3
'నేను బడికి పోనమ్మా." అన్నాడు సుందరం.
అందరు పిల్లలవెంటా తరుచుగా వచ్చే ఈ మాట తన కొడుకునోట రావటం విన్న సీతమ్మ మనస్సు తల్లడిల్లింది. సుందరం బడికి వెళ్ళిరావటం అది రెండోరోజే.
"ఎందుకురా?" అన్నదావిడ.
"పంతులు ఇవాళకూడా అ ఆ లే దిద్దబెట్టాడు."
"అవి వచ్చినయ్యని చెప్పమంటినిగా?"
"చెప్పా, ఏడిచావులే అన్నాడు...పంతులు ఊరికేనే కొడతాడమ్మా. రూళ్ళకర్రపెట్టి కణుపులమీద కొట్టాడు."
సుందరానికి దుఃఖం పొంగివచ్చింది.
"ఎందుకూ?" అన్నది సీతమ్మ, బాధపడుతూ.
"ఏమో నేనేం చెయ్యలేదు. అందర్నీ కొడతాడు."
సీతమ్మ కొడుకు విషయం భర్తతో చెప్పింది.
"పోనీ బడిమానమను, బళ్ళోకి పోకపోతే బడితెలాగా తయారవుతాడేమోనని గాని, ఇప్పుడు వాడి చదువేంముంచుకు పోయింది?" అన్నాడు శ్రీ మన్నారాయణ.
ఆయన ఏదో మంచిసలహా చెబుతాడనుకుంటే సీతమ్మకు నిరాశ అయింది. కొడుకును బలవంతాన బడికి పంపించి బడిమీద వాడికి మరింత ఏవగింపు కలగనివ్వటమా, లేక బడిమానిపించి చదువు ధ్యాసపోగొట్టటమా? సీతమ్మకు ఏదీఇష్టంలేదు. ఆకస్మికంగా ఆవిడ కొక ఆలోచన తట్టింది.
"అక్షరాలు నేనుదిద్దబెడతాలేరా," అన్నదావిడ. ఈ మాట అనేసిన తరవాత సీతమ్మ కేదో జంకు కలిగింది. పిల్లవాణ్ణి బడిమాన్పించి తాను చదువు చెప్పటం మొదలుపెడితే నలుగురూ నవ్వుతారేమో. కాని ఈ ఆలోచన మార్చుకునేటందుకు సుందరం అవకాశం ఇవ్వలేదు. వాడు ఆనందంతో ఒక్కగంతువేసి "నిజంగా నువ్వు దిద్ద బెడతావా, అమ్మా?" అంటూ వెళ్ళి పలకా బలపమూ తెచ్చి ఆవిడ ముందు పెట్టాడు.
"ఇప్పుడేనుట్రా? నేను వంట చేసుకోటానికి వెళ్ళాలి రేపు దిద్దబెడతాలే," అన్నది సీతమ్మ.
కాని సుందరం వినలేదు. వాడు చిన్నబుచ్చుకున్నవాలకంతో "దిద్దబెట్టి వంటచేసుకో కూడదేం?" అన్నాడు,
సీతమ్మ మారుమాటాడక పలక తుడిచి, బలపంతో "ఇ ఈ" అనే రెండక్షరాలూ రాసింది. మూడునాలుగుసార్లు రాసి తుడిచిన తరవాతగాని ఆవిడకా అక్షరాలు సరిగా కుదరలేదు. ఆవిడ పాట్లు చూసి సుందరం నవ్వాడు. కాని ఆనవ్వులో వెటకారంలేదు.
తల్లి చేతినుంచి పలక తీసుకుంటూనే సుందరం కిరసనాయిలు బుడ్డీదీపం దగ్గర కూచుని అక్షరాలు దిద్దసాగాడు.
మరో అరగంటకు సీతమ్మ వంటింట్లో అన్నం వార్చుతూండగా సుందరం వచ్చి తనకు అక్షరాలు వచ్చినయ్యని చెప్పాడు.
"అప్పుడే?" అన్నదావిడ,
"రాసి చూపిస్తా చూడు," అంటూ సుందరం పలక వెనకవేపున రెండక్షరాలూ వంకర టింకరగా రాసి చూపించాడు.
"అవును. అక్షరాలు వచ్చినై. ఇవాల్టికి చాల్లే." అన్నది సీతమ్మ.
ఇంకా రెండక్షరాలు రాసిపెట్టమని సుందరం పేచీపెట్టాడు.
"ఏపిచ్చిపడితే ఆపిచ్చేనుట్రా?" అన్నదావిడ. కాని మరుక్షణమే ఆ మాట అన్నందుకు పశ్చాత్తాప పడింది. ఏ క్షణాన ఎవరు సుందరానికి చదువుమీద ఉన్న ఆసక్తికి అడ్డుపుల్లలు వేస్తారో అని భయపడుతూవచ్చిన తానుకూడా ఆపనే చెయ్యట మేమిటి?"
సీతమ్మ చేతులు కడుక్కుని వచ్చి పలకమీద "ఉ ఊ" అనే అక్షరాలూ రాసిచ్చింది.
సుందరానికి ఈ అక్షరాలు చాల అందంగా కనిపించినై అదివరకు దిద్దిన నాలుగుఅక్షరాలకన్నా ఇవి వాడికి చాలా సులభంగాకూడా తోచినై. పలక పట్టుకుపోయి సుందరం చాలాసేపు ఆ అక్షక్షరాల స్వరూపాన్ని మనసుకు పట్టించుకుంటూ కూచున్నాడు. ఒకసారో రెండుసార్లో అక్షరాలుదిద్దగానే వాడికా అక్షరాలు తనంతట రాయబుద్ధయింది. పలకతిప్పి తడువుకోకుండా రెండక్షరాలూ రాసేశాడు. వాడు రాసిన అక్షరాలు వాడికే అందంగా కనపడినై.
"అమ్మా, నాకీ అక్షరాలు వచ్చేసినై. ఇదుగోచూసుకో" అని తాను రాసిన అక్షరాలు చూపించాడు సుందరం.
ఈసారి నిజంగా సీతమ్మకు భయంవేసింది. సుందరం చదువులో చురుకుకావటం ఆవిడకానందమేగాని అయిదు నిమిషాలకొక అక్షరం చొప్పున నేర్చుకునేచురుకు నిలవదేమో అనిపించింది. "సులభంగా వచ్చిన విద్య సులభంగానే పోతుంది." అని తనతండ్రి ఏనాడో అన్నమాటలు ఆవిడకు జ్ఞాపకం వచ్చినై.
"వెనుక చూసి రాశావా?" అన్నది సీతమ్మ.
"లేదమ్మా. కావలిస్తే మళ్ళీ రాస్తాపట్టు," అని సుందరం తన అక్షరాలు చెరిపేసి మళ్ళీ రాశాడు.
"వెధవా, సరిగా చెరపవలేదు. పాతఅక్షరాలు కనిపిస్తూనే ఉన్నై. అని చూసి రాశావు," అన్నదావిడ. అట్లా మాట్లాడటం ఆవిడ అంతరాత్మ కిష్టంలేదుగాని ఎవరో అనిపిస్తున్నట్టుగా' ఆ మాటలు వాటంతట అవే ఆమె నోటవచ్చినై.
తన తల్లి ఇట్లా మాట్లాడటం సుందరానికి నిరుత్సాహం కలిగించకపోగా ఉత్సాహంకలిగించిండి, అకారణంగా చేతిమెటికలు విరగగొట్టే మేస్టరునుచూచి, తనస్థాయికి దిగటానికి సిద్దంగావున్న తల్లిని చూసేసరికి సుందరానికి చదువంటే ఇట్లావుండాలనిపించింది.
వాడు గబగబా వెళ్ళి పలక రెండు వేపులా నీళ్ళు పెట్టి కడిగి తుడిచి తెచ్చి తల్లిదగ్గరకి వచ్చాడు.
"బిందెలో చెయ్యి ముంచావట్రా? ఏం పనుల్రా?" అన్నది సీతమ్మ.
కాని సుందరం వినిపించుకోలేదు. వాడు పలకమీద ఉ ఊ రాసి చూపించాడు.
"కొత్తవి నేర్చుకుంటూ పాతవి మరచి పోవటంలేదు కదా?" అన్నది సీతమ్మ.
సుందరం వరసగా అ ఆ ఇ ఈ ఉ ఊ రాసి తల్లికి చూపించాడు.
"చాల్లే నువ్వు వెళ్ళి నాన్నను కాళ్ళు కడుక్కోమను. నువ్వుకూడా కాళ్ళు కడుక్కురా అన్నంపెడతా," అన్నది సీతమ్మ.
