కనకారావుని ఎక్కించుకున్న రిక్షా ముందుకి పరుగులు తీసింది.
16
కనకారావు ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
"తను మోసపొయ్యాడా! ఒక త్రాగుబోతువాడి మాటలునమ్మి పరిశోధనలోకి దిగటం తెలివితక్కువ తనమేమో! అలా ఆలోచిస్తున్న కనకారావుకి 'కాదు కాదు' అని మనసు ఘోషించింది.
గోవిందరావు చెప్పిన పైపై సాక్ష్యం తప్ప, ఎవరూ కూడా చిన్న క్లూ కూడా అందించలేదు.
అనిత డెడ్ బాడీ కోసం ఎవరూ రాలేదు. అనిత డెడ్ బాడీని ఫోటోస్ తీసి, ఈ డెడ్ బాడీని ఎవరైనా గుర్తుపడితే చెప్పండి. అని పేపర్ లో ప్రచురించటం జరిగింది. పేపర్లో ప్రచురించిన ఐదురోజుల తరువాత.
ముసలి దంపతులు స్టేషన్ కి వచ్చారు. వాళ్ళు తప్ప అనితకి నా అన్నవాళ్ళెవరూ లేరు. వాళ్ళకి అనితకి దూరపు చుట్టరికం తప్ప మరేంలేదు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు పోట్లాడి ఇంటినుండి వెళ్ళిపోయాడు. అనిత తల్లీ తండ్రి చనిపోయారు.
అనిత మోడలింగ్, అలంకరణ వస్తువులు తయారుచేసి కొన్ని షాపులకి సరఫరా చేయటం ఏవో అలంకరణ పన్లు చేసుకుని సొంతంగా బ్రతుకుతున్నది. అంతేగాక ఆ ముసలివాళ్ళకు కూడా కొంచెం ఆధారంగా వుంది. అనిత ఎందుకు ఇంటికిరాలేదా! అని అనుకుంటున్నారు కాని, అనిత చనిపోయిన విషయం వాళ్ళకి తెలియదు. పేపర్ కొనటము, చదవటము కూడా వాళ్ళకి అలవాటులేదు. అనిత ఎందుకు ఇంటికి రాలేదా అని గాభరాపడుతూంటే పేపర్ లో పడిన వార్తని ఎవరో అందించడం జరిగింది. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు.
చనిపోయేరోజు సాయంత్రం అనిత ఇంట్లోంచి వెడుతూ "నాకు మంచిరోజులు వచ్చాయి. నాతోపాటు మీకు" అంది. అదేమిటి? అంటే వచ్చి చెబుతాను అంది. అంతకుమించి వాళ్ళేమీ చెప్పలేకపోయారు. ఆమె మరణించేనాటికి ఆమె గర్భవతి అనికూడా వారికి తెలియదు. ముసలి దంపతులు అమాయకులు. ఆధారం పోయినందుకు బాధపడటం తప్ప, మరణించినందుకు ఏడ్వడం మించి పరిశోధనచేయమని కోరే స్థితిలో లేరు వారు. అనిత గురించి అంతకుమించి ఇంకేమీ బయటకు రాలేదు. ఈ పరిస్థితులలో ఇన్ స్పెక్టర్ ఏమీ చేయలేక అక్కడికి శాయశక్తులా ప్రయత్నించి కేసుని ప్రక్కకు పెట్టేశాడు. ఓ విధంగా చెప్పాలంటే కేసుని అక్కడతో మూసేసినట్లే. తనకి మాత్రం ఈ కేసుమీద చాలా ఇంట్రస్ట్ కలిగింది.
హంతకుడు తప్పించుకోలేడు. పదే పదే తన మనసు ఘోషిస్తూంటే, ఇన స్పెక్టర్ తో ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి గుర్తుపట్టిన వ్యక్తి గోవిందరావు. ఎప్పటికైనా గోవిందరావు ద్వారానే మనం హంతకుడిని పట్టుకోగలం. ఈ మాట తను అనంగానే ఇన్ స్పెక్టర్ నవ్వాడు. "కిషోరీ లాల్ తో వచ్చిన అమ్మాయి కిషోరీలాల్ తోనే వెళ్ళి పోయింది. ఆ త్రాగుబోతుగాడి మాటలు నమ్మి మనం రంగంలోకి డిగితే ఇసుమంత అయినా ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ నమ్మకంతోనే నీవు ముందుకు సాగి ఈ హత్యా రహస్యాన్ని ఛేదిస్తాను అంటే అంతకన్నా కావలసిందేముంది. అవసరమైతే నా సహాయ సహకారాలు అందిస్తాను. గో ఎహెడ్" అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఇన్ స్పెక్టర్ ఆమోదం లభించింది. తను అనుకున్న దానిమీద తనకు నమ్మకం వుంది. ఎక్కడో ఏదో ఒక చిన్న ఆధారం దొరకలేకపోతుందా! పట్టలేకపోతానా! అనుకుని రంగంలోకి దిగటం గోవిందరావుని కలుసుకోవటం జరిగింది. గోవిందరావుని తను పూర్తిగా నమ్మాడు. అలా నమ్మి తను పోలీసు అయివుండి గోవిందరావుకి లంచం ఆశ చూపాడు. గోవిందరావు చెప్పింది విని, పాతిక సీసాలు లంచంగా సమర్పించుకోవటం కూడా అయిపోయింది.
గోవిందరావుని అటు పంపించి, గోవిందరావు చెప్పిన అడ్రస్ కి వెళ్ళి ఆ యింటిని బయటనుండి చూశాడు. చూడగానే ఆశ్చర్యపోయాడు.
అది శాంతినిలయం చాలా పెద్ద మేడ. దాని అధిపతి రావుగారు. ఆయనని సంఘంలొ పరువు, ప్రతిష్టలు, పలుకుబడి చాలా వున్నాయి. బాగా భాగ్యశాలి కూడా వాడికి ఒక్కడే కొడుకని, కొద్ది నెలలక్రితమే పెళ్ళి అయిందని, తన పై పై ఎంక్వైరీలో తెలిసింది. ఈ ఐదు రోజులబట్టీ తను యింటిమీద నిఘావేసి చాటుగా గమనిస్తూనే వున్నాడు గోవిందరావు చెప్పిన రూపురేఖలు గల వ్యక్తి లోపలకు వెళ్ళటంగాని, బయటకు రావటంగాని జరుగలేదు. ఆ ఇంటి నౌకర్లని, మేనేజర్ ని గుమాస్తాని అందర్నీ చూడటం జరిగింది. రావుగారి కొడుకు వారం క్రితం వూరువెళ్ళాడు. కాబట్టి అతనూ కాదు. కాబట్టి వాళ్ళింటికి వచ్చేపోయేవాళ్ళలో ఒకడు హంతకుడు కావచ్చు. కిషోరీలాల్ అనే వ్యక్తిలో రావుగారికి కాని, కొడుక్కి కాని ఆ యింట్లో మరెవరికైనాగాని, సంబంధము ఉందేమో కనుక్కోవాలంటే ఈ కిషోరీలాల్ అనే వ్యక్తి నూటికో కోటికో తప్ప యింటికి రాకపోవచ్చు. తను వెంటనే రంగంలోకి దిగి నిజంగా అతడే హంతకుడు అయ్యుంటే ఈ విషయం మాత్రం పసిగట్టినా పారిపోవడం ఖాయం. కనుక తను చాలా జాగ్రత్తగా పరిశోధనలోకి దిగాలి.
అసలు గోవిందరావు నిజమే చెప్పాడా! లేక పాతిక సీసాల కోసం అబద్దం ఆడాడా! ఏదో అడ్రస్ చెప్పి తప్పుకున్నాడా! అంత ధైర్యం అసలు గోవిందరావుకి వుందా! తనొకసారి గోవిందరావుని కలుసుకుంటే మంచిది. మాటలలోపెట్టి నిజా నిజాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడో గోవిందరావు తనని కలుసుకుంటాడంటే ఆలస్యం కావచ్చు, ఇప్పుడే తను గోవిందరావుని కలుసుకోవాలి. గోవిందరావుని కలుసుకోవాలంటే అతని ఇంటికి వెళ్ళటం తప్ప మరో మార్గం లేదు. సమయానికి అతని భార్య ఇంట్లో వుంటే ఈ పోలీసు దెయ్యం మళ్ళీ ఇంటికి వచ్చిందే అనుకోవచ్చు. ఏదో మామూలుగా రెండు మాటలు మాట్లాడి అక్కడ గోవిందరావు కనుక వుంటే సైగచేసి తిరిగి వచ్చేస్తాడు.
ఆ సైగని అర్ధం చేసుకున్న గోవిందరావు, ఎప్పుడో అప్పుడు వచ్చి తనని కలుసుకుంటాడు. అప్పనంగా పాతిక బాటిల్స్ పొందినవాడు తనకి మొహం చాటెయ్యలేడు.
ఇలా ఆలోచిస్తూ కనకారావు గోవిందరావు వుండే ఫ్లాట్ కి వచ్చాడు.
అక్కడ పరిస్థితి చూసి కనకారావు షాక్ తిన్నట్టు అయ్యాడు.
"నాలుగు రోజులక్రితం తన ఫామిలీని తీసుకుని పూర్తిగా ఇల్లు ఖాళీచేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేముందు, చిన్న తగాదా ఆడుకున్నారని, ఒక్కసారి పాతిక బుడ్లకి డబ్బు తగలేశావా అని మధురమీనాక్షి అతనిపై అరవటం ప్రక్క పోర్షన్ వాళ్ళువిన్నారు. నేను ఇవి కొనలేదు, ఒక స్నేహితుడు గిఫ్ట్ గా ఇచ్చాడు అని గోవిందరావు అనటము కూడా వారు విన్నారు. ఆయన తాగటము ఆవిడ అరవటము ఎప్పుడూ వున్న గోలే అని ఆ తరువాత వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళారన్నది కూడా తెలియలేదు" అని అక్కడి వాళ్ళు కనకారావుతో చెప్పారు.
