Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 4

    "ఒకసారి ఆడుతూ ఆడుతూ సీత అవలీలగా శివధనస్సును ప్రక్కన పెట్టినప్పుడు దశరధుడు ఆశ్చర్యపోలు అనుకున్నాడట. సీతలాగే శివధనుస్సును లేపే వాడికే సీతనిచ్చి పెళ్ళి చేయాలని."

    "అవునూ" అంది నిర్లిప్త

    "స్వయంవరంలో రాముడు తప్ప రావణుడు ఎత్తలేకపోయాడు కదా! మరి శివధనుస్సు నెత్తలేని వాడు....అంతటి శివధనుస్సు నెత్తిన సీత నెలా ఎత్తుకెళ్ళిపోయాడు?" అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు నిఖిల్.

    నిర్లిప్త ఆలోచనలో పడింది. వెంటనే తీసుకొని....

    "మీరేదో కత్తిపద్మారావ్ మీటింగుల కెళుతున్నారు. లేకపోతే మీకీ ఆలోచనలేంటి? శ్రీవారి రామాయణం పెడదోవ పట్టింది గాని...లేచి ఆఫీస్ కెళ్ళండి" అంటూ వెళ్ళబోయింది నిర్లిప్త. వెళ్తూనే "బాబోయ్....మళ్ళీ ముట్టుకున్నారు" అని అరచింది నిఖిల్ చేతిలోంచి ఆమె కొంగును లాక్కుంటూ.

    "రామాయణం ఏం ఖర్మ! ప్రేమాయణాన్ని కూడా మూడు ముక్కల్లో చెపుతాను. కూచోవోయ్" అంటూ కొంగులాగాడు.

    "ఏంటో పాపం....?"

    "పట్టె....పెట్టె__పుట్టె."

    "ఛీ.....ఛీ...ప్రొద్దున్నే ఈ బూతు సుప్రభాతం ఏంటి? మీకు ఇరవై నాలుగ్గంటలూ ఇదే గోలా?" అంటూ కొంగు విడిపించుకొని వెళ్ళబోయింది. ఒక్క ఊపుతో మంచం మీదికొచ్చిపడింది.

    "మడిపాడైపోయింది. వెళ్ళి స్నానం చెయ్యాలి....వదలండి" అంది నిర్లిప్త.

    "ఏదీ ఆ మాట మరోసారి అను...." అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.

    "ఏం...తెలుగు సిన్మా డైలాగులా వుందా? ద్వందార్ధం వచ్చేలా" అంది చిరుకోపంగా.
 
    "ఎలాగూ స్నానం చేస్తావ్ కదా! ప్లీజ్....ఒక్కసారి..."అన్నాడు నిఖిల్ బ్రతిమాలుతూ.

    "మీ ప్రవర్తనకు అడ్డూ అదుపూ లేకుండాపోతుంది. మరీ చిన్న పిల్లాడి చేష్టలా ఏమిటిది? ఎవరైనాచూస్తే ఏమనుకుంటారండీ" అంది అతని బందీలోంచి తప్పుకుంటూ.

    "ఎవరూ చూడరులే."

    "ఊహూ....ఓసారి కిటికీ వైపు చూడండి ఎవరు చూస్తున్నారో?" అని నిఖిల్ కిటికీ వైపు చూడగానే చెంగున పూజగదిలోకి పోయింది నిర్లిప్త.
    పూల కుండీల్లోకి నీరు పోస్తూ ప్రక్కింటి రెండో అంతస్తు నుంచి "సుగాత్రి" గమనించటం చూసి ఠక్కున దుప్పట్లోకి దూరిపోయాడు నిఖిల్.

    సుగాత్రి అంటే నిఖిల్ కు భయంతో కూడిన గౌరవం. ఆమె భర్త శరత్ (సుగాత్రి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్) అంటే మరీ గౌరవం. వీళ్ళ చిన్నిల్లు ప్రక్కనే వాళ్ళ పెద్దిల్లు!! అందులోనూ నిఖిల్ ఇంజనీరుగా పనిచేసేది సుగాత్రి ఇండస్ట్రీస్ లోనే. సుగాత్రి, నిర్లిప్తా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా!

    దుప్పటిమీద ఒరిపిడై తలబయటికి తీసి చూసాడు నిఖిల్. ప్రక్కనే నిర్లిప్త!!

    "అలిగి ఆఫీస్ కు ఎక్కడ వెళ్ళరోనని..." అంది అవ్యక్తమయిన ప్రేమతో దగ్గరగా జరుగుతూ. ఆమె గోరింటాకు చేతులు అతని జుత్తులోకి జొప్పించి నిమిరింది. నిఖిల్ ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు.

    "ఏమండీ రేపటికి మన పెళ్ళయి నాలుగేళ్ళవుతుంది...." భారమైన మాటకు నిఖిల్ తలెత్తి ఆమె కళ్ళలోకి చూసాడు ఏదో తీరని వ్యధ? ఆమె కళ్ళలో నిస్సత్తువ నిండిన స్థబ్దత....గుండె కవాటాల్ని తన్నుకొని వచ్చిన ఆవిరేదో ఆమె అందమైన కళ్ళను తడిచేసి నల్లని మబ్బులు!!

    నిఖిల్ కు తెలుసు...ఆ వ్యదంతా పాపకోసమని. పెళ్ళయి నాలుగేళ్ళయినా వాళ్ళకు పిల్లల్లేరు. అదే వాళ్ళను కృంగదీసేది. కొద్ది క్షణాలు వాళ్ళ చూపుల మధ్య నిశ్శబ్ద ప్రతిబింబాలు కన్పించాయి. పిల్లలు లేని లోటు తీర్చుకోవడానికి వాల్లే పిల్లల్లా ప్రవర్తిస్తారు. నిఖిల్ లేని సమయాన నిర్లిప్త....నిర్లిప్తంగా వుండిపోతుంది. నిఖిల్ వచ్చీ రాగానే ఏవో ఫజిల్స్ ని వేస్తాడు. మరేవో పొడుపు కథలు చెపుతాడు చిక్కుముళ్ళు విప్పమంటాడు. ఇదంతా ఆవేదన మరవడానికే! కాని....ఒక్కటయినపుడు వాళ్ళ గుండెలు మవునంగా రోదిస్తాయి. ఆ రోదనకు మూలకారణమైన వేదనే వాళ్ళలో విడదీయరానంతగా బంధాన్ని పెంచుతోంది. ఆమెకు అతడో పసిపిల్లవాడు.....అతనికి ఆమె ఓ ముద్దుల పాప.

    అతని కేరింతలకు ఆమె లాలిస్తుంది. ఆమె అలుగుల్లకు అతడు గోరుముద్దలు తినిపిస్తాడు. అరమోడ్పులవుతున్న నిర్లిప్త కళ్ళను సుతారంగా ముద్దాడాడు నిఖిల్. జలపాతంలా జారిపడుతూ అతని గుండెలపై తలదాచుకుంది. విడివడి వున్న ఆమె నల్లని కురులు నిఖిల్ ని నిక్షిప్తం చేస్తున్నాయి.

    అతని ఛాతి మీద వాలిన మరుక్షణమే ఆమె మౌనంగా ప్రార్ధించేది. నాలుగేళ్ళనించి అదే ప్రార్ధన!! ఇప్పుడూ అదే....

    "అగ్నిసాక్షి అడుగుజాడల్లో చోటిచ్చి ఆదరిస్తున్న మహర్షీ!

    నిప్పులు కడిగే నీ మచ్చలేని జీవితానికి నన్ను దగ్గరగా హత్తుకున్నా.....మచ్చ కనిపించని దూరపు కొండను నేను! బురదలో కల్సిపోయే వర్షపు బిందువును....ఆకాశంలోనే అందుకొని ఆదరిస్తున్న నీ చకోర హృదయానికి నేనేది ఫణం పెట్టను??

    మీ వర్చస్సును నా వక్షస్థలానికానించి తపస్సు చేస్తున్న మీకు వంశాంకురాన్ని అందించని వంచకురాల్ని! ఉషస్సు పొడవాల్సిన మీ వంశానికి తమస్సునై తరలివచ్చి పునఃసృష్టిని ఆపిన పాపాత్మురాలిని!!

    ప్రియతమా....!!

    కేరింతలకోసం__ముద్దుల మూటల కోసం, మీ నిరీక్షణ-నిరీక్షణగానే మిగిలిపోతుందని ఎలా చెప్పను? నా వాళ్ళే ఆ కేరింతలు విన్పించవని....ఆ ముద్దుల మూటలు కన్పించవని ఎలా తెలుపను? వట వృక్షం కావాల్సిన వంశాంకురం నన్ను మనువాడిన్నాడే మసైపోయిందని ఎలా చెప్పను?

    పెళ్ళికి ముందే నా గర్భనాళాలు ముడిపడ్డాయని ఏవిధంగా మీకు తెలియపర్చను? కట్నం కోరల్లో చిక్కి నిస్సహాయ స్థితిలో...ఒక నీచుడి చేతిలో పెట్టడానికి కసాయి తల్లిదండ్రులు గర్భనాళాల్ని కత్తిరించారని నీకెలా బోధించను.??   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS