Previous Page Next Page 
అష్టపది పేజి 10

 

    "అక్కడ వుంది."
    
    "నన్ను యిక్కడ నుంచి తప్పించటానికి రంజిత్ ఏం ప్లాన్ వేశాడు" స్వరం బాగా తగ్గించి శీతల్ అడిగింది.
    
    మీరు చెప్పండి అన్నట్లు ఆమె ఆయన వేపు చూసింది.
    
    సి.పి.ఐ. అధికారి ఏదో చెప్పబోతుండగా గోవర్ధనరావు నౌకరుని వెంట బెట్టుకుని హడావుడిగా లోపలికి వచ్చాడు. దాంతో ఆయన నోరు మూసుకోక తప్పలేదు.
    
    "మీరు గోవా నుంచి వచ్చారట. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. శీతూని చూడటానికి మీరొస్తారని ముందే తెలిసినట్లయితే స్వయంగా అక్కడికి నేనే వచ్చే వాడిని. మీరేం తీసుకుంటారు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్" కొద్ది కంగారుతో మర్యాదగా అడిగాడు గోవర్ధనరావు.
    
    "అక్కడ తీసుకునే వచ్చాము. ఇక్కడ ఏమి వద్దు" అన్నాడు సి.బి.ఐ అధికారి.
    
    "అలా కాదు, మీరు ఏదో ఒకటి తీసుకోకపోతే బాగుండదు."  

 

    "ప్రస్తుతానికి ఐస్ వాటర్ చాలు" నవ్వుతూ అన్నది ఆమె.
    
    ఐస్ వాటర్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా తెమ్మని నౌకరుని పంపించాడు గోవర్ధనరావు.
    
    నౌకరు గుమ్మం దాటాడు.
    
    "అరె! తలనొప్పి మాత్రలు జేబులో వేసుకోవడం మర్చిపోయాను" సి.బి.ఐ. అధికారి కోటుజేబు తడుముకుంటూ అన్నాడు.
    
    "క్షణంలో నేను తెప్పిస్తాను" అంటూ గోవర్ధనరావు గుమ్మందాటి బైటికి వెళ్ళాడు.
    
    "మళ్ళీ మనం వివరంగా మాట్లాడుకోటానికి కుదరకపోవచ్చు. రంజిత్ నన్ను యిక్కడ నుంచి తప్పించటానికి పథకం వేశాడో చెప్పండి" శీతల్ నెమ్మదిగానే అడిగింది అయితే ఆ అడగడంలో గాభరా వుంది.
    
    "వివరిస్తూ కూర్చుంటే మీ డాడీ వచ్చేస్తాడు టైము లేదు. నేను చెప్పింది జాగ్రత్తగా విను. మరో రెండు గంటల తర్వాత మేమో నాటకం ఆడి తప్పిస్తాము. మామూలుగా వుండు. ఈ ఇంట్లోంచి బయటపడడం అప్పటికప్పుడు క్విక్ గా జరిగిపోతుంది అన్నీ చూసుకోడానికి మేము వున్నాం" సి.బి.ఐ. అధికారి మాట పూర్తిచేశాడు తలనొప్పి మాత్రతో గోవర్ధనరావు లోపలికి వచ్చాడు.
    
    శీతల్ ఎన్నో అడగాలనుకుంది. మరెన్నో అనుమానాలు మనసులో మెదులుతున్నాయి. నోరు మెదపటానికి వీలులేదు ఎదురుగా పులిలా తండ్రి వున్నాడు.
    
    కొద్దిసేపు గోవర్ధనరావు వాళ్ళతో మాట్లాడాడు గోవా గురించి అడిగాడు. వాళ్ళు అక్కడి విశేషాలు చెప్పారు.
    
    ఈ పెళ్ళికి ఎలాగూ వచ్చాము కాబట్టి ఒక నెల ఇక్కడ వుండి వెళతామని చెప్పారు. తిరుపతి చూడాలనుకుంటున్నామని చెప్పారు.
    
