Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 25


    కనకారావు చెప్పింది ఎలా వుందంటే అతను డ్యూటీ విషయంలో చాలా విసిగిపోయినట్టుగా వుంది. అతని నటుడు చాలా బాగాపనిచేసింది గోవిందరావుమీద.
    పావుగంట తరువాత.
    అసలు విషయంలోకి వచ్చాడు గోవిందరావు.
    "అనుకోకుండా నేను మొన్న చూశాను."
    "ఏమిటి చూసింది?"
    "పాతిక బాటిల్స్..." అంటూ నాన్చుతూ ఆగిపోయాడు
    పోలీసు కనకారావుకి విషయం అర్ధమైపోయింది. ఆ విషయమేదో తెలుసుకోవాలని చాలా ఆతృత పడ్డాడు. కాని, ఆతృతని పైకి ప్రదర్శించదలచుకోలేదు. చాలా జాగ్రత్తగా తూచితూచి మాట్లాడుతూ "వీడు పోలీసు కనకారావే కావచ్చు కాని ఆడినమాట తప్పడు మిత్రమా!" అన్నాడు.     అప్పటికప్పుడు గోవిందరావుని మిత్రుడిగా పిలుస్తూ.
    గోవిందరావు అయిస్ అయిపోయాడు.
    "మీరు నన్ను మిత్రమా అన్నారా!
    "అవును మిత్రమా! అందులో పిసరంత అయినా సందేహం లేదు."
    "ఈ తఫా గోవిందరావు మరింత చల్లగా అయిపోయి కరగటానికి సిద్దంగా ఉన్నట్టుగా అయి, "నేను వాడిని చూశాను" అన్నాడు.
    "వాడెవడు?" ఏమీ తెలియనట్టు అడిగాడు కనకారావు.
    "అదే, వాడే"
    "నాకర్ధం కావటంలేదు వాడెవడు ఆ కధేమిటి!
    "ఆరోజు హోటల్ లో చూశానన్నావే..."
    ఆ, అది" అంటూ ఇప్పుడు ఆతృత చూపెట్టాడు కనకారావు.
    "వాడిని, నిన్న నేను చూశాను."
    "ఎవరిని చూసి ఎవరనుకున్నారో!"
    "లేదు వాడే నాకు బాగా గుర్తు."
    "అంత బాగా గుర్తువుంచుకున్నారా?"
    "ఆ..."
    "ఆ, వర్ణించండి చూద్దాం."
    "పొడుగు మొహం, బాగా రింగులు తిరిగిన జుట్టు, మెడకింద కాయ (యాపిల్) వాడే నండీ బాబూ! నేను చక్కగా గుర్తుపట్టాను. నేను ఒకసారి చూసిన మనిషిని ఎప్పుడూ మరచిపోను.
    "గుడ్, నీ జ్ఞాపకశక్తిని నిజంగా అభినందించవచ్చు.
    ఇంతకీ ఎక్కడ చూశారు వాడిని?"
    "బజారులో చూశాను."
    "అప్పుడెవరూ అతని ప్రక్కన లేరా?"
    "ఊహు...అతను ఒక్కడే సిగరెట్ కాలుస్తూ నెమ్మదిగా నడుస్తూ వెళుతున్నాడు అప్పుడు చూశాను."
    "అరె, అరె మీరు చాలా పొరపాటుచేశారు మిత్రమా మీరు కూడా అతని వెనుకాలే వెళ్ళి వుండాల్సింది?"
    "భలేవారే! నేను వెళ్ళకుండా ఎలా వుంటాను. మీరు ముందే చెప్పారు కదా! అతనికంటపడితే ఎక్కడికి వెడతారు అతని వెనకాలే వెళ్ళి చూసి ఇల్లు గుర్తుపట్టమన్నాడు కదా! ఆ విషయం నాకు బాగా గుర్తు వుంది."
    "ఊ, ఆ తరువాత"
    "నేన్నెమ్మదిగా అతనిని అనుసరిస్తూ అతని వెనుక సాగాను. పావుగంట నడచి ఒక వీధిలోకి వచ్చాడు. ఆ వీధిలో వున్న పెద్ద మేడలోకి వెళ్ళాడు. నేను గంటసేపు అక్కడేవున్నాను. అతను ఆ మేడలోంచి బయటకురాలేదు. నాకు విసుగుపుట్టి నేనువచ్చేశాను. ఈ విషయం నేను మా ఆవిడకి చెప్పలేదు. నిన్న మీకోసం చూస్తే డ్యూటీలో వున్నారు. ఎలా చెప్పాలో తెలియక చాలా మధనపడ్డాను. మీరు డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చేశారు. నేను చెప్పేశాను.
    గోవిందరావు చెప్పింది విని కనకారావుకి చాలాసంతోషం వేసింది.
    "ఆ ఇల్లెక్కడో మర్చిపోలేదు కదా!"
    "కావాలంటే ఇప్పుడే చూపించగలను, కాని ఇప్పుడు అంతదూరం వెళ్ళడం అనవసరంశ్రమ. నేను పూర్తి అడ్రస్ చెప్పగలను. అది చాలదా?" గోవిందరావు అడిగాడు.
    గోవిందరావుని కంగారుపెట్టదలుచుకోలేదు కనకారావు.
    "మరేం ఫర్వాలేదు. ఇవాళ కాకపోతే రేపు చూడవచ్చు. పూర్తి అడ్రసు చెప్పండి చాలు. అన్నాడు కనకారావు.
    చాలా చక్కగా చెప్పాడు ఆ అడ్రసు గోవిందరావు. గోవిందరావు ఎంత చక్కగా చెప్పాడంటే తెలివితక్కువ వాడుకూడా ఆ మహానగరంలో ఐదునిమిషాలలో ఆ అడ్రసు పట్టుకొని ఆ యిల్లు కొనుక్కోగలడు.
    తను తొందరపడదలచుకోలేదు కనకారావు. తూచి తూచి అడుగులువేస్తూ, ఆ వార్త మీద అంత ఇంట్రస్ట్ లేనట్టు మాట్లాడాడు.
    కనకారావు మామూలుగా మాట్లాడుతూ తను తెచ్చిన వార్తకు అయిస్ అయిపోలేదు. ఈ పోలీసువాడు పాతికబుడ్లు ఎగకొడతాడేమో అనుకున్నాడు గోవిందరావు.
    కనకారావుకి అప్పటికప్పుడు వెళ్ళి ఆ యిల్లు చూడాలనిపించింది. ఆ విషయం బయటపెట్టకుండా "మీరు చెప్పిన ఎడ్రస్ కి రేపు వెళ్ళి చూస్తాను. మూసేసిన కేసేకదా! కాని ఈ వార్త అందించినందుకు ఇంకా ఆ వ్యక్తిని నేను చూడకపోయినా మీ మాటలమీదవున్న నమ్మకంతో బహుమతి ఇవ్వదలచుకున్నాను పదండి" అంటూ లేచాడు కనకారావు.
    "ఇప్పుడే ఎందుకు మరేం ఫరవాలేదు. తరువాత ఇద్దరుకాని" అంటూ లేచాడు గోవిందరావు.
    కనకారావులేచి పాంటు, షర్ట్ వేసుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి రూమ్ కి తాళంవేసి రిక్షా ఎక్కారు ఇద్దరూ. రిక్షా బయలుదేరింది?
    తనకి తెలిసిన ఒక షాప్ ముందు రిక్షా ఆపించి, విస్కీ, బ్రాందీ, బీరు అన్ని రకాలు ఒక పాతిక సీసాలు ప్యాక్ చేయించాడు. రిక్షాలో పెట్టించి రిక్షావాడికి కూడా డబ్బులిచ్చి, గోవిందరావు ఒక్కడినీ అతని ఇంటికి పంపించాడు. పంపించే టపుడు "మరోసారి స్నేహంగా కలుసుకుందాం" అన్నాడు కనకారావు.
    "డ్యూటీచేసి చాలా అలసిపోయివున్నాను. రూమ్ కెళ్ళి పడుకుంటాను" అని చెప్పాడు కనకారావు.
    గోవిందరావు రిక్షా కనుమరుగు అయినంతవరకూ ఆగాడు కనకారావు.
    ఆ అడ్రస్.
    గోవిందరావు చెప్పిందే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS