Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 21

    "సరే! ఈ ఒక్క రాత్రికి విడిచిపెట్టు. ఎందుకంటే ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్ విన్ స్టన్ చర్చిల్ అని ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు పార్టీ ఇస్తూ ఏదో మ్యూజికల్ నైట్ అరేంజ్ చేసాడట. అంతా వి.ఐ.పీ లు వస్తారు. ఆ పార్టీకి రావల్సిందిగా చర్చిల్ మరీ మరీ చెప్పాడు. వెళ్ళక తప్పదు సుగాత్రి.... నైట్ లో వెళతాను నా కోసం ఎదురు చూడకేం?" అన్నాడు తినటం ముగించి వాష్ బేసిన్ దగ్గరికి వెళుతూ.

    "అంత రాత్రి ఒక్కరే వెళతారా?" అంది సుగాత్రి.

    "ఏమిటి సుగా! రోజు రోజుకు మరీ చిన్నపిల్లవయి పోతున్నావ్. నాకేం భయమా? పోనీ నువ్వు తోడు రాకూడదా?"

    ఈ చివరి వాక్యం సుగాత్రి గుండెల్లో సూటిగా తాకి జివ్వున కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి.

    "పెళ్ళాం ఇంటిదాకానే తోడొస్తుంది. కొడుకు మాత్రమే__" అసంకల్పితంగా గుర్తొచ్చిన దేవకమ్మ మాటలు అస్పష్టంగానయినా సుగాత్రి చెవుల్లో ప్రతిధ్వనించాయి. అలా ఒకటి వెనుక ఒకటి దేవకమ్మ మాటలు గింగుర్లు తిరుగుతున్నాయి.

    ఓ కడలి కెరటం చెలియలి కట్టను చెలిమితో తాకి వెళ్ళింది.

    సుగాత్రి కళ్ళలోని తడిని గుర్తించిన శరత్...ఆమెను దగ్గరకు తీసుకుంటూ ఏమిటి సుగా అన్నాడు.

    ఆమె బరువైన గుండెల్లోంచి వస్తున్న భారమయిన శ్వాస వేడి నిట్టూర్పులై శరత్ ని స్పృసిస్తోంది.

    ఆమె చుబుకాన్ని ఎత్తి ఏమైంది? అన్నాడు మరోసారి.

    ఎదలోపలి బాషనంతా ఏర్చి కూర్చి, పేర్చి గొంతులోకి తెచ్చి కూడబలికినట్లు అన్నా....అస్పష్టమై అధరాల్నిదాటి రాలేదామాట.

    "ఏ....మం...డీ....!"

    ఆమె కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కళ్ళతోనే ప్రశ్నిస్తున్నాడు శరత్.

    "మీరేమో...మొన్నేదో చెపుతానన్నారు!"

    అతని భ్రుకుటి ముడిపడింది.

    అతడు మొన్న హాస్యానికే అన్నాడో, లాస్యానికే అన్నాడో తెలీక పోయినా, ఆమెలో ఏదో చిగురాశ!

    అదే అడగాలని ప్రయత్నిస్తూ...

    "పాప....బాబు..." అంది నసిగినట్టు.

    అది విని సారథ పెద్దగా నవ్వాడు ఇంతేనా అన్నట్టు. తర్వాత నిమిషంపాటు ఆలోచించి....ఇప్పుడు చెప్పను సారీ అన్నాడు.

    "ఏం? నాకు చెప్పకూడని రహస్యమా?"

    "అవునూ! ఇంకొద్ది రోజులుగా నీకు చెప్పకూడని రహస్యమే ఇంకా అతనికే చెప్పలేదు" అన్నాడు అకస్మాత్తుగా.

    క్షణంపాటు అనుమానంగా చూసి "అతనా...? అతనెవరు...? ఏం చెప్పాలి?" ఆమెలో ప్రశ్నల పరం పర.

    తన పొరబాటుకు తానే ఉలిక్కిపడ్డాడు శరత్. నిర్ణయానికి ముందే మాట జారినందుకు గతుక్కుమని "అదికాదు సుగా..." తొట్రుపడ్డాడు.

    "ఏది కాదండీ?" ఆత్మీయతను రంగరించే కంఠం అనుమానాన్ని ధ్వనించింది.

    శరత్ కొద్దిసేపటివరకూ మౌనం వహించాడు.

    ఆ మవునమే...ఆమెలోని అనుమానాన్ని దృఢపరుస్తోంది.

    ఏం చెప్పాలో తెలియక...తీసుకున్న నిర్ణయానికి రూపం రాక, ఇంకా కొలిక్కిరాని విషయాన్ని జారవిడిచినందుకు....పశ్చాత్తాపపడినట్లు నిశ్శబ్దంగా వుండిపోయాడతను.

    "మీరేం అంటున్నారో నాకేం అర్ధం కావటంలేదు." అతని భుజాల చుట్టూ చేతులేసి గుండెల్లో గువ్వలా ఒదిగిపోతూ అంది.

    "అలా అని కాదు సుగా..."

    "లేదు మీరు నా దగ్గరేదో దాస్తున్నారు. చెప్పండీ? ఇన్నాళ్ళూ మీ హృదయాన్ని పంచుకున్నా, ఆ హృదయంలో నాకు తెలియందేదో దాచుకుంటున్నారు.....చెప్పండి ప్లీజ్!"

    అన్నేళ్ళ దాంపత్యంలో ఆమె ఎప్పుడూ అలా అభ్యర్ధించలేదు. శరత్ కు ఆ సమయంలో ఏం చెప్పాలో అర్ధంకాలేదు ఏదో సంఘర్షణతో మనసులో అనుకున్నాడు....

    తను సుగాత్రి అభిప్రాయం తెల్సుకోకుండానే....భార్గవను ఆ కోరిక కోరదల్చుకున్నాడా?

    కాని....సుగాత్రి అందుకు ఒప్పుకుంటుందా? ఇంతకీ భార్గవ తన కోరికతో ఏకీభవించి ఒప్పుకుంటాడా?

    ఇప్పుడే అసలు విషయం చెబితే...సుగాత్రి ఒప్పుకుంటుందా?

    ప్రశ్నలు! ప్రశ్నలు!! ప్రశ్నలు!!!

    ఎన్ని రాత్రులు ఆలోచించి తను ఈ నిర్ణయానికి వచ్చాడు! తన నిర్ణయాన్ని ఈ లోకం హర్షిస్తుందా? లోకంతో తనకేం పని?

    తమ దాంపత్యానికి కావల్సిందొక వారసుడు. అంతే!

    అయినా ఏదో చెప్పాలనుకుంటున్న అతని మాటలు గొంతులోనే సమాధి అవుతున్నాయి. అలాగే సుగాత్రిని హత్తుకున్నాడు మరింతగా.

    ఎంతసేపో...

    వాళ్ళ అధరాల మధ్య నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది.

    వాళ్ళ శరీరాల్లోని ఇనుము కరిగి మంచు సముద్రాలై ప్రవహిస్తోంది.

    వాళ్ళ వెన్నుముకల్లోంచి అన్యోన్యం కంఠ నరాల్లోకి ప్రసరించి మెడవంపుల్లో ఒదిగిపోతూంది.

    ఆమెకు అడగాలనివున్నా...ఏం అడగాలో తెలీని స్థితి.

    అతనికి చెప్పాలనివున్నా....అసలేం చెప్పాలో అర్ధంగాని పరిస్థితి.

    అది విచిత్ర స్థితి....

    కాలం క్షణాల్ని కంటూనే వుంది నిరంతరంగా....పుట్టిన క్షణం చచ్చిపోతూనే వుంది నిశ్శబ్దంగా....

    ఆ నిశ్శబ్దాలన్నీ కూడి నిమిషాలై త్యాగానికి సిద్దపడుతున్నాయి నిర్ధాక్షిణ్యంగా....   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS