"అలా అడుగుదూరంలో ఎదురొచ్చి నిలబడేకంటే....ఇలా మీ అంతరంగంలో ఒదిగిపోవడమే నాకిష్టం" అంది అతని తొడలమీద తలను మరింత ఆనిస్తూ.
"నాకే కాదు ఏ ఆడదానికైనా అంతే. భర్త ఎదురుగా రావాలంటే అడుగులు తడబడతాయి. ఎదలోకి రావాలంటే మాత్రం అనురాగం తోడు ఉంటే చాలు ఏ తడబాటు వుండదు జీవితాంతం" అంది సుగాత్రి. శరత్ ఆమె తల్లో ఎర్రగులాబి తురిమాడు.
"సుగా....నల్లమబ్బుల్లో వెండి మెరుపంటే తెల్సా" అన్నాడు నవ్వుతూ.
"ఏమిటీ?"
"ముసల్దానివై పోతున్నావ్....తెల్సా...ఇదిగో వెండితీగ" అంటూ తెల్ల వెంట్రుక చూపించాడు.
"వృద్దాప్యం శరీరానికేగాని__మనసుకి కాదుగదా__అయినా నేనింకేం చిన్నపిల్లను కాదు. మన పెళ్ళయి ఏడేళ్ళు దాటింది__" అంది శరత్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. "ఏమండీ! ఈ ఇంటికి ఒక్కగానొక్క పెద్దదిక్కు, మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడేలా ఓసారి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పించండి. రాత్రంతా ఆయన రూములో విపరీతంగా దగ్గుతూనే వున్నారు. నేను చెప్పి చూశాను కాని__నన్ను మందుల్తో చంపకండమ్మా, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే లక్ష్మి వచ్చింది. నా కొడుకు చాలా ఎదిగిపోయాడు. ఆ తృప్తితోనే నేను వెళ్ళిపోతాను అన్నారు. రాత్రి దగ్గుతో పాటు రక్తం కూడా పడింది. నాకు బాగా భయమేసింది" అంది సుగాత్రి.
"మా నాన్నెప్పుడూ అంతే! ఇంకేమన్నాడు."
"ఇంకేమంటాడు! ఎప్పుడూ అనేదే! నా కడుపునా ఓ కాయ కాయ నందుకు చింత తప్ప అన్నీ సుఖంగానే వున్నాయట."
"ఆ మాటకు నువ్వు బాధపడ్డావా?" అన్నాడు శరత్ నవ్వుతూ.
"దాదాపుగా అయిదేళ్ళుగా అంటున్న మాటేగా-అలవాటైపోయింది. ఓసారి షిర్డి వెళ్ళి సాయిబాబాను దర్సించి రమ్మన్నారు" అంది తనూ నవ్వుతూ.
"షర్ట్ కన్నీ ఆయిల్ మరకలంటాయి. రాత్రి ఓ యంత్రాన్ని మరమ్మత్తు చేశాను. అలసటగా వుంది. నే స్నానం చేసి వచ్చేలోగా....కాఫీ రెడీ చెయ్యి" అన్నాడు సుగాత్రిని లేవబెడుతూ. ఆమె లేవలేదు.
"ఏమండీ! ఇక మనకీ పిల్లలు పుట్టే అవకాశమే లేదా__?" అంది దీనంగా సుగాత్రి.
ఏడేళ్ళ అన్యోన్య దాంపత్యంలో అంతటి గద్గదంగా_అతనెప్పుడూ ఆమె నోటి నుండి వినలేదు. శరత్ కొద్దిసేపు మౌనంగా వున్నాడు. మాట మార్చడానికి ప్రయత్నిస్తూ- "ఆ చాదస్తపు ముసలాయన గాని ఏమయినా అన్నాడా?"
"ఛ-ఛ- ఆయనెప్పుడూ నన్నేమీ అనలేదు. మీ ఆస్థికి, అంతస్థుకు, ముఖ్యంగా వంశానికి ఓ వారసున్ని ఇవ్వలేకపోయాను" ఆమె కళ్ళల్లో నీళ్ళు.
"ఏమిటి సుగాత్రి? క్రొత్తగా మాట్లాడుతున్నావ్! వారసున్ని ఇవ్వలేకపోయానని నువ్వేనా బాధపడేది? డాక్టర్లెప్పుడో నిర్ణయించారు కదా లోపం నాదేనని" అన్నాడు శరత్. ఆ మాట అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. ఆమెకు తెలుసు. డాక్టర్ల పరీక్షల ప్రకారం లోపం అతనిదేనని. ఈ రహస్యం వాళ్ళిద్దరి మధ్యే వుంది. కాని లోకం ఎవరి మీద నిందవేస్తుంది? మగాడిలో లోపం వుండి పిల్లలు కలుగకపోతే__ఆడదాన్నే గొడ్రాలుగా ముద్రవేస్తారు కాని మగాన్నేమీ అనరు.
"లోపం నాదే కదా__?" తనలో తానే అనుకుంటూ బయటికే అన్నాడు శరత్.
"ఏమండీ__లోపం మీదేనని గుర్తుచేసి బాధపెడుతున్నానని కాదు, ఎందుకో ఈ మధ్య నాకు పిల్లలంటే ఆసక్తి పెరుగుతుంది. ఏమండీ! మీ బంధువులింట్లో చిన్న పాపలుంటే దత్తత తీసుకుందామా?"
"ఆ నిర్ణయం తీసుకునే వాన్ని....! కాని నాన్నగారు ఒప్పుకోరు. ఆయన మా బంధువులంతా రాబందులంటాడు. అందుకే ఆయనకు భయపడి ఎవరూ ఈ ఇంట్గి చాయలకు కూడా రారు. మరే అనాధ బాలున్నో తెస్తే_ఆస్థిని మింగేవాడు తయారవుతాడు తప్ప కాపాడి వృద్దిలోకి తేలేరని ఆయన చాదస్తపు అభిప్రాయం. ఆయన మనసు నొప్పించలేక ఇన్నాళ్ళూ ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను." అన్నాడు శరత్ ఆమె తల నిమురుతూ.
సుగాత్రి కనురెప్పలు మండుతూంటే...మూసుకుంటూ శరత్ ని మరింత హత్తుకుంది.
"సుగా...."
"ఊ..."
వాళ్ళలోని భావాలు భాషను అన్వయించుకోలేక...భారంగా వచ్చే పదాలే అయ్యాయి. అందుకే అతనిలోని వేదనతో బంధానికి అనుబంధపు సంకెళ్ళు వేస్తున్నట్టు అతడు మరోసారి 'సుగా' అన్నాడు.
ఆ పిలుపులో ప్రేమ తరంగాల ఘోష....
ఆ పిలుపులో ఆమె గుండెల్ని తాకే ఉచ్వాస....
ఆ పిలుపులో అన్యోన్య బంధాల అత్యాశ....
"ఊ" అంది సుగాత్రి.
అత్యాశల నిశ్వాసల్ని నిగూఢం చేసుకోడానికి అందుకొమన్నట్టు అతి భారంగా- అతడిలో ఏదో సంశయం. ఆ సంశయం నిశ్శబ్దాన్ని తోడుతెచ్చుకుంటే క్షణాలు మౌనంగా దొర్లాయి కొద్దిసేపు.
వాళ్ళిద్దరిపైన నిశ్శబ్దం శాసిస్తూంది.
వాళ్ళిద్దరి లోపల సముద్రం ఘోషిస్తూంది.
పై భాగాన ఎంతటి అలలు ఎగిసిపడితే సముద్రపు అట్టడుగు అగాధాలకు చలనం కలుగుతుంది. కాని భౌతిక ధర్మాలకు వ్యతిరేకంగా వాళ్ళలో చలనమంతా అడుగునా, నిశ్శబ్దమంతా ఉపరిభాగాన వుంది ప్రస్తుతం.
గుండె గదుల్లో నిశీధి నిండుకొంటున్నప్పుడు....స్థబ్ధమైన మనోవాల్మీకాలు-నిర్వికల్ప సమాధిలాంటి స్థితిలో మన్నుతిన్న భుజంగాలైనప్పుడు వేదనల "మంత్ర నగరి" సరిహద్దులు దాటి మాటలు పెగలలేక__వాళ్ళిద్దరి మధ్య పదాలేగాని...వాక్యాలు దొర్లటంలేదు.
