నన్ను క్షమించు ప్రియతమా! ఈ మోసంతో నిన్ను వంచిస్తున్నందుకు!!
ఎడారి ఎదను ఒయాసిస్సులా ఒదిగించుకుంటున్న మీ సంస్కారానికి ఆరారు జన్మలకైనా మీ పాద ధూళి రేణువునై తోడొస్తాను..."
ఇప్పుడూ అదే ప్రార్ధించిందామె! రెప్పల చిప్పల్లోంచి బయటి కొచ్చిన ఒక కన్నీటి బొట్టు ముత్యమై అతని చాతి వెంట్రుకల్లో చిక్కి మదిలో ఇంకిపోయింది. నాలుగేళ్ళ వాళ్ళ అన్యోన్య దాంపత్యంలో అతనికి తెలియని ఆ విషయాన్ని...అతని గుండెలపై వాలినప్పుదల్లా మన్నించమని కోరుతూ మవునంగా ఒక అశ్రుకణాన్ని ఆవిష్కరిస్తుందామె!
పందిరిని అల్లుకున్న మల్లెతీగల్లా ఆమె కరుచుకుపోయింది. వాళ్ళ మధ్య కవాటాల శబ్దాలు తప్ప నిశ్శబ్దం కూడా ఇమడలేకపోయింది.
"ఆంటీ....ఏమిటింకా....ఎయిట్ థర్టీ అవుతుంది తెలుసా?"
కిటికీ వూచలు పట్టుకొనిఅన్నాడు ఓ అయిదేళ్ళ కుర్రాడు. నిఖిల్ చటుక్కున నిర్లిప్తను వదిలేసాడు.
"అరె....బాబీ...నువ్వట్రా" అంటూ లేచాడు నిఖిల్. నిర్లిప్తకి సిగ్గు ముంచుకొచ్చింది. ఈ గడుగ్గాయిగాడి కంట్లో పడ్డాంరా దేవుడా అనుకుంటూ తడారిన వెంట్రుకల్ని ముడివేస్తూ లేచింది.
"అంకుల్...ఆంటీ సిగ్గుపడుతుందిగాని....ముందు తలుపులు తెరవండి" అన్నాడు బాబీ ఆర్డర్ వేసినట్టుగా.
నిఖిల్ గబుక్కున వెళ్ళి ముందురూం తలుపులు తెరిచాడు. బాబీ లోపలికొస్తూనే "అంకుల్...మీరు ఆంటీ దగ్గర పడుకున్నట్లే నాకూ మా అమ్మదగ్గర పడుకోవాల్సివస్తుంది గాని నాకు అమ్మ లేదుగా..." పసివాడి పలుకులకు నిర్లిప్తకు ఏమనాలో తోచలేదు.
* * * *
నిర్లిప్తా...నేను ఆఫీసుకు వెళుతున్నాను....తలుపేసుకో...బై....ఓ.కే. అన్నాడు నిఖిల్.
బాబిగాడు ముందు రూంలోకి వచ్చాడు.
"ఓ.కే. నిర్లిప్తా....బై" అన్నాడు మళ్ళీ నిఖిల్. నిర్లిప్త వంటింట్లోంచి బయటికి రాలేదు.
"ఆంటీ....అంకుల్ ఓ.కే, ఓ.కే. అంటున్నాడు. అంటే ఓన్లీ వన్ కిస్ అనేమో...తొందరగా వచ్చి ఇచ్చెయ్" అన్నాడు బాబీ పౌరుషంగా. అంతే! నిర్లిప్త వంటింట్లోంచి గరిటె పట్టుకొని వచ్చింది "వెధవా! వేలెడంత లేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్" అంటూ.
"ఇప్పటివరకూ ఇడ్లీలు వడ్డించావ్ కదా ఆంటీ! మళ్ళీ తన్నులు వడ్డిస్తావా? చూడంకుల్!" అంటూ నిఖిల్ చుట్టూ తిరుగుతున్నాడు బాబీ నిర్లిప్తకందకుండా!! ఇదే అదను అనుకున్న నిఖిల్ చుట్టూ తిరుగుతున్న నిర్లిప్తను చటుక్కున ముద్దెట్టుకున్నాడు.
"అంకుల్ వతుకు నేను థ్యాంక్స్ చెప్పనా ఆంటీ" అన్నాడు బాబీ నిఖిల్ వెనుక నుండి మరింత కొంటెగా.
నిర్లిప్త ముఖం మందారంకాగా చురచురా చూసి కొరకొరా వెళ్ళబోయింది. నిఖిల్ ఆపాడు.
"అన్నట్టు నిర్లిప్తా...ఈరోజొక ఫజిల్ చెపుతాను. ఆఫీసు నుండి వచ్చేసరికి చిక్కుముడి విప్పాలి. సరేనా?" అన్నాడు.
"అలా అయితే ఆంటీ తరపున నేనూ ఒకటి అడుగుతాను" అన్నాడు బాబీ నిర్లిప్తకు సపోర్టుగా.
రచయిత భార్గవ, నిఖిల్ చిన్నప్పటి నుండి ప్రాణస్నేహితులు. భార్గవ భార్య చనిపోయినప్పట్నించి నిఖిల్ కుటుంబంతోనె ఎక్కువ చొరవ భార్గవకి. అందుకే బాబీని వాళ్ళింట్లో విడిచి పెట్టి పోతుంటాడు. బాబీ అంటే అందరికీ ప్రాణం. వాడి అల్లరన్న మరింత ఇష్టం. తల్లి లేని పిల్లవాడన్న జాలి....తమకు పిల్లలు లేరన్నా దిగులువల్ల నిర్లిప్తకు బాబీ మరింత దగ్గరయ్యాడు. ఎర్రగా, బొద్దుగా వుండి, వాడి బుడి బుడి మాటలు ముచ్చటగొలుపుతాయి.
"లేడీస్ ఫస్ట్" చెప్పాడు బాబీ.
"ఏదీ...అడుగుమరి" అన్నాడు నిఖిల్. బాబి చేతులు నడుంమీద వేసి స్టయిల్ గా ఓ ఫోజిచ్చాడు.
"ఒక వూరి చెరువులో వున్న తాబేలు, ఎండ్రి రోడ్డుపైకి వచ్చాయి. వూరేమో ఉత్తరం దిక్కుగా వుంది. అవి రెండూ పరుగు పందాలు వేసుకున్నాయి అయితే రెండు కళ్ళూ మూసుకుని పది నిమిషాలలో వూర్లోని గాంధీ బొమ్మదగ్గరకు చేరాలి. అదీ పందెం.
ఓకే అంది ఎండ్రి.
రెండూ రెడీగా ఒకే పోజిషన్ లో నిల్చున్నాయి...
కళ్ళు మూసుకున్నాయి....తాబేలు వన్, టూ, త్రీ అంది. పరుగో పరుగు....
పది నిమిషాల తర్వాత చూస్తే తాబేలు గాంధీ బొమ్మ దగ్గరుంది కాని...ఎండ్రి మాత్రం చెరువులోనే వుంది. అదెలా సాధ్యం" అడిగాడు బాబీ.
వాడి స్టయిల్ కు నవ్వి" ఎండ్రి తాబేలును మోసపుచ్చి వుంటుంది" చెప్పాడు నిఖిల్.
"షేమ్...షేమ్....మేమే గెల్చాం. అసలు ఎండ్రీకి దారి తెలీదు" అల్లరిగా అంది నిర్లిప్త.
"ఛస్...మీరిద్దరూ తప్పే" కోపంగా అన్నాడు బాబీ.
వాళ్ళు ఠక్కున నోరు మూయగానే...
"తాబేలు, ఎండ్రి ఒకే పొజిషన్ లో నిల్చున్నాయి అన్నానా? అసలు ఎండ్రి ఎలా నడుస్తుందో ఎప్పుడయినా చూసారా? ముందుకు నడవదు. ప్రక్కగా నడుస్తుంది. తాబేలులాగే దాని ప్రక్కన నిల్చున్నప్పటికి, కళ్ళు మూసుకుని పరుగెత్తేసరికి తాబేలేమో సూటిగా పోయింది. ఎండ్రిమాత్రం తను రన్నింగ్ లోనే వున్నాననుకుంటూ చెరువులోకొచ్చి పడింది. అదీ సంగతి."
వాడి తెలివికి ముక్కుమీద వేలేసుకుంది నిర్లిప్త. నిఖిల్ 'గుడ్' అన్నాడు.
