Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 3


    రెండు నిముషాల తరువాత "నువ్వు నువ్వేనా" కిరణ్ అడిగాడు.
    "నేను, నేనే" కదలి ముందుకు అడుగు వేస్తూ అంది అనిత.
    అప్పటికప్పుడే తన నిర్ణయం మార్చుకున్నాడు కిరణ్ క్షణాలలో నిర్ణయాలు మార్చుకోవటం కిరణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే జరిగింది.
    కిరణ్ అనితను చేతుల్లోకి తీసుకుని పైకెత్తి గిర గిర తిప్పి కిందకు దించాడు.
    అతను చేసిన పని అనితకి వచ్చింది. కిరణ్ తన ప్రశ్నకి "పండు" అని జవాబు ఇవ్వబోతున్నాడు అని గ్రహించుకుంది. అయినా ఆ సంతోషాన్ని అంతరంగపు అట్టడుగు పొరల్లో దాచుకుని, నీ తీరుని చూస్తుంటే చంపేసేటట్టున్నావు బాబూ విసుగుని ప్రదర్శిస్తూ కావాలని అంది.
    "నేను అదే అనుకుంటున్నాను, ముద్దులతో మరి పిడిగుద్దులతోనా" అన్నాడు కిరణ్.
    "ఆ విషయం తరువాత చెప్తాను. ముందీ విషయం చెప్పు కాయా, పండా?"
    "పండుకాయ" అన్నాడు కిరణ్.
    "లాభంలేదు, నువ్వేదో నాటకం ఆడుతున్నావు" అని మూతి ముడుచుకుని కూర్చుంది అనిత.
    కిరణ్ కాసేపు అనితను బ్రతిమలాడాడు. అయినా అనిత కరగలేదు. నిజం అపుడే చెప్పదలచుకొని కిరణ్ వచ్చిన అవకాశాన్ని విడుచుకోలేక అనిత చెవిలో గుస, గుస లాడుతూ పండు, పండు, పండు అని రామనామ జపంలా అనసాగాడు.
    "నిజం!"
    "నిజం పండూ" అన్నాడు కిరణ్.
    "వెంటనే కిరణ్ బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది అనిత.
    "మరొకటి" తన్మయంగా అన్నాడు కిరణ్.
    "అంత ఆశ పనికిరాదు అబ్బాయీ" అంది అనిత.
    "పనికి రాదా"
    "పనికి రాదు."
    "అయితే ఇప్పుడేం చేద్దాం?"
    "ఏమీ చెయ్యక్కర లేదు మహానుభావా, మీ యింట్లో పొమ్మన్నారు, ఏమిటి, అన్నీ వివరంగా చెప్పు. ఆ తరువాత నీ ఇష్టం. నలిపిపారేస్తావో, నంచుకుతింటావో!" గోముగా అంది అనిత.
    "జరిగింది జరిగినట్టు చెప్పనా?"
    "లేదు మసాలాలు చేర్చి చెప్పు."
    "అయితే డ్యూయట్లు కూడా వుంటే బాగుంటుందేమో!"  
    "నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు కిరణ్"
    "అవును సుమా! నీ మాత్రం ఇంగిత జ్ఞానం నాకు లేకపోయింది. రంభను ప్రక్కనపెట్టుకుని కొంబు చెంబు వేషాలు వేస్తున్నాను."
    "అదిగో మళ్ళీ ఇలా అయితే నే వెళ్ళిపోతాను."
    "వద్దు, వద్దు చెప్పేస్తాను."
    "ఊ" అంది అనిత.
    కిరణ్ ఒకసారి గొంతు సవరించుకుని చెప్పటం మొదలు పెట్టాడు.
    ఇంటికి వెళ్ళాను సమయానికి డాడీ, మమ్మీ ఏదో సీరియస్ విషయం చర్చించుకుంటున్నారు. నీ తల రాత టైము బావుండలేదు రా తండ్రీ అనుకుంటూ అప్పుడు మన విషయం చెప్పలేదు. మీల్స్ తరువాత ఇంటిముందు లాన్ లో కూర్చుని మమ్మీ డాడీ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వీలైతే చెబుదామని నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కొద్దిపాటి వెన్నెల, చల్లని గాలి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వుంది. దానికి తోడు మమ్మీ డాడీ ఏదో విషయం చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఇదే సరయిన సమయం వాతావరణం బావుంది.
    నెమ్మదిగా మమ్మీ డాడీలను మాటలలోకి దింపాను. ఎవరి విషయమో అన్నట్టుగా మన ప్రేమ కథనే కాస్త అటూ ఇటూ మార్చి చెప్పి అభిప్రాయం అడిగాను. ఆ పరిస్థితులలో అమ్మాయిని అన్యాయం చెయ్యకూడదు అన్నారు ఇరువురు. నాకు ఎంత సంతోషం వేసిందో చెప్పలేదు. ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను! డాడీ, మమ్మీ మీరిరువురు ముక్కు సూటిగా సమాధానం చెప్పాలి. అలా చెప్తాను అంటేనే చెబుతాను అన్నాను.
    ముందుగా డాడీ "చెప్పవోయ్" అన్నాడు మేము వింటానికి రెడీగా వున్నాము, నీదే ఇక ఆలస్యం అంది మమ్మీ.
    "ఇంతకు ముందు నే చెప్పిన పరిస్థితి నాకేవస్తే మీరేం నిర్ణయం తీసుకుంటారు?" అని అడిగాను.
    మమ్మీ నా మాటలను తేలికగా తీసుకుంటూ "వచ్చి నప్పుడు చూద్దాంలే" అని అంది. "ఆల్ రెడీ వచ్చేసిందేమో" డాడీ చిరునవ్వుతో అన్నారు.
    మమ్మీ డాడీ అలా అనంగానే నాకు ఎక్కడలేని తెగింపు వచ్చింది. "ఎస్, డాడీ! నేను ఆ పరిస్థితులలోనే వున్నాను" అంటూ సీరియస్ గా చెప్పాను.
    "అయితే ఆలస్యం ఎందుకు ఆ అమ్మాయిని తీసుకురా వెంటనే పెళ్ళి చేసేస్తాం!" అన్నారు డాడీ.
    "ఆలస్యం అమృతం విషం. ఇప్పుడే వెళ్ళి తీసుకురా" అంది మమ్మీకూడా.
    "నిజంగా ఇప్పుడే వెళ్ళి తీసుకురానా?" లేస్తూ అన్నాను.
    "అయితే నువ్వు చెప్పింది నిజమేనన్నమాట" మమ్మీ ఆశ్చర్యంగా అడిగింది.
    "ప్రామిస్, మమ్మీ నే చెప్పినదాంట్లో రవ్వంత కూడా అబద్దం లేదు" అన్నాను నేను.
    "అయితే ఇది తమాషా కాదన్నమాట" మమ్మీ అంది.
    "అయితే ఇది నిజంగా నిజమేనన్నమాట!" డాడీ అన్నారు.
    "నిజంగా నిజం ముమ్మాటికీ నిజం" అన్నాను.
    "చాలా ఘనకార్యమే చేశావన్నమాట!" వెంటనే డాడీ అందుకుని "గొప్ప గ్రంథసాగుడివి అయ్యావన్న మాట" అన్నారు.
    "ఇంతలోనే ఇంతమార్పా? ఆశ్చర్యపోతూ మీ రిరువురు నాటకం ఆడటం లేదుకదా!" అన్నాను.
    "లేదు! ఆ అవసరం మాకులేదు. నువ్వు తమాషాగా చెబుతున్నావనుకుని మేమూ తమాషాగా అన్నాము. వాస్తవం ఇది అని తెలిస్తే...? అన్నాడు డాడీ.
    "జరిగింది నాకు అర్ధమయిపోయింది. ఇంతవరకు మమ్మీ డాడీ నా మాటల్ని తమాషాగా తీసుకున్నారన్న మాట! వెళ్ళేలా తీసుకున్నా నా కనవసరం. నా వల్ల నీకు అన్యాయం జరుగకూడదు అనుకున్న నేను, స్థిరంగా, గట్టిగా నా అభిప్రాయం చెప్పేశాను. ఒకవేళ మీరు కాదంటే నాకు ఈ ఇంట్లో స్థానంలేదంటే నిర్భయంగా బయటకు వెళ్ళిపోతాను. అంతేకాని నన్ను నమ్ముకున్న ఆ అమ్మాయిని మటుకు మోసం చేయను అని చెప్పాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS