Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 22

    ఇంకా ఆమెను బాధపెట్టడం ఇష్టంలేక శరత్ అన్నాడు.

    "ఇదిగో మనక్కావల్సింది ఓ పాప లేదా బాబు అంతేగదా! మొత్తానికి మనకు పుట్టబోతున్నాడు."

    "అంతా డూప్...నాకు తెలీకుండా నేనెలా కంటాను చెప్పు?" అంది అయినా ఏదో ఆశ చావనట్టు.

    "మన మధ్యకు ఓ బాబు వస్తాడు. నీ వింకా బిజీ."

    "ఏం? మీరుగాని నెలతప్పారా...?" అంది పెదాలు విచ్చుకునేలా చిన్నగా నవ్వుతూ.

    కళ్ళలో తడి నెమ్మదిగా ఆరిపోతోంది.

    అప్పుడు విన్పించింది__

    తెరలు తెరలుగా...ఊపిరితిత్తుల్ని పిడికిళ్ళతో పిసికిపట్టి...శ్వాస నాళాల్ని పెరికి వేస్తున్న ఆర్తనాదం.

    ఉలిక్కిపడ్డారిద్దరూ...గబగబా క్రిందికి పరిగెత్తుకొచ్చారు. అప్పటికే రంగి ఆదుర్దాగా పైకి వస్తోంది.

    "ఏమైంది రంగీ" అంటూనే క్రిందికొచ్చారు.

    ఆ గదిలో వృద్దుడు దగ్గిదగ్గి భళ్ళున రక్తం కక్కుకున్నాడు శ్వాసందటంలేనట్లు రొప్పుతున్నాడు. ఆ రొప్పటంలోనే బాధగా అరుస్తున్నాడు. నిర్విరామంగా ఎక్కివస్తున్న దగ్గును ఆపుకోలేక మెలికలు తిరుగుతూ....పొర్లటంతో రూమంతా రక్తం మరకలు.

    "నాన్నా....నాన్నా..." అంటూ శరత్ ఆదుర్దాగా పట్టుకున్నాడు. తోటమాలి రామన్న, పనిమనిషి రంగి పరుగున వచ్చి చేరారు సుగాత్రి కూడా పట్టుకాగానే, శరత్ వెళ్ళి డాక్టర్ కు ఫోన్ చేస్తున్నాడు.


   
                          *    *    *    *    *


    "ఈ సృష్టిలో అద్దం కంటే నునుపైంది ఏమిటి నిర్లిప్తా?" అన్నాడు నిఖిల్ నిలువుటద్దం ముందు నిల్చుని తలదువ్వుకుంటూ.

    "అద్దంకంటే నునుపైంది....వూహు...ఇంకేమీలేదు ప్రపంచంలో" దృఢంగా అంది నిర్లిప్త.

    "ఇంత చిన్న ప్రశ్నకు నీకు జవాబు దొరకటం లేదంటే- మొన్నటి 'ఇంటిపేరు' సమాధానం ఎవరో చెప్పివుంటారు తప్పక."

    "నాకెవరూ చెప్పలేదు తెలుసా?" అంది రోషంగా నిర్లిప్త.

    "అద్దం కంటే నునుపైంది....గోద్రేజ్ బీరువా" అన్నాడు ఆమెవేపు చూస్తూ కొంటెగా.

    నిర్లిప్త కోపం తారాస్థాయి నందుకుంది. వెనుకవేపు వేలాడుతున్న కొంగును కుడిచేత్తో లాగిపట్టి...చిర్రు బుర్రు లాడుతూ అంది.

    "ఇదిగో మాటిమాటికీ గోద్రేజ్ బీరువా...గోద్రేజ్ బీరువా అని ఎత్తిపొడిస్తే నేనూరుకోను. ఆఫ్టరాల్ ఒక బీరువా పెళ్ళిలో ఇస్తానని మా నాన్న ఇవ్వనందుకేగదా...మీరింతళా దెప్పిపొడుస్తున్నారు" అంది నిర్లిప్త ఏడ్పు మొహంతో.

    "అదికాదు నిర్లిప్తా. సారీ! ఏదో జోక్ చెయ్యాలని తప్ప నిన్నేడ్పించాలని కాదు. ప్రామిస్. ఇంతకీ ఆ అద్దం కంటే నునుపైన దేమిటో చెప్పనా?" అన్నాడు దగ్గరగా వచ్చి.

    "చెప్పండి" బుంగమూతితోనే అంది.

    "మిర్రర్ కంటే స్మూత్ ఐంది__బట్టతల" అన్నాడు నవ్వేస్తూ__ నిర్లిప్త కూడా నవ్వింది.

    "నిజమోయ్! మొన్న టెలిఫోన్ భవన్ లో జె.ఇ గారి ముందు మేమంతా కూచుని వుంటే__మా అందరి ప్రతిబింబాలు కెలీడియో స్కోప్ అండ్ కలర్ లో కన్పించాయి."

    "సరేగాని__నేవెళ్ళాలి" అంది కదులుతూ.

    "ఆగాగు__హార్లిక్స్ అడ్వర్ టయిజ్ మెంట్ విన్నావా? ఎప్పుడైనా జనరంజనిలో!"

    "విన్నాను__ఏం?" అంది ఆగి.

    "అందులో చివర ఓ కుర్రాడు నేను ఆర్లిక్స్ తాగను_తింటాను అంటాడు గుర్తుందా?"

    "వుంది. ఫిల్మ్ లో కూడా ఆ డైలాగు వుంది" అంది నిర్లిప్త.

    "దీనినే నిరోధ్ కు అన్వయిస్తే, ఆ కుర్రాడు ఏంచెప్తే బావుంటుందో చెప్పు" అన్నాడు నిఖిల్.

    కాసేపు ఆలోచించగా__నిర్లిప్త మొహం ఎర్రబడింది సిగ్గుతో.

    "ఏమో నాకేం తట్టటం లేదు." అంది నిర్లిప్త తెలిసినా సిగ్గుతో చెప్పలేకపోతూ.

    "నే చెప్పేస్తున్నా...."

    "వద్దు బాబు, రోజు రోజుకీ మీకు సిగ్గులేకుండా పోతుంది__" అంది.

    "నేను నిరోధ్ పెట్టుకోను__ఊదుతాను-" అనే కుర్రాడి స్టయిల్ లో మాట విన్పించేసరికి ఇద్దరూ నివ్వెరపోయారు, ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గుమ్మంవేపు చూసారు.

    గుమ్మంలో నవ్వుతూ__బాబీ!


   
                          *    *    *    *    *


    "మళ్ళీ ఏమైనా అబ్నాక్షియస్ కాల్స్ వచ్చాయా__?" అడిగాడు అమితేష్.

    "హలో-రా-నిన్ననే వస్తావనుకున్నాను__" అన్నాడు అమితేష్ భార్గవను ఆహ్వానిస్తూ.

    భార్గవ విష్ చేసి కూచున్నాడు. ఇంతలో కాఫీలు తెచ్చిపెట్టి వెళ్ళి పోయాడు ఒక అటెండర్.

    "ఆ....టెలిఫోన్ భవన్ లో జె.ఇ.గారితో మాట్లాడుతుండగా__"

    "ఓహో...అక్కడికి కూడా చేసిందన్న మాట. ఈసారి ఏం చెప్పింది?" అమితేష్ కుతూహలంగా అడిగాడు.

    "ఏం లేదు. పేరు చెప్పి వూర్కొంది."

    "యూ డోంట్ వర్రీ మిస్టర్ భార్గవా! నీకు ఏ క్షణం అవసరం పడినా వీడున్నాడని గుర్తుంచుకో. వయసు వచ్చిన ఆడపిల్లయి వుంటుంది. నీతో ఆటలాడుకుంటుందేమో? బట్! ఏ సమయంలోనూ నువ్వేం ఫీల్ కావద్దు. ఒకటి గుర్తుంచుకో! నీకు ఏ కొంచెం ఎవరి మీద అనుమానం వచ్చినా నాకు అర్జంటుగా తెలుపు. రెడ్ హాండ్ గా నేనే పట్టుకొని...ఆ అమ్మాయిని నీకు కానుకగా ఇస్తాను."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS