళ్దాం చిరాగ్గా అనుకున్నాడు.
    మళ్ళీ బయలుదేరాడు. కాని గోడకు విసిరేసిన బంతి లాగా మళ్ళీ వెనక్కు వచ్చాడు.
    కిరణ్ విసురుకి కారణం ఇదేదికాదు. చేసిన హత్య దాన్ని ఎలా తప్పించుకోవాలా అని రాత్రంతా మేలుకుని ఆలోచించడం.
    చేస్తున్న పచార్లు ఆపి బెడ్ మీద అటువైపు త్రిప్పి పడుకోబెట్టిన అనిత శవాన్ని చూస్తూ కోపంగా "బ్లడీ బిచ్, బ్లడీ బిచ్" పైకి తిట్టాడు. డెడ్ బాడీని అలా చూస్తూ వుండిపోయాడు తరువాత.
    ఆ సమయంలో రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకోవటం, చడీ చప్పుడు కాకుండా ఒక స్త్రీ లోపలికి రావటం, తలుపువేసి తలుపుకు ఆనుకుని నిలుచోవడం జరిగింది.
    కిరణ్ డెడ్ బాడీని చూస్తూ అలా ఆలోచిస్తూ వుండిపోయాడు. ఎన్నిసార్లు అనితతో సుఖాలు పొందాడు. అలా పొందుతున్నప్పుడల్లా "అనితా ఏదో ఒకరోజు నీకు గుడ్ బై చెప్పక తప్పదు" అని నిశ్శబ్దంగా అనుకునేవాడిని. నిన్న వుదయానికి ఈ ఉదయానికి ఎంతతేడా? ఇలా జరుగుతుందని ఎపుడూ అనుకోలేదు. అనుకోని హత్య. ఇదంతా ఈ బిచ్ తనను రెచ్చగొట్టడం వల్లనే జరిగింది.
    అనిత డెడ్ బాడీని కసిగా చూసి కిరణ్ వెనుతిరిగాడు. భయంతో అతని నోటినుండి పెద్ద గావుకేక ఒకటి బయటకు రాబోయింది. కాని నోరు నొక్కేసినట్లు ఆ కేక కంఠం లోనే ఆగిపోయింది. పిచ్చిగా, భయంగా, వెర్రిగా, ఆమెను చూస్తూ వుండిపోయాడు.
    కామినిదేవి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో వ్యంగ్యం చక్కగా కనిపిస్తున్నది.
    "నువ్వా?" అప్రయత్నంగా అన్నాడు కిరణ్.
    "నేనే దెయ్యాన్ని, భూతాన్ని కాదు" అంది నవ్వుతూ కామినీదేవి.
    కిరణ్ మొహం పాలిపోయింది.
    ఈ సమయంలో ఇక్కడికి, ఈ కామినీ పిశాచం ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చెయ్యాలి? అనితే పెద్ద బిచ్ అనుకుంటే, ఇది బిచ్ ఒక్కటేకాదు, పిశాచం, దెయ్యం, అన్నీను. వదిలించుకుందామన్నా వదలని యమపాశం. వెంటనే దీన్ని మాయ మాటలు చెప్పి రూంలో నుండి బయటకు తీసుకు వెళ్ళాలి.
    కిరణ్ చాలా క్విక్ గా ఆలోచించాడు.
    ఈ లోపల కిరణ్ మోహంలో మారుతున్న భావాల్ని, బెడ్ మీద అటు తిరిగి పడుకుని వున్న స్త్రీని, చూసింది కామినీదేవి. ఏదో విషయంలో కిరణ్ ఆందోళన పడుతున్నట్లుగా కూడా అనిపించింది, కామినీదేవికి.
    "ఇక్కడికి ఎలా వచ్చావ్? ఎందుకు వచ్చావ్?" కిరణ్ గబ, గబా అడిగాడు.
    "మామూలుగానే....నడచి.....నీ వెనుకనే.....వచ్చాను. కాస్త అటు ఇటుగా నువ్వు ముందు, నేను వెనుక ఈ రూంలో అడుగుపెట్టాం." కామినీదేవి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది.
    "నే నడిగింది ఇదికాదు, ఎందుకు ఇక్కడకు వచ్చావ్ అంటున్నాను?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS