Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 5


    "నువ్వు నిజమే మాట్లాడుతున్నావు కదూ?"
    "అక్షరం అక్షరం వాస్తవమే"
    "అయితే ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?"
    "చెప్పి మన ఆనందాన్ని పాడుచేసుకోవటం ఇష్టం లేక"
    "అంటే...అంటే...." అంటూ అనిత ఒక్క క్షణం ఆగి,
    "నీవు మళ్ళీ నన్ను మళ్ళీ మళ్ళీ ఆనందాన్ని పొందటానికి అబద్దాన్ని ఆడావు. అంతేనా! కిరణ్?" బాధగా అంది.
    "అఫ్ కోర్స్" చాలా తేలికగా అన్నాడు కిరణ్.
    "నువ్వు మోసగాడివి కిరణ్. ఈ లెక్కన నీవు మీ యింట్లో మన విషయం చెప్పావన్నది కూడా అనుమానమే"
    కిరణ్ మాట్లాడలేదు.
    "నీమీద నాకు నమ్మకం కలగాలంటే రేపు ఉదయం మీ మమ్మీ డాడీ దగ్గరకు తీసుకువెళ్ళు, అక్కడ మన విషయం నా ఎదుటే చెప్పి ఈ నెలలోనే పెళ్ళి ముహూర్తం పెట్టించు. అది అయింతరువాత అపుడు కావాలంటే నీఇష్టానుసారం వెంటనే ఎబార్షన్ చేయించుకుంటాను."
    "అది జరగని పని"
    "అంటే?"
    "ముందు  ఎబార్షన్ తరువాత మా మమ్మీ డాడీల దగ్గరకి తీసుకువెళ్ళి పరిచయం చెయ్యడం" నా నిర్ణయంలో తిరుగులేదు. కిరణ్ స్థిరంగా చెప్పాడు.
    "అర్ధమయింది కిరణ్! నువ్వు మన సంగతి మీ అమ్మా నాన్నకి చెప్పలేదు. వాళ్ళతో సంప్రదించటం అనేది అసలు జరగలేదు. నాతో పొందు నీకు విందే కాని నేను తల్లిని కావటం నీకు కంటకంగా గుచ్చుకుంది. నేను ఎబార్షన్ కి ఒప్పుకుంటానో లేదో అని ముందుగా తెలివిగా ఆలోచించి కట్టుకధ అల్లి కమ్మగా వినిపించావు. నన్ను చూడంగానే వెంటనే చెప్పబుద్ది కాలేదు. అవకాశం వున్నంత వరకూ ఆనందాలని జుర్రుకునే తత్వం నీది. ఇపుడు ఆపనే చేశావు. చావు కబురు చల్లగా వినిపించావు. అవునా? నాకు నిజం కావాలి." కిరణ్ వైపు గుచ్చి చూస్తూ అడిగింది అనిత.
    "నేను మోసగాడిని కాదు" అన్నాడు కిరణ్.
    "ఆ మాట అనుకోకుండా వుండవలసిన దాన్ని నేను, కాని నీ మాటలు, చర్యలు చూస్తుంటే నీవు పెద్ద మోసగాడివి అనిపిస్తున్నది. అవును మోసగాడివి."
    "నేను మోసగాడిని కాదు. ఒకవేళ మోసగాడినే అనుకో ఏం చేస్తావ్?"
    "వెంటనే నేను మీ మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళి వున్న నిజం చెబుతాను. ఎలా అయినా వాళ్ళు నీ కన్నతల్లి తండ్రి కదా! నీలాంటి వాళ్ళే అయివుంటే ఇంతకు ముందు నువ్వు మాట్లాడినట్లే వాళ్ళూ మాట్లాడతారు. మధ్యలో అడ్డుతగిలి కిరణ్ అన్నాడు అప్పుడు?....
    "నువ్వు అనుకుంటున్నట్లు ఈ అనిత బేల కాదు, అబల కాదు నీ వాళ్ళు కూడా ఒప్పుకోని మరుక్షణం ఈ విషయం లోకానికి ఎలుగెత్తి చాటుతాను. మనిషి, మనిషిని పిలిచి వినిపిస్తాను. మన కథని పేపర్లకి ఎక్కించటానికి కూడా ప్రయత్నిస్తాను. నన్ను అమాయకురాలిలాగా భావిస్తే అది నీ పొరబాటు ఈ అనిత మంచికి మంచి చెడుకు చెడు. ఈ అనితకు ఆ రెండే తెలుసు మంచి, చెడు."
    "అయితే నీవు అమాయకురాలివి కాదన్న మాట" కిరణ్ తాపీగా అడిగాడు.
    "మన వ్యవహారం రచ్చకెక్కనంతవరకు అమాయకురాలినే, రచ్చకెక్కిన మరుక్షణం రాక్షసినే. నా సంగతి నీకు తెలీదు."
    "నాకు బాగా తెలుసు."
    "ఏం తెలుసు." వ్యంగ్యంగా అంది అనిత.
    "నీవు పెద్ద మోసగత్తెవని." కిరణ్ వ్యంగ్యంగా అన్నాడు.
    "ఏది మళ్ళీ అను" అనిత గర్జించింది.
    "మళ్ళీ, మళ్ళీ అంటాను నీవు మోసగత్తెవి."
    "ఛీ సిగ్గులేని మొగవాడా మాటలు గారడీతో ఆడపిల్ల బ్రతుకుని నాశనం చెయ్యటం కాదు పిరికివాడిలాగా అసమర్ధుడిలాగా."
    "ఎస్ నేను అసమర్ధుడిని, నా లోపం నేను ధైర్యంగా ధైర్యంగా వప్పుకుంటున్నాను. నేను ఏ ఆడపిల్లనీ తల్లిని చేయలేను."
    "ఏమిటి నువ్వు మాట్లాడేది?" అనిత అర్ధంకాక అడిగింది.
    "ఇదేమాట అర్ధమయ్యేలా చెప్పనా!"
    "ఊ"
    "నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి  నేను తండ్రిని కాను."
    "మోసగాడా" పెద్దగా ఛీత్కారం చేసింది అనిత.
    "దీంట్లో మోసమేముంది. ఉన్న విషయమే అది."
    "అయితే మరి నాకీస్థితి ఎలా కలిగింది?"
    "ఎలా కలిగింది అన్న విషయం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని అడుగు."
    ఆ మాట వింటూనే ఆడపులిలాగా కిరణ్ మీదకు దూకింది అనిత. ఎడాపెడా చెంపలు వాయించింది. అనిత కాలర్ పట్టుకొని ఏది మళ్ళీ ఆ మాట అను." వగరుస్తూ అంది.
    కిరణ్ ఏ మాత్రం తొణక్కుండా" ఎలా కలిగింది అన్న విషయం నీకడుపులో పెరుగుతున్న బిడ్డతండ్రిని అడుగు" అన్నాడు.
    "ఛీ నీ మొహం చూట్టానికే నాకు చాలా అసహ్యంగా వుంది. నన్ను అంత మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది. ఇంతవరకు నీ ప్రేమ తుచ్చమైన కామంతో కూడినది అన్నమాట?"
    "నువ్వు వగర్చినా అరచి గీ పెట్టినా లాభంలేదు. ఈ పరిస్థితులలో నా ప్రేమని నిలబెట్టుకోవాలనుకుంటే నామాట విను రేపు లేడీ డాక్టర్ దగ్గరకు వెళదాం. ఆవిడ ఎబార్షన్ చేస్తుంది. మళ్ళీ మన ప్రేమ క్రొత్త చిగుళ్ళు తొడుగుతుంది. లేదంటావా నీ కడుపులో బిడ్డకి నేను తండ్రిని కాను. నీ విషయం కూడా అనవసరం. రేపటినుంచి నీ దోవ నీది. నా దోవ నాది."
    "అది జరగనిపని. ఇంతటితో నేను వదుల్తాననుకోకు. రేపే మొదలవుతుంది. నా బ్రతుకుకాదు, నీ బ్రతుకు నలుగురిలో నవ్వులపాలు కావాలి. నేను అల్లరి పడలేను, అవహేళనకు గురి అవలేను, చస్తాను అయినాసరే నిన్ను ముప్పతిప్పలుపెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించి కాని వదలను. రేపటిదాకా ఎందుకు ఈ క్షణంనుంచే వెళ్ళి మొదలుపెడతాను." అని చెప్పి అనిత వెళ్ళబోయింది.
    "కిరణ్ అడిగాడు ఎక్కడికి?"
    "ముందు ఈ గదినుండి బైటికి బైటికి వెళ్ళిన మరుక్షణం..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS