Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 27


    కనకారావు నిరాశగా వెనుతిరిగి బయలుదేరాడు. కనకారావుకి మిణుకు మిణుక్ మంటూ ఒక్క ఆశ మాత్రం వున్నది. అది....
    గోవిందరావు పాతిక బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళడంతో భార్యకి అనుమానం వచ్చి ఉంటుంది. ఇన్ని బాటిల్స్ కి ఇంత డబ్బు ఎక్కడిది? అని అడిగి వుంటుంది. గత్యంతరం లేని పరిస్థితులలో గోవిందరావు అసలు విషయం చెప్పి వుంటాడు. అప్పుడు గోవిందరావు భార్య ఇలా అని ఉంటుంది.
    "హంతకుడు వుండే ఇంటిని నువ్వు పోలీసులకి చూపించావు. పోలీసులు ఇంతటితో వూరుకోరు. ఆ మనిషిని పట్టుకొచ్చి వీడి గురించే కదూ నువ్వు చెప్పింది అని అడుగుతారు, అప్పుడు నీవు అవుననక తప్పదు. ఈ లోపలే హంతకుడు ఎలాగో అలా జైలునుండి తప్పించుకుంటాడు. నువ్వు సాక్ష్యం చెప్పినందుకు కోపంలో నిన్ను ఎక్కడో అక్కడ పట్టుకొని పొడిచి పారేసాడు. అలా కాకపోతే నన్నూ, నా పిల్లలినన్నా చంపి పారేస్తాడు. నీ కాళ్ళిరగగొట్టి కూర్చోబెడతాడు. నేను ఆ రోజునే చెప్పాను. పోలీసు వాడితో వ్యవహారం కొరివితో తలగోక్కున్నట్టు అని. నువ్వు వినిపించుకోలేదు. నువ్వు ఏ నాడు నా మాట వినిపించుకున్నావు కాబట్టి, ఈనాడు వినిపించుకుంటావు. ఎంతసేపు ఏదో ఒకటి నా పీకమీదకు తీసుకు రావటంవచ్చు నీకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నే చెప్పినట్టు విను. నువ్వు తక్షణం ఇక్కడి నుండి మకాం ఎత్తేసి అటు పోలీసులకి ఇటు హంతకుడికి కనపడకుండా ఏ మారుమూల పల్లెటూరికో వెళదాం" ఇలా చెప్పి గోవిందరావు భార్య గోవిందరావుని భయపెట్టి వుంటుంది. ఒక ఇల్లాలిగా ఆమె ఆలోచనలు అలాగే సాగివుంటాయి. భార్య పోరుతో గోవిందరావు కూడా భయపడి పోయి 'సరే' అని ఉంటాడు. మధురమీనాక్షి చాలా తెలివిగలది. గడుసు పిండం కూడా తలదాచుకునేందుకు ఏ మారు మూల పల్లెటూరన్నా వెళ్ళిపోయి వుంటుంది. ఇప్పుడు తను వాళ్ళను వెతకటంకన్నా, రావుగారి ఇంటిమీద ఒక కన్నేసి వుంచితే సరిపోతుంది.
    ఒక నిర్ణయానికి వచ్చాడు కనకారావు.
    ప్రస్తుతానికి.
    అంతకన్నా చేసేదేమీ లేక.
    కనకారావు కాళ్ళీడ్చుకుంటూ నిరాశగా రూమ్ కి బయలుదేరాడు.
    మనిషి ఆశాజీవి అలాగే కానిస్టేబుల్ కనకారావు కూడా ఆశాజీవే.
    ఏ మూలో ఆశ మిణుక్ మిణుక్ మంటుంటే కనకారావు ముందుకు సాగాడు.
    
