Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 5


                                    3
    సూర్యుడు పశ్చిమ కొండల్లోకి వెళ్ళుతున్నాడు. ప్రాచీకన్నె వింత వింత రంగుల్లో మెరిసి పోతుంది. విశాల వినీలాకాశంలో అక్కడక్కడ ఉన్న తెల్లని మబ్బులు సంధ్యాదేవి ధరించిన నీలం చీర అద్దిన తెల్లని నల్లని పువ్వుల్లా ఉన్నాయి.
    అప్పుడప్పుడే మల్లెలు, జాజులూ విచ్చుకుంటున్నాయి. మెత్తని ఆ సౌరభం కలిసి దూర దూర లోకాలకు ప్రయాణమై పోతుంది.
    పారిజాత చెట్టు కింద వేసి ఉన్న లౌంజ్ చైర్స్ లో విజయా, సుధీరా కూర్చోనున్నారు.
    విజయ చేతిలో "హృదయేశ్వరీ" పుస్తక ముంది. సుధీర ఏదో నవల చదువు కుంటుంది.
    "భాను మళ్ళీ రానేలేదు" సుధీర ముఖంలోకి చూస్తూ అంది విజయ.
    "అవును. రాలేదు" తలెత్తి అని మళ్ళీ పుస్తకం చదవడం లో మునిగిపోయింది. సుదీర.
    విజయ ఏం మాట్లాడలేదు. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ కూర్చుంది.
    "ఇద్దరూ మాట్లాడుకోకుండా కూర్చున్నారెం? కొట్లాడుకున్నారా?" సన్నగా నవ్వుతూ అంది విశాల.
    పరధ్యానంలో ఉన్న విజయా, పుస్తకం లో లీనమైన సుధీర విశాల వైపు చూసి నవ్వారు.
    "కూర్చో! యీ రోజు యింత అలస్యమేం?" పుస్తకం మడుస్తూ అంది సుధీర.
    "పిన్నీకి జ్వరమొస్తుంది. వంట చేసి...."
    "వచ్చేది ఒక్క ఆదివారం, అదీ యింత ఆలస్యముగా వస్తే ఎలా?" మందలించింది సుదీర.
    "ఒక్కరోజు  అలస్యమైనంత మాత్రాన కొంపలు మునిగిపోవు." కుర్చీలో కూర్చుంటూ అంది విశాల.
    "చివరి రెండు పాఠాలకు నోట్సు తయారు చెయ్యాలి కదూ?"
    విశాల ఔనన్నట్లు తల ఊపింది.
    "మీకోసం ఎవరో వచ్చారు." నౌకరు వచ్చి విజయతో చెప్పాడు.
    విజయ లేచి వెళ్ళింది.
    "నీకోసం యీరోజు ఏంటో ఆత్రంగా కాచుకోనున్నాను?" విశాల ముఖంలోకి చూసి నవ్వి అంది సుదీర.
    "ఎందుకో?" కుతూహలంగా అడిగింది విశాల.
    తన ప్రక్కనున్న న్యూస్ పేపరు తీసి అందులోని మాట్రిమోనియల్ కాలమ్ చదవమని విశాల చేతికిచ్చింది సుధీర.
    విశాల చదివి, సుదీర ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది.
    "ఆ నాలుగో ప్రకటన మళ్ళా చదువు"
    విశాల మళ్ళీ చదివింది.
    "ఏవుంది?"
    "ఓ ఫారెన్ రిటర్న్ అబ్బాయికి అందమైన చదువుకున్న అమ్మాయి కావాలట."
    "ఇంకా?"
    "ఇరవయ్యీ యిరవై ఐదు లోపు వయసు."
    "ముఖ్యమైన మరిచావు."
    "కులంతో పనిలేదు. అద్దాలు పెట్టుకోకూడదట!"
    ఇద్దరూ ఫక్కున నవ్వారు.
    "అడ్డాలుంటే ఏమో?"విశాల సందేహంగా అంది.
    "అందం చెడి పోతుందని!"
    "సొసైటీ లేడీసంతా పెట్టుకుంటారుగా?'
