"అన్నం తిన్నతరవాత మళ్ళీ రెండక్షరాలు రాసిస్తావా?" అన్నాడు సుందరం.
"అట్లాగేలే."
అన్నం తిన్న తరవాత సీతమ్మ ఋ ౠ రాసి ఇచ్చింది.
ఆ అక్షరాలు సుందరాని కంత రుచించలేదు. "అరు అరూ" అని వాటిని అనాలని తల్లి చెప్పింది. తల్లి నిజం చెప్పుతున్నట్టు వాడికి తోచలేదు. వాటిని దిద్దుతూనే ఎప్పుడు నిద్రపోయి నాడోసుందరం దీపందగ్గరే పడుకుని నిద్రపోయినాడు.
వాడి చేతినుంచి మెల్లిగా పలక విడిపించి తన అక్షరాల మీదగా కొడుకు దిద్దిన గీతలు చూచుకుని చాలా మురిసింది.
* * * *
సుందరం తల్లి సహాయంతో అక్షరాలు నేర్చుకోవడం సుందరానికెంత విచిత్రానుభవమయిందో, సీతమ్మకూ అంతవిచిత్రానుభవమయింది. తానేమిటి, కొడుక్కు చదువు చెప్పటమేమిటి అన్నసందేహం మళ్ళీ సీతమ్మ మనస్సులో తలఎత్తలేదు. ఇది చాలా మంచి ఆలోచన అన్నది మొదటిగంటలోనే రుజువయింది. రెండోరోజు సుందరం పన్నెండు అక్షరాలు ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటున్నట్టు నేర్చుకున్నాడు. నిజానికి వాడిబుద్ధి ఆ నేర్చుకునే అక్షరాలకు అంటుకుపోయి తిండిమీదా, ఆటలమీదాకూడా ధ్యాసలేకుండా చేసింది. అది వాడికి ఒకవిధమైన వ్యసనమల్లే అయిపోయింది. వాడి మనస్సు ఎట్లాపనిచేస్తున్నదీ కళ్ళతో చూస్తున్నట్టుగా కనిపెడుతున్న సీతమ్మకు. తన కొడుకు అమితదీక్షతో అతి వేగంగా అక్షరాలు నేర్చుకుంటున్నాడన్న అనుమానంకూడా బాధించింది.
రెండో రోజు ప్రొద్దున వాడు తల్లితో పోట్లాడి నాలుగక్షరాలు దిద్దబెట్ట మన్నాడు. ఋ ౠ అలు అలూ దిద్ద బెట్టించుకున్నాడు. కాని వాడు వాటిని దిద్దలేదు. అవి చూడకుండా వచ్చేదాకా చూసి రాశాడు. ఆ తరువాత ఇంకా నాలుగుక్షరాలు కావాలన్నాడు. తల్లి ఎ ఏ ఐ మాత్రమే రాసి యిచ్చింది. అవి నిజంగా రెండే అక్షరాలని వాడు పోట్లాడాడు. ఎ ఏ లు ఒకే అక్షరం కింద వాడు స్వీకరించాడు. అయినా అవి రాసి చూపించే దాకా సీతమ్మ ఒ ఓ ఔ దిద్దబెట్టలేదు. ఒ అనే అక్షరం సుందరానికి ఋ అనే అక్షరంలో ఒక భాగంగా కనబడింది. దాన్ని వాడు వెంటనే రాసేశాడు.
రాఘవయ్య పంతులు బడిలో చదివిన రెండు రోజుల లోనూ సుందరానికి చదువుతప్ప అన్ని కనిపించినై, అసలైన చదువు ఇప్పుడే వాడికి అనుభవంలోకి వచ్చింది. వాడు కన్న కలలకు ప్రత్యక్ష స్వరూపమల్లే ఉన్నది ఇదే. ఆ రాఘవయ్య బడి ఏదో చిన్ననాటి అనుభవమల్లే అయిపోయింది. అప్పుడే దాని తాలూకు జ్ఞాపకం మాయసాగింది.
తల్లి నేర్చుకుంటే తాను నేర్చుకునే అక్షరాలు తనకకేదో మేలుచేస్తయ్యని మాత్రమే సుందరం ఎరుగునుగాని, అక్షరాలు నేర్చుకోవటంలోనే తనలో ఒక పరిణామం___ ఒక పెద్ద పరివర్తన__ కలుగుతున్నదని వాడెరుగడు. అయినా ఈ పరిణామం దాగలేదు. తాను నేర్చుకునే ప్రతి అక్షరమూ తనకు తెలిసిన పదజాలాన్ని నిర్మించే సాధనాలలో ఒకటనివాడు గుర్తిస్తూనే వచ్చాడు. ఐతే ఈ అక్షరాలకూ తనకు తెలిసిన మాటలకూ మధ్య ఇంకా ఏదో అడ్డుండటం తెలిసి బాధకలిగేది. ఇంట్లో ఉన్న భాగవతం తీస్తే అందులో తాను నేర్చుకునే అక్షరాలు ఎక్కడోగాని కనిపించేవికావు.
"అమ్మా ఇంకా ఎన్ని అక్షరాలూ నేర్చుకోవాలి? ఎన్నాళ్ళుపడుతుంది?" అని వాడు తల్లిని అడిగేవాడు.
"కాస్త వోపికపట్టు," అనేది తల్లి.
సుందరానికి ప్రతిఅక్షరమూ సజీవంగా తోచటమేకాక వాడా అక్షరాల మధ్యగల సంబంధాలన్నిటినీ పరీక్షగా గమనించాడు. కొన్నిటికి శద్ధసంబంధముంటే మరికొన్నింటికి స్వరూప సంబంధమున్నది. అనేక అక్షరాలు త్వరగా నేర్చుకోవటానికి సుందరం ఈ సంబంధాలను పూర్తిగా వినియోగించుకున్నాడు. ఉడ అనే రెండక్షరాలకూ దగ్గర సంబంధమున్నది. ఈ మాట సుందరం తనలో తాను అనుకుంటుండగా "ఊడ" అనే మాటలో రెండక్షరాలూ తనకు వచ్చునని వాడికి స్ఫురించింది. తరవాత "ద ,డ" లకు సంబంధం ఉండటంకూడా గమనించాడు.
అక్షరాలు వాడిబుద్దిని ఎక్కడెక్కడికో తీసుకుపోయేవి. వాడితలకాయలో చిన్న చిన్న రెండక్షరాల మాటలూ, మాటలలో భాగాలూ ప్రతిధ్వనించేవి. అన్ని అక్షరాలూ వాడికిసమంగా కనిపించేవికావు. కొన్ని భయపెట్టేవి, అనుమానం కలిగించేవి. అరు, అరూ అలు, అలూ ఇంజా, ఇణీ__ ఈ అక్షరాలు చూస్తే సుందరానికి చాలా అనుమానం "ఙ" అనే అక్షరాన్ని "ఇంజా" అనీ "ఇ " అనే అక్షరాన్ని "ఇణీ" అనీ అనాలని వాళ్ళమ్మచెప్పింది. బుద్ధిమంతుడల్లే సుందరం ఒప్పుకున్నాడు. కాని ఏమూలో వాడికి శంక ఉండనేవుంది. ఇవేమక్షరాలు? వీటిని చూస్తే ఏమాటా ఎందుకు జ్ఞాపకంరాదు?
సీతమ్మ తాను ఎప్పటల్లే ఇంటి పనులన్నీ చేస్తూనే ఉన్నది. కాని ఆవిడ ధ్యాసంతా కొడుకు చదువు మీదే ఉండటం వల్ల, ఆవిడ మనస్సులో తాను ఇంటిపనులన్నీ ఎగవేసి కొడుక్కు చదువు మాత్రమే చెబుతున్న భావం కలిగింది. తాను కొత్తగా అక్షరాలు నేర్చుకుంటున్నట్టే ఉంది. ఆవిడకు. తాను రాసిన అక్షరాలే అయినా వాటిని తన కొడుకు కళ్ళతో చూసేది.
ఆవిడ తత్వానికి గొప్ప చెప్పుకోవడం సరిపడదు. తనను గురించి చెప్పుకోవడం ఆవిడ కెంతకష్టంగా ఉండేదో తన కొడుకు గురించి చెప్పుకోవటమన్నా అంత కష్టంగానే ఉండేది.
సుందరం చురుకుగా అక్షరాలు నేర్చుకుంటున్నాడన్న సంగతి ఆవిడ తన భర్తకే నేరుగా చెప్ప లేకపోయింది.
"ఏమండీ. పాపం, వాడికి నా చచువెన్నాళ్ళనీ ?" అన్నదామె ఒకనాడు భర్తతో.
"ఏదో చదువుతున్నట్టున్నాడే?" అన్నాడు శ్రీమన్నారాయణ.
"రేపో ఎల్లుండో వాడికి అక్షరాలన్నీ వచ్చేస్తయ్ ఆ తరువాత నేనేం చెయ్యనూ?"
శ్రీమన్నారాయణ నవ్వి. "వాడి మొహం నీ మొహం." అన్నాడు.
