శీతల్ మాట్లాడలేదు.
"సిగ్గా లేక అప్పుడే నిద్రపట్టిందా?"
శీతల్ చిన్నగా గుర్రుపెట్టింది.
"అయ్యోరామ. ఏం పిల్లవే నీవు! మా కాలంలో పెళ్ళి అనంగానే కంటిమీద కునుకు వుండేది కాదు సాయంత్రంనుంచీ అదేపనిగా పడుకునే ఉంటివి. ఊ...సరేకాని...." మాటను పైకే అని చిన్నగా నిట్టూర్పు విడిచి లేచింది మంచంమీద నుంచి "నీ నిద్రని ఎలా చెడగొట్టాలో నాకు తెలుసులేవే శీతల్!' అనుకుంటూ గదిలోంచి బైటికి వెళ్ళిపోయింది సునందాదేవి.
'అమ్మయ్య పిన్నిగోల వదిలింది' అనుకుంది శీతల్. కాని ఆమె బయటికి వెళ్ళి 'పెళ్ళికూతురుని ఆటలు పట్టిస్తూ సరదాగా ఆ గదిలో ఉండండిరా అమ్మాయిలూ!' అంటూ తన స్నేహితురాళ్ళని పంపిస్తుంది అనుకోలేదు.
సహజంగా శీతల్ రాణి అందాల బొమ్మ. మగాళ్ళు పదే పదే చూశారంటే అర్ధముంది. ఆడవాళ్ళు కూడా తిరిగి చూడటం, కొందరాడవాళ్ళు శీతల్ అందానికి ముగ్ధులు అయితే మరికొందరు తనకి లేని అందం ఆ అమ్మాయి ఎందుకు వుండాలని యీర్ష్యతో దహించుకుపోయేవారు.
ఇప్పుడు శీతల్ బాధ ఆడవాళ్ళ గురించి కాదు మగవాళ్ళు గురించి కాదు. తన పెళ్ళి గురించి. తెల్లవారుఝామున నాలుగు నలభైకి పెళ్ళి నయనబాబుకి భార్య కాబోతున్నది. ఆరునూరయినా నూరు ఆరయినా నయనబాబుతో పెళ్ళి జరగటానికి వీలులేదు. కాని, ఇక్కడ శీతల్ ఇష్టా అయిష్టాలతో పని లేకుండా నయనబాబు భార్య కాబోతున్నది. వక్కతే కూతురని కూడా ఆలోచించకుండా, శీతల్ చెప్పేది వినిపించుకోకుండా ఈ పెళ్ళి కుదిర్చాడు. ఇంక తిరుగులేదు.
ముఖ్యంగా శీతల్ చేసిన ఆ పని గోవర్ధనరావు కంఠంలో ఇరుక్కున్న ముల్లులా వుంది. చేసిన వెధవ పని నుంచి శీతల్ ని తప్పించాలి అంటే నయనబాబుకిచ్చి పెళ్ళి చేసి ఇరువురిని ఫారెన్ వెంటనే పంపించాలి.
శీతల్ కి ఇష్టంలేని పెళ్ళి ఇది. ఏదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు. శీతల్ పిరికి పిల్లకాదు కాబట్టి ఆత్మహత్య లాంటి పనులు చేసుకోకపోవచ్చు. శీతల్ తెలివికలది. చేప పిల్లలాంటిది. జరిగేది బలవంతం పెళ్ళి కాబట్టి నీటిలో పిల్లలా జారిపోయినా జారిపోతుంది.
శీతల్ సంగతి బాగా తెలిసిన గోవర్ధనరావు నలువైపులా రక్షణ కవచాల్లా కొందరు మనుషులను నియమించాడు. కొందరైతే పెళ్ళివారిలో కలసి నౌకర్లు తిరుగుతున్నారు.
శీతల్ ఆత్మహత్య చేసుకో దల్చుకోలేదు. ఇంట్లోంచి పారిపోవాలి ఈ పెళ్ళి జరగనందుకు, పెళ్ళి కూతురు మాయమయినందుకు గోవర్ధనరావుకి పెద్ద అవమానం పెళ్ళి కొడుకు వారి తాలూకా వాళ్ళు గోల చేస్తారు. అంతా రసాభాస అవుతుంది. అయినా సరే పెళ్ళి జరగటానికి వీలులేదు.
తండ్రి ముందు జాగ్రత్తతో తెలివిగా ఎన్ని ఏర్పాట్లు చేశాడో శీతల్ కి తెలుసు. తను లేచి ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు తన ప్రతి చర్య వేయికళ్ళు అనుక్షణం గమనిస్తాయని శీతల్ కి తెలుసు.
ఏం చేయాలి?
శీతల్ చాలా తెలివిగా ఆలోచించి మాంచి పథకం పన్ని ఒకే ఒక పని చేసింది. అది సక్సెస్ అయితే చిక్కు లేదు. ఓ వేళ కాకపోతే నయనబాబుకి భార్య కావటం ఖాయం. పెళ్ళి ముహూర్తానికి ఇంక కొద్ది గంటలు మాత్రమే సమయం వుంది. నిమిషాలు గడుస్తున్న కొద్దీ కాలం తరుగుతున్నదిగాని పెరగటం లేదు.
తన పథకం పారుతుందా పారదా!
శీతల్ కి ఇదే ఆలోచన.
సక్సెస్ అయితే ఫరవాలేదు. కాకపోతే ఏమిటి చెయ్యాలి?
ఏం చేయాలో అర్ధంగాని పరిస్థితిలో తల బద్దలవుతున్నది శీతల్ కి. పెళ్ళికూతురు అయినా, మరోపక్క పెళ్ళి హడావిడితో ఇల్లంతా బంధుజనంతో కిక్కిరిసివున్నా శీతల్ కి పట్టలేదు. నిద్ర; తలనొప్పి పన్నుపోటు చెవిపోటు ఈ పెళ్ళి ముహూర్తం వారం క్రితం నిర్ణయించిన దగ్గర నుంచి శీతల్ కి ఇలాంటి వంకలు ఏదో వకటి చెప్పడం, మూడంకెవేసి పడుకోడం జరుగుతున్నది.
శీతల్ తమ్ముడు చందన్ అమెరికాలో చదువుతున్నాడు. వారం క్రితమే నిశ్చితార్ధం తాంబూలలు పుచ్చుకున్న అక్క పెళ్ళికి అతను రావడానికి కూడా లేదు. శీతల్ పెళ్లి అయిన నాలుగో రోజు వీళ్ళే అమెరికా వెడతారు కాబట్టి చందన్ రాలేదన్న సమస్య లేదు ఆ ఇంట్లో జరిగే ఒకే ఒక ఆడపిల్ల పెళ్ళి వున్నది ఒక్క తమ్ముడూ అయినా వీలుకానప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు?
స్నేహితులకి, బంధువులకి ఎవరికీ అర్ధం కానిది ఒకటే ఒక్కటుంది. గోవర్ధనరావు వారం గ్యాప్ పెట్టి కూతురు పెళ్ళి ఎందుకు నిశ్చయించాడు? ఇంత అర్జంటు ఏమొచ్చింది?
హితులు, సన్నిహితులు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని గోవర్ధనరావుని అడిగారు.
"పిల్లవాడు, వాళ్ళ సంప్రదాయం అన్నీ మంచి నయనబాబుకి అమెరికాలో చాలా పెద్ద పోస్ట్ లో, డైరెక్టర్ హోదాలో జాబ్ వచ్చింది. రెండేళ్ళలో మిలియనీర్ అయిపోతాడు. జాబ్ లో చేరింతరువాత ఏడాది దాకా ఇండియా రావడానికి లేదు. అతను అమెరికా వెళ్ళేది పై వారమే. వాళ్ళు శీతల్ ని ఇష్టపడ్డారు. మేము ఇష్టపడ్డాము. ఇంత మంచి సంబంధం వదులుకుంటే మళ్ళీ దొరకవద్దా!"
