"పాతిక బాటిల్స్ అమ్మో..." అంటూ నోరు తెరిచేవాడు గోవిందరావు.
"పాతిక నాకొక లెక్కకాదు. ఏ షాపు వాడికి కబురుచేసినా తెచ్చి ఇంట్లో పదవేస్తాడు. ఆ మాత్రం సత్తా లేకపోతే ఈ పోలీసు ఉద్యోగం ఎందుకు?" నవ్వుతూ అన్నాడు కనకారావు.
ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకొని గోవిందరావు, మరోసారి "నిజమే చెప్తున్నారు కదూ!" అన్నాడు.
"నా మదర్ మీద ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఇంకా అంతకన్నా ఏమి చెబుతున్నాను."
గోవిందరావు గబుక్కున "మీ మాటలు నమ్ముతున్నాను," అంటూ కనకారావు చేతులు పట్టుకున్నాడు.
"స్నేహంలో ఆ నమ్మకమే వుండాలి. మీరీ విషయం మీ భార్యతో చెప్పొద్దు. ఎందుకు చెప్పవద్దంటున్నానంటే. మీలో మళ్ళీ ఏదో అనుమానం రేకెత్తించి మనలను వేరుచేస్తుంది." అన్నాడు కనకారావు.
అవునన్నట్టు తల ఊపాడు గోవిందరావు.
మరో పది నిముషాల తరువాత వాళ్ళ పార్టీ ముగిసింది.
తరువాత వెళ్ళటానికి లేచాడు గోవిందరావు.
బజారునుంచీ వస్తూ కొన్న విస్కీ బాటిల్ ని బలవంతానా గోవిందరావు చేతికిచ్చాడు కనకారావు. ఒక ప్రక్క వద్దు వద్దంటూనే మనస్సు ఆటే పీకుతుండగా, బాటిల్ ని అందుకున్నాడు.
కనకారావు దగ్గర శలవు తీసుకున్నాడు.
తను పార్టీ చేసినట్టు గోవిందరావు భార్యకు చెప్పడు. త్రాగుబోతులకి భార్య మాటలకన్నా పాతిక సీసాలే విలువైనవి. ఆ విలువ పోగొట్టుకోరు, వెడుతున్న గోవిందరావుని చూస్తూ అనుకున్నాడు కనకారావు.
కనకారావు గాలిలో ఒక బాణం వదిలాడు.
అది తగిలి తీరుతుంది.
ఆ నమ్మకం పోలీసు కనకారావుకి వుంది.
15
ఏడూ పది నిమిషాలు.
కనకారావు డ్యూటీనుండి ఇంటికి బయలుదేరాడు. పోలీస్ స్టేషన్ కి అతని రూమ్ దూరమేమీకాదు. ఈల పాట పాడుకుంటూ తాపీగా నడచి పోతున్నాడు.
పది నిమిషాల తరువాత కనకారావుకి అనుమానం వచ్చింది తననెవరో వెంటాడు తున్నారని. అతని పోలీసు దృష్టినుంచి అతను తప్పించుకోలేకపోయాడు.
దూర దూరంగా తన నీడలా తననే అనుసరిస్తున్న గోవిందరావుని చూశాడు.
"గోవిందరావ్! నీవు నేను అనుకున్నంత అమాయకుడివి కావు. నీవు నామీద పరిశోధన చేస్తున్నావ్. నేను తలచుకుంటే అయిదు సరిగా అయిదే నిమిషాలు చాలు, నిన్ను కటకటాల వెనుకకు పంపించటానికి." అనుకున్నాడు కనకారావ్. ఇదేమిటో చూద్దాం అనుకుంటూ ఏమీ తెలియని వాడిలాగా ముందుకు సాగాడు.
కనకారావు తన రూమ్ ని సమీపించాడు.
అంతవరకూ గోవిందరావు అనుసరిస్తూ వస్తూనే వున్నాడు.
కనకారావు రూములోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసుకొని, కిటికీ తలుపులు ఓరగా తెరచి, బయటకు చూశాడు. గోవిందరావు రోడ్డుమీద తచ్చాడుతూ అక్కడే కనిపించాడు.
"గోవిందరావునుంచి సమాచారం లాగాలంటే, తనీ డ్రస్సులో వుండకూడదు" అనుకున్నాడు.
కనకారావు త్వరగా తన యూనీఫామ్ నుండి, మామూలు డ్రస్సులోకి మారాడు. లుంగీ పైన షర్ట్ వేసుకుని బయటకు వచ్చాడు. గోవిందరావ్ ని అప్పుడే చూసినట్టుగా పిలవాలనుకున్నాడు కనకారావు.
కాని, గోవిందరావు కనకారావుని చూస్తూనే పరుగున దగ్గరకు వచ్చాడు.
కనకారావు తెల్లబోయాడు.
"గోవిందరావు పెద్ద నటుడు" అనుకుంటూ వుండగానే గోవిందరావు దగ్గరికి వచ్చేసి "లోపలికి పదండి చాలా ముఖ్య విషయం మాట్లాడాలి" అన్నాడు.
ఇదేదో గట్టిగా చూడాల్సిందే అనుకుంటూ గోవిందరావుని తీసుకుని లోపలికి వచ్చాడు కనకారావు.
"నేను ఇప్పుడే డ్యూటీనుంచి వచ్చాను."
"నాకు తెలుసు" అన్నాడు గోవిందరావు.
"మీకు తెలుసా? చాలా ఆశ్చర్యంగా వుందే, మీరు ఇప్పుడే కదా లోపలికి వచ్చారు!" ఏమీ తెలియనట్టు అడిగాడు కనకారావు.
"నేను మిమ్మల్ని రెండు గంటల క్రితమే చూశాను. మీరు డ్యూటీలో ఉన్నారు కదా! డ్యూటీలో ఉంటే ఎలా మాట్లాడను. అని అనుకున్నాను. దాంతో మీ రాకకోసం ఎదురుచూస్తూ ఆగిపోయాను. డ్యూటీ ముగించుకుని మీరు ఇంటికి వచ్చాక యూనిఫామ్ మార్చేవరకూ ఎదురు చూస్తూ కూర్చున్నాను."
"ఎందుకలా?" నిజంగానే అర్ధంగాక అడిగాడు కనకారావు.
"మీ పోలీసు డ్రస్సు చూస్తే నాకు భయం. మీ రాక డ్రస్సులోవుంటే డ్యూటీలో ఉన్నట్టే లెక్క. ఈ డ్రస్సులో మీరు నాకు మిత్రుల క్రిందే లెక్క." స్నేహపూరితంగా మాట్లాడాడు గోవిందరావు.
ఏదో ఉందని గ్రహించాడు కనకారావు. భుజంమీద చెయ్యివేసి "కూర్చొని మాట్లాడుకొందాం రండి" అన్నాడు.
"వెధవడ్యూటీ చాలా అలసిపోయాను" అంటూ అలమారాలోనున్న విస్కీ బాటిల్ తీశాడు. టేబుల్ మీద గ్లాసులు అవి పెట్టే, కారంబూందీ తీసి ప్లేట్ లో పోశాడు. రెండు గ్లాసుల్లోకి రెండుపెగ్గులు ఒంపి, "తీసుకోండి మిత్రమా" అన్నాడు.
"ఎప్పుడొచ్చినా మర్యాదలేమిటి! నన్ను మరీ మొహ మాట పెట్టేస్తున్నారు." గోవిందరావు గ్లాసుమీదే దృష్టివుంచి అన్నాడు.
ఆరోజు తరువాత మళ్ళీ రాలేదు కదా! మా యింటికి. మనం కలుసుకుని పదిరోజులు అయ్యుంటుంది. అంతేకదూ! ఆరోజు నేను పార్టీ ఇచ్చాక, మళ్ళీ ఇప్పుడే కదా రావటం. మధ్యలో ఎప్పుడన్నా వచ్చి కలుసుకోమన్నా కలుసుకోలేదు కదా!" కావాలనే కొద్ది నిష్టూరంగా అన్నాడు కనకారావు.
"సిగ్గువేసింది."
"సిగ్గు ఎందుకు?"
"నేను మీకేసాయం చేయకపోగా..."
"సాయంచేస్తేనే మిత్రులన్న మాట."
"అలా అని కాదు..." నసిగాడు గోవిందరావు.
గోవిందరావు ఏదో చెప్పటానికి వచ్చాడని గ్రహించాడు కనకారావు. వెంటనే అడిగితే అతను చెప్పితే చెప్పొచ్చు. లేకపోతే లేదు. అనుకున్న కనకారావు తెలివిగా మాటలుమార్చి ఏవో విషయాలు ముచ్చటిస్తూ కారంబూందీని తినిపిస్తూ, అరబాటిల్ ఖాళీ అయ్యేంతవరకూ ఓపికపట్టాడు. మధ్యలో పోలీసు ఉద్యోగం వెధవదని పై ఆఫీసరు చేత మాటపడటం తప్ప ఏమీలేదని ప్రజలచేత అనవసరంగా తిట్టించుకునే ఉద్యోగం అని అదని ఇదని చెప్పాడు.
