Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 3

    "రమా!" భారమైన నిట్టూర్పు.

    "ఎండిపోయిన ఏ గుండెల్లో...చిగుళ్ళు పూయిస్తానని నువ్వెళ్ళి పోయావ్....

    నీ గొంతులో కోయిల ఆత్మాహుతి చేసుకున్నా....ఏవో అనురాగాలు విన్పిస్తున్నాయి!

    నీ సమాధి మీద నా నెత్తుటి చమురుతో సమిధలు పెట్టి...ఏ త్యాగాలతో నిన్ను అలంకరించను...?

    నిశ్శబ్దమై శాసించకు....

    సముద్రమై ఘోషింషకు....

    నీ ఆధరాల్లో నవ్వుల్ని చిగురిస్తూ....నా నయనాల్లో 'నయగరా'ల్ని దూకించకు!

    శృతి కుసుమాలన్నీ....చితి భస్మాలయ్యాయి నేస్తమా!"

    ఆమె జ్ఞాపకాలుకవితారూపంగా చిమ్ముకురాగానే కన్రెప్పల గుమ్మంలో రెండు నీటి బొట్లు కాపలా కాస్తాయి.

    భార్గవ భార్య జ్ఞాపకాలలో తడుస్తూనే...లైటార్పి బాబిగాడి ప్రక్కనే పడుకున్నాడు. రెప్పల చిప్పలు బరువుగా నిద్రను మోసుకొస్తుంటే అతనికి చప్పున గుర్తొచ్చింది.

    ఈ సృష్టిలో ఏ భక్తుడూ ఏ భగవంతుణ్ణి కోరని కోరిక!

   
                                        2


    పొద్దున్నే లేచి పూజ ముగించుకొని హారతి తీసుకొని బెడ్ రూంలోకి వెళ్ళింది నిర్లిప్త!

    నిర్లిప్త అడుగుల చప్పుడు విని మళ్ళీ ముసుగు తన్నాడు నిఖిల్.

    "కమలా కుచ చూచుక కుంకుమతో - నియతారుణి తాతుల నీలతనో విజయీ భవ వేంకట శైలపతే!"

    "అబ్బో...! దుప్పట్లో సుప్రభాతం చాలుగాని....లేచి హారతి తీస్కోండి" అంది నిర్లిప్త.

    "సుప్రభాతం కాదోయ్...మన తెలుగు సిన్మాలని మించిన బూతుపాట" అన్నాడు నిఖిల్ దుప్పటి తీయకుండానే.

    "చాల్లెండి! భగవంతుడికి కోపం వస్తుంది. సుప్రభాతాన్ని బూతుపాటంటారేమిటి? ఈ రోజు శనివారం తెల్సా?" అంది నిర్లిప్త చిరుకోపంగా.

    నిఖిల్ ఠక్కున దుప్పటి తీశాడు.

    మంచులో తడిసిన ముద్ద మందారపు పువ్వులా....నిండుదనంతో....భూగ్రహంలాంటి కళ్ళ గోళాల మధ్య ఉదయిస్తున్న సూర్యబింబంలాంటి బొట్టు...దాని కిందే మరో చిన్న కుంకుమ బొట్టు_జాలువారిన వెంట్రుకల్లోంచి ఇంకా జలతారు బిందువులు జారిపడుతున్నాయి.

    నిఖిల్ కొద్దిక్షణాలు మైమరచి చూశాడు నిర్లిప్తని. అంతలోనే తేరుకొని....

    "బూతుపాట కాక మరేంటి? ఓ శ్రీ వెంకటేశ్వర స్వామీ! రాత్రంతా నీ భార్య స్థనాల రాపిడికి వక్షస్థలం ఎర్రబడిన ఎర్రబడిన వాడా.....నిద్రలేవూ అనిదానర్ధం" అన్నాడు.

    "ఛీ....రోజు రోజుకూ మీకు సిగ్గులేకుండా పోతుంది. ఏమిటా మాటలు. కొంపదీసి ఉద్యోగం మానేసి ఏదయినా హేతువాద సంఘంలాంటి బూతువాద సంఘంలో గాని కల్సిపోయారా ఏంటి?"

    అలా అంటూనే నిర్లిప్త కెవ్వున అరిచింది.

    "అయ్యో! ఈరోజు శనివారమండి....ముట్టుకోవద్దు...ప్లీజ్ విడవండీ!" అంటూ దూరంగా జరిగింది.

    "మళ్ళీ మడి కట్టుకుందువుగాని....ఇలా రావోయ్! నీలాంటి చాలా మంది ఆడవాళ్ళకు తెలీదు. మగవాళ్ళు తెల్లవారుజామునే టెన్షన్ లో వుంటారని..."

    "బాగానే వుంది చోద్యం....మడికట్టుకొని బెడ్ రూంలోకి రావటం నా తప్పు. ముందు హారతి తీస్కోండి. బాబు పుట్టాలని కోరుకోండి."

    "అయినా నాకు తెలీక అడుగుతాను! నువ్వు  ఆదివారం లక్ష్మీపూజని, సోమవారం...ఇంకో పూజని....ఇలా రోజూ మడికట్టుక్కూర్చుంటే బీరకాయ పీచులెక్కడి నుండి వస్తాయ్" అన్నాడు నిఖిల్.

    "లేత బెండకాయలాంటి మీరుండగా ఇప్పుడే బీరకాయలెందుకు చెప్పండి...ఈ రోజు టిఫిన్ చేయలేదు. హోటల్లో చేసి ఆఫీస్ కెళ్ళండి....అన్నట్టు ఈ రోజు బీరకాయ వండనా? బెండకాయ వండనా?" అని నిర్లిప్తమరింత దూరం జరిగింది.

    "కాకరకాయ పండు..." అన్నాడు నిఖిల్ కోపంగా.

    "కాకరకాయ కాదు....నూతన విద్యా విధానం ప్రకారం కీకరకాయ్ అనాలి" అంది నిర్లిప్త నవ్వుతూ.

    నిఖిల్ కోపంగా మళ్ళీ దుప్పటి ముసుగు తన్నాడు. నిర్లిప్త హారతి ప్రక్కన బెట్టి మంచం మీదికి వంగింది.

    "నిఖిల చక్రవర్తీ! శ్రీరామచంద్రా! రేపు మన మారేజ్ డే కదా! ఈ శ్రీమతి కోసం ఏ లేడి పిల్లనయినా ప్రెజెంట్ చెయ్యరూ...." అంది గోముగా.

    "లేడి పిల్లను పట్టుకొచ్చాక సవితిపోరు ఎక్కువయితే నన్నేం అనొద్దు" అన్నాడు నిఖిల్ దుప్పట్లోంచే.

    "లేడి పిల్లంటే ఆడపిల్ల కాదు! ఈమధ్య మీ బుద్దులు పెడదోవ పడుతున్నాయి నాకు తెల్సు" అంది నిర్లిప్త కోపంగా.

    నిఖిల్ దుప్పటి తొలగించాడు. మళ్ళీ ఎక్కడ ముట్టుకుంటాడోనని కాస్త దూరంగా జరిగింది నిర్లిప్త.

    "అవునూ...లేడిపిల్లంటే గుర్తొంచ్చింది. రాముడు లేడిపిల్ల కోసం వెళ్ళిం తర్వాతే గదా రావణుడు పీతనెత్తుకెళ్ళింది" అన్నాడు ఏదో అనుమానంగా.

    "అబ్బో! శ్రీవారికి రామాయణం కూడా వచ్చే-" అంటూ ఇంకొంత దూరం జరిగింది. నిర్లిప్తకు తెలుసు...మాటల్లో మభ్యపెట్టి గబుక్కున వాటేసుకుంటాడని.

    "అవునా?"

    "ఊ" అంది నిర్లిప్త.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS