Previous Page Next Page 
అష్టపది పేజి 2

 

    ఇందిరారాణి మాట పూర్తి కాకముందే "ఆంటీ! ఇక్కడ వున్నవా! కల్పనా అయ్యర్ వచ్చింది. నీవెక్కడున్నావని అడిగింది అదేమిటి అంకుల్! పడుకున్నారు?" అంటూ బిందియా లోపలికి వచ్చింది.
    
    "కల్పనా అయ్యర్అయ్యర్ వచ్చిందా? పద పద" అని భర్త వేపు తిరిగి "వెళ్ళి నేను చెప్పింది చేయండి" అంటూ హడావిడిగా లేచి పట్టుచీర సవరించుకుంటూ గదిలోంచి వెళ్ళిపోయింది.
    
    "ఆంటీ ఏంటి అంకుల్! మీకు పని చెప్పి వెళ్ళింది?" బిందియా అడిగింది.  

 

    "మగ పెళ్ళివారు వున్న విడిదికి వెళ్ళి అన్నీ సవ్యంగా అందుతున్నాయో లేదో కనుక్కోవాలిట. ఎక్కడి కక్కడ అన్ని ఏర్పాట్లు చేశానా, అయినా అలా వెళ్ళికనుక్కోవడం ఆడపెళ్ళివారి మర్యాదట అదీ విషయం. నాకేమో బద్దకంగా వుంది. మీ ఆంటీ ఏమో హుకుం జారీచేసి పోయింది" గోవర్ధనరావు పడుకున్న చోటునుంచి అర అంగుళం అటూ యిటూ కదలనైనా కదలకుండా చెప్పాడు.
    
    "ఓ పని చేస్తే ఎలా వుంటుంది అంకుల్?" బిందియా అడిగింది.
    
    "ముందు ఆ పని ఏమిటో చెప్పు!"
    
    "నేను ఆడపెళ్ళివారి తరపుదాన్నే కదా మీ బదులు నేను ఓసారి వెళ్లి మర్యాదలు జరుగుతున్నాయో లేదో చూసి విచారించి వస్తాను, అవసరం అయితే మీరు వెళుదురుగాని."
    
    "ఎంత చక్కటి అయిడియా!" గోవర్ధనరావు మెచ్చుకున్నాడు.
        
    బిందియా దుపట్టా సరిచేసుకుంటూ గర్వంగా చూసింది.
    
    "చూడు బిందు తల్లీ! సమయానికి చక్కటి సలహా ఇచ్చి రక్షించావు. ఒక్కసారి విడిదికి వెళ్ళి అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసిరా అవసరం అయితే నేను వెళ్లి వస్తాను. అన్నట్లు ఈ విషయం మీ ఆంటీతో చెప్పకు. నా మీద ఒంటికాలిమీద లేస్తుంది" భయం నటిస్తూ అన్నాడు గోవర్ధనరావు.

 

    "చేప పిల్లలా ఈదుకుంటూ వెళ్లి రాకెట్ లా తిరిగి క్షణాలలో వచ్చేస్తాను. వెళ్ళనా అంకుల్!"
    
    "వెళ్ళిరా కాని అక్కడ తుఫాను సృష్టించకేం. అసలే సుడిగాలి లాంటి పిల్లవి" నవ్వుతూ అన్నాడు గోవర్ధనరావు.
    
    "మలయామారుతంలా వెళ్ళి గలగలా గోదావరిలా వాళ్ళ మధ్య తిరిగి కృష్ణమ్మ తల్లిలా ఏం కావాలో నెమ్మదిగా అడిగి గంగా కావేరీ ఎక్స్ ప్రెస్ లా దూసుకువస్తాను" చిరునవ్వుతో చెప్పి బిందియా అక్కడనుంచి వెళ్ళిపోయింది.
    
    గోవర్ధనరావు దీర్ఘంగా నిట్టూర్పువిడిచి కళ్ళుమూసుకున్నాడు.
    
                                                                 *    *    *    *
    
    "నీతో ఇప్పటికి సరిగ్గా పదిమంది అయ్యారు" ముసలాయన నవ్వుతూ అన్నాడు.
    
    "ఏ విషయంలోనుండి మామయ్యగారూ!" వరసకలిపేస్తూ చిరునవ్వుతో నమ్రతగా అడిగింది బిందియా.
    
    బిందియా స్వభావమే అంత. మనుషుల తీరు చూసి వరసలు కలిపి మాట్లాడుతుంది. ముసలివాళ్ళలో రెండు రకాలు పెద్దరికంగల మగవాడు గౌరవంగా తాతగారు అన్న పిలుపుకి ఇష్టపడతాడు. శరీరంలో అన్నీ ఉడిగినా కోరికలు చావక మీసాలకి, తలకి రంగు పులుముకుని, మల్లెపువ్వుల్లాంటి దుస్తులు, కల్పించుకుని హాస్యాలాడడం యీ రకం ముసలివాళ్ళని తాతగారు అంటే ముఖం చిట్లిస్తారు. మామయ్యగారు, అంకుల్ - ఇలా సంబోధిస్తే సంతోషిస్తారు.
    
    తనని మామయ్యగారు అని పిలిచేసరికి ఆ ముసలాయనకి తన వయసు ఏకంగా పాతికేళ్ళు తగ్గిపోయినట్టు అనిపించింది.
    
    "మర్యాదలు చేయడానికి అడుగుకి ఓ మనిషిని యేర్పాటు చేశారు. ఏమన్నా అవసరమా! ఏదన్నా కావాలా! అంటూ వాళ్ళు అరిగిపోయిన రికార్డులూ పదేపదే ఒకే మాట అడుగుతున్నారు. మగపెళ్ళివారం కదా సరదాగా ఏదో ఒకవంక చూపిద్దాం కదా అని చూస్తే భూతద్దం వేసి చూసినా ఏ లోటు కనిపించడం లేదు. మధ్య మధ్య ఎవరో ఒకరువచ్చి లోటుపాట్లు ఏమన్నావున్నాయా! అన్నీ సవ్యంగా అందుతున్నాయా అని అడిగి వెడుతున్నారు. అలా అడిగేవాళ్ళ సంఖ్యని లెక్కపెడితే నీతో కలిపి ఇప్పటికి పదిమంది అయ్యారు" ముసలాయన నవ్వుతో చెప్పాడు.
    
    "ఎంత చేసినా ఆడపెళ్ళివారు అనే సరికి..."
    
    "ఆట పట్టించక మానరు మగపెళ్ళివారు అంటారు అంతేనా అమ్మాయీ!"
    
    "అంతేనండీ తాతగారూ!" కొంటెతనంగా అందామనుకుని, లేనిపోని గొడవ ఎందుకనుకుంది. "ఏ లోటు లేదని అంకుల్ తో చెప్పాలి. కొద్దిసేపు ఆగి పదకొండో సారి అడగడానికి నేనే వస్తాను మామయ్యగారూ!" అని బిందియా వెనుతిరిగింది.
    
    పందిట్లో పెళ్లవుతున్నది. కనువిందవుతున్నది. కన్నీరే కురుయుచున్నది...
    
    బిందియా ఇవతలికి వస్తూ పక్క గదిలోకి తొంగిచూసింది. టేప్ రికార్డ్ మధ్యలో పెట్టుకుని ఇద్దరమ్మాయిలు ప్రేమ లేఖల్లోని పందిట్లో పెళ్లవుతున్నది పాట వింటున్నారు.
    
    టిక్ టిక్ మని తలుపుమీద వేళ్ళు మడిచికొట్టి శబ్దచేసింది.
    
    బిందియా చేసిన శబ్దం విని అమ్మాయిలిద్దరూ తల యెత్తి చూశారు. "ఆడపెళ్ళివారి తరపువేనా!" అందులో ఓ అమ్మాయి రవ్వంత వ్యంగ్యంగా అడిగింది.
    
    "అవును" బిందియా చెప్పింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS