'అయ్యగారికి ఎలర్జీ సెంటువాసన చూస్తేచాలు తుమ్ములు వస్తాయి. సార్ సంగతి మీకు తెలియదు. ముక్కుతో వాసనచూసి ఎన్నిసార్లో దొంగలని పట్టారు. ఈ సమయంలో వారికి చిరాకు కలిగించవద్దు. సెంటు రాసుకున్న వారెవరో దూరంగా వెళ్ళండి" కానిస్టేబుల్ కనకారావు చాలా తెలివిగా అసలువిషయం చెప్పి సెంటు రాసుకొచ్చినవాడిని రక్షించాడు.
"గుడికొస్తు సెంటు రాసుకురావటం తప్పయిందా! ఇదెక్కడి గోలరా బాబూ!" అనుకుంటూ నెమ్మదిగా అటునుంచి అటే అతను వెళ్ళి పోయాడు.
మరికొద్ది సేపు అటు ఇటు తిరిగి అందరిని అడ్డమైన ప్రశ్నలువేసి ఇది మామూలుకేసుకాదు. వచ్చింది మామూలు దొంగలుకారు. నాకో అనుమానం వస్తున్నది. అదే నిజమైతే చాలా ఘోరం పెద్దనేరం చూస్తాను. దీనిఅంతు చూస్తాను." అని చెప్పి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తన మందిమార్భలంతో గాక అక్కడ దొంగలు విడిచిపెట్టివెళ్ళిన గడ్డపలుగులు పార భక్తులు అమ్మవారికికొట్టిన కొబ్బరికాయల తాలూకు చిప్పలు తీసుకుని వెళ్ళిపోయాడు.
"వెంటనే దొంగలు తవ్వినచోట మళ్ళీ బండలు పరిచి సిమెంటు చేయించండి" అని ఆర్డరు కూడా వేశాడు.
ఇన్ స్పెక్టర్ వెళ్ళగానే.
"ఇదెక్కడి గోలండీ కరణంగారూ! బండలు పరిపించటం, సిమెంటు చేయించటం అంటే చేయిస్తాము పూలుపూసే పచ్చటి చెట్టుని కొట్టించడం అంటే అదెంతకీడో మీకు తెలియదా?" ఆలయ అధికారి పూజారి కరణంముందు వాపోయారు.
"ఇన్ స్పెక్టర్ గారికి నేను నచ్చచెపుతాను సరేనా!" అన్నాడు కరణం చెట్టుని కొట్టించడం ఆయనక=కి ఇష్టంలేదు.
అమ్మయ్య అనుకున్నారు వాళ్ళిద్దరూ.
అప్పుడే ఏంకాలేదు ముందున్నది ముసళ్ళపండుగని ఆ సమయంలో పాపం వాళ్ళు ఊహించనైనా ఊహించలేదు.
పల్లెటూరివాడి వేషంలో చెవిలో పువ్వు ముఖాన వీభూతి చాక్ లెట్ సైజులో పెట్టుకుని కనుబొమలమధ్య కుంకం అద్దుకుని అచ్చం భక్తుడి వేషంలోవున్న కురైపతి తను వచ్చినపని పూర్తికావటంతో కొండదిగి వెళ్ళిపోయాడు.
4
రాత్రి పదకొండు నలభై.
"ఎందుకే అంత భయపడతావ్?" ఖుషీగా కాళ్ళూపుతూ విలాసంగా సిగరెట్ పొగ మాలక్షమ్మ మీదికి వదులుతూ అన్నాడు శివుడు,
"నాకేం భయంలేదు. నేనేమి పిరికిపందను కాను" మాలక్ష్మమ్మ తల్లోపూలు ముడుచుకుంటూ అంది.
"మరి నేనా!"
"నీవూ కాదు."
"మరి భయం దేనికి?"
"నీ ఉద్యోగం వూడుతుందేమోనని...?"
"ఓసోస్, ఇదేమన్నా కలకటేరు ఉద్యోగమా? అదిపోతే ఇంకోకటి అదీపోతే మరొకటి ఏదీలేకపోతే నీపక్కనే కొట్టుపెడతా. నీకు పోటీ గాను ఉంటుంది తోడుగాను ఉంటుంది.
"కబుర్లు నేనూ చెపుతాను కావలసినన్ని....!" అంటూ శివుడి పక్కకొచ్చి కూర్చుంది మాలక్ష్మమ్మ.
"చెప్పు చెప్పు వింటానికి రడీగున్నాను" శివుడు నవ్వేస్తూ అన్నాడు.
"వేళా,కోళంకాదు శివుడూ! రాత్రి డ్యూటీలప్పుడు నిన్ను రావద్దని నేననటంలేదు వచ్చి గంట రెండుగంటలు ఉండి వెళ్ళు అంతేగాని రాత్రంతా నన్ను కాపలాకాస్తూ కూర్చుని గుడిదగ్గర కాపలా కాయటం మానేస్తే మళ్ళీ గుళ్ళో ఏమన్నా జరిగిందంటే మధ్యలో నీ ప్రాణం మీదకి వస్తుంది. నీ మంచి కొరకేకదా ఇదంతా నేను చెపుతున్నది?" శివుడ్ని లాలిస్తూ చెప్పింది మాలక్షమ్మ.
"ఇన్ని మాటలెందుకు! రాత్రంతా నీవు నా పక్కనే ఉంటే నాకు కుదరదు మగడా! అని చెప్పు! ఇప్పుడే ఈ ఫలాన లేచిపోతాను......" శివుడు కోపం తెచ్చుకుంటూ అన్నాడు.
"మాలావు కోపం వకటి మంచి చెపుతుంటే వినిపించుకోటంలేదు ఇక్కడ ఉన్నంతసేపు ఉండి నిద్రపోయేముందు పైకెక్కి గుడి తలుపుల దగ్గరే పడుకో.
"అసలే పని చేసిచేసి అలసిపోయి వుంటాకదా! నిద్ర ముంచుకు వస్తుంది. దేముడా అంటూ మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి కిందపడుకుని చావాలంటే చచ్చేచావు వస్తుంది.
"నా గడప తొక్కకముందు బండలను కర్చుకుని పడుకోక పట్టెమంచాల మీద పడుకున్నావా!"
