"ఊ...ఇక నువ్వు కానియ్" ఆర్డర్ వేసి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు బాబీ.
"వరకట్నం నించి వయసుపొంగుల వరకూ ఆడది అత్తవారింటికి అన్నీ తెచ్చినా, ఒక్కటి మాత్రం పుట్టింటిదగ్గరే విడిచిపెడుతుంది...ఏమిటది?"
"ఏమిటి మరి?" ఠక్కున అడిగాడు బాబీ.
"అదేరా నా ప్రశ్న! నీకర్ధం కాదుగాని....బుర్ర పాడుచేస్కోకు. నిర్లిప్తా నేనొచ్చేసరికి చిక్కుముడి విప్పాలి. సరేనా?" అంటూ ఆఫీస్ కెళ్ళి పోయాడు నిఖిల్. నిర్లిప్త ఆలోచిస్తూనే వంటింట్లోకి వెళ్ళింది. గదిలో మిగిలిన బాబీగాడికి ఎటూ పాలుపోక చెంగున బయటికెళ్ళిపోయాడు.
3
కారు హారన్ విని గూర్ఖా హడావుడిగా గేట్ తీశాడు. రంగురంగుల పూమొక్కల లాన్ మధ్యనుంచి ఆవరణలోకి వచ్చింది ఎరుపు రంగు కాంటెస్సా కారు. కారు చూడగానే ముగ్గురు నౌఖర్లు పరుగెత్తుకొచ్చి నిల్చున్నారు. దూరంగా స్తంభానికి కట్టేసిన ఆల్సేషియన్ డాగ్ కుయ్.....కుయ్ మని తోకాడిస్తూ మూలుగుతోంది.
కారులోంచి దిగిన శరత్ గుమ్మంవేపు చూసాడు....సుగాత్రి ఎదురు రాలేదేమిటా అని! రెండంతస్థుల అతిపెద్ద భవనం అది. నైట్ క్వీన్ పుష్పాల పరిమళం.....గులాబీల గుభాళింపులు, మందారాల ఎరుపు సంధ్యలు. రకరకాల పూమొక్కలు ఆ యింటిని చుట్టుముట్టి మరింత శోభనిస్తున్నాయి. ఆ శోభలకు...శోభనిచ్చే అందం ఆ ఇల్లాలు సుగాత్రిది. ఎదురుగా వచ్చిన పని మనిషి 'రంగి' ని అడిగాడు శరత్.
"రంగీ...అమ్మగారు లేరా?"
రంగికి ఇరవై ఏళ్లుంటాయి. వయసు వంపులు స్పష్టమవుతుంటే సిగ్గుతో శరత్ ముందు నిల్చోలేక వంకర్లు తిరుగుతోంది.
"గిప్పటిదాకా కుండీల నీళ్ళు వోసిండ్రు....మళ్ళవోయి పడుకున్నది దొరా!" అంది రంగి.
"ఒంట్లోగాని బాగులేదా...?" అన్నాడు శరత్ డోర్ లాక్ చేస్తూ.
"గిప్పటిదాకా మంచిగనే వుంది దొరా! నేనడగలేదు.....మీరెళ్ళే అడుగుండ్రి" అంది రంగి అక్కడనుంచి వెళ్ళిపోతూ. శరత్ రెండడుగులు వేసాడో లేదో తోటమాలి రాయన్న-
"దండం బాబూ" అన్నాడు.
"ఏం రాయన్నా-ఎర్ర గులాబీలు అలాగే వున్నాయి అమ్మగారు తెంపుకెళ్ళలేదా?"
"లేదు బాబూ! ఇప్పటిదాకా పై బంగళామీది పూలకుండీలకు అమ్మగారే నీళ్ళు పోసారు. ఈ రోజింకా పూలు తెంపలేదు" అన్నాడు రాయన్న వినయంగా.
"కారు చప్పుడు వినవచ్చేమో....లోపలికెళ్ళిపోయారు" అన్నాడు రాయన్న మళ్ళీ.
"అలాగా....అమ్మగారు కోపంగా వుందన్నమాట! రాయన్న ఆ గులాబి పువ్వు కోసివ్వు" అన్నాడు శరత్ ఆగి.
"ఒక్క పువ్వేం ఖర్మబాబూ! ఈ తోటలోని పూలన్నీ కోసుకెళ్ళి అమ్మగారిమీద చల్లండి....కోపం కూడా చిటికెలో ఎగిరిపోద్ది. అప్పుడైనా పండంటి కొడుకును మీరు కనాల, ఈ ముసిలోడి భుజాలమీద ఆ బాబు ఊరేగాల...అప్పటివరకూ బతుకుతాను బాబూ నేను" అన్నాడు రాయన్న ఎర్రగులాబి అందిస్తూ.
ఆ భవంతి మధ్యలో విశాలమైన వరండా. దాని మధ్యలో నాలుగు సోఫాలు. వాటి మధ్యన అపురూపమైన స్త్రీ శిల్పం. వరండా నిండా ఎర్రని తివాచీ పరచి వుంది. వరండాలోకొచ్చి మెట్లెక్కి పై అంతస్థులోని బెడ్ రూమ్ లోకి వచ్చాడు శరత్. అత్యంత ఆధునికమైన ఆ గది మధ్యన అతి ఖరీదయిన డబుల్ కాట్ బెడ్స్, ఓ మూల టీవీ, గోడకు అతి పెద్ద కలర్ పెయింటింగ్....చిన్నారిబాబు నవ్వుతూ పరుగెడుతున్నట్లు. టేబుల్ పైన ఎక్వేరియంలో రంగురంగుల చేపలు.....దానిమీద ప్లాస్టిక్ పూల గుత్తులు.
బెడ్ మీద అటువేపు తిరిగి ముడుచుకుని పడుకునుంది సుగాత్రి. వెనుకవైపునుంచి ఆమె అందాలు శరత్ ను మత్తుగొలుపుతున్నాయి. ఆమె వాలుజడ పొడుగ్గా నల్లవాగులా పరుచుకొని వుంది. శరత్ తమాయించుకుని 'సుగాత్రి' అని పిలిచాడు సుగాత్రి తిరగలేదు.
"సారీ సుగా! రాత్రి నే రాలేదనేగా నీ కోపం. అయినా ఇంత పెద్దింటిలో నువ్వొక్కదానివే కాదుగా....ఇంతమంది పనిమనుషులున్నారు. నాకు తెలుసు. రాత్రంతా నువ్ మెలుకువగానే ఉండి వుంటావ్" అన్నాడు కోటువిప్పి ఆమె ప్రక్కనే కూర్చుంటూ.
"ఇదిగో ఎర్రగులాబి...నీకిష్టంకదా! సారీ చెబుతున్నాను. అలకమానలేవా?" అంటూ భుజాలుపట్టి తనవేపు తిప్పుకున్నాడు. అతని ఒడిలో ఆమె!
సుగాత్రి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎర్రజీరలు ప్రాకి, చింతనిప్పుల్లా వున్నాయి కళ్ళు. ఆమె వదనంలో ఎలాంటి భావమూ లేదు.
"రాత్రి నిద్రపోనట్టే ఉన్నావ్....ఫోన్ కూడా చేశాను కదా నేను రావటంలేదని. ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతినదూ..." అన్నాడు ఆమెను పొదివిపట్టుకుంటూ. ఆమె శరత్ చుట్టూ చేతులేసి మౌనంగా ఒదిగిపోయింది.
"మాట్లాడవేం సుగా....మౌనంతో ఎదుటివాళ్ళ గుండెను కోయడం మీ ఆడవాళ్ళకే చెల్లుతుంది" అన్నాడతను నవ్వుతూ. ఆ మాటకు సుగాత్రి పెదవుల్లో చిరునవ్వు తొణికి విచ్చుకున్నాయి.
"ఇండస్ట్రీలో ఏదయినా పాడయితే మెకానిక్ లే కరువయ్యారా? అన్నిటికీ మీరే బాగుచేసుకుంటూ రాత్రిళ్ళూ యంత్రాలతోనే సంసారం చేస్తే....యాంత్రిక జీవితమే అయిపోతుంది" అంది కోపంగా.
"నేను కూడా కార్మికుల్లో కార్మికున్ని కావటంవల్లే! అన్నిటికీ కార్మికుల్ని ఇబ్బందిపెట్టడం భావ్యంకాదు! వాళ్ళతో కల్సిపోవాలి. అప్పుడే ఇండస్ట్రీలు డెవలప్ అయ్యేది. అన్నింటిని మించి ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన క్షణంనుంచీ లక్ష్మి తాండవిస్తుంది. ఒక్కరాత్రి రానందుకే...నిద్ర పోగొట్టుకున్నావ్, కళ్ళు ఉబ్బి ఎంతగా ఎర్రబడినాయో. అందుకేనా? ఈ రోజు ఎదురు రాలేదు?" అన్నాడు శరత్. "
