Previous Page Next Page 
అష్టపది పేజి 9


    
    వచ్చిన వాళ్ళు మగ పెళ్ళివారు తాలూకూ కాబట్టి అక్కడుంటే బాగుండదని శీతల్ స్నేహితురాళ్ళు అక్కడ నుంచి బైటికి వెళ్ళారు.
    
    దాసీది, వాళ్ళు ముగ్గురూ గదిలో మిగిలారు.
    
    వాళ్ళను చూసి శీతల్ లేచి నుంచుంది. వచ్చింది మగపెళ్ళివారు తాలూకు ఫార్మాల్టీస్ తప్పవు ఇష్టమున్నా లేకున్నా చేయల్సిందే.    

 

    "అమ్మాయిగారూ!" దాసీది పిలిచింది.
    
    "ఊ..." శీతల్ తల ఎత్తకుండానే ఊ కొట్టింది.
    
    "వీరు మగ పెళ్ళివారి తరఫువారు. పెళ్ళికి గోవా నుంచి రావటం వల్ల ఆలశ్యం అయిందిట. ఇంతకు ముందే వచ్చారు. సురేంద్రనాద్ బాబు గారికి తమ్ముడు వరస అవుతారు. వీరు కూడా మరో తమ్ముడు. అమ్మగారు ఈ బాబు గారి భార్య. మిమ్మల్ని చూద్దామని వచ్చారు" అంటూ దాసీది వాళ్ళని పరిచయం చేస్తూ వివరించింది.
    
    శీతల్ చిరుమందహాసంతో నమస్కారం పెట్టింది.
    
    "అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడి వస్తాము. నువ్వెళ్ళి మళ్ళీ అక్కడ విడిదిలో వుండు" దాసీదానితో అంది ఆమె.
    
    "ఫరవాలేదు గుమ్మం దగ్గర నుంచుంటాలెండి" వినయంగా జవాబు ఇచ్చింది దాసీది.
    
    "అక్కరలేదు, వెళ్ళమన్నాను" ఆమె చిరు కోపంతో అనేసరికి 'మగ పెళ్ళివారికి కోపం తెప్పిస్తే మీ తాట వలిచి వీపులు చీరేస్తాను' అన్న గోవర్ధనరావుగా మాటలు దాసీదానికి గుర్తుకొచ్చాయి.
    
    "సరేనమ్మా, వెళుతున్నా"నని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
    
    ఇప్పుడు వచ్చిన దాసీది మళ్ళీ  విడిది గృహం వేపు వెళ్ళిపోతూ ఇక్కడ వున్న నౌకరుకి విషయం చెప్పి వెళ్ళింది. నౌకరు అప్పటికప్పుడు గోవర్ధనరావుకి మగపెళ్ళివారి తాలూకు వాళ్ళు అమ్మాయి గారిని చూడడానికి వచ్చారు అని చెప్పడానికి ఆయన ఎక్కడ వున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు.    

 

    తనకి ఇష్టమున్నా లేకున్నా మర్యాద చేయటం ధర్మం కాబట్టి "కూర్చోండి" అంటూ అక్కడే వున్న సోఫా చూపించింది శీతల్.
    
    మగవాళ్ళిద్దరూ వెళ్ళి సోఫాలో పక్క పక్క కూర్చున్నారు.
    
    ఆమె వేరే సోఫాలో కూర్చుంది.
    
    వాళ్ళు ముగ్గురూ కూర్చున్న తర్వాత శీతల్ ఆమె కూర్చున్న సోఫాలోనే ఓ పక్కగా కాస్త వదిగి కూర్చుంది.    

 

    జరిగి శీతల్ ని ఆనుకున్నంత దగ్గరగా కూర్చుని శీతల్ చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ "మా నయనబాబుకి ఎలాంటి భార్య వస్తుందో అని భయపడేదాన్ని. మొత్తానికి చక్కని చుక్కే వస్తున్నది. ఏమంటారు?" అని భర్తని అడిగింది.
    
    "ఎస్. ఎస్." అన్నాడు ఆయన.
    
    శీతల్ కి ఒళ్ళంతా తేళ్ళు, జెర్రులు పాకినట్టు అనిపించింది. పక్కకొచ్చి కూర్చున్నది గాక చెయ్యి నిమరటం కూడా దేనికి? కలసి కాపురం చేసేది ఈవిడ అయినట్లు భయపడిందట! భయపడడం ఎందుకో అదేదో రోగలక్షణం లాగా...
    
    వాళ్ళు ముగ్గురూ మగ పెళ్ళివారి తాలూకు అనుకుంటున్నది శీతల్.
    
    సి.బి.ఐ. తాలూకు ఈ ముగ్గురు సురేంద్రనాథ్ దగ్గరకు వచ్చి ఆయన్ని వప్పించి తన దగ్గరకు వచ్చారని శీతల్ కి తెలియదు.
    
    వచ్చిన పని తొందరగా కానియ్యి అన్నట్టు కనుసైగ చేశాడు. సి.బి.ఐ. అధికారి. సరిగ్గా అదే సమయంలో తల ఎత్తి ఆయన్ని చూసిన శీతల్ ఆయన ఏదో అర్ధంతో కనుబొమ్మలు ఎగరెయ్యటం గమనించింది. ఆయన సైగని అర్ధం చేసుకున్నానన్న గుర్తుగా ఆమె పొడి దగ్గుదగ్గింది.
    
    "వచ్చిన వీళ్ళు ముగ్గురు మగ పెళ్ళివారి తాలూకాయేనా!" అన్న అనుమానం శీతల్ కి వచ్చింది.
    
    "నీ పేరు శీతల్ కదూ!" ఆమె మరింత దగ్గరగా జరిగి అడిగింది.
    
    "శీతల్ రాణి" శీతల్ నెమ్మదిగా చెప్పింది.
    
    "మేము చెప్పేది జాగ్రత్తగా విను...." అని అనంగానే శీతల్ కి రంజిత్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే తను రంజిత్ కి వార్త పంపిస్తూ డబ్బు కూడా రజియా పంపించింది. వీళ్ళు రంజిత్ పంపిస్తే వచ్చినవాళ్ళు కాదు కదా! అనుకుంటూ ఆతృతగా అడిగింది శీతల్. "నేను చెప్పినట్లుగా చేశాడన్నమాట!..."
    
    "అదికాదు" అని ఆమె ఏదో అనబోయి వెంట సి.బి.ఐ. అధికారి చాలా తెలివిగా ఆ మాటని అణిచేస్తూ "కుమ్ దుమ్! అది కాదు. ఇది కాదు అంటానానిస్తే అసలు విషయం చెప్పటం కుదరదు. ఆలస్యం అమృతం విషం" అన్నాడు.
    
    "నిజమే డాడీ నా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పలేను. రజియా వక్కతే ధైర్యంగా నా మాట విని నేను చెప్పినట్టు చేసేది. అందుకనే రంజిత్ దగ్గరకు రజియాని పంపించాను."
    
    "అన్నీ తెలుసు" సి.బి.ఐ. అధికారి అన్నాడు.
    
    "రజియా ఏది?" శీతల్ అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS