Previous Page Next Page 
చదువు పేజి 7

 

     "వాడిమొహమేమిటి? వచ్చిన అక్షరాలూ రాసి చూపించమనండి." అన్నదావిడ.

    "ఒరే, సుందరం, పలకా బలపం పట్టుకురా," అన్నాడు శ్రీమన్నారాయణ.
  
     సుందరం వచ్చాడు.

    "అట్లా కూచుని నీకువచ్చిన అక్షరాలన్నీ రాయి."

    సుందరం  మోకాళ్ళు ముడుచుకు కూర్చుని కాళ్ళమీద  ఏటవాలుగా పలకపెట్టుకుని బలపం పెట్టి రాయబోతుండగా తండ్రి "పలక అట్లాగేనుట్రా పట్టుకునేది?" అన్నాడు. సుందరం బిత్తరపోయినాడు. పలక మొహానికి ఎదురుగా ఉండేటట్టు పట్టుకోవటం ఎట్లాగో శ్రీమన్నారాయణ కొడుక్కు చూపించాడు. మోకాళ్ళు  ముడుచుకు కూర్చోరాదు. బాసిపెట్టు వేసుకోవాలి. పలక నిలువుగా రెండుకాళ్ళమీదా ఆనించి ఎడంచేత్తో కొద్దిగా ఎత్తిపట్టుకోవాలి.
 
    సుందరం తండ్రి చెప్పినట్టే చేశాడు. కాని యిట్లా రాయటం వాడికి అలవాటు లేదు. అయినా రాయసాగాడు. సుందరం రాయటం మొదలుపెట్టగానే శ్రీమన్నారాయణ ఇంకేదో పనిలో నిమగ్నుడైనాడు. సుందరాని కెందుకోగాని, తన తండ్రికి తన చదువు మీద ఆసక్తి లేదని అనుమానం కలిగింది. తాను అక్షరాలు సరిగా రాస్తాడన్న నమ్మకంగాని, రాయడేమోనన్న భయంగాని తండ్రికి లేదని వాడికి ఎవరో చెప్పినట్లుగా తెలుసును అసలు తన చదువే ఆయనకు పట్టలేదు, తన తల్లి కూడా అక్షరాలు రాసిచ్చి తన పని తాను చూసుకునేది. కాని ఆవిడకు తన చదువుగురించిన ఆలోచన ఏమూలో ఉన్నట్టు సుందరానికి గుడ్డినమ్మకం. తండ్రి విషయంలో ఈ నమ్మకం కలగలేదు.

    మరి కాస్సేపటికి సుందరం పలక మీద 30అక్షరాలకు పైగా రాసి తండ్రి ఎదటే పెట్టాడు.

    "ఎబ్బెబ్బే! ఇవేం అక్షరాలురా, నీ తలకాయ అక్షరాలూ? ఒకటి చిన్నదీ, ఒకటి పెద్దదీ? ఒకటి కిందా. ఒకటి మీదా! ఈ పంక్తులేమిటి? ఇంత ఎగుడుదిగుడుగానా?  సూటిగా రాయాలి. అన్ని అక్షరాలూ సమంగా ఉండాలి. ఇంతచిన్న అక్షరంరాసి అంత పెద్ద తలకట్టిస్తారా? అక్షరాలు అందంగా వుండాలి...

    తండ్రి ఏం చెబుతున్నదీ సుందరానికి అర్ధమేకాలేదు. కాని నోరు తెరుచుకు విన్నాడు. శ్రీ మన్నారాయణ కొడుక్కు చాలా మంచి సలహా యావత్తూ ఇచ్చాననుకున్నాడు. కాని కొడుక్కు ప్రోత్సాహమివ్వాలని      ఆయనకు తట్టలేదు. మూడు రోజుల్లో ఇన్ని అక్షరాలు వాడి కెట్లా వచ్చినయ్యని ఆయన ఆలోచించలేదు. అన్ని అక్షరాలూ వాడు ఒక్క తప్పు లేకుండా రాశాడనికూడా అయన గమనించలేదు.
   
                                       *    *    *    *
   
    మామూలు ప్రకారం సుబ్బమ్మ మధ్యాన్నం దాటగానే 'రాచ కార్యాలకు' వచ్చింది.

    "ఏవమ్మా. అప్పుడు మీబంధువుల పిల్లవాన్ని బళ్ళోవేశారే, వాడు చక్కగా చదువుకుంటున్నాడా?" అన్నది సీతమ్మ.

    "ఆఁ, వాడికెక్కడ చదువొస్తుంది? వొట్టి తిప్పకాయ వెధవ. ఎప్పుడన్నా బడికిపోతేగా? ఇంటోఉంటే చెట్లూ చామలూ ఎక్కి చేతులూ కాళ్ళూ విరుచుకుంటాడని  వాళ్ళమ్మ కానీ అర్ధణా లంచంపెట్టి బడికి పంపింస్తుంది. అదిపెట్టి కొనుక్కుతిని ఎక్కడో నలుగురు పిల్లల్ని చేర్చి గోలికాయలూ, గోటిబిళ్ళా ఆడి ఇంటికి చక్కావస్తాడు. అయినా వాడికి చదువు లేకపోతే ఏంలే. ఏదోయింత తినటానికి భగవంతుడిచ్చాడూ? నాలూక్కాలాలపాటు బతికిబట్టకడితే చాలు. ఉద్యోగాలుచేసి ఊళ్ళేలక్కర్లేదు," అన్నది సుబ్బమ్మ.

    "నువ్వుపోయి లక్ష్మితో ఆడుకోరాదుట్రా?" అన్నది సీతమ్మ, సుబ్బమ్మ చెప్పే మాటలను నోరు తెరుచుకు వింటున్నకొడుకుతో.

    సుందరం లేచి బయటకి వెళ్ళాడు.
 
    "మీ వాడెట్లాగైనా నయం. శ్రద్దగా చదువుతాడు. చూస్తున్నాగా. వాడికి అల్లరీ ఆటలూ అక్కర్లేదు. అదృష్టం."

    "ఇదెన్నాళ్ళో? బళ్ళోవాడికి చదువురాలా, కాకపోయినా బడిపంతుళ్ళు శ్రద్దగా చెప్పరు. నేనెన్నాళ్ళు చెప్పగలను చెప్పమ్మా? ఇవాళతో అయిదు బళ్ళూ చెప్పా. గుడింతాలూ, వత్తులూ చెప్పాలి. వాడికో బాలశిక్ష తెచ్చిపెట్టమన్నా. ఏంతెస్తారో? ఆయనకు వక్కరవ్వపట్టదు." అన్నది సీతమ్మ.

    "కాక పోయినా మనం చెబితే పిల్లలకు చదువెక్కడ వస్తుందమ్మా? నేను మహాలక్ష్మిని రెండక్షరాలు దిద్దుకోవే, అని మూడురోజులనుంచి పోరుతున్నా. ఠలాయిస్తుంది. నన్నుఎదురుఆటల్లో పెడుతుంది: గురువంటూ ఉంటేగాని పిల్లలు భయభక్తులతో చదువు కోరు." అన్నది. సుబ్బమ్మ.

    సుబ్బమ్మ కేమాత్రమైనా ఆలోచనా, జ్ఞానమూ ఉంటే ఈ మాట అనదు. నాలుగైదు రోజుల్లో తల్లి దగ్గర సుందరం అక్షరాలన్నీ నేర్చుకున్నసంగతి ఆవిడకు తెలుసు. సుందరం ఈ పనిచేయటానికి, కారణం భయభక్తులుకావు, శ్రద్ధ. ఆ సంగతి సుబ్బమ్మ జన్మలో అర్ధంచేసుకోలేదు.

    సీతమ్మ మాత్రం, "అవును, నిజమే," అని ఆ విషయం అంతటితో పోనిచ్చింది.

    మా వాళ్ళక్కూడా అదే సలహాచెప్పా. 'ఎందుకర్రా వాణ్ణి బడికి పొమ్మంటే పోనప్పుడు, మేస్టర్ని ఇంటికి పిలిపించి ప్రెయివేటు చెప్పించండి.' అన్నా" అన్నది సుబ్బమ్మ.

    సీతమ్మా ఆలోచించింది. తాను కొడుక్కు చెప్పే చదువు అయిపోవచ్చింది. ఎవరన్నా మేస్టర్ని పెడితే, పై సంవత్సరం కాకపోతే ఆపై సంవత్సరమైనా హైస్కూలులో చేర్పిస్తాడు. ఈ విషయం భర్తకు చెప్పటానికి ఆవిడనిశ్చయించింది.
 
    ఆ త్రాత్రి సుందరం తల్లికి "శ ష స హ ళ క్ష " రాసి చూపించాడు.
 
    "అమ్మా, నాకిప్పుడన్ని అక్షరాలూ వచ్చినయ్యా?"అన్నాడు వాడు.

    అవునన్నదితల్లి.

    "అయితే అన్ని మాటలూ రాయొచ్చా?"
 
    "అప్పుడేనా?" అన్నది తల్లి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS