మందీ మార్భలంతో ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వచ్చాడు.
పరమేశ్వరీ ఆలయానికి పోలీసులు దర్శనార్ధంగాక నేరపరిశోధనార్ధనం రావటంవల్ల ఊరి పెద్దలు ఎప్పటిలా భక్తులు ఇదేమిటో చూద్దామని మరికొందరు రావటంవల్ల గుడిలో జనం పెరిగిపోయి తిరణాలలాగా తయారయింది అక్కడ.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చాలాకేసులే చూశాడు. తను సర్వీసులో చేరింతరువాత ఇలాంటి కేసుమాత్రం చూడలేదు. ప్రమోషన్లు లేక పల్లె టూరిలాంటి ఊళ్ళే తనకి గతి అయ్యేసరికి తన బ్రతుకు ఇంతేనా అని ఎప్పుడూ చింతించేవాడు.
ఇప్పుడు వర్ధనరావుకి ఇది కొత్త కేసు.
ఏదైనా పట్టుకోగలిగితే ప్రమోషను ఖాయం. గుడిలో దొంగ(లు) నా కొడుకులు దూరారు. తొవ్వి పారిపోయారు అన్న విషయం తేట తెల్లంగా తెలుస్తూనే ఉంది.
కనుక.......!
వాళ్ళని పట్టుకుంటే......!
ప్రమోషను ఖాయం.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ముక్కుతో వాసన పీల్చటం (అందరూ పీల్చేది దాంతోనే) అంటే హూ హూ అంటూ చప్పుడుచేస్తూ గాలి పీల్చటం చేస్తుంటాడు. దేనిమీదైనా అనుమానం కలిగితే కనురెప్పలు అర్పకుండా కళ్ళునెప్పులు పుట్టేదాకా చూడటం దొంగలని దొంగనాకొడుకులనటం వగైరా అలవాట్లు లక్షణాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు వర్ధనరావు చేస్తున్నది అదే.
పరిశోధన.
కళ్ళార్పకుండా చెట్టునిచూసి ఆలోచించటం కూడా పరిశోధనలో భాగమే.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఇటు తిరిగి మాట్లాడిందాకా కానిస్టేబుల్స్ తదితర సిబ్బంది మౌనంగా వేచి ఉండాల్సిందే. పెద్దలు చూస్తూ నుంచున్నారు. వాళ్ళకి దూరదూరంగా జనం ఏం జరుగుతుందా అని చూస్తూ నుంచున్నారు.
అయిదు నిమిషాల తర్వాత.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు టకీమని ఇటు తిరిగాడు. దీర్ఘాలోచన లోంచి బైటపడ్డ వాడిలా ముఖం పెట్టాడు. ఏదో అర్ధమైనట్టు తల పంకించాడు "తెలుసుకున్నాను" వకేవక మాట ముక్తసరిగా అన్నాడు.
ఇన్ స్పెక్టర్ గారికి తెలిసిపోయింది. ఏమిటో అర్ధంగాకపోయినా ఆయన తెలుసుకున్నాను అనంగానే అక్కడున్న అందరిలో కలకలం ఏర్పడింది.
జనం ముఖం చూసేసరికి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఉషారు వచ్చింది.
"దొంగలు గుడిలోకి వచ్చినమాట వాస్తవమే సింహాచలం శివయ్య చప్పుళ్ళు విన్నమాట వాస్తవమే, తలుపులు వేసి ఉన్నాయి తాళం వేసే ఉంది, గోడ పగలగొట్టిగాని గోడకింద కన్నంపెట్టిగాని దొంగలు లోపలికి రాలేదు, మరెలా వచ్చినట్లు? గాలిలోంచి ఊడిపడ్డారా! ఆకాశం నుంచి ఎగిరి వచ్చారా! అదేమీకాదు, వాళ్ళెలా వచ్చారు, ఎలా వెళ్ళారు అన్నది అర్ధమైంది" అంతవరకూ చెప్పి వినేవాళ్ళలో కుతూహలం రేకెత్తించటానికి వక్క క్షణం ఆగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
నిజమే అందరిలో కుతూహలం ఏర్పడింది.
వర్ధనరావు విజయగర్వంగా అందరివేపూ చూసి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు.
"ఈ గుడికున్న ప్రహరీగోడ కవతలివేపు గోడకి నిచ్చన వేసుకుని దొంగనా కొడుకులు గోడ ఎక్కారు. ఈ చెట్టు గోడ మీదకి పడి ఉండటంవల్ల చాలా తేలికగా గోడమీద నుంచి కిందకు దిగారు కనుక ముందు ఈ చెట్టు అర్జెంట్ గా ఇక్కడనుంచి తొలగించాలి. ఎందుకు తొవ్వారు అన్నది తర్వాత చూస్తాము."
వర్ధనరావు చెప్పింది విని అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. పదినిమిషాలసేపు చెట్టువేపు చూసి ఈయనగారు కనిపెట్టింది యిదా, అన్నట్టు ముఖంపెట్టారు జనం అయితే వాళ్ళలో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఖాకీదుస్తుల బలం అలాంటిది.
చెట్టు పరిశోధన అయింది. అంతకుక్రితమే అంతా చూడటం పూర్తయింది. ఇహ చూసేది ఏమీ కనపడలేదు వర్ధనరావుకి, అటునుంచి యిటు తిరగంగానే ఏదో వాసన రావడంతో 'హోహో' అని శబ్దం చేస్తూ పైకి ముక్కు ఎగబీల్చాడు. ఏమిటీ వాసన! ఎవరిదగ్గరనుంచి! మాట్లాడరేమిటి? అంటూ గద్దించి అడిగాడు.
మళ్ళీ అందరూ ముఖ,ముఖాలు చూసుకొన్నారు. 'ఏదైనా కొత్త కంపువస్తే అందరికీ రావాలికదా, అలాంటివేమీ లేదుకదా!' ఎవరికివారే అనుకున్నారు,
"ఏమిటీ వాసన ఎవరిదగ్గరనుంచి?" మరోసారి వర్ధనరావు గద్దించి అడగటంతో ఈదఫా ధైర్యం చేసి కరణంగారు అడిగారు. "వాసన అంటున్నారు అదేమిటో మాకర్ధంకాలేదు వివరిస్తే!"
"ఇంతకంపు కొడుతుంటే అర్ధంకాలేదా?"
"ఉహు?"
"ఇక్కడున్న అందరివీ ముక్కులా తాటిపట్టిలా, సెంటుకంపు ముక్కు బద్దలయేలా కొడుతున్నదా లేదా?" మాట పూర్తిచేస్తూనే హూచ్చ్ హూచ్చ్ అంటూ అరడజను తుమ్ములు తుమ్మి 'ఇక్కడికొస్తు సెంటు పూసుకురావటం ఏమిటి?" అని మళ్ళీ తుమ్మాడు వర్ధనరావు.