                                     17
    
    సాయంత్రం ఆరూ పది.
    రావుగారు, ఊర్మిళాదేవి లాన్ లొ కూర్చొని వున్నారు. వాళ్ళ మొహాలు సంతోషం గా లేవు. తీవ్రాలోచన చేస్తున్నారు. ఆ సమయంలో పనివాళ్ళు ఇంటి పనిలో వున్నారు. అక్కడ వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరూ లేక పోవడంవల్ల పైకే మాట్లాడుకుంటున్నారు.
    "ఆ రోజునే మీరు కాస్త గట్టిగా వున్నట్లయితే..." ఊర్మిళాదేవి అంది.
    "ఆ మాత్రం నాకు తెలియకనే ఇంత పెద్దవాడివి అయ్యావా, సంఘంలో చక్రము తిప్పగల నేను, ఇంట్లో నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అలాంటిది. పోనీ నువ్వు చెయ్యకపోయినావ్," రావుగారు కాస్త విసుగ్గా అన్నారు.
    "వాడు ఫోన్ చేసినప్పటినుంచీ ఈ రోజువరకూ నన్ను నోరు ఎత్తనిచ్చారా! నేను ఏదన్నా కూడా ఏదేదో చెప్పి నా నోరు మూయిస్తిరి. ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని సమర్ధించటమే కదా! ఒక్కసారి మొత్తం నామీద వదిలేయండి. తాడోపేడో తేల్చి పారేస్తాను." నిష్టూర్యము, ఆవేశము కూడిన స్వరంతో అంది ఊర్మిళాదేవి.
    "తాడోపేడో తేలుస్తానని నాకు తెలుసు."
    భర్త ఆ మాట అనంగానే ఊర్మిళాదేవి మొహం సంతోషంతో విప్పారింది. "అయితే ఈ రోజే తేల్చేయనా!" అంది.
    "వద్దు."
    "అదేమిటి? ఇంతలోనే మాట మార్చారు?"
    "నీవు టకటకా పనులు చేయగలవని నాకు తెలుసు. కాని, అలాఅని ప్రతి విషయంలో అంత వేగం పనికిరాదు." ఊర్మిళాదేవి.
    "ఇది మనవాడికి సంబంధించిన విషయము కాబట్టి" రావుగారు శాంతంగా అన్నారు.
    "మనవాడికి సంబంధించిన విషయము కాబట్టే మనం వూరుకోకూడదు. కామిని అంతస్థేమిటి? మన అంతస్థు ఏమిటి? ఒక్కగానొక్క కొడుకు గొప్పగా పెళ్ళి చేయగలిగామా? గర్వంతో పదిమందిలో చెప్పుకోగలిగామా? ఇది మన కోడలని. కిరణ్ మన మాటే సరిగ్గా వినేవాడు కాదు. మన గారాబం, యువ రక్తం కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అనుకున్నాము. అన్నీ చిన్న చిన్న విషయాలు కాబట్టి మనం పట్టించుకోలేదు. ఇది చాలా పెద్ద విషయము ఇలాటప్పుడు కూడా..."
    "ఇలాంటప్పుడు కాబట్టే మనము నిదానించాలి."
    "ఎందుకు నిదానించాలి?" అంది ఊర్మిళాదేవి, తిరిగి మళ్ళీ "కిరణ్ పెళ్ళి చేసుకొచ్చి రెండు నెలలు దాటింది అంతేనా?" అంది.
    "అంతే" ముక్తసరిగా అన్నాడు రావుగారు.
    "అంతే అని చాలా తేలిగ్గానే అన్నాడు మనవాడు పెళ్ళి చేసుకుని రెండు నెలలు దాటింది. కామినీకి కడుపు వచ్చి ఐదు నెలలు దాటబోతోంది. మరో మూడునెలలు దాటంగానే అది ప్రసవిస్తే అప్పుడు నా పరువు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడే మన గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు. అప్పుడు పదిమందీ చెప్పుకుంటారు."
    "కొన్ని పరిస్థితులకి మనము తల వొగ్గక తప్పదు ఊర్మిళా!"
    "తప్పదు కాదు తప్పించుకోవటానికి చూడాలండీ లేకపోతే తప్పించటానికి చూడాలి. కామిని మాటలు ప్రవర్తన పెద్దింటి పిల్ల లాగానూ లేవు, సంస్కారవంతురాలి లాగానూ లేవు. వాడిమీదనే కాదు నా మీదకూడా అధికారం చెలాయించాలని చూస్తూంది. మీరు గమనించారో లేదో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS