Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 22


    "చూశారుగా ఇదీ వరుస, ఆయన తాగటము ఏదో తెలిసినట్టు వాగటమూ తప్ప, ఆయన చెప్పే ఒక్క మాటలో నిజం వుండదు. ఈయన చెప్పే మాటలు విని, మీరు రంగం లోకి డిగితే, ఎలికతోక పట్టుకుని సముద్రానికి ఎదురు ఈది నట్టే, ఈ పాతికేళ్ళ కాపురంలో ఆయన ఎలాంటి వారో ఆయన చెప్పేవి ఎలాంటి నిజాలో నాకు బాగా తెలుసు. కావాలంటే ఆయనను వంద ప్రశ్నలు అడగండి, నాకేమీ అభ్యంతరం లేదు." అంది మధురమీనాక్షి.
    "గోవిందరావుగారూ!" కనకారావు తట్టి పిలుస్తూ లేపాడు.
    "నాకేమి తెలియదంటే తెలియదు. అన్నీ మాఆవిడకి తెలుసు, హడగండి" అతి బలవంతంమీద కొద్దిసేపటికి మాట్లాడాడు.
    "నీ ముందే చెప్పానా! ఈ మనిషి ఎలాంటి వాడంటే మీ యిల్లెక్కడ గోవిందరావుగారూ అన్నారనుకోండి మా ఆవిడని అడగండి అనే రకం. ఈ పూటకి ఇహ ఆయన లేవరు ఆ మత్తులోనుండి. మీ యిష్టం" అంది మీనాక్షి.
    ఆమె మీ ఇష్టం అన్న మాటలోనే వుంటే వుండండి పోతేపొండి అన్న అర్ధం స్ఫురించింది కనకారావుకి.
    "అయితే రేపు ఒకసారి వచ్చి కలుసుకుంటాను."
    "మీరేమన్నా అనుకోండి కనకారావుగారూ, నన్ను గయ్యాళి ఆడదనుకున్నా ఫరవాలేదు. మా ఆయన సంగతి మీకు తెలియదు. ఈ త్రాగుడి వ్యసనంలో వున్న ఉద్యోగం ఊడింది. అప్పటినుండి సేల్సుమన్ గా నాలుగు రాళ్ళు సంపాదించడం తప్ప, ఇంకేమీ చెయ్యడం లేదు. ఆ సంపాదించిన నాలుగు రాళ్ళతో ఇలా తాగి 24 గంటలూ పడుతుంటారు. ఈ మనిషి మాటలు మీరు నమ్మి ఈ మనిషిని మీరు సాక్ష్యానికి తీసుకుంటే నోటికి ఏదొస్తే అది వాగుతుంటాడు. మీకూ శ్రమ. లేనిపోనిది నాకూ కష్టం. దయచేసి ఈ విషయాన్నీ ఇంతటితో వదిలేయండి."
    "ఆయనని మేమేమి బలవంతం పెట్టడంలేదు కదా!"
    "మీరు బలవంతం పెట్టినా పరవాలేదు, మర్యాదగా అడిగినా ఫరవాలేదు. ఆయన చెప్పే మాటలలో ఒక్క అక్షరం కూడా మీకు ఉపయోగపడదని తెలియ జేస్తున్నాను అంతే."
    "ఆయన సంపాదన ఆయన త్రాగుడికే సరిపోతుంటే, సంసారం ఎలా గడుస్తున్నది?"
    "నాకు టైలరింగ్ వచ్చు, ఎంబ్రాయడరీ వచ్చు. రెండు షాపుల్లో వర్క్ చేయటానికి కుదిరాను. అదే జీవనోపాధి. వాళ్ళిచ్చిన డబ్బుతోనే సంసారాన్ని గట్టిగా లాక్కువస్తున్నాను."
    కనకారావు కొద్దిసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. మధురమీనాక్షి "టీ తాగుతారా?" అని అడిగింది.
    "అక్కరలేదు. నేను డ్యూటీమీద రాలేదు. ఈ కేసు ఎటూ తేలలేదు. గోవిందరావుగారి సాక్ష్యం ఎలాగూ  చాలదు. నా పర్సనల్ ఇంట్రస్ట్ మీద వూరికే మాట్లాడటానికి వచ్చాను..."
    "ఈ తెలివితక్కువ ఆయనని పట్టుకొని దయచేసి మా సంసారాన్ని చిక్కులో పడవేయవద్దు." కళ్ళు తుడుచుకుంటూ అంది మధురమీనాక్షి.
    "మీరు భయపడకండి. ఒక అమాయకుడ్ని లేనిపోని చిక్కుల్లో ఇరికించటం ఒక హంతకుడ్ని వదిలేయటం నా అభిమతం కాదు." అంటూ కనకారావు కుర్చీలోనుండి లేచాడు.
    మధురమీనాక్షి  దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
    కనకారావు వెళ్ళినట్టే వెళ్ళి పది నిముషాలు తరువాత తిరిగివచ్చాడు. మూసివున్న తలుపుకి చెవి ఆనించి నిలబడ్డాడు.
    లోపలినుండి స్పష్టంగా గోవిందరావు మధురమీనాక్షి అనుకునేమాటలు సాగాయి.
    "నేను ముందే చెప్పానా?" కోపంగా అంది మధుర మీనాక్షి.
    "నువ్వు చెప్పినట్టు నేను విన్నాను కదా!" తగ్గు స్వరముతో అన్నాడు గోవిందరావు.
    "వినకపోతే కొంపమీదకి తీసుకురా! తాగుడికి ఎలాగూ బానిసవయ్యావని భరిస్తున్నాను. నోరుమూసుకుని వుండమంటే మాత్రం వుండవు. అన్నింటిలో తలదూర్చి కొంపమీదకి ఏదో ఒకటి తెస్తావు. ఇది మామూలు వ్యవహారం కాదు. పోలీసులతో వ్యవహారం, హత్యానేరం. ఆరోజుతోనే అయిపోయింది. ఇంకేం జరగదన్నాఉ కదా! కాని ఇప్పుడూ మళ్ళీ పోలీసు వాడు మనింటికి వచ్చాడు. నువ్వేం చెయ్యకపోయినా రేపు నీమీద అనుమానం వస్తే లాక్కెళ్ళి జైల్లో కూర్చోబెడతారు, మన బ్రతుక్కి అదొక్కటే తక్కువ..."
    "నేనేం మాట్లాడనని మాట ఇచ్చాకదా! ఇందాక కూడా మాట్లాడకుండా పడుకున్నావా లేదా!" గోవిందరావు అన్నాడు.
    "ఆ పడుకున్నాఉలే "ఓ బుడ్డి కొనియిస్తే ఐసై పోయి అడ్డమైన వాగుడూ వాగుతావు" రుసరుసలాడింది మధురమీనాక్షి.
    గోవిందరావు మాట్లాడలేదు.
    ఆ తరువాత వాళ్ళ మాటలు వేరే విషయాలమీద దొర్లాయి.
    ఇంకెంతసేపు నుంచున్నా ఇంక తనకు ఉపయోగపడే చిన్న మాట కూడా తన చెవినపడదని గ్రహించి కనకారావు మెట్టుదిగి వెళ్ళిపోయాడు.
    
                                  14

    గోవిందరావు బజారులో నడుస్తున్నాడు. అపుడు సాయంత్రం ఐదుగంటలయింది.
    కొద్దిగా మనిషీ తూలుతున్నాడు. నీరసంగా అడుగులు తడబడుతూంటే కాళ్ళీడ్చుకుంటూ తల పూర్తిగా వంచేసుకుని తడబడే అడుగులతో నడుస్తున్నాడు. ఆ సమయంలో పరిసరాల గూర్చి పట్టలేదు. పైకే గొణుక్కుంటూ పోతున్నాడు. చూసేవాళ్ళకి ఆ క్షణంలో గోవిందరావు పిచ్చి వాడిలా వున్నాడు.
    సరిగా 2గంటలనుండి, మామూలు దుస్తులతోవున్న కానిస్టేబుల్ కనకారావు, గోవిందరావు చర్యలను కనిపెడుతూ దూరదూరంగా అనుసరిస్తూ వస్తున్నాడు.
    గోవిందరావు మెయిన్ రోడ్డుమీదనుండి ప్రక్కసందులోకి తిరిగాడు.
    "గోవిందరావుగారూ!"
    తనపేరు ఎవరో పిలవటం విని టక్కున వెనుతిరిగాడు. భయంతో చూశాడు.
    "నేనే గోవిందరావుగారూ!" కనకారావుని, గుర్తుపట్టలేదా?" కనకారావు చిరునవ్వుతో అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS