Previous Page Next Page 
అష్టపది పేజి 3


    
    "అన్ని మర్యాదలు చక్కగా జరుగుతున్నాయి. ఇలా మాటిమాటికి ఎవరో ఒకరువచ్చి అది కావాలా, ఇది కావాలా? ఏదన్నా కావాలంటే అడగండి క్షణాల్లో తెచ్చి యిస్తాము ఏర్పాటు చేస్తాము అంటూ మమ్మల్ని మధ్యలో డిస్ట్రర్బ్ చేయకండి. అలా అయితే మేము మర్యాద లోపించింది అనుకోవలసి వస్తుంది" ఇద్దరిలో ఓ అమ్మాయి ముఖం చిట్లించి చెప్పింది.
    
    "సారీ!" అని చెప్పి ఇవతలికి వస్తూ అనుకుంది బిందియా 'ఈ సమయంలో పందిట్లో పెళ్లవుతున్నది వరకు కరెక్టు కన్నీరే కురియుచున్నది ఏమిటి! వీళ్ళ ముఖం సరదా అయిన పాట పెట్టుకొని...'
    
    "చూడండి మిస్!"
    
    ఎవరో పిలిచినట్టయి ఆలోచిస్తూ వాకిలిదాకా వచ్చిన బిందియా తలయెత్తి చూసింది. ఎదురుగా ఇద్దరు మగవాళ్ళు, ఓ పెద్దావిడా కనిపించారు.
    
    మగపెళ్ళివారి తాలూకా శాల్తీలు కావచ్చు ననుకొని చకచక అడిగేసింది- "ఏమన్నా కావాలా చెప్పండి. చిటికెలో ఏర్పాటు చేస్తాము" చిటికవేసి మరీ చెప్పింది బిందియా.
    
    "పెళ్ళికొడుకు తండ్రి ఎక్కడున్నారు?" ఒకాయన అడిగాడు.
    
    'ఈయనగారు పెళ్ళికొడుకు తండ్రిని అడుగుతున్నారంటే అర్ధం ఏమిటబ్బా! మగపెళ్ళివారి తరపున వచ్చిన వాళ్ళు కాదా ఆడపెళ్ళి తరఫునవాళ్ళు అయితే నాకు తెలుస్తుంది. ఆడాకాక, మొగాకాక....! ఓహో పెళ్ళి కుమారులంగారి తండ్రిగారి మిత్రుడు గారు కావచ్చు కదా! అయినా ఆడపెళ్ళివారు ఎంతలో వుండాలో అంతలోనే వుండాలని ఇందిరా ఆంటీ చెప్పారు కదా!' అనుకున్న బిందియా అటూ ఇటూ కలయచూసి "అక్కడ కుర్చీలో కూర్చుని పేపరు తిరగేస్తున్నారు చూశారా ఆయనే సురేంద్రనాథ్ గారు" అటూ చేయి చాచి చూపించి "మరి నేను వెళ్ళనాండీ!" వినయంగా అడిగింది.
    
    "అయితే నీవు ఆడపెళ్ళివారి తరఫు అమ్మాయివన్న మాట!" వచ్చిన ఆమె అడిగింది.
    
    "అవునండి నన్ను కూడా మీతో రమ్మంటారా! ఏదన్నా కావాలన్నా, మర్యాదలు చేయాలన్నా..."
    
    "అక్కరలేదు నువ్వు వెళ్ళవచ్చు."
    
    "మరి కొద్దిసేపు ఆగి వస్తాలేండి" అంటూ బిందియా ఇవతలికి వచ్చేసింది.
    
    "రాజమణీ! అధిక ప్రసంగం చేయొద్దు" వచ్చిన మగవాళ్ళలో ఒకతను అన్నాడు.
    
    "దేదీప్యమానంగా రంగు రంగులతో కాంతులు వెదజల్లుతున్న ఈ లైట్ల తోరణాలని చూసేసరికి రాజమణికి పెళ్ళికి వచ్చినట్టు వుంది" రెండో అతను నవ్వుతూ అన్నాడు.  

 

    రాజమణి నవ్వింది.    

 

    ముగ్గురు కలసి పెళ్ళికొడుకు తండ్రి సురేంద్రనాథ్ దగ్గరకు వెళ్ళారు.
    
    "అన్నీ సరిగ్గా అందుతున్నాయో లేదో కనుక్కోడానికి ఈ తఫా ఏకంగా ముగ్గురుని పంపించాడా మా వియ్యంకుడు?" తన దగ్గరగా వచ్చి నిలిచిన ఆ ముగ్గురినీ చూస్తూ నవ్వుతూ అడిగాడు సురేంద్రనాథ్.  

 

    "మేము ఆడపెళ్ళివారి తరఫున వచ్చిన వాళ్ళం కాదు."
    
    "మరి?...."
    
    "మీతో పనివుండి వచ్చాము."
    
    "పనా! అంటే?"    

 

    "మీతో సీక్రెట్ గా మాట్లాడాలి" వచ్చినతను స్వరం తగ్గించి చెప్పాడు.
    
    "నాతో సీక్రెట్ ఏమిటి? జోక్ చేస్తున్నారా?" ఆ మాట వినంగానే లోలోపల కంగారుగా వున్నా, పైకి చిరునవ్వు వెదజల్లుతూ అడిగాడు సురేంద్రనాథ్.
    
    "దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడండి. పెళ్ళి కొడుకు తండ్రి కాబట్టి ఈ విషయం మీతోనే సంప్రతించడం మంచిదని సరాసరి మీ దగ్గరకు వచ్చాము."    

 

    "మీ రెవరో నాకు తెలియదు. ఏమైనా విషయముంటే తర్వాత మాట్లాడుకుందాము."    

 

    "అఫ్ కోర్స్ మీరు మాత్రం మాకు తెలుసా? యమర్జెన్సీ కాబట్టి వెంటనే వచ్చాము. అర్జంట్ గా మాట్లాడాలి."
    
    సురేంద్రనాధ్ గట్టివాడు అయినా అపరిచిత వ్యక్తులు అకస్మాత్ గా ముగ్గురు వచ్చి అర్జంట్, సీక్రెట్ యమర్జన్సీ అంటుంటే కాస్త గాభరాయే అనిపించింది తెల్లవారుఝామున జరగబోయే తన కొడుకు పెళ్ళి వెనుక కుంభకోణం, లావాదేవీలతో కూడింది గోవర్ధనరావు తనూ చేయి చేయి కలిపారు. అంతవరకే సీక్రెట్. మధ్యలో వీళ్ళెవరు? ఇందులో ఏమైనా...
    
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" వచ్చిన వాళ్ళలో ఒకతను అడిగాడు. అతను ఆకారానికి గాంభీర్యంగా వున్నాడు మాట అలాగే వుంది.
    
    "ఇంతకీ మీ రెవరు?" సురేంద్రనాథ్ అడిగాడు.
    
    "ఇప్పుడే చెప్పాలా?"
    
    "ఊ..."
    
    అతను కోటు జేబులోంచి ఐడెంటిటీ కార్డ్ తీసి చేతిలో వుంచుకుని చూపించాడు.
    
    "సి.బి.ఐ!" అది చూసి భయంతోను, ఆశ్చర్యంతోను నోరు తెరిచాడు సురేంద్రనాథ్. 

   
    "ఎస్." అన్నాడు అతను ముక్తసరిగా.
    
    "నేను....నేను.....ఏ నేరము చేయలేదు. పైగా సమయంలో...."
    
    "మిస్టర్ సురేంద్రనాథ్! మీరు నేరం చేశారని మేము రాలేదు. మీతో మేము ఒంటరిగా మాట్లాడాలి మీ పక్కన ప్రస్తుతం ఎవరూ లేరు. మనం మాట్లాడుకుంటుంటే ఎవరైనా రావొచ్చు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. మనం బైటికి వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది. లేక వీలైతే మరో పనిచేయవచ్చు గదిలోకి వెళ్ళి ఇక్కడే మాట్లాడుకుందాం."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS