అంతవరకు ప్రశాంతంగా వున్న వాతావరణం మబ్బులు, కారుచీకట్లు, పెనుగాలులతో కూడుకున్నట్లు భయంకరంగా మారిపోయింది. మమ్మీ చాలా పౌరుషంగా మాట్లాడింది. డాడీ మెత్త మెత్తగా చీవాట్లు వేశారు. నేను మటుకు నా నిర్ణయం మార్చుకోనని మరోసారి చెప్పేశాను.
అరగంట తరువాత డాడీ మెత్తపడ్డారు. "నీ ప్రేమ ఎంతగట్టిదో చూద్డామని అలా మాట్లాడాను. ఆ పిల్ల ఎలాంటిదైనా సరే నువ్వు మెచ్చినపిల్ల. మీ పెళ్ళికి నేనేమీ అభ్యంతరం పెట్టను. ఇంక మీ మమ్మీ ఇష్టం. మీ మమ్మీని ఎలా ప్రసన్నురాలిని చేసుకుంటావో నీ యిష్టం.
డాడీ గ్రీన్ సిగ్నల్ చూపారు.
మమ్మీ మాత్రం మొండిగా ససేమిరా నా కంఠంలో ప్రాణం వుండగా ఒప్పుకోనన్నది. వన్ మినిట్ అని ఇంట్లోకి పరిగెత్తాను. లైసెన్స్ వున్న డాడీ రివాల్వర్ వుంటే అది తీసుకువచ్చాను. మమ్మీ ఎదురుగుండా నుంచుని నా కణతకి రివాల్వర్ గురిపెట్టుకున్నాను.
"మమ్మీ నీ మాట కాదనలేదు. నన్ను నమ్ముకున్న అమ్మాయిని వదులుకోలేను. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నీకు నీ కొడుకు కావాలా? నీ మాట నెగ్గడం కావాలా? ఏదో ఒకటి త్వరగా చెప్పు."
మమ్మీ క్షణాలలో నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడూ అంతే "నాకు న అకోదుకే కావాలి అంది" అంటే మమ్మీ మన పెళ్ళికి ఆమోదించింది అని అర్ధం. వెంటనే ఆనందంతో రివాల్వర్ ని అవతల పడేసి మమ్మీని ఎత్తి గిర, గిర త్రిప్పారు. ఎలాగో తెలుసా? అచ్చం సినిమాలో హీరో లాగా అన్నమాట. రేపటిరోజు నిన్ను తీసుకువచ్చి చూపెట్టమన్నారు. వీలైతే ఈ నెలలోనే పెళ్ళి ఏర్పాట్లు చేద్దామన్నారు. ఈ విషయం నీతో ఎక్కడైనా చెప్పొచ్చు.
కాని, నాకలా ఇష్టంలేక పోయింది. అందుకనే ఈ హోటల్ రూమ్ తీసుకుని నిన్నిక్కడికి పిలిచి పెళ్ళి బాజా వినిపించాను. టట్టడోయ్." విషయమంతా సరదాగా చెప్పాడు కిరణ్.
చీర చెంగుతో కళ్ళు వత్తుకుంది అనిత.
"అరె ఈ సమయంలో కన్నీరా?"
"ఇది కన్నీరు కాదు కిరణ్; ఆనంద బాష్పాలు, నా ఆనందాన్ని మాటలలో ఎలా వర్ణించాలో తెలియటంలేదు. రెక్కలు కట్టుకుని గాలిలొ ఎగరాలనిపిస్తున్నది. వినీల ఆకాశంలో విహంగంలా ఎగరాలని పిస్తోంది. ఇంకా ఇంకా ఏదేదో చెయ్యాలని పిస్తున్నది. నిజం కిరణ్! అనిత మధురంగా మత్తుగా పలికింది."
"ఆల్ రెడీ నేనుకూడా రెక్కలు కట్టుకుని వున్నాను." ఇద్దరం కలిసి ఎగురుదాం పద." అంటూ అనితను చేతుల్లోకి తీసుకున్నాడు కిరణ్.
4
"ఇది అన్యాయం" అంది అనిత.
"నాకు మట్టుకు న్యాయంగానే అనిపిస్తున్నది" అన్నాడు కిరణ్.
"మగవాళ్ళకి అన్నీ న్యాయంగానే కనిపిస్తాయి. ఒక ఆడపిల్ల వంటరిగా రాత్రి ఒంటిగంటదాకా హోటల్ గదిలో ఒక అబ్బాయితో వుండటం లోకానికి తెలిస్తే లోకం హర్షించదు. నోట్లో వుమ్మేస్తుంది."
"నోట్లో!" అన్నాడు ఆశ్చర్యంగా కిరణ్.
"అవును నోట్లోనే నోరు తెరవమని మరీ వుమ్మేస్తారు" అంది అనిత.
"అంతకుమించి ఏమీ చెయ్యదు కదా లోకం!"
"సిగ్గు లేకపోతే వరి మాటలతో కాలయాపనచేసి పబ్బం గడుపుకుంటున్నావు. వచ్చినప్పటినుంచి వెళతాను. అంటుంటే ఒంటిగంటదాకా చేశావు. కిరణ్ నీ మాటలు చూపులు మత్తుగా, గమ్మత్తుగా వుంటాయి. నీతో పరిచయం వున్న ఏ ఆడపిల్లా నీ మాట కాదనదు."
"ఈజిట్?"
"ఒకరి విషయం ఎందుకు నా విషయం మటుకు అంతే" అంది అనిత.
"నువ్వు నిజమే పలుకుతున్నావు కదూ!" అన్నాడు కిరణ్.
"నిజంగా నిజం" అంటూ కిరణ్ క్రాఫ్ అల్లరిగా చెరిపేశింది అనిత.
"అయితే నేనెలా చెబితే అలా వింటావా!"
"ఓ" అంది అనిత.
"అయితే ఇపుడు ఒక కోరిక కోరుతాను."
"కోరుకో నరుడా" తమాషాగా అంది అనిత.
"అయితే రేపు మనం లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్దాం."
"నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకో చెప్పు!"
"ఎబార్షన్ కోసం."
"ఎవరికి? నీకా!" నవ్వుతూ అడిగింది అనిత.
"కాదు, నీకు" స్థిరంగా పలికింది కిరణ్ స్వరం.
"కిరణ్ వడిలోంచి చటుక్కున పైకి లేచింది అనిత. అతనిని సూటిగా చూస్తూ జోక్ చేస్తున్నావా కిరణ్" అంది.
"నువ్వు నా మాట వింటానన్నావ్" అన్నాడు కిరణ్.
"నా ప్రశ్నకు జవాబు ఇది కాదు" అంది అనిత.
"అయితే నాదే జోక్ కాదు" అన్నాడు కిరణ్.
"విషయమేమిటో ముక్కు సూటిగా చెప్పు" అంది సీరియస్ గా అనిత.
"మనకి ఇపుడే పిల్లలు అవసరంలేదు. నేను తండ్రిని కావటానికి ఇంకా చాలా టైము వుంది. ఇప్పుడే నీవు తల్లి వయితే నీలో అందాలు చెదిరిపోతాయి. పైగా నే నీ విషయం మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎబార్షన్ అయిన తరువాతనే నిన్ను మా వాళ్ళ దగ్గరకు తీసుకు వెళతాను. నే చెప్పిన దాంట్లో జోక్ ఏమీలేదు. నిన్ను కన్నెపిల్లగా కాకుండా, ఒక పిల్లనూ కనబోయే తల్లిగా మా వాళ్ళకు పరిచయం చెయ్యటం నాకే ఇష్టంలేదు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళేమంటారో తెలుసా? ఎవడివల్ల ఆ పిల్ల తల్లి కాబోతుందొ అంటారు. అంతమాట నిన్ను మా వాళ్ళు అంటం ఇష్టంలేక నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు లేడీడాక్టర్ దగ్గరకు వెళ్ళటం అత్యవసరం" కిరణ్ చెప్పాడు.
"నీవు మన గురించి మొత్తం మీ అమ్మా నాన్నకు చెప్పానన్నావ్?" అనుమానంగా చూస్తూ అంది అనిత.
"మన ప్రేమ గురించి చెప్పాను. నువ్వుంటే నాకు, నేనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పాను, అంతే కాని పెళ్ళికి ముందే తల్లిని కావటానికి తఃయారుగా వున్నావని చెప్పలేదు. చెబితే నేను ఒప్పుకున్నట్లుగా వెంటనే మా వాళ్ళు అసలు మన పెళ్ళికి ఒప్పుకోరు."
