"కాబోయే కోడలిని మీరు అనుమానించకూడదు. అది మీకే మంచిదికాదు."
"అనుమానం కాదు, ఊరికే తెలుసుకుందామని."
"ఉపేంద్రకుమార్ కి, శీతల్ రాణికి పరిచయం వుందా లేదా అన్నది మనం ఇప్పుడు ఆడబోయే నాటకంతో తేలుతుంది. శీతల్ రాణి పోలికలుగల వేరే అమ్మాయి ఈ హత్య చేసిందేమో! మాకు వచ్చిన ఫోన్ కాల్, సాక్ష్యాధారాలు లభించినవి చూస్తే..."
"మీకు ఫోన్ కాల్ వచ్చిందా! ఏమిటి సాక్ష్యాధారాలు లభించాయా? అవి ఏమిటి?" సురేంద్రనాద్ అడిగాడు.
సి.బి.ఐ. అధికారి ఏమి దాయలేదు ఫోన్ కాల్ మంచి సాక్ష్యాధారాల వరకు వివరించాడు. కొన్ని కోటు జేబులోంచితీసి చూపించాడు. "సాధారణంగా కేసుని పోలీస్ డిపార్టుమెంటే చూసుకుంటుంది. అవసరం అయితే సి.ఐ.డి లు దిగుతారు. కాని ఈ కేసువెనుక చాలా పెద్ద హస్తం వుండడం ఎవరికీ చెప్పకూడని మరో కారణం వుండడం. కేసు పూర్తి అయిన తర్వాత. విషయం బయటపడిం తరువాత మేమెందుకు రంగంలో దిగాల్సి వచ్చిందో తెలుస్తుంది" అంటూ ఆ వివరణకూడా ఇచ్చాడు సి.బి.ఐ. అధికారి.
ఈ వివాహం నిశ్చయించే ముందు తను, గోవర్ధనరావు ఏం మాట్లాడుకున్నారో సురేంద్రనాథ్ కి గుర్తువచ్చింది. కాని, ఆ విషయం వచ్చినవాళ్ళకి చెప్పలేదు కారణం- అది కూడా రహస్యం కాబట్టి.
'తను మొగపిల్లవాడి తండ్రి ఈ పెళ్లి ఆగిపోతే గోవర్ధనరావు పరువుపోతుందేమో గాని తన పరువు పోదు తన కొడుక్కి పెళ్ళి కాకపోదు అలాగాక శీతల్ రాణి ఈ హత్యకి ఏ సంబంధం లేకపోతే తను, తన కొడుకు చాలా అదృష్టవంతులు అనుకున్న సురేంద్రనాథ్ "చెప్పండి-నన్నేం చేయమంటారో!" అన్నాడు.
"ఇతను నా అసిస్టెంట్, ఈమె నా లేడీ అసిస్టెంటు మేము ముగ్గురం మీ స్నేహితులుగా పెళ్ళికి వచ్చాం మా వేషం చూశారుగా పెళ్ళి వాళ్ళం లాగానే వున్నాం ఇహపై భాష కూడా మారిపోతుంది. ఇంక చేయవలసినవి చెపుతాము, జాగ్రత్తగా వినండి" అంటూ సి.బి.ఐ అధికారి చెప్పటం మొదలు పెట్టాడు.
సురేంద్రనాథ్ వింటూ వుండిపోయాడు.
* * * *
"పెళ్ళి కూతురు నీవా-నేనా?"
"నేనేలే" బద్దకంగా బెడ్ మీద నుంచి కూర్చుంటూ శీతల్ నెమ్మదిగా జవాబు ఇచ్చింది.
"ఇంత దిగులు పనికి రాదమ్మాయ్!"
"ఇదే నేనయితే ఏం చేస్తానో తెలుసా? ఎగిరి గంతులు వేస్తాను. పెళ్లవుతుందన్నంత వుషారే లేదు ముఖం చూడు ముఖం."
"పెళ్లికొడుకు నయనబాబు ఎలా వున్నాడో తెలుసా?"
"ఎలా వున్నాడమ్మా!"
"నవ్వుతూ, త్రుళ్ళుతూ నవ్విస్తూ, కవ్విస్తూ ఝాం ఝాం అని మాట్లాడేస్తూ...."
"అయితే ఫరవాలేదు, నోట్లో వేలేసుకుని కూర్చుంటే కష్టంగాని..."
అందరూ ఒక్కసారిగా కిలకిల నవ్వేశారు.
పెళ్ళికూతురు శీతల్ మాత్రం ఉత్సవానికి అలంకరించిన దేవతా విగ్రహంలా నిండా అలంకరణతో ధగధగ మెరిసిపోతున్నది. పెదవి మాత్రం కదపటం లేదు.
సందడంతా శీతల్ స్నేహితురాళ్లదే కవ్విస్తూన్నారు, నవ్విస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు గలగల మాట్లాడేస్తున్నారు. ఒక్కసారిగా బిల బిల లాడుతూ తన రూమ్ లోకి స్నేహితురాళ్ళు రావడంతో తప్పించుకోలేక తప్పనిసరి అయి లేచి కూర్చుంది శీతల్. మనసు మాత్రం రజియా తెచ్చే వార్త మీద వుంది. తను పంపిన వార్త రజియా అందించగానే రంజిత్ రంగంలోకి దిగాలి. లేకపోతే తను చాలా చిక్కుల్లో పడిపోతుంది.
శీతల్ ఆలోచనలు వేరుగా వున్నాయి.
స్నేహితురాళ్ళు అది చూసి మరో విధంగా భావిస్తున్నారు. శీతల్ కి పెళ్ళి కాంగానే అత్తవారింటికి వెళుతుంది అత్తగారిల్లు ఇక్కడయినా వెళ్ళి కాపురం పెట్టేది అమెరికాలో. ఒక్కసారిగా తల్లీ తండ్రిని విడిచిపెట్టి పెరిగిన వాతావరణంకి బహుదూరంగా వెళ్ళాలంటే ఎవరికైనా కష్టంగానే వుంటుంది' అలా అని వాళ్ళు అనుకుంటున్నారు.
"శీతల్!" రూపరాణి అనే స్నేహితురాలు పిలిచింది.
"ఊ..." శీతల్ పరధ్యానంగా ఊ కొట్టింది.
"నయనబాబుతో మాట్లాడి వచ్చాము."
"ఊ..."
"అన్నింటికి ఊ ఏనా?"
"మరేం చేయను?"
"నా నయన్ నా గురించి అడిగాడా! అని నీవడిగితే సరదాగా మేమేదన్నా చెప్పడానికి వుంటుంది."
"నా కలాంటి సరదాలు లేవు" శీతల్ ముఖ చిట్లించి చెప్పింది.
"ఏం వేషాలు పోతున్నావే నా తల్లీ! నీ స్థానంలో నేనుంటే ఎగిరి గంతులు వేస్తాను" రూపరాణి అంది.
"అప్పుడుగాని పెళ్ళికూతురికి పిచ్చి పట్టింది అనరు చిరునవ్వుతో జవాబు ఇచ్చింది శీతల్.
శీతల్ అలా అనంగానే మిగతా స్నేహితురాళ్ళు కిలకిల నవ్వారు.
సరిగా అప్పుడే మగపెళ్ళివారి విడిదిలో వుంది దాసీది. మగపెళ్ళివారి తాలూకూ వాళ్ళంటూ ఒక స్త్రీ ఇద్దరు మగవాళ్ళని వెంటబెట్టుకు వచ్చింది.
