Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 6

 

    "నాదే!"
    "అదెలా సంభవం?"
    "అదే ఆలోచిస్తున్నాను" తలవంచుకుని మెల్లగా గొణిగాడు.
    సుధీర కన్నుల్లో ఎర్రజీరలు ఏర్పడుతున్నాయి. తొందరపడి సుధీర ఏమీ హడావుడి చేస్తుందోనని విశాల భయపడుతుంది. చంద్రశేఖరం తప్పు చేసినవాడిలా తలవంచుకుని నిల్చున్నాడు.
    "మీరు ఫారెన్ రిటర్న్ డా?"
    "నన్ను చూశాక కూడా అలాంటి ప్రశ్న వెయ్యాలనిపిస్తుందా?' తలెత్తి విచారంగా నవ్వి అన్నాడు.
    సుధీర కంఠంలో తీవ్రత కాస్త తగ్గించి, "మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా?" అంది.
    "నాకేం పెళ్ళి!"
    "వధువు కావాలంటూ పేపర్లో ప్రకటించలేదా?"
    "ఊహూ...."
    "మా ఉత్తరం మీకు చేరలేదా?"
    "అబ్బే!"
    "అయితే యీ ఉత్తరం వ్రాసింది మీరు కాదా?"
    "నమ్మలేకపోతే నేనేం చెయ్యను?"
    "ఏదీ? మాఎదుట సంతకం చెయ్యండి!" కుర్చీలో పడి వున్న పుస్తకం, పెన్ను తీసుకుంటూ అంది సుధీర'.
    విశాల తనకేం సంబంధం లేదన్నట్టు మౌనంగా ఉండిపోయింది.
    సుధీర పుస్తకం తిరగేస్తూ, "ఏమిటివన్నీ?" అంది కుతూహలంగా.
    చంద్రశేఖరం ఏమీ జవాబు చెప్పలేదు.
    "పాటలా? పద్యాలా?" రెట్టించింది .
    "పద్యాలే!"
    "ఓహో కవిత్వమన్నమాట! మీ  వాలకం చూడగానే అనుకున్నాను లెండి! ఉ.... సంతకం చెయ్యండి!"
    చంద్రశేఖరం సంతకం చేశాడు.
    "సుధీ! యీ నిలువు జీవితమేమిటే తల్లీ! అతను కాదులే! పోదాం పద." విశాల విసుగ్గా అంది.
    "ఇదుగో! నువ్వు నిల్చోలేకుంటే అలాగా కుర్చీలో కూర్చో! ఇందులో మోసమేమిటో తెలుసుకొందే చచ్చినా అడుగు ముందు కేయ్యను! అతనేమనుకోడులే! కూర్చో! ఏవంటారు కవి కుమారా!"
    చంద్రశేఖరం సిగ్గుతో సగం చచ్చిపోయాడు. కనుకొనల్లో నుండి ఆ గడుగ్గాయి వైపు చురచురా చూశాడు.
    "చంద్రశేఖరం గారూ! యీ విషయన్నిలా వదిలెయ్యడం నాకే మాత్రం యిష్టం లేదు. అలా కూర్చోండి! మేము ఈ మంచం మీద కూర్చుంటాము. తర్వాత అసలు విషయమేమిటో వివరంగా చెప్పండి!"
    ముగ్గురూ కూర్చున్నారు.
    "నాకేం తెలీదు. నామాట నమ్మండి!"
    "ఊహు... అలా మంకుపట్టు పట్టకండి! మీకు తెలీకుండా మీ పేరులో ఉత్తరమేవరు రాస్తారు?"
    "నా స్నేహితులిద్దరున్నారు."
    "అలా చెప్పండి! ఇది వాళ్ళ పనేనన్న మాట!"
    చంద్రశేఖరం ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.
    "వాళ్ళ వివరాలు కాస్త చెప్పండి!" దోసిట్లో గడ్డం ఆన్చి అడిగింది సుధీర.
    "ఒకరు బి.ఏ చదువుతున్నాడు. ఇంకోడెమో నిరుద్యోగి."
    "నిరుద్యోగి ఏం చేస్తుంటారు? ఐమీన్ మీగదిలో వుండాల్సిన అవసరమేమిటి?"
    "ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో వున్నాడు." "ఇది అతని పనే అనుకోవచ్చా?"
    "........"
    "మాట్లాడరేం?"
    "నాకెలా తెలుస్తుంది?"
    "మరి మీకు తెలిసిందేమిటి? కవిత్వం గెలకడమా?"
    అవునన్నట్లు తల ఊపాడు చంద్రశేఖరం .
    సుధీర పకాల్న నవ్వింది.
    విశాల చేతి గుడ్డ నోటికి అడ్డ్డు పెట్టుకుంది.
    "నన్నిలా అవమానించడం ఏం బాగాలేదు."
    "మీరిలా మోసం చెయ్యటం బావుందా?"
    "నేనెవర్ని మోసం చెయ్యలేదు."
    "మీ స్నేహితులు?"
    "వాళ్ళు చేసినట్టు నాకు తెలీదు. తెలిస్తే అసలు ఊరుకునే వాణ్ణి గాను. వాళ్లోచ్చాక బాగా చివాట్లు పెడతాను. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక మీరు దయచేసి...."
    "వెళ్ళండి -- అంటారు! అంతేనా? వెళ్ళక యిక్కడ ఉట్టి గట్టుకుని వెళ్ళాడతామనుకున్నారా లేక కాపరం చేసేందుకు వచ్చామనుకున్నారా? అబ్బ! ఏం మనిషమ్మ తల్లీ! రావే! విశాలా! ఇదుగో! ఏవయ్యో ! కవీ! మిమ్మల్ని , మీ స్నేహితుల్ని ఈ సారికి క్షమించి వదిలేస్తున్నాను. జాగ్రత్త! యిలాంటి తమాషాలు యింకేప్పుడూ చెయ్యకండి! ఆ మాట మీ స్నేహితుల్తో గట్టిగా చెప్పండి!"
    "అలాగే! అలాగే..... ఏదో బుద్ది గడ్డి తిని...." నీళ్ళు నమిలాడు.
    విశాలా, సుధీరా వెళ్ళిపోయారు.
    విద్యుల్లత తళుక్కున మెరిసి మాయమై నట్లనిపించింది, చంద్రశేఖరానికి. అలా కయ్యానికి కాక నెయ్యానికి వచ్చినట్లయితే ఆ ముగ్ధ మోహన రూపాన్ని మరికాస్సేపు తిలకించి "సౌందర్యోపానం" అనే సరిక్రొత్త కవిత్వమల్లి తన కవితా కన్నె పాదపద్మాల పై భక్తీ శ్రద్దలతో అర్పించుకుని ఉండేవాడు!
    వీధిలో లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి. సాయంత్రం కావడం చేత రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. జీవన యాత్రను సాగించే ప్రతి యాత్రికుడూ ఏమాత్రం ఆలస్యం చేసినా తన 'గమ్యస్థానం చేరలేనేమోనని ఊపిరైనా సరిగ్గా పీల్చుకోకుండా పరుగులు తీస్తున్నాడు. తోటి యాత్రికులను దాటుకొని పోవాలన్న ఉత్సాహంతో వాళ్ళకు తను కల్గించే కష్ట నష్టాలను గురించి అసలు ఆలోచించడం లేదు. యాత్రను సాగించలేని అసమర్ధుల పట్ల కనీసం సానుభూతి చూపే పాటి సహృదయం, సమయమూ కూడా కొంతమందికి లేవు. ప్రక్క వాళ్ళను, ఎదుటి వాళ్ళను చూడకుండా ఒకే పరుగు. విమానం లో, రైళ్ళ లో, కార్లో, బస్సులో , జేట్కా లో రిక్షాలో, ఎద్దు బండి లో , కాలి నడకన-- అలా సాగిపోతోంది జీవనయాత్ర. ఒకరికొకరికి పొత్తు బొత్తుగా కుదరడం లేదు. విమానం లో పోయే వారికి, కాలినడకన పోయేవారికి పోత్తేలా కుదురుతుంది?
    పుట్ పాత్ మీద విశాల, సుధీరా మెల్లాగా నడుస్తున్నారు.
    "ఇంత మోసగాళ్ళు కూడా ఉంటారని నేనను కోలేదు!" విశాల ఆశ్చర్యంగా అంది.
    "ఇది మోసం కాదు గానీ కొంటె కాయలు చేసిన కొంటేపని."
    "ఈ విషయం నాన్నకు తెలిస్తే , ఎంత బాధపడతారు?'
    "లేనిపోనివన్నీ కల్పించుకుని అలా భయపడతావెందుకు? మీ నాన్న కీ విషయం ఎలా తెలుస్తుంది చెప్పు? ఒకవేళ తెలుసుందే అనుకో- ఇందులో అంతగా బాధపడవలసిన విషయం మేముంది? జీవితంలో నీ భాగస్వామిని ఎన్నుకోనేందుకు నీవు చేసిన ఒక చిన్న ప్రయత్నం క్షమించరాని అపరాదమవుతుందా?"
    "నువ్వు నన్ను అర్ధం చేసుకోలేదు సుదీ! నే చేసింది తప్పని కాదు -- నీకు పెళ్ళి చెయ్యలేక పోయానే అని బాధ."
    అందుకు సుధీర ఏమీ మాట్లాడలేదు.
    ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.
    "ఎక్కడకు, సుధీ?" ప్రక్కగా కారులో వెళ్ళుతున్న విజయ కారు నిలిపి అడిగింది.
    "మా స్నేహితురాలి ఇంటి నుండి...."
    "సరే, ఇప్పుడు?"
    "విశాలా వాళ్ళింటికి. బావతోనూ మాట్లాడాలి."
    "అయితే కారులో ఎక్కండి. అందరూ వెళ్దాము."
    ఇద్దరూ కారులో ఎక్కారు. ఐదు నిమిషాల్లో కారు విశాల వాళ్ళ ఇంటి ముందు ఆగింది.
    భానుమూర్తి హల్లో పడక కుర్చీ లో కూర్చుని ఆరోజు పేపరు తిరగేస్తున్నాడు.
    హల్లో కిటికీ దగ్గర నిల్చున్న మీనాక్షి తలతిప్పి "దొరసాను లోస్తున్నారు!" అంది.
    భానుమూర్తి పేపరు ప్రక్కన పెట్టి మీనాక్షి ముఖంలోకి అదోరకంగా చూసి, వరండా లోకి వచ్చాడు.
    "ఆహ్వానం లేకున్నా వస్తున్నాం బావా!" వరండా మెట్లెక్కు తూ అంది సుధీర.
    భానుమూర్తి నవ్వి - "అదేగా గొప్పతనం!" అన్నాడు.
    "రావే, విశాలా! మా మీనాక్షి ని పరిచయం చేస్తాను. " భానుమూర్తి , వాళ్ళూ ఆ ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర వారం రోజులు కావస్తున్నా మీనాక్షి ఒక్క రోజన్నా విశాలను పలకరించలేదు. రెండు మూడుసార్లు విశాల పలకరించాలని ప్రయత్నించి మీనాక్షి ముభావంగా ఉండడం మూలాన మానుకుంది.
    మీనాక్షి తల విసురుగా తిప్పుకుని, చరచరా వెళ్ళిపోయింది!
    "కూర్చోండి!" కుర్చీలు చూపించాడు భానుమూర్తి. ముగ్గురూ కూర్చున్నారు.
    "మీనాక్షి ని తీసుకురాలేదేం?" కాస్త కోపంగానే అంది విజయ.
    "రానంది."
    "రానంటే అలా ఊరుకుండిపోతావా? అంత నిర్లక్ష్యం పనికిరాదు, భానూ!"
    "లేదు రానంటే నేనేం చెయ్యను?"
    "అవేం మాటలు!"
    "బావ ఏం చేస్తాడక్కయ్యా! పోనీ నువ్వొచ్చావుగా ?చూసే వెళ్ళు" అంది సుధీర.
    పెరట్లో నుండి నీళ్ళ బిందె తెస్తున్న మీనాక్షి ని కేకవేసింది  సుధీర. నీళ్ళ బిందె దింపి వచ్చి నడవ గుమ్మం అనుకుని నిల్చుంది మీనాక్షి.
    "పలుకే బంగారమైందా ఏవిటి?" అంది సుధీర నవ్వుతూ ఆప్యాయంగా.
    "కూటికి లేని దరిద్రురాలి పలుకు బంగారమేలా అవుతుందమ్మా! మాట మాట్లాడినా కాస్త సబబుగా ఉండాలి!" ముఖం చిట్లించి అంది మీనాక్షి.
    సుదీర ముఖం వెలవెలపోయింది. విశాల చిత్తరువులా కన్నార్పకుండా మీనాక్షి వేపు చూస్తూ కూర్చుంది.
    "అక్కడ నిల్చున్నావేం? ఇలా వచ్చి కూర్చో, మీనాక్షి!" అంది విజయ.
    "మీతో సరిసమానంగా కూర్చునే పాటి గొప్ప వాళ్ళమా మేము!" అదోరకంగా నవ్వి అంది మీనాక్షి.
    "ఈమధ్య మీనాక్షి ఇలాగే మాట్లాడుతుంది విజయా! ఏమనుకోకు." వ్యధిత కంఠంతో అన్నాడు భానుమూర్తి.   
    "అనుకునేందు కిందులో ఏముందని? మీనాక్షి మానసిక పరిస్థితి బాగున్నట్టు లేదు. గదిలోకి పద, మీనాక్షి! పరీక్ష చేస్తాను. "కుర్చీలో నుండి లేస్తూ అంది విజయ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS