భార్గవ నవ్వాడు. ఆ నవ్వులో జీవకళ ఉట్టిపడలేదు.
"అన్నట్టు నీ సుపుత్రుడ్ని ఒక్కసారి తీసుకురాకూడదా? ఎప్పుడు నీ ఇంటికి వద్దామన్నా కుదర్డం లేదు. మా ఇంటర్ పోల్ డిటెక్టివ్ లకు కూడా దొరకని గజదొంగ అవుతాడేమో?"
"ఈసారి వచ్చేప్పుడు తీసుకొస్తాను."
"నువ్వు మరో పెళ్ళి చేసుకోకూడదా భార్గవ్!"
ఆ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేనట్టు మౌనంగా వుండిపోయాడు.
"ఎన్నాళ్ళని ఒంటరిగా వుంటావ్. నువ్వింత హోదాలో వున్నప్పుడు కో అంటే కోటి మంది అమ్మాయిలు కట్నంతో సహా వస్తారు. పోనీ...నిన్ను హెచ్చరిస్తున్న అమ్మాయిని పట్టివ్వనా? అయినా ముందు కీడెంచి తర్వాత మేలెంచాలని ఏదైనా పథకం వేస్తుందేమో? ఎవరికి తెలుసు?" అన్నాడు అమితేష్ నవ్విస్తూ.
"సరేగాని....రిజల్ట్స్ ఏమయ్యాయి?"
అమితేష్ టేబిల్ డ్రాయర్ లోంచి ఓ ఫైల్ తీసి- "ప్రింట్స్ తీసాం భార్గవా! ఆ అమ్మాయి వేలి ముద్రలు స్పష్టంగా పడ్డాయి. ఈ ఫోటోల్లో చూడు.
ఇకపోతే మా దగ్గరున్న ఆడ నేరస్థుల వేలిముద్రల ఫోటోలతో పోల్చి చూసాం...ప్చ్...అలాంటి పోలికలేం లేవు" నిరాశగా అన్నాడు.
భార్గవ ఫింగర్ ప్రింట్స్ ని సూక్ష్మంగా చూస్తున్నాడు. అర్ధం కాని గీతలు....గుండ్రంగా అక్కడక్కడా. అవి చూసి ఏదో సాధించాలనుకున్న భార్గవకు అప్పుడు నిరాశే మిగిలింది.
వీటి ద్వారా తనెవర్నని గుర్తుపట్టగలడు? ఏ ఆడపిల్లని పట్టుకోగలడు.
ఒక్కోసారి ఇంటర్ పోల్ డిటెక్టివ్ లకే సాధ్యం గానిది...తనెంత?
తలా తోక తెలియని వ్యక్తి ముద్రలు సంపాదించినా...ఏం చెయ్యగలడు?
అసలీ ఫింగర్ ప్రింట్స్ తో ఏ ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు?
ఏదో చెయ్యాలని ఆతృతపడిన భార్గవలో ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నిస్సత్తువతో కణతలు రుద్దుకుంటూ "ఇవి చూస్తే నాకేం అర్ధం కావటంలేదు అమితేష్. నాకు తప్పక నీ సాయం కావాలి!" అన్నాడు భార్గవ.
"ష్యూర్. నన్ను రంగంలోకి దిగమంటావా? ఆ ఆడపిల్లను అమాంతం ఎత్తుకు వచ్చి నీ ముందు పడేస్తాను. అన్నట్టు నీ ఫోన్ అబ్జర్వేషన్ లో పెట్టవా?"
"కాల్స్ రికార్డ్ చెయ్యమని జె.ఇ.గారికి చెప్పివుంచాను." అని ఫోటోలు టేబిల్ పై వుంచాడు. అంతలో అమితేష్ కు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే__
"ఇంతకీ నీ ఇంట్లోని ఫోన్ కు ఎన్నిసార్లు హెచ్చరికలు పంపింది?" అన్నాడు.
"భార్గవ గుర్తుచేసుకుంటూ" మొదట శరత్ గారి ఆఫీస్ కి, తర్వాత నీ ముందు, ఆ తర్వాత టెలిఫోన్ భవన్ లో జె.ఇ.గారి ఆఫీస్ లో...అంటే...ఇంతవరకూ నా ఇంట్లోని ఫోన్ కు బెదిరింపులు రాలేదు." చెప్పాడు ఎందుకన్నట్లు.
"ఒహౌ....చాలా తెలివైన ఆడదన్న మాట. స్టుపిడ్...అది నీ ఇంటికి హెచ్చరిక చేస్తే నీ ఫోన్ నెలాగూ అబ్జర్వేషన్ లో పెట్టివుంచుతావనే....చాలా తెలివిగా నిన్ను ఫాలో అవుతూ, అవుట్ డోర్ లో నువ్వెళ్ళిన చోటికి ఫోన్ చేస్తుందన్న మాట. బాస్టర్డ్...అలా అయితే ఎవరి ఫోన్ లవీ, ఎందరి ఫోన్ లనీ అబ్జర్వేషన్ లో పెట్టగలం? నిజంగా అది తెలివైన ఆడదే."
అమితేష్ అనుమానం అక్షరాలా నిజమనిపించి....భార్గవలో భయం ఉధృతమైంది. అసలీ బెదిరింపులు ఎక్కడికి దారి తీయబోతున్నాయ్? ఆలోచించలేకపోయాడు. మెదడు మొద్దుబారిపోతుంది. అంతలో మృత్యు వివాదంలా మ్రోగింది ఫోను.
అప్రతిభులై చూసారిద్దరూ దానివైపు....ఆ క్షణం అలాంటిది. అది సమర శంఖంలా మ్రోగుతూనే వుంది.
"నువ్వెత్తుతావా? నన్నెత్తమంటావా? భారం నా మీదే పెడుతున్నావ్ కాబట్టి....ఇక్కడి నుండే నా ఇన్వెస్టిగేషన్ మొదలెడతాను మరి...." ఐ విల్ టై మై లెవెల్ ఫాస్ట్..." అన్నాడు అమితేష్ ఫోనెత్తకుండానే. ఎందుకైనా మంచిదని...ఆ కాల్ ని రికార్డ్ చేయడానికి తన పాకెట్ టేప్ ని తీసి పట్టుకున్నాడు.
ఆ మ్రోత భార్గవకు చేతులాడ్డం లేదు. "నువ్వే ఎత్తుకో....ఈ సారి ఏమంటుందో చూద్దాం" అన్నాడు.
"ఎత్తకపోతే అమ్మాయిగారు బాధపడతారేమో....అలా ఎత్తకుండానే మనం కూడా కాసేపు ఏడిపిద్డామా" అన్నాడు అమితేష్. భార్గవలో భయంతో కూడిన టెన్షన్ పెరిగిపోతుంటే" ముందు ఏం చెప్తుందో విందాం. నువ్వే ఎత్తు" అన్నాడు.
అమితేష్ అలా కెడిల్ ని చెవిదగ్గరుంచుకున్నాడో లేదో....ఆ గొంతు విని షాక్ తిన్నట్టయ్యాడు.
"ఇంతసేపూ నిద్రబోతున్నావా? డిటెక్టివ్ లంటే ఎంత ఆక్టివ్ గా వుండాలో నీక్కూడా చెప్పాలా.... డామిట్స్. ఎమ్టీ మైండీజ్ డెవిల్ ఇండస్ట్రీ అన్నట్టు....అసలు మిమ్మల్నెప్పుడూ ఖాళీగా వుంచకూడదు. ఈ అరనిమిషంలో రెండు హత్య కేసుల ఆధారాలు దొరక బట్టేంతటి ఆక్టివ్ వుండాలి. ఇంతకీ పాత బస్తీ హత్యకేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకొచ్చింది ....ఏమైనా తేలిందా? మినిస్టర్స్ ఒత్తిడులన్నీ నా ప్రాణానికి....మీరేమో సుష్టుగా గడ్డితిని....నిద్రపొండి" తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు అవతలి వ్యక్తి.
"ఎస్ సార్! దాదాపు హత్య కేసు పరిశోధన పూర్తయింది సార్! ఆధారాలన్నీ దొరికాయిగాని.... హంతకుడి కోసం డాగ్స్ తీసుకొని పోలీసులు బయల్దేరారుసార్! త్వరలోనే దొరకొచ్చు సార్. తప్పక పట్టుబడతాడు సార్" గణగణా అప్పజెప్పాడు అమితేష్.
