Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 7


    అనితను ఎత్తికెళ్ళి బాత్ రూమ్ లో మూలగా కూర్చోపెట్టాడు. గది అంతటినీ ఒకసారి పరిశీలించాడు. మామూలుగా వుండే ప్రయత్నంలొ లేని గాంభీర్యాన్ని మొహానికి పులుముకున్నాడు.
    బజ్జర్ మ్రోగింది.
    తప్పదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో లేచివెళ్ళి ఆవలిస్తూ తలుపు తీశాడు. గుమ్మం అవతల బేరర్ నుంచొని వున్నాడు.
    "ముందు కాఫీ తీసుకురానా సర్ లేక కాఫీ, టిఫిన్ రెండూ తీసుకురానా సర్" అంటూ వినయంగా అడిగాడు బేరర్.
    "ఒక కాఫీ" కిరణ్ చెప్పాడు.
    "ఒక కాఫీనా? మేడమ్ ఇంకా లేవలేదా సార్" అన్నాడు వినయంగా బేరర్.
    చాలా త్వరగా మూవ్ అయాడు కిరణ్. "ఒక పాలు కాఫీ ఇద్దరికీ చాలవా?" నవ్వుతూ ప్రశ్నించాడు కిరణ్.
    "మీరు ఒక కాఫీనే చెప్పారు సార్"
    "అలా చెప్పానా!"
    "ఎస్ సార్"
    కిరణ్ ఆవులించాడు. "నిద్రమత్తులో అలా చెప్పాను కాబోలు. పాలు కాఫీ తీసుకురా!" అన్నాడు కిరణ్ మరలా ఆవులిస్తూ.
    "రెండు నిముషాలు సార్" అంటూ బేరర్ వెళ్ళి పోయాడు.
    కిరణ్ క్విక్ గా తలుపు మూసాడు. అంతకన్నా త్వరగా ఆలోచించాడు. వేగంగా బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫుల్ స్పీడ్ తో పంపులో నీళ్ళు వచ్చేలాగా తిప్పి బాత్ రూమ్ తలుపులు వేసి, వెంటనే రూమ్ తలుపులోపలి గడియ తీసేసి, వచ్చి కుర్చీలో కూర్చుని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్లుగా కూర్చుండిపోయాడు. బాత్ రూమ్ లో నీళ్ళ చప్పుడు బయటకు వినిపించసాగింది.
    ఇపుడు బేరర్ లోపలికివస్తే మేడమ్ బాత్రూం లో వుండి మొహం కడుక్కుంటున్నారు కాబోలు అనుకుంటాడు.
    ఆ ప్లాన్ తోనే కిరణ్ ఈ పని చేశాడు.
    బేరర్ వచ్చి కాఫీపాలు, కప్స్, సాసర్స్ టేబిల్ మీద సర్ది వెళ్ళాడు. బేరర్ వెడుతున్నపుదు అతను వినేలా "అనితా! కాఫీ రెడీ నీదే ఆలస్యం. కడిగింది చాల్లే త్వరగా రావోయ్" అన్నాడు కిరణ్.
    కిరణ్ అనుకున్నట్లుగానే బేరర్ అతని మాటలు విన్నాడు. బేరర్ వెళ్ళిన తర్వాత తలుపు లోపల గడియవేసి వచ్చాడు కిరణ్. రాత్రినుంచి మండిపోతున్న కడుపుని చల్లార్చుకోవటానికి మొత్తం కాఫీ తాగేసాడు. బాత్ రూమ్ లోకి వెళ్ళి అనిత శవాన్ని చేతుల మీద తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. గోడవైపు మొహం పెట్టుకుని పడుకున్నట్లుగా, గోడవైపు త్రిప్పి పడుకోబెట్టాడు. వెళ్ళి గడియతీసి వచ్చి చేతుల్లో పుస్తకం పుచ్చుకుని, పుస్తకం చదువుతున్నట్టుగా అనితను ఆనుకుని కూర్చున్నాడు. బేరర్ వచ్చి ఖాళీ అయిన కాఫీ పాలును తీసికువెడుతూ, "టిఫిన్ ఎన్నింటికి తీసుకురాను సార్" అన్నాడు.
    "మరి కొద్దిసేపట్లో మేము బయటకు వెళ్ళాలి. క్రింద తిని వెళ్తాము. ఇపుడు ఏమీ అవసరంలేదు. మళ్ళీ పిలిచిందాకా!" అన్నాడు కిరణ్ బేరర్ వెళ్ళిపోయాడు.
    కిరణ్ రాత్రి తను వేసుకున్న పధకాన్ని మరోసారి మననం చేసుకున్నాడు.
    తను రూమ్ తలుపు లాక్ చేసి బయటకి వెళతాడు. తను ఒంటరిగా బయటకి వెళ్ళినట్లు హోటల్ సిబ్బందికి తెలియకుండా వుండటానికి, ఎవరి కంటాపడకుండా హోటల్ వెనుకభాగం నుండి మెట్లుదిగి క్రింద పార్కింగ్ (కార్లు) ప్లేస్ ప్రక్కనుండి వెళ్ళిపోతాడు.
    ఆ తరువాత.
    సరిగా అరగంట ఆగి,
    పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకివెళ్ళి, ఇదే హోటల్ మేనేజర్ కి ఫోన్ చెయ్యాలి. "బిజినెస్ నిమిత్తం నేనెప్పుడు ఈ వూరు వచ్చినా మీ హోటల్ లోనే దిగుతాను. మూడవ ఫ్లోర్ లోని 42, 43, 44 నెంబర్లుగల రూమ్స్ లొ ఏదో ఒకటి నాకు రిజర్వ్ చేయించాల్సింది. ఆ త్రీ రూమ్స్ లోని ఏ రూమ్ లొ దిగినా నాకు కలసివస్తుంది. 10రోజులు వుంటాను. నా చాదస్తానికి, సెంటిమెంటుకు నవ్వుకుంటున్నారా?" అని తను అడుగుతాడు.
    తన మాటలు విని మేనేజర్ నిజంగానే నవ్వుకుంటాడు. కానీ నవ్వనట్లుగా మాట్లాడుతాడు. "మీరు మా హోటల్ లోనే ఎప్పుడు బసచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతాడు మొదట. తరువాత నేనూ సెంటిమెంట్స్ ని లైక్ చేసే వ్యక్తినే అంటూ రూమ్ నెం 44 ఖాళీలేదు సార్! రూమ్ నెం 42 కాని 43 కాని బుక్ చేస్తాను సార్" అని నమ్రతగా అడుగుతాడు.
    రూమ్ నెం 44లో వున్నది తనే కదా! పిచ్చ వెధవ వాడికి తెలిచ్చావక 42, 43 కాని ఇస్తానంటున్నాడు. తనకి తెలుసు ఆ రెండు రూంలు ఖాళీగా వున్నట్లు.
    అక్కడితో ఒక పని పూర్తవుతుంది. తను మరో హోటల్ రూం తీసుకోవాలి. మారువేషంలో మేనేజర్ ఇచ్చే రూంలో దిగి రెండు చెక్క పెట్టెలు సంపాదించి, ఆ చెక్కపెట్టెలు ఒక బ్రీఫ్ కేస్ తో అక్కడ వుండిపోతాను. తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో వుంటారు. అప్పుడు తన రూంలో  నుంచి అనిత శవాన్ని తీసుకుని ప్రక్కరూంలోకి వస్తాడు. అనిత శరీరంమీద ఏ చిన్న గుర్తు వుండటానికి వీల్లేదు. నగలు బట్టలు తీసేస్తాడు. అనిత మొహంమీద ఒంటిమీద ఆసిడ్ పోస్తాడు. అనిత మొహం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అనితను రెండు ముక్కలుగా చేసి రెండు పెట్టెలలో పెట్టేయాలి. తను ఈ పని చేస్తున్నపుదు చేతికి గ్లవుస్ వేసుకోవాలి కాలికి తన సైజుకన్నా పెద్దసైజు కలర్బూట్స్ వేసుకోవాలి ఆ రూంలొ తనని కాలిముద్రలు వేలి ముద్రలు ఏవీ  పడకూడదు.
    తన గురించి చిన్న సాక్ష్యాధారం కూడా లభించకూడదు. ఆ తరువాత అనిత దుస్తులకు బ్రీఫ్ కేస్ లొ పెట్టుకుని రూం తలుపు తాళంవేసి బయటకు వచ్చేస్తాడు. అనిత గుడ్డలున్న తన బ్రీఫ్ కేస్ తన రూం 44లో పెట్టాలి.
    అందరి ఎదుట నడుచుకుంటూ క్రిందకు రావాలి. రిసెప్షనిస్ట్ తో "నేను అర్జంటు పనిమీద ప్రక్కవూరు వెడుతున్నాను. వారందాకా రాను. నా కోసం గులాబ్ చంద్ అనే అతను వస్తాడు. నే నిక్కడ దిగినట్లు అతనికి తెలుసు. అతను నా గురించి అడిగితే వూరు వెళ్ళారు, ఆదివారం నాటికి ఇక్కడ వుంటారు అప్పుడు రండి అని చెప్పండి" అని చెప్పి తను బయటకు వెళ్ళిపోతాడు.
    తను తిరిగి ఈ వేషంతో ఈ హోటల్ మొహం చూసేదిలేదు. బయటకు వెళ్ళిన తను, తన మామూలు వేషంలో తన గది 44కి వస్తాడు. అక్కడ తను రోజుకో కాల్ గర్ల్ అని పిలిపించుకునే మనిషిలా రోజుకో అమ్మాయిని పిలిపించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తూ సరదాగా గడపాలి. ఈ లోపల ప్రక్కగదిలో శవం బయటపడదు. ఒకవేళ పడ్డా నేరం తనమీదకు రాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS