ఉన్నట్టుండి ఏడుపుమొహం పెట్టుకుని "నేను చచ్చిపోతాను" అన్నాడు గోవిందరావు.
కనకారావు ఆప్యాయంగా గోవిందరావు భుజంమీద చెయ్యివేశాడు.
"మిత్రుడితో అలాగేనా మాట్లాడవలసినది మీరు! అసలేమయింది?" అన్నాడు భుజంమీద ఆప్యాయంగా నొక్కుతూ.
"వెధవ హత్య నా ప్రాణంమీదకు వచ్చింది. చెప్పొద్దని అది, చెప్పమని మీరు. ఈ బాధ నేను పడలేను."
"ఛ, ఛ. అంతేనా నన్ను అర్ధం చేసుకున్నది మీరు గోవిందరావుగారూ! మీకు తెలుసో లేదో ఆ కేసు పెడితే మూసేశాం."
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు గోవిందరావు.
"తగిన గట్టి సాక్ష్యాలు లేవు. పైగా ఆ అమ్మాయి కూడా మంచిది కాదని తెలిసింది. ఎవడో కోపంతో చంపి పారేసి వుంటాడు. అయినా ఆ హత్య జరిగి, అప్పుడే రెండు నెలలయ్యింది. ఇంకా ఆ విషయమే మీరు ఆలోచిస్తున్నారా మేము ఎప్పుడో మరచిపోయాము. తెల్లారిలేస్తే ఇలాంటి కేసులు మాకు సవాలక్ష.
"నిజంగా!" అన్నాడు గోవిందరావు.
కనకారావు జేబులోంచి చిన్న బ్రాందీ బాటిల్ తీశాడు. ఆ సీసాని పైకెత్తి చూపుతూ "కావాలంటే నా కిష్టమైన ఈ సీసామీద ఒట్టేసి చెబుతున్నాను. నేను ఫ్రెండ్లీగా మీతో మాట్లాడుతున్నాను కానీ కేసు విషయం మీదకాదు," అన్నాడు.
కనకారావు చెప్పేది విన్నాడో లేదో కాని. గోవిందరావు సీసాను చూసి పెదాలను నాలుకతో తడుపుకుంటూ "మీరుకూడా...." అన్నాడు.
"ఏం? నేను మటుకు మనిషినికాదా! ప్రతిరాత్రి నేను కొంచెం పుచ్చుకొని కని నిద్రపోను. ఓ... మర్చేపోయాను మీరుకూడా తీసుకుంటారుకదూ!" కనకారావు మామూలుగా అడిగాడు.
గోవిందరావు సిగ్గుపడి తలవంచుకున్నాడు.
"మన ఇద్దరం చెరొక రకం జాబ్ చేస్తూ వుండవచ్చు. అంతమాత్రం చేత చెరొకదారి వెళ్ళనక్కరలేదు. పదండి ఇద్దరం కలిసి నా రూమ్ కి వెళదాం. ఇద్దరం కలిసి...." అంటూ తమాషాగా కన్నుగీటాడు కనకారావు.
విషయం అర్ధమైంది గోవిందరావుకి. రెండురోజుల బట్టీ చేతిలో డబ్బూలాడటం లేదు. భార్యను అడిగితే ఇవ్వలేదు, సేట్ ని అడిగితే ఇవ్వను అన్నాడు. రోజూ మందు పుచ్చుకునే ప్రాణం, ఈరోజు మందులేకపోయేసరికి ప్రాణాలు ఎవరో లాగేసినట్టూ, నరాలు చచ్చుబడ్డట్టూ అయినాయి. కాళ్ళరిగేలా తిరగటం తప్ప రెండురూపాయలుకూడా అప్పు దొరకలేదు.
సరీగా అలాంటి సమయంలో కనకారావు ఆహ్వానించాడు. కాదనగలశక్తి గోవిందరావుకి లేకపోయింది. కనకారావు రిక్షా పిలిచాడు. ఇద్దరూ రిక్షా ఎక్కారు.
కనకారావు జబారులో రిక్షా ఆపించి, విస్కీబాటిల్ ఒకటి, కోడి పకోడీలు, మిరపకాయఆకారంలో కోడిగుడ్డుతో చేసే బజ్జీలు, మిక్చర్ మొదలైనవి తీసుకున్నాడు.
మరికొద్ది సేపట్లో కనకారావు గదిలో చెరొక కుర్చీలో ఎదురెదురుగా కూర్చున్నారు. వారిముందు టేబుల్ మీద సరుకు, సరంజామా పరచివున్నాయి.
తన చేత్తో మొదటిపెగ్ ని గోవిందరావు కి అందించాడు కనకారావు.
మీరు దేవుడు...అనబోయి ఆ మాట అంటే బాగుండదేమో అని, ఒక వెధవనవ్వు నవ్వి గ్లాసందుకున్న గోవిందరావు.
గోవిందరావు తాగకపోతే మనిషి కాదు కాని, తాగితేనే మనిషని, మాటలు కొద్దిగా తడబడొచ్చు కాని మత్తుగా పడుకోడని, తాగినపుడే నిర్భయంగా మాట్లాడగలడని, కొద్ది వారాలుగా గోవిందరావుని వాచ్ చేస్తూ, గోవిందరావుని నీడలా అనుసరిస్తున్న కనకారావు బాగా గ్రహించాడు. ఇప్పుడు అసలు విషయం రాబట్టడానికే ఈ పార్టీ.
కనకారావు పోలీసు పోలీసువాడు పోలీసువాడే.
గోవిందరావు త్రాగుబోతు. త్రాగుబోతు త్రాగుబోతే.
పావుగంట గడిచిపోయింది.
వాళ్ళమధ్య రకరకాల సంభాషణ జరిగింది.
ఖరీదైన పదార్ధాలు, ఖరీదైన పానీయం.
గోవిందరావుకి నెంబర్ వన్ గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తున్నట్టుగా వుంది.
కనకారావు తెలివిగా మాటల మధ్యలో అనితకేసుని తీసుకువచ్చాడు. ఇదివరకు గోవిందరావు ఏదిచెప్పాడో, అదే చెప్పాడు. కాని, ఒక్కమాటకూడా అటుఇటూ మార్చి చెప్పలేదు. కాకపోతే ఇంకొకవిషయం చెప్పాడు.
అది,
"తన భార్య పోలీసువాళ్ళతో వ్యవహారం అంటే నిప్పులో చెయ్యిపెట్టడం లాంటిదే అని భయపెట్టింది అని, అంతవరకూ చెప్పిందేదో చెప్పావు వాడు మళ్ళీ వస్తే, ఏమీ తెలియదని అన్నా చెప్పు? లేకపోతే సుబ్బరంగా తాగి పడుకోమని చెప్పింది. అందుకే ఆరోజు మీరు మా యింటికివస్తే నేను మత్తుగా పడుకుండిపోయినట్లు యాక్షన్ చేశాను.
అప్పుడు తెలివి బాగానేవుంది. మీరు నా భార్య మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. మీరు వెళ్ళినతరువాత అది నాతో పోట్లాడింది కూడా." గోవిందరావు చెప్పాడు.
గోవిందరావు నిజాయితీకి మంత్రముగ్ధుడై వాడు కనకారావు అయినా అతనిప్పుడు డ్యూటీమీదలేకపోవచ్చు కాని, ఆ కేసులో విషయసేకరణకే ఇప్పుడు ఈ పార్టీ.
వారిమధ్య మరికొద్దిసేపు మాటలు జరిగాయి.
గోవిందరావుకి కనకారావు చాలా నచ్చాడు.
సరి అయిన సమయం చూసి, విషయంలోకి వచ్చాడు.
"గోవిందరావుగారూ! మీరునమ్మినా నమ్మకపోయినా కేసువిషయం నిజమే చెప్పాను. అయితే ఆరోజు ఆ వ్యక్తి గురించి వర్ణించారు చూడండి, అతనిని ఎప్పటికైనా చూద్దామని వుంది. ఒకసారి మూసివేసిన కేసుని తిరిగి పైకి తోడం ఆ వ్యక్తి ఎప్పుడైనా మీ కళ్ళబడితే అతనిని నీడలా అనుసరించి వెళ్ళి అతను ఎక్కడుంటాడో తెలుసుకుని ఆ విషయం నాకొచ్చి చెప్పండి."
"ఎందుకు?" అనుమానంగా అడిగాడు గోవిందరావు.
"జస్ట్ క్యూరియాసిటీ, అంతే. మీకిష్టంలేకపోతేవద్దు. బలవంతమేమీలేదు. మీరు అబద్దాలు చెబుతారని మీరు ఇరవై నాలుగు గంటలూ త్రాగి ఏవేవో మాట్లాడుతారనీ, మీ ఆవిడ అందికదా! ఆలెక్కన మీరు చెప్పినదంతా అబద్దమయి వుండాలి. అలాకాక మీరు నిజమే చెప్పారనుకోండి మీరు చెప్పేవి నిజాలని నేను ఎప్పుడో నమ్మాను. ఇంకా బాగా నమ్మటానికి, పైగా వాడు ఎలావుంటాడో చూడాలన్న కోరిక అందువల్ల అడుగుతున్నాను. మీకిష్టమైతే చెయ్యండి. నా మాటలకి మీ మనసు కష్టపడితే, స్నేహితుడి ప్రధమ తప్పిదంగా వదిలేసెయ్యండి. అన్నట్టు మరో విషయం మీరు ఏ విధమైన సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. అతను కనపడితే ఎక్కడుంటాడో చూసిచెబితే చాలు. అలా చెప్పంగానే, మీకు నేను మీకిష్టమయినది బ్రాందీగాని, విస్కీగాని, సరిగ్గా పాతిక బాటిల్స్ కొని ఇస్తాను" అన్నాడు కనకారావు.