    శీతల్ వాళ్ళతోగాని, వాళ్ళు శీతల్ తోగాని రహస్యంగా మాట్లాడే అవకాశం లేకపోయింది.
    
    నౌకరు ఐస్ వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాడు.
    
    గోవర్ధనరావు బలవంతం మీద కూల్ డ్రింక్స్ తీసుకున్నారు.
    
    గోవర్ధనరావు ఎంతకీ కదలకపోవటంతో వాళ్ళు మాత్రం ఎంతసేపు కూర్చుంటారు? విడిదిలోకి వెళ్ళటానికి లేచారు. వాళ్ళతో కలసి గోవర్ధనరావు కూడా బయలుదేరాడు.
    
    "అన్నీ మేము చూసుకుంటాము. నీవు మౌనంగా చూస్తూ వూరుకో" ఆమె వెళుతూ శీతల్ కి మాత్రమే వినిపించేటంత నెమ్మదిగా చెప్పి వెళ్ళింది.
    
    "ఓహ్ రంజిత్! నువ్వొక్కడివే నన్ను రక్షించగలిగినవాడివి. ఆపదలో కాంతి కిరణంలా నువ్వే కనబడ్డావు రంజిత్. నాకు తెలుసు నేనెలాంటి స్థితిలో వున్నానో!" అనుకుంది శీతల్.
    
    రజియా చేత కబురు రహస్యంగా చేయటమేగాక పెద్ద మొత్తం డబ్బు తనని తప్పించటానికి అవసరానికి వాడమని రంజిత్ కి పంపించింది. రంజిత్ కి ఎన్నోసార్లు తను సహాయం చేసింది. రంజిత్ తనకి తప్పక సహాయం చేస్తాడు తను ఈ పంజరంలోంచి బయటపడుతున్నది.
    
    ఈ మాట అనుకోంగానే శీతల్ మనసు పురివిప్పిన నెమలిలా నర్తించింది.
    
    వచ్చిన ముగ్గురూ రంజిత్ పంపించినవాళ్ళు కారని అసలు మగ పెళ్ళివారి తరపువారు కారని, వాళ్ళు వచ్చింది గోవానుంచి కాదని, సి.బి.ఐ. వాళ్ళని శీతల్ కి బొత్తిగా తెలియదు.
    
    వాళ్ళు పరిశోధనలో ఏదో అడగబోతుంటే శీతల్ తొందరపాటుతో నోరు జారింది. అది వాళ్ళకి పనికొచ్చింది.
    
    తాను చాలా పెద్ద పొరపాటు చేశానని, ఆ పొరపాటు తన ప్రాణంమీదకి వస్తుందని, తనో పెద్ద సుడిగుండంలో చిక్కుకోబోతున్నదని శీతల్ గ్రహిస్తే...!
    
    ఊహూ గ్రహించలేదు.
    
    ముంచుకొచ్చే మృత్యువుని, ముంచుకొచ్చే ముప్పుని ఎవరూ ఆపలేరు.
    
    శీతల్ దానికి అతీతురాలు కాదు.    

                                                                *    *    *    *
    
    "ఎవరు డాడీ! ఈ వచ్చిన ముగ్గురు?"
    
    ఈ ప్రశ్న అడిగింది తన కొడుకు అయినా నిజం చెప్పకూడదు. ఎందుకంటే వచ్చింది సి.బి.ఐ. అధికార్లు పెళ్ళికూతురు చూడబోతే హంతకురాలేమోనన్న అనుమానం. అనుమానం ఏం ఖర్మ, హంతకురాలే కావచ్చు. ఈ పెళ్ళి ఆగిపోతే శీతల్ ని ఎంతో ఇష్టపడిన నయర్ కి షాక్ తగులుతుంది. అయినా చేసేదేమీలేదు. హంతకురాలు తన కోడలు ఎలా అవుతుంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS