"కిరణ్ వేగంగా వచ్చి తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు" నిన్ను వెళ్ళనివ్వను స్థిరంగా పలికాడు.
"నన్నిక ఏశక్తి ఆపలేదు" అంది అనిత అడుగుముందుకు వేస్తూ.
"నీ మంచి కోసం చెబుతున్నాను. నా మాట విను అనితా నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే!" అనితను చేతులతో ఆపుతూ అన్నాడు.
"నాకు అడ్డులే" అనిత గట్టిగా అంది.
"నిన్ను వెళ్ళనివ్వను" అంటూ అనిత జబ్బనుగట్టిగా పుచ్చుకున్నాడు.
అనిత గింజుకుంది పట్టు విడిపించుకోటానికి.
కిషోర్ చెయ్యి అనిత జబ్బమీద మరింత బిగుసుకుంది. "నాయిష్టం లేకుండా నువ్వెలా వెడతావో చూస్తాను"
"పెద్దగా అరచి గోలచేసి వెడతాను" అంది అనిత.
"ఏదీ అరువ్" అన్నాడు కిరణ్.
"రక్షించండి, రక్షిం..."
అనిత నోటి మీద ఫెడేల్ మని చేయిచాచి కొట్టాడు.
"అబ్బా" అంటూ అనిత కిరణ్ చేతిని గట్టిగా రక్కింది. మళ్ళీ అరవటానికి అన్నట్టు నోరు తెరిచింది.
పట్టలేని కోపంతో కిరణ్ ఎడాపెడా అనితను కొట్టాడు.
"హెల్ప్, హెల్ప్" అంటూ అనిత కిరణ్ నుంచి తప్పించుకోటానికి అతనిని గోళ్ళతో రక్కసాగింది.
కిరణ్ పట్టలేని ఆవేశంతో ఒక చేయి అనిత నోటిమీద వేసి మరో చేతితో రెక్కపుచ్చుకుని గిర్రున త్రిప్పి విసురుగా బలంగా తోశాడు.
ఆ విసురుకి అనిత దూరంగా వెళ్ళి డబుల్ కాట్ కి తగిలి కుప్పగా కూలిపోయింది.
క్షణకాలం.
కిరణ్ రొప్పుతూ అనితవైపు కోపంగా చూస్తూ అలా నుంచుండిపోయాడు.
విసురుగా వెళ్ళి అల్లంత దూరాన పడ్డ అనిత పడేటపుడు అమ్మా అని కాని అబ్బా అని కాని అనలేదు. బాధతో ఏ విధమైన ఆక్రందన చేయలేదు కనీసం చిన్నపాటి మూలుగుకూడా ఆమె పెదవిదాటి రాలేదు.
చాలా త్వరగానే తెలివి తెచ్చుకున్నాడు కిరణ్. పాదాలు విసురుగా వేస్తూ అనిత దగ్గరకు వచ్చాడు. నాట కాలుచాలులే పైకి అన్నాడు.
అనిత దగ్గరనుంచి ఎటువంటి సమాధానంలేదు.
"గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తున్నావ్. నీ నటన గ్రహించలేనంతటి మూర్ఖుని కాను." అంటూ కాలితో అనితను తన్నాడు కిరణ్.
"దబ్" మంటూ పూర్తిగా ప్రక్కకు ఒరిగిపోయింది అనిత. అప్పుడు వచ్చింది అనుమానం కిరణ్ కి. అనిత ప్రక్కనే క్రింద కూర్చుని, అనితను కదిలిస్తూ "ఏయ్" అన్నాడు.
అనిత మూలగటం కూడా చేయకపోయేసరికి లేచి వెళ్ళి గ్లాస్ తో నీళ్ళు తీసుకువచ్చాడు. అనిత మొహంమీద చిలకరించాడు. అయినా అనితకి తెలివి రాలేదు. గట్టిగా పిలుస్తూ రెండు భుజాలు పట్టుకుని కుదిపాడు.
చలనరహితమైన అనిత నిశ్చలంగా అలానే వుండిపోయింది.
అప్పుడు వచ్చింది కిరణ్ కి అనుమానం ముక్కు దగ్గర వేలుపెట్టి చూసాడు. అనిత గుండెమీద చెవిపెట్టి ఆలకించాడు. ఆమె ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిందని తెలుసుకోవటానికి అయిదు నిముషాలు కూడా పట్టలేదు. కిరణ్ కి భయం పట్టుకుంది.
అనితను అలాగే వదిలేసి చేతులు కట్టుకుని గదిలో పచార్లు చేస్తూ తీవ్ర ఆలోచనల్లో పడ్డాడు కిరణ్.
అతను ఎన్నోసార్లు ఎందరికో గాలం వేశాడు. ఆ గాలానికి చిక్కుకొని ఆడపిల్ల లేదు. అందులో కొందరు కిరణ్ మోసగాడని తెలుసుకుని వాళ్ళంతట వాళ్ళే తప్పుకున్నారు. వాళ్ళలో మరికొందరు దగాపడ్డామని తెలుసుకుని కన్నీళ్ళతో దూరంగా పోయారు. కొందరు కన్నెపిల్లలు కన్న తల్లులుగా మారుతున్న వేళ కిరణ్ బెదిరింపు లకు భయపడి ఈ లోకాన్నే వదిలిపోయారు. కాస్త ముందు చూపు వున్న వారు పట్టిన కల్మషాన్ని వదిలించుకుని గప్ చిప్ గా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఖర్మకాలి ఎవరన్నా ఎదురుతిరిగి పోట్లాడితే కిరణ్ బెదిరించేవాడు. ఆ బెదిరింపులకి భయపడి ఆమడ దూరానికి వెళ్ళిపోయేవారు. అంతేకాని ఇలా అనితలా ఎదురు తిరిగి మొండిగా ప్రాణాలు పోగొట్టుకున్న వారు లేరు.
ఇది కిరణ్ ఆవేశంతో చేసిన మొదటి హత్య.
ఇలాంటి క్లిష్ట పరిస్థితి కిరణ్ కి ఎప్పుడూ ఎదురనలేదు.
అందరిలాగానే ఏడుస్తూ, మొత్తుకుంటూ, తిట్లు, శాపనార్దాలతో అనిత తనకి దూరంగా వెళ్ళడమో, తన మాట వినడమో చేస్తుందని అనుకున్నాడు. ఇంతదూరం వస్తుందని, ఇలా జరుగుతుందని అనుకోలేదు.
అనుకోనిది జరిగింది.
"ఇప్పుడెలా?"
కిరణ్ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి.
"ఇలా జరుగుతుందని అనుకోలేదు. అమ్మో ఇది హత్యానేరం ఈ సంగతి డాడీకి తెలిస్తే, ఈ సంగతి లోకానికి తెలిస్తే? ఈ సంగతి పోలీసులకి తెలిస్తే? కటకటాలు లెక్కపెడుతూ ఏళ్ల తరబడి జైలు పక్షిలా అన్ని సుఖాలకీ దూరమై, అనామకుడిగా హంతకుడిగా, ఏ సుఖాలకీ నోచుకోకుండా...హయ్యో" అని నుదురు కొట్టుకున్నాడు కిరణ్.
ఈ పరిస్థితిలో తను ఇక్కడనుంచి తప్పించుకు పోవాలి. తను తప్పించుకు పోవడం చాలా తేలిక కాని, కాని అనితను ఏం చేసేట్టు? అనితను కాదు అనిత శవాన్ని ఏం చేసేట్టు? తను ఈ గదిలోంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ హత్యా నేరాన్ని తప్పించుకోలేడు.
ఏ చిన్న సాక్ష్యాధారం లేకుండా అనితను మాయం చేయగలిగితే తను బ్రతికిపోతాడు.
అనిత శవాన్ని మాయం చేయాలి.
తను బయట పడాలి ఈ విషమ పరిస్థితి నుంచి.
అనిత శవాన్ని రెండవ కంటికి తెలియకుండా మాయంచేయాలి.
అందరి కళ్ళముందు తను స్వేచ్చగా తిరగాలి.
"ఎలా? ఇది ఎలా సాధ్యం?"
పిచ్చిపట్టినట్లు ఆలోచిస్తూ తీవ్రంగా మధనపడుతూ పచార్లు చేస్తూ వుండిపోయాడు కిరణ్.
5
రాత్రంతా.
బోనులో పులిలా తిరుగుతూనే వున్నాడు. కిరణ్ ఎంతకీ తెల్లవారదు. ఎంతకీ ఆలోచనలు తెగవు, తెలతెలవారుతుండగా, అతనికి ఒక ఆలోచన వచ్చింది. అంతకు మించి మార్గం కూడా కనబడలేదు. ఎంతో ఆలోచిస్తే ఆ ఒక్కటే మంచి మార్గంలా తోచింది.
