"ఏం అక్కర్లేదు!' కఠినంగా అంది మీనాక్షి.
"మీనాక్షి నన్నెందుకిలా బాధపెడతావు? నీకోసం కాకున్నా నా కోరకన్నా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళి పరీక్ష చేయించుకో. ఈ ఒక్కసారికి నా మాట విను" సన్నగా వణుకుతున్న గొంతుతో అన్నాడు భానుమూర్తి.
మీనాక్షి అయిష్టం గానే విజయ వెంట వెళ్ళింది. సుధీర జాలిగా చూసింది భానుమూర్తి వేపు.
భానుమూర్తి పై కలిగిన సానుభూతి తో విశాల హృదయం నిండి వెల్లువలై ప్రవహించింది. సంగీతం అందరికీ రాదు. కాని అపశ్రుతి యిట్టే తెలిసిపోతుంది. మధురంగా, మంజులంగా , మనోహారంగా సాగిపోతున్న గాన వాహినిలో ఏ క్షణం అపశ్రుతి కలిగినా, హృదయం యిట్టే పట్టేస్తుంది.
తన జీవితంలో కలిగిన అపశ్రుతి కనీసం విశాల కైనా వినిపించకుండా చేయాలని భానుమూర్తి ఎంతో ప్రయత్నం చేశాడు. అయినా విశాల ముందా ప్రయత్నం ఏమాత్రం కొనసాగలేదనే చెప్పవచ్చు.
"బాగా చదువుతున్నారా?' అన్నాడు తలెత్తి విశాల వేపు చూసి.
"ఏదో!"
"మీ నాన్న ఎప్పుడూ బయట కనిపించరేం? నేనింతవరకూ చూడలేదు."
"వయసయి పోయింది. అందులోనూ ఆరోగ్యం సరిగ్గా లేదు." భానుమూర్తి ముఖంలోకి చూస్తూ అంది విశాల.
విశాలమైన కనుపాపల్లో వ్యధా పూరితమైన భానుమూర్తి హృదయం దేనికోసమో వెదుకుతుంది.
"అమ్మ నిన్ను రమ్మంది బావా " అంది సుదీర.
"ఎందుకూ?"
"ఏదో పెళ్ళి సంబంధం గురించి మాట్లాడాలట."
"నాపెళ్ళి గురించేనా?" నవ్వి అన్నాడు భానుమూర్తి.
"లేక? నా పెళ్ళి గురించా?" గలగలా నవ్వి అంది సుధీర.
"ఏం? నీ పెళ్ళి గురించి మాట్లాడకూడదా?"
సుధీర ముఖం సిగ్గుతో కందిపోయింది. "నేనేం పెళ్ళి చేసుకోను" అంది తలవంచుకుని, క్రీగంట భానుమూర్తి వేపు చూస్తూ.
"అవునవును! అలాగే అంటారు! ఆ రాజకుమారుడెవరో వచ్చి హృదయ వీణను మీటే వరకూ అమ్మాయి లంతా యిలాగే మాట్లాడుతుంటారు! ఏవంటారు విశాలా?" చిరునవ్వుతో విశాల వేపు చూసి అన్నాడు భానుమూర్తి.
విశాల సన్నని ఎర్రని పెదమలు మీద తళుక్కున ఓ హాసరేఖ మెరిసి మాయామైంది. నల్లని కాంతి వంతమైన కన్నుల్లో ఏదో భావం అల్లనల్లన కదలాడింది.
విజయా, మీనాక్షి హాల్లోకి వచ్చారు. మీనాక్షి పెరట్లో కి వెళ్ళిపోయింది. భానుమూర్తి ఆత్రంగా విజయ ముఖంలోకి చూశాడు.
"చెప్పుకోదగ్గ జబ్బంటూ ఏం లేదు...."
"ఊ....?
"పెళ్ళి చేస్తే ఆరోగ్యం కుదుట పడచ్చు"
"పెళ్ళా!"
"ఏం? తప్పా?"
"తప్పని కాదు, ఒకసారి చేసి...."
వంటగదిలో పని ముగించుకుని మీనాక్షి హాల్లోకి వచ్చింది, తడి చేతులు పైట చెంగుతో తుడుచుకుంటూ.
"మీనాక్షి, చూడూ! యీమె మీ ప్రక్కింట్లో వుంటున్నారు. పేరు విశాలాక్షి!" సుధీర విశాలను పరిచయం చేసింది.
"తెలుసు," ముభావంగా అంది మీనాక్షి.
"నేనంతగా చెప్పవలసినా నా పుట్టిన దినం పండక్కు రానేలేదెం?' విజయ అడిగింది.
"నేనొస్తే ఎంత? రాకుంటే ఎంత? నేను రానంత మాత్రాన నీ పుట్టిన దినం పండగ ఆగిపోతుందా?"
"ఆగిపోదు. కానీ ఆ వెలి తనేది ఉండనే వుంటుందిగా."
"అవును, నేను రాకుంటే మీకు చాలా వెలితే కలుగుతుంది! ఆ విషయం రెండు సంవత్సరాల క్రితమే తెలిసిందిగా?' వ్యంగ్యంగా , హేళనగా అని, విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి.
విజయ ఏమనలేదు. రెండు నిమిషాలు నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని పరిపాలించింది.
'అక్కయ్య కు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ షిప్ దొరికింది. ఈరోజే ఆర్డర్స్ వచ్చాయి. రెండు రోజుల్లో హైదరాబాదు వెళ్ళిపోతుంది." ఆవరించిన నిశ్శబ్దాన్ని భంగం కలిగిస్తూ అంది సుధీర.
"ఇంతటి శుభవార్త ను యింత ఆలస్యంగా చెప్తున్నావెం? హార్టీ కంగ్రాచులేషన్స్ , విజయా! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి!" ఉత్సాహంగా అన్నాడు భానుమూర్తి.
"అవును నా అదృష్టం నీ కొక్కడికే కనిపిస్తుంది." అదో రకంగా నవ్వుతూ అంది విజయ.
"నువ్వు కాదంటే మటుకు సరిపోతుందా?' నీవంటి అదృష్ట జాతకులు ప్రపంచంలో ఎంత మందున్నారు చెప్పు? బహు స్వల్పం. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. శ్రీమంతుల ఇంట్లో పుట్టావు. విదేశాల కెళ్ళి పై చదువులు చదివావు. అందచందాలు, తెలివి తేటలూ నీ సొత్తు. అదృష్టం లో నిన్ను మించిన వాడిని చేసుకుని సుఖ పడాలి. మేమంతా కోరుకునేది, ఎదురు చూసేది అదే!" చిరునవ్వుతో అన్నాడు భానుమూర్తి.
విజయ, భానుమూర్తి ముఖంలోకి ఓ క్షణం చూసి తల ప్రక్కకు త్రిప్పుకుని "ప్రపంచ మంట నన్ను అదృష్ట వంతురాలినంటే మటుకు నాకేం లాభం? ఆ అదృష్టమేదో నాకు కనిపించాలిగా?' అంది.
"హైదరాబాద్ వెళ్ళాక కనిపిస్తుందిలే! చీకటి పడింది. ఇక వెళ్దాం పద, "కుర్చీ నుండి లేచి, నవ్వుతూ అంది సుధీర.
ముగ్గురూ భానుమూర్తి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయారు.
వాళ్లటు వెళ్ళగానే మీనాక్షి లోపలికి వచ్చింది.
"ఏం జబ్బట? దొరసాని పరీక్ష చేసి పోయిందిగా?' ముఖం చిట్లించి అడిగింది మీనాక్షి.
ఆలోచనా నిమగ్నుడైన భానుమూర్తి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఏం చెప్పింది?"
"భానుమూర్తి ఓ క్షణం తటపటాయించి, "చెప్పుకోతగ్గ జబ్బంటూ లేదట! బలహీనం వల్లనే అలా నలత నలతగా ఉంటుందట" అన్నాడు.
మీనాక్షి మరేం మాట్లాడక లైటు వేసి వరండాలోకి వచ్చింది.
వాలు కుర్చీలో పడుకొని భానుమూర్తి బరువుగా కళ్ళు మూసుకున్నాడు. మెదడు లో భద్రంగా దాచిన దానికి సంబంధించిన బొమ్మలు తెర తొలగించుకుని కళ్ళ ముందు నిలుచున్నట్లయింది. జీవితంలో కొన్ని సంఘటనలు మైలు రాళ్ళలా నిలిచిపోతాయి. ఆజన్మాంతం మనతోనే ఉండి తన జీవన యాత్రలో తల్లి మరణం నిజంగా ఒక మైలు రాయిలాంటిది. తనప్పుడు ఎస్.ఎస్.ఎల్. సి. గాబోలు చదువు కొంటున్నాడు. అమ్మ పోవడంతో తనూ, మీనాక్షి దిక్కులేని వాళ్ళయ్యారు. ఇద్దర్నీ అత్తయ్య తనింటికి తీసుకు వచ్చింది. అపప్తికి మీనాక్షి వయసు సరిగ్గా పది సంవత్సరాలు. సుధీరా, మీనాక్షి ఒకే యీడు వాళ్ళు కావడం చేత బందుత్వమే గాక మంచి స్నేహం కూడా ఏర్పడింది.
సుందరం పన్నెండేళ్ళ వాడు. విజయ కు పద్నాలుగు సంవత్సరాలు.
ఆరోజు తనకు బాగా గుర్తుంది.
స్కూలు నుండి అప్పుడే వచ్చిన సుందరం కళ్ళు పెద్దవి చేసి "మీనాక్షి ఎప్పుడూ యిక మనింట్లో నే ఉంటుందా అమ్మా" అన్నాడు అమాయకంగా.
'అవున్రా! ఈ యింటి కోడలే గా అది! ఇక్కడే వుండక ఎక్కడకు పోతుంది?" అంది అత్తయ్య నవ్వుతూ.
ఆ విషయం సుందరానికి అర్ధమైందో లేదో తనకు తెలీదూ కాని ఆదుకునేందుకు తనకొక స్నేహితురాలు దొరికిందని సుందరం సంతోష పడ్డ మాట మటుకు నిజం.
సోఫాలో కూర్చుని చుట్ట కాలుస్తున్న మావయ్య అత్తయ్య వేపు కళ్ళెర్ర చేసి చూడ్డం తను గమనించక పోలేదు. అత్తయ్య అది గమనించిందో లేదో గాని మీనాక్షి ని తన వళ్ళోకి తీసుకుని చెక్కిలి మీద ముద్దు పెట్టుకుంది.
మీనాక్షిని, తననూ తన స్వంత బిద్దల్లాగే చూసుకుంది అత్తయ్య. అత్తయ్య ప్రేమాదరాలడోలికల్లో మీనాక్షి అమ్మలేని లోటును మరిచిపోయింది. అసలు అమ్మనే మరపింప జేసింది అత్తయ్య. ఆమె హృదయం అంత గొప్పది.
మావయ్య పూర్తిగా చెడ్డవాడని తను చెప్పలేడు గాని ఒక తరహ మనిషి- డబ్బు మనిషి . మావయ్య డబ్బుతో ఏం పుట్టలేదు. దరిద్రం లోనే పుట్టాడు. దరిద్రం లోనే పెరిగాడు. కానీ లక్ష్మి లాంటి అత్తయ్య ఆ యింట్లో అడుగు పెట్టినప్పటి నుండి మావయ్య అదృష్టచక్రం ఎవ్వరూ ఊహించనంత వేగంగా తిరిగిపోయింది.
ఏదో బస్సు కంపెనీ లో సామాన్య గుమస్తా గా ఉన్న మావయ్య క్రమక్రమంగా లారీలకూ, బస్సులకూ అధికారి అయిపోయాడు. ఈరోజు తలమునిగే సంపదలతో తులతూగుతున్నాడు. తనూ, మీనాక్షి వాళ్ళింట్లో ఉండడం మావయ్య కేం కష్టం కాదు. అయిష్టం కూడా ఏం లేదు. కానీ మీనాక్షి గానీ తను గానీ శాశ్వతంగా ఆ యింటి నే తమ స్వంతం చేసుకోవడం మటుకు మావయ్య కు బొత్తుగా యిష్టం లేదు.
