అత్తయ్య అంతరంగం లో మీనాక్షి ని కోడలుగా చేసుకోవాలనీ, తన్నా యింటి పెద్ద అల్లుడిని చేసుకోవాలని, లేకపోలేదు. తను ఎస్.ఎస్.ఎల్.సి పాసుకాగానే ఉద్యోగంలో చేరాలనుకున్నాను. అత్తయ్యా, మావయ్యా ససేమిరా ఒప్పుకోలేదు.
బి.ఏ, బి.ఇడి చేసి స్కూలు అసిస్టెంటు గా చేరాను. తన కాళ్ళ మీద తను నిలబడగలిగాక అత్తయ్యా వాళ్ళ మీద ఇంకా ఆధారపడి ఉండడం తన కిష్టం లేకపోయింది. అత్తయ్య అందుకు ఒప్పుకోలేదు.
మావయ్య మటుకు ముభావంగా ఉండిపోయాడు.
అందుకనే అత్తయ్య కన్నీళ్ళు పెట్టుకున్నా తను లెక్క చెయ్యక వేరుగా వచ్చేశాను. మరి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. మీనాక్షి కి చదువు అబ్బలేదు.
ఆడపిల్ల గదా పెళ్ళి చేస్తే సరిపోతుందనుకున్నాను. ఆ మాటే అత్తయ్యతో చెప్పేశాను.
"నీకు మీనాక్షి ని గురించి బెంగెం అక్కర్లేదు. సుందరం చదువు గానీ" అంది.
అక్కడే కూర్చుని సినిమా పత్రికేదో తిరిగేస్తున్న సుందరం "అలాంటి ఆశలు పెట్టకే! నేను మీనాక్షిని చేసుకోను" అన్నాడు స్పష్టంగా - కుండ బద్దలు కొట్టినట్లు.
అత్తయ్యకు కన్నీళ్ళ పర్యంతమైంది.
తనకు భూమి గిర్రున తిరిగి నట్లయింది.
"ఏం? ఎందుకు చేసుకోవు?' అంది అత్తయ్య.
"ఆ పిల్ల నాకిష్టం లేదు."
"ఎందుకనీ?"
"నల్లగా ఉంటుంది!
"ఎవరికన్నా? నీ కన్నా నలుపా?"
సుందరం మావయ్య లా నల్లగా ఉంటాడు.
"నాకన్నా కాదనుకో.... అయినా నేనా నల్ల పిల్లను చేసుకోనమ్మా!" విసురుగా అక్కణ్నుంచి లేచిపోతూ అన్నాడు సుందరం.
అత్తయ్య తర్వాత ఎంతగానో బ్రతిమాలాడింది. ఉహు....సుందరం ససేమిరా చేసుకోనన్నాడు. మావయ్య సుందరానికే మద్దతిచ్చాడు. అప్పుడు సుందరం బి.ఏ క్లాసుకు వచ్చాడు. విజయ విశాఖ లో మెడిసిన్ చేస్తుంది. సుధీర యింటర్ లో గాబోలుంది.
దానితో మీనాక్షి అభిమానం బాగా దెబ్బతినింది. స్వయాన తనమేనట్టే తనకు అత్తగారావుతుందనీ, సుందరం బావే తన జీవిత భాగస్వామి అని కోటి కలలు కంటున్నా మీనాక్షి స్వప్న సౌధాలు నేల మట్టంగా కూలిపోయాయి. అప్పుడే విచ్చుకొని సుగంధాన్ని వెదజల్లుతున్న మీనాక్షి హృదయసుమం సుందరం కఠోర ప్రవర్తన వల్ల ముకుళించుకుపోయింది. సుగందానికి బదులు విషవాయువులు ఈ రోజు ఆ హృదయాన్నుండి వస్తున్నాయంటే అందుకు బాధ్యులెవరు?
సుందరమా? లేక తనా? ఏమో తను నిర్ణయించలేదు.. మీనాక్షి తన మీద చేసిన అభియోగం లో ఎంత వరకూ న్యాయముంది?
ఆరోజు నుండి మీనాక్షి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తాళి తెంచుకున్న ఈ మూడు నెలల నుండి మరీ మారిపోయింది.
అత్తయ్య వాళ్ళింట్లో ప్రతి ఒక్కరూ ఆగర్భ శత్రువుల్లా తయారయ్యారు. వాళ్లతో సంబంధం, మాటలు, చూపులు, మీనాక్షికి భరించరాణివయ్యాయి. చివరకు వాళ్ళనీడ తనమీద పడితేనే గంగ వేర్రులెత్తుతుంది. మీనాక్షిని మార్చాలని తను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరాయ్యాయి.
అలాంటి పరిస్థితుల్లో మీనాక్షి కి పెళ్ళి చేసి పంపడమే మేలనిపించింది తనకూ, అత్తయ్యకూ. మీనాక్షికి మంచి సంబంధం చూసి, కట్నమూ, పెళ్ళి ఖర్చులూ అన్నీ తనే భరించి పెళ్ళి చేస్తానంది అత్తయ్య. ఆ మాట వినగానే తన హృదయం మీద నుండి పెద్ద బరువు తీసి పెట్టినట్లయింది.
లేకుంటే చిల్లి కానీ చేతిలో లేని తనకు, కట్న పిశాచం పట్టి యుక్తా యుక్తా జ్ఞానం నశించిన నర ప్రపంచంలో అడుగు పెట్టేందుక్కూడా అర్హత లేదు. అత్తయ్యకు మనసులోనే చేతులెత్తి నమస్కరించాను. ఇంటికి వచ్చి మీనాక్షి ముందు వెలిబుచ్చాను. తన నోట్లో నుండి మాటలా వచ్చిందో లేదో, తారాజువ్వలా లేచింది మీనాక్షి. అత్తయ్యా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తన పెళ్ళి చేసినట్లయితే బావిలో పడి చస్తానంది. అప్పటి మీనాక్షి పరిస్థితి అర్ధం చేసుకోనటం కష్టం కాకున్నా ఎన్నో విధాల నచ్చ చెప్పి చూశాను. అత్తయ్యా వాళ్ళింట్లో ఉప్పు కల్లు కూడా తను తాకనంది.
"మరి డబ్బు లేకుండా నీ పెళ్లెలా చెయ్యను?" అన్నాడు తను.
"మనసుంటే మార్గమే లేకపోతుందా?"
'ఆ మార్గమేదో చూపు."
"నువ్వు కట్నం తీసుకో. దానితో నా పెళ్ళి చెయ్యి."
"నీకు కట్న మివ్వడమే నా ఆశయాలకు విరుద్దమైన పని. ఇక నేను కట్నమేలా తీసుకొను?"
"నా కోసం!"
"ఊహు... నీకోసం నా ప్రాణాలైనా యిస్తాను కానీ, కట్నం మట్టుకు తీసుకోలేను."
"పాపం! ఆశయాలన్నీ నీకొక్కడికే గాబోలు!"
"అందరూ గోతిలో దూకుతున్నారని మనమూ దూకుతామా?"
"పోనీలే! నాకు పెళ్ళి చెయ్యటం నీకిష్టం లేకపోతె వదిలేయ్! అసలు నాకు పెళ్ళి చేసుకోవాలని కూడా లేదు." ముఖంలో కంటు పెట్టుకుని అంది.
ఆ మాటలు వజ్రాఘాతం లా తన హృదయాన్ని తాకాయి. 'అంత అన్యాయంగా మాట్లాడకు, నీకు పెళ్ళి చెయ్యడం నా కిష్టం లేదా? నాతల తాకట్టు పెట్టయినా సరే నీకు పెళ్ళి చేస్తాను. నువ్వు సుఖపడ్డం కన్నా ప్రపంచంలో నేను కోరుకునేది మరొకటి లేదు. నువ్వు నన్నర్ధం చేసుకుంటే అంతకన్నా సంతోషకరమైన విషయమూ లేదు." జీరగొంతుతో అన్నాడు తను.
అత్తయ్యా, వాళ్ళ సాయంతో ఐదు వేలు అప్పు తీసుకుని, నెలకు వంద రూపాయలు అసలూ వడ్డీ కట్టేందుకు ఒప్పుకున్నాను. ఆరోజుకూ ఆ అప్పు తీరిస్తూనే ఉన్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. తనకోక్కటీ నచ్చలేదు. మీనాక్షి కి నచ్చడం, నచ్చక పోవడమంటూ లేనేలేదు. నిర్లిప్తంగా, ఉండిపోయింది. మీనాక్షి అంత నిశ్శబ్దంగా ఎందుకుందో నాకు తెలుసు. కానీ తన చేతిలో ఏం లేదు.
చివరకో సంబంధం ఖాయం చేసుకున్నాను. అత్తయ్యకు కూడా ఆ సంబంధం నచ్చింది. ఉన్నంత లో పెళ్ళి బాగానే చేశాడు. కానీ క్రమక్రమంగా తెలిసి వచ్చింది ఏమంటే -- అతనికి అంటే రామచంద్రానికి యిదివరకే పెండ్లయిందనీ, భార్యను వదిలేశాడనీ, వట్టి తిరుగుబోతని, తాగుబోతూ అనీ, ఒంటి నిండా పుట్టెడు రోగాలతో ఉన్నాడనీ. ఇంత చరిత్ర అతనికి ఉంటె దాన్నెలా దాచగలిగాడన్నది తనకీ రోజుకూ ఆశ్చర్యకరమైన విషయమే! అతనీ వూరికి క్రొత్త, స్వస్థలం లో విచారిస్తే మంచివాడని అన్నారు. ఎప్పుడో అయిదారేళ్ళ క్రితం స్వగ్రామం లో ఉన్నాడు. తర్వాత దేశాలమ్మటే తిరుగుతున్నట్లుంది. అందుకనే అతన్ని గురించి ఎవ్వరూ ఒక కచ్చితమైన అభిప్రాయాన్ని ఇవ్వలేక పోయారు.
మీనాక్షి సుఖపడ్డం మాట అటుంచి , అతని దగ్గరున్న రెండు సంవత్సరాల్లోనూ నరకాన్నే రుచి చూసింది. ఆ తర్వాత మీనాక్షికి ఆ నరకం నుండి శాశ్వత విముక్తి లభించింది. జీవితం ఒక సెలయేరు లాంటిది. దాని జీవన జీవన పరిమితి, వేగమూ అది ప్రవహించే ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. చాలావరకు కొండల మీదనుండి చంగు చంగున దూకి పడుతున్న సెలయేరు ఎక్కువమంది దృష్టిని ఆకర్షించినా, దాని జీవన పరిమితి రక్కువ, మైదానంలో నెమ్మదిగా ప్రవహిస్తున్నా అందరి దృష్టిని ఆకట్టుకోలేపోయినా జీవన పరిమితి ఎక్కువ. లీలగా వినిపించే సంగీతం మెత్తని మెత్తని వెన్నెల్లా, ఒక విధమైన నిండుతనాన్ని హాయిని కలిగి ఉంటుంది. మార్గం తెలీక వక్ర మార్గం లో పడి , మరు భూమిలో యింకిపోయిన సెలయేరును చూచినట్లయితే హృదయం జాలి సానుభూతితో నిండిపోతుంది.
రామచంద్రం మూడో రకానికి చెందినవాడు. దయ, సానుభూతి, పరోపకారం, సద్భావం , సదాచారం, మనలోని జీవశక్తిని అభివృద్ధి చేసి ప్రకాశింప చేస్తాయి. నిర్దయ, క్రోధం, ఈర్ష్య, దుర్భుద్ది, దురాచారం జీవశక్తిని హరిస్తుంది. మనిషి గానుగలో వేసి పిండి బయట వేసిన చెరకు పిప్పిలా తయారవుతాడు. రామచంద్రం స్థితి గూడా అలాగే ఉంది. జీవశక్తి హరించుకు పోయిన అతను ఎక్కువ రోజులు బ్రతకనని తను సంవత్సరం క్రితమే తెలుసుకున్నాడు. తను అనుకున్నట్లే జరిగింది కూడా అంతా మీనాక్షి దురదృష్టం.
తన ప్రయత్నంలో ఎలాంటి లోపమూ లేదు. తన హృదయంలో ఎలాంటి మాలిన్యమూ లేదు. కాని దాని ఫలితం ఎందుకిలా తయారయిందో తన కర్ధం కాదు. భానుమూర్తి కళ్ళల్లో నుండి రెండు కన్నీటి బొట్లు రాలి చెంపల మీదుగా ప్రవహించాయి.