    "ఏమో, మరి! 'అతని' కిష్టమున్నట్లు లెదు"
    "ఎవరా అతను?"
    "ఇది మరీ బాగుందేవ్! నాకేం తెలుసు?"
    "మరెందుకు చదవమన్నట్లు?"
    "అతనెవరో తెలుసుకుందామనే!"
    "తెలుసుకుని?" కనుబొమలు ముడిచి ప్రశ్నించింది విశాల.
    "చేసుకోవచ్చని...." వచ్చే నవ్వాపుకుని అంది సుధీర.
    "ఏం? మీనాన్న పెళ్ళి చేయ్యనన్నాడా?"
    "నాక్కాదే అమ్మడూ! నీకే!"
    "నాకా!"
    "ఆ!"
    "నాకు పెళ్ళి చేసే అధికారం నీకెవరిచ్చారు?"
    "ఒకరిచ్చేదేమిటి?నేనే తీసుకున్నాను!" సీరియస్గా అంది సుధీర.
    "ఎమ్మా లాగా అందరికీ పెళ్ళిళ్ళు చెయ్యాలనుకుంటున్నావా?"
    "అందరికీ కాదు నీకొక్కదానికే!"
    "ఇక చాలు! "భీముని శీలం' వ్రాయాలి. కాస్త సాయం చెయ్యి."
    "కొంపదీసి తమాషా అనుకుంటున్నావా ఏమిటి? రేపు ఉదయానికల్లా నీ ఫోటో ఒకటి కావాలి" అంది సుధీర.
    అంతవరకూ తమాషాగా తీసుకున్న విశాల అప్పటికి నిజమని నమ్మక తప్పింది కాదు.
    "ఏవంటావు, విశాల?"
    "నీకెందుకీ కష్టం?" అయినా నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు."
    "అవును. ఆ సంగతి నాకు తెలుసు. కుసుమ సమానమైన నీ హృదయాన్ని యీ సమాజం నిర్దాక్షిణ్యముగా నలిపెసింది. తియ్యటి భవిష్యత్తును గురించి కనీసం అలోచించనే నువ్వు భయపడుతున్నావు నాకు తెలీక పోలేదు. విశాలా!"
    టేబిలు మీద వ్రేలితో పిచ్చి గీతలు గీస్తూ మౌనంగా ఉండిపోయింది విశాల.
    "పెళ్ళి చేసుకోకుండా జీవితన్నంతా దేశ సేవకే అంకితం చెయ్యాలనుకోవటం ఉత్తమమైన ఆదర్శం. దాన్నెవరూ కాదనరు. కానీ ఆ ఆదర్శాన్ని కార్యరూపంలో పెట్టాలంటే ఎంతో ఓర్పు, నిగ్రహశక్తి అవసరం."
    విశాల తలెత్తి అదోరకంగా చూసింది.
    'ఆహా! నీకా ఓర్పూ, నిగ్రహం లేదని కాదు. కానీ.... నీచుట్టు పట్ల వాళ్ళ సంగతి కూడా కాస్త ఆలోచించాలి. మన సమాజ పరిస్తితులు గూడా ఎలాంటివో కాస్త యోచించాలి. నువ్వో సెకండరీ గ్రేడ్ తీచరువు." నిశ్చల కంఠంతో అంది సుధీర.
    "ఆవిషయం నేను మరిచిపోలేదు. పదేపదే ఎందుకు గుర్తు చేస్తావు?' బాధగా అంది విశాల.
    "మరించిపోయావని కాదు. సమాజం దృష్టి లో నిస్థానమేమిటి? నువ్వే అంతస్తులో ఉంటావు? నీవనుకున్నట్లుగా నీ ఆదర్శం సక్రమంగా నెరవేరుతుందా? అందుకు తగిన అవకాశం ఈ సమాజం నీకు కలగ జేస్తుందా? ఒకసారి నువ్వే చెప్పావు, గుర్తుందా? ఎవరో ఉత్తరం వ్రాశాడనీ, నీచాతి నీచమైన సంబంధాన్ని నీతో వాంచించాడనీ...."
    "సుధీ! ఆ విషయాలన్నీ యిప్పడేందుకు చెప్పు?" సుడులు తిరిగిన కన్నీటిని దాచుకునేందుకు వ్యర్ధ ప్రయత్నం చేసింది విశాల.
    "ఎందుకలా వ్రాశాడంటావు?"
    "జవాబు నువ్వే చెప్పాలి"
    "ఒకటీ, నీకు వివాహం కాకపోవటం , రెండు నీ బీదరికం మూడు...."
    "చాలు!"
    "ఈ విషయంలో మటుకు నా మాట కాదనకు. ఇది ప్రయత్నం మాత్రమే! అందులోనూ కులంతో పనిలేదని స్పష్టంగా రాశారాయే."
    "ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే , సుధీ ప్రాణ త్యాగమొక్కటే యీ అవమానం నుండి నన్ను కాపాడగలదనిపిస్తుంది." గద్గగ కంఠంతో అంది విశాల.
    ఛా! అవి పిరికివాళ్ళ మాట్లాడవలసిన మాటలు!"
    విశాలా విషాదంగా నవ్వింది.
    మరో గంట కూర్చుని యిద్దరూ కలిసినోట్సు తయారు చేశారు.
    విశాల వెళ్ళేటప్పుడు ఫోటో పంపమని మరీ మరీ చెప్పింది సుధీర. విశాల అయిష్టంగానే తల ఊపి వెళ్ళింది.
    విశాల, సుధీర ల స్నేహలత వయసు రెండు సంవత్సరాలు మటుకే! అయినా ఆ స్నేహలత ప్రగాడంగా అల్లుకుపోయింది. మొగ్గలు తొడిగి పుష్పించింది. దాని నుండి వచ్చే పరిమళాలు వాళ్ళిద్దరికే కాగ, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాయి నీ, ఆనందాన్నీ యిచ్చేవి. మహిళా సమాజం లోని వాళ్ళ పరిచయం ప్రాణ స్నేహం లోకి మారుతుందని ఆరోజు యిద్దర్లో ఒక్కరూ అనుకోలేదు. కడిగిన ముత్యంలా , నిర్మలంగా , అందంగా ఉన్న విశాల సుధీర హృదయాంతరంలో ఒక ప్రత్యెక స్థానాన్ని ఆరోజే ఏర్పరచుకుంది. నవ్వుతూ, త్రుళ్ళుతూ , మూర్తీభవించిన జీవనవహినిలా ఉన్న సుధీర విశాల ముగ్ధ హృదయాన్ని ఆనందంతో నింపేసింది.
    "సుధీ! నీ దగ్గరుంటే నాలుగ్గంటలూ నాలుగు క్షణాల్లా దోర్లిపోతాయి. జీవితం మీద ప్రేమ, ఆశ, లాలన క్షణ క్షణానికి పెరిగిపోతాయి. విశాలా కశామంతటి ఆశ, అపారసాగర మంతటి ప్రేమా జీవితం మీద కలిగేటట్లు చేస్తావు ఏం నోములు నోచి యిలాంటి వరాన్ని పొందావో చెప్పవూ?" అనేది విశాల.
    సుధీర గలగలా నవ్వి "ఉపదేశానికిది సమయం కాదు. సమయమొచ్చినప్పుడు తప్పక చెప్తాను" అనేది.
    జీవితం ఒక రసవత్తర కావ్యమైతే అందులో తరచి తరచి , తిరిగి తిరిగి చదవలసిన అధ్యాయాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యెకధ్యాయాల్లో ఒకటి స్నేహం. సుధీర , విశాల మధ్య నున్నా స్నేహం వాళ్ళ జీవిత గ్రందాల నుండి మళ్ళీ మళ్ళీ చదవలసిన అధ్యాయం.

                              *    *    *    *
    "డోర్ నెం. 14-236...." పర్సు లో నుండి కాగితం తీసి చదివింది సుధీర'.
    "అయితే యిదే!" అంది విశాల.
    "పద, మరి."
    "ముందు నువ్వు."
    "ఇంత పిరికితనముంటే బ్రతకడం కష్టం. అమ్మడూ!"
    విశాల నవ్వింది తెలుగ్గా -- హాయిగా.
    ఓరగా వేసి ఉన్న గది తలుపు మెల్లగా తట్టింది సుధీర. ఓ నిమిషం సేపు వేచి ఉన్నా ఎలాంటి జవాబూ లేదు.
    "లోపల ఎవరూ వున్నట్టు లేదే!" సందేహంగా అంది విశాల.
    "తలుపు తీసేవుంటే లోపలా ఎవరూ లేకుండా ఎలా వుంటారు? ఎవరండీ లోపల?"
    మరో నిమిషం నిశ్శబ్దం.
    "నేనంటూనే వున్నాను- ఇందులో ఏదో మోసముందని! నామాట చెవిలో వేసుకున్నావా? మనల్ని రమ్మనవలసిన అవసరమేమిటి? నిక్షేపంలా అతనే రావచ్చుగా?"
    "నోరు మూసుకో!శకున పక్షిలా చెవిలో చేరి!" కసిరింది సుధీర.
    విశాల బుంగమూతి పెట్టింది.
    సుధీర నెమ్మదిగా తలుపు నెట్టింది. ఏ ఆటంకమూ లేకుండా తలుపు తెరచుకుంది. ఎదురుగా ఉన్న కిటికీ దగ్గార వాలు కుర్చీలో పడుకుని ఊహ లోకంలో విహరిస్తున్నాడు కళ్ళు మూసుకుని- ఒక యువకుడు. ఒడిలో పుస్తకం చేతిలో పెన్ను అతన్ని గురించి కొద్దిగా చెప్పాయి.
    "మిమ్మల్నే!" గదిని మూడోసారి ముచ్చటగా కలయజూసి అంది సుధీర.
    అతను కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మాయి లిద్దరి వైపు. మరుక్షణం లోనే తడబడుతూ లేచి నిల్చున్నాడు.
    "ఎవరు....? మీరు?" అస్పష్టంగానే అన్నాడు.
    "బాగుంది! మంచి ప్రశ్నే!" పెదవి విరిచింది సుధీర.
    అతనికేం మాట్లాడాలో తెలీలేదు. చాలా అస్వస్తంగా బాధపడుతున్నాడు.
    "ఏదో.... మాట్లాడాలని..... రాశారు గదండి?" విశాల కల్పించుకుంది.
    "నేనా? మీతోనా? ఎందుకూ? ఊహు.... లేదండి! ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పేందుకు విచారిస్తున్నాను." చేతులు నలుపుకుంటూ అన్నాడు.
    సుధీర అతని రూప, వేషాల సమగ్ర పరిశీలనలో పూర్తిగా మునిగిపోయింది. పొడుగ్గా సన్నగా, చామనఛాయగా ఉన్నాడు. పొడుగాటి ముక్కూ, విశాల ఫాలం, తీక్షణంగా ఉన్న చిన్న కళ్ళు అతనికొక ప్రత్యేకత నిస్తాయి. మాసిపోయిన పంచా, గుండీలు కూడా పెట్టుకొని చొక్కా అతని దారిద్యాన్ని నిర్లక్ష్యాన్ని సాక్షి భూతంగా ఉన్నాయి.
    "సుధీ! వింటున్నావా?"
    "ఏమిటి?" తన పర్యవేక్షణ ముగించి అడిగింది సుధీర.
    "అతనికేం తెలీదట!"
    "తెలీదంటే సరిపోతుందా? ఇలా చూడండి యీ ఉత్తరం మీరు వ్రాసింది కాదూ?' పర్సులో నుండి కవరు తీసి అతని చేతికందిస్తూ అంది సుధీర.
    "మీపేరు?" బోనులో ముద్దాయిని ప్రశ్నించినట్లు ప్రశ్నించింది సుధీర.
    "చంద్రశేఖరం."
    "ఆ ఉత్తరంలో ఎవరి సంతకముందో కాస్త చూడండి!"
    "ఇది నా సంతకం కాదు."
    "పేరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS