Previous Page Next Page 
అష్టపది పేజి 7

 

    "అవును."
    
    "దయచేసి ఈ విషయం పెళ్ళి జరిగిపోయిందాకా దాయలేరా? ఈమాట మిమ్మల్ని నేను అడగకూడదు. కాని అడుగుతున్నాను పెళ్ళితంతు పూర్తి అయిందాకా మీరు మా మధ్యనే వుందురుకాని" ఇది హత్య, పైగా పోలీసు అధికారులతో పని. అందుకే భయపడుతూనే కాస్త ధైర్యంచేసి అడిగాడు సురేంద్రనాథ్.
    
    "మాకు అభ్యంతరంలేదు. ఆ తర్వాత నిజం తెలిస్తే మీరు భరించగలరా?"    

 

    సురేంద్రనాథ్ ఆలోచించాడు. "ఇంతకీ ఎవరిమీద మీ అనుమానం?" నెమ్మదిగా అడిగాడు.
    
    "శీతల్ రాణి మీద"
    
    సురేంద్రనాథ్ నడినెత్తిన పిడుగుపడినట్లయింది. ఎలాగో మాట కూడదీసుకుని గొంతుపెగల్చుకుని అడిగాడు. "మా వాళ్ళలో ఆ పేరుగలవాళ్ళు ఎవరూ లేరు. శీతల్ రాణి..."
    
    "మా కా విషయం తెలుసు. పెళ్ళికూతురు పేరు శీతల్ రాణి" చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు సి.బి.ఐ. అధికారి.
    
    అప్పుడే ఓ అనుమానం వచ్చింది సురేంద్రనాథ్ కి.
    
    "శీతల్ రాణి మీద అనుమానం వుంటే మీరు వెళ్ళి కలవాల్సింది గోవర్ధనరావుని కదా?"
    
    "నిజమే కాని, బిడ్డ నేరంచేస్తే తల్లి కాని, తండ్రికాని ఏం చేస్తారంటారు?"
    
    "నిజాన్ని కప్పిపుచ్చటానికి చూస్తారు."
    
    "అదే యిప్పుడు జరిగిందేమోనని మా అనుమానం"
    
    "దయచేసి వివరంగా చెప్పండి."
    
    "అలాగే, ఈ కేసు విషయంలో మీరు సహకరిస్తారని ముందుగా మేము మిమ్మల్ని కలవడం జరిగింది. గోవర్ధనరావుని కల్సుకుంటే తండ్రిగా ఆయన ఈ విషయం దాచవచ్చు ఈ విషయంలో తండ్రి, కూతురు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి వుంటే ఒకేమాట చెపుతారుగాని బైటపడరు. కూతురిని రక్షించుకోటానికి ఆయనేదన్నా ఎత్తువేసి ఉండవచ్చు."
    
    సి.బి.ఐ. అధికారి చెబుతుంటే నిజమేననిపించింది సురేంద్రనాథ్ కి.
    
    "...లాస్ట్ మినిట్ లో అంటే ఈ ఈవినింగ్ మాకు కొత్త రిపోర్టు అందింది. ఈ తెల్లవారుఝామునే మీ అబ్బాయితో శీతల్ రాణి వివాహం అని తెలిసింది. ముఖ్యంగా మీరోమాట గుర్తుపెట్టుకోవాలి. అటు గోవర్ధనరావు, ఇటు మీరు సంఘంలో హోదా, పలుకుబడి, డబ్బు ఉన్నవాళ్ళు. శీతల్ రాణిమీద అనుమానంతో వచ్చాము కాని జరగబోయే శుభకార్యాన్ని కకావికలు చేయటానికి కాదు."
    
    "నాకు మీరు చెప్పేది కాస్త అర్ధమయి కాకుండా వుంది. ఇంకాస్త వివరంగా చెప్పండి"
    
    "మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. అంత మాత్రంచేత శీతల్ రాణి హంతకురాలని మేము అనటం లేదు. మా అనుమానం తీర్చుకోడానికి మాత్రమే వచ్చాము. శీతల్ రాణి హంతకురాలనుకోండి, వెంటనే మేము ఆమెని కష్టడీలోకి తీసుకుంటాము. మీ కోడలు కాకముందే ఆ పని చేస్తే మీ పరువుపోదు. అలా పెళ్ళి అయి ఇలా నేరం బయటపడితే సంఘంలో ప్రముఖుడు, పెద్దమనిషి అయిన సురేంద్రనాథ్ గారి కొత్త కోడలు హంతకురాలు. అటు మూడు ముళ్ళు, ఇటు చేతులకి అరదండాలు హంతకురాలి మెడలో తాళికట్టిన హీరో నయనబాబు అంటూ దినపత్రికలు పెద్ద సంచలనం రేపుతాయి, అది మీకు గౌరవప్రదమా?"
    
    "లేదు, లేదు" అంటూ సురేంద్రనాథ్ కంగారుగా అన్నాడు.
    
    "శీతల్ రాణికి, జరిగిన హత్యకి ఏ సంబంధం లేకపోవచ్చు. ఆధారాలు చివరికి నిరాధారాలు కావచ్చు. అలాంటప్పుడు మేము తొందరపడి ముందడుగు వేస్తే ఓ ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వులపాలు చేసిన వాళ్ళ మవుతాము. పెళ్ళి ఆగిపోతుంది. అది ఆమె జీవితానికి దెబ్బ అవుతుంది. అందువల్ల మేము మీ దగ్గరకు బయలుదేరి వచ్చాము."
    
    "ఈ విషయంలో నేనేమి సాయం చేయగలను?"
    
    "మేము ఇన్వెస్టిగేషన్ కు ముందు ప్లాను వేసుకుని బయలుదేరుతాము, తెల్లారితే పెళ్ళి అయిపోతుంది. ఈ రాత్రి లోపల పెళ్ళికూతురు హంతకురాలు అవునో కాదో తేల్చుకోవాలి. తేల్చుకోవాలి అంటే డైరెక్టుగా యీ పరిస్థితులలో రంగంలోకి దిగకూడదు. ఏం చేయాలి, మా ప్లానులో భాగంగా సక్సెస్ చేయగల మొదటి వ్యక్తి మీరు అందువల్ల మీ దగ్గరకు వచ్చాము"
    
    "ఏం చేయాలో చెప్పండి"
    
    "చెపుతాము చెప్పే ముందు ఒక్క మాట చిన్న నాటక ఆడాలి. దాంతో పెళ్ళికూతురు హంతకురాలు అవునో కాదో తేల్చుకుంటాము ఇది రెండో కంటికి తెలియకుండా ఆఖరికి పెళ్ళికూతురికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. శీతల్ రాణి హంతకురాలయితే యీ పెళ్ళి ఆగిపోతుంది. కాకపోతే ఆ ముహూర్తానికే దివ్యంగా పెళ్ళి అవుతుంది. మీ కోడలు అవుతుంది. జరిగింది మీకు తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి ఈ నిజాన్ని మీ గుండెలో భద్రపరచుకుందురు గాని ఏమంటారు?" సి.బి.ఐ. అధికారి అడిగాడు.
    
    "మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. కాని....."
    
    "మీరు నాన్చనవసరంలేదు అనుమానంలేదు వుంటే అడిగి తీర్చుకోండి."
    
    "హతుడు ఉపేంద్రకుమార్ కి, శీతల్ రాణికి గతంలో..." ఆపైన ఎలా అడగాలో తెలియక సురేంద్రనాథ్ ఆగిపోయాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS