"పైన ఓ రూమ్ ఖాళీగా వుంది" వెంటనే చెప్పాడు సురేంద్రనాధ్.
"రూమ్ ఖాళీగా వుంటే మరీ మంచిది. వెడదాం పదండి."
"కూల్ డ్రింక్ ఏదైనా...."
"అవసరం లేదు పదండి"
సురేంద్రనాధ్ కుర్చీలోంచి లేచాడు. సరీగా అప్పుడే నయనబాబు అక్కడికి వచ్చాడు.
"డాడ్! వీళ్ళు ఆడపెళ్ళివారి తాలూకా కాదు కదా!" భయం నటిస్తూ తమాషాగా అడిగాడు నయన బాబు.
"మేము ఏ పెళ్ళివారము కాదు. బిజినెస్ లో మీ డాడీ పాత మిత్రులం" సి.బి.ఐ. అధికారులలో ఒకతను చెప్పాడు.
అబద్దం కూడా అతికినట్లు ఆడారు అన్నట్టు మెచ్చుకోలుగా వాళ్ళని చూస్తూ "వీడొక్కడే నాకు అబ్బాయి. ఇప్పుడు జరిగే పెళ్ళి వీడిదే. పేరు నయన బాబు" చెప్పాడు వీరేంద్రనాథ్.
తండ్రికి వాళ్ళు పాత మిత్రులు అయినప్పుడు తను వక్కడే కొడుకున్న పరిచయం దేనికి? అన్న ఆలోచన నయనబాబుకి రాలేదు.
"నయన్! నేను వీళ్ళతో కొద్దిగా మాట్లాడాలి. పైకి ఎవరూ రాకండి" అని కొడుకుతో చెప్పి, "పదండి అంటూ మెట్లవైపు దారితీశాడు సురేంద్రనాథ్.
"అలాగే డాడ్!" అంటూ నయనబాబు మిత్రుల దగ్గరకు వెళ్ళాడు.
సురేంద్రనాథ్ మేడమీద ఓ పక్కగా వున్న రూమ్ లో కాలుపెట్టాడు. "రండి" అంటూ ఆ ముగ్గురు ఆహ్వానించాడు.
ముగ్గురూ లోపలికి వెళ్ళారు.
"మన మాటలు ఎవరయినా వినే అవకాశం వుంది సి.బి.ఐ. అధికారి ఒకతను అడిగాడు.
"ఎందుకు?" సురేంద్రనాథ్ అనుమానంగా అడిగాడు.
"మీరు మమ్మల్నే అనుమానిస్తున్నారా!"
కంగారు కప్పిపుచ్చుకుంటూ "లేదు లేదు మామూలుగా అడిగాను" అన్నాడు సురేంద్రనాథ్.
"ఎందుకంటే ఇది పరువు, మర్యాదకి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు చెప్పండి. మన మాటలు ఎవరయినా వినే అవకాశం వుందా!" సి బి ఐ అధికారి విషయం చెప్పి మళ్ళీ అదేమాట అడిగాడు.
"లేదు" సురేంద్రనాథ్ చెప్పాడు.
"గుడ్ ముందీ విషయం ముఖ్యంకాదు. ఈ మేటర్ చదవటం ముఖ్యం. అప్పుడు మేము చెప్పేది మీకు అర్ధమవుతుంది." అంటూ సి బి ఐ అధికారి కోటు జేబులోంచి మడతలు పెట్టబడ్డ కాగితంతీసి సురేంద్రనాథ్ కి ఇచ్చాడు.
ఆ కాగితం పేపరు కటింగు.
సురేంద్రనాథ్ పేపరు కటింగులో వున్న మేటర్ చదవటం మొదలుపెట్టాడు.
ఆ మెటరంతా ఒక హత్యా గురించి విపులంగా వుంది. పూర్తిగా హత్యకు సంబంధించినది.
అది చదువుతున్న సురేంద్రనాథ్ ముఖం పాలిపోయింది.
వాళ్ళు ముగ్గురూ చూస్తూ కూర్చున్నారు.
* * * *
"శీతల్ రాణీ, ఓ శీతల్ రాణీ!"
గోడవేపు ముఖంపెట్టి అటుతిరిగి బెడ్ మీద పడుకున్న శీతల్ ఇటు తిరక్కుండానే స్వరం ఎవరిదో గుర్తించి "ఊ" అని మాత్రం అంది.
"నిద్రపోతున్నావా?" మంచంమీద కూర్చుని అడిగింది సునందాదేవి.
"ఊ" అంది మరోసారి శీతల్.
"తొమ్మిది గంటలకే నిద్ర ఏమిటి?"
"నిద్రవస్తుంది పిన్నీ!" శీతల్ ఇటు తిరగకుండానే నెమ్మదిగా జవాబు ఇచ్చింది.
"పది సూర్యుళ్ళు వక్కసారిగా పొడిచినట్లు ఇల్లంతా లైట్లతో పట్టపగలులాగా వుంది. మరో పక్క పెళ్ళిజనంతో కళకళలాడి పోతున్నది. పెళ్ళికూతురు అనంగానే యెవరో ఒకరు చూసి వెళుతుంటారు. పడుకుంటే బాగుంటుందా?" సునందా దేవి మెడలో వున్న పిల్లకాసులపేరుని సవరించుకుంటూ అడిగింది.
నన్ను ఆలోచించుకోనివ్వరు, ఏడ్వటానికి టైము ఇవ్వరు, కనీసం కాసేపు వంటరిగాకూడా వుండనివ్వరు. అనుకున్న శీతల్ పిన్ని గుణం బాగా తెలుసు కాబట్టి తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో "ఏం చేయనుపిన్నీ! కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నాకు మాత్రం నిద్రపోవటం సరదానా!" అంది.
"కళ్ళు మూతలుపడితే చల్లటి నీళ్ళతో కడుక్కుని రా!"
"ఆ పని చేశాను."
"ఎలాగో అలా మేలుకోవాలి. చూసినవాళ్ళు ఏమనుకుంటారు. పన్నెండు గంటలదాకానన్నా మేలుకుంటే ఆ తర్వాత ఓ గంట నిద్రపోవచ్చు. తెల్లవారుఝామున పెళ్ళి అంటే ఇంతేమరి. రాత్రంతా నిద్ర ఉండదు."
"ఎలాగూ రాత్రంతా నిద్ర ఉండదు. అందుకే పడుకున్నాను."
"నిద్ర ఉండదుకదా అని పడుకున్నావు సరే, నిన్ను చూడటానికి మగపెళ్ళివారిలో ఎవరో ఒకరు వచ్చి చూసి వెళుతున్నారు. పెళ్ళికూతురు పడుకున్నదీ అంటే వాళ్ళు ఏమనుకుంటారు! అపార్ధం చేసుకున్నారూ అంటే మళ్ళీ అదోగోల. నీవు పడుకున్నా పని అక్క చెప్పింది. లేపి కాసేపు కబుర్లు చెపుదామని వచ్చాను. పోనీ నయన్ బాబుని రమ్మననా ఏమిటి?" నవ్వుతూ అడిగింది సునందాదేవి.
