13
టక్, టక్, టక్.
ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది.
నాలుగు పెగ్ లోవున్న గోవిందరావు తలుపు త్రోసుకుని రండి అన్నాడు.
మరోసారి తలుపు తట్టిన చప్పుడు వినపడింది. "ఎవరో వచ్చారు. తలుపు తెరవండి" ప్రక్క గదిలోవున్న మధుర మీనాక్షి అంది.
"తలుపు తెరిచే వుంది మీనూ" తడబడుతూ చెప్పాడు గోవిందరావు.
"మీకు ఒకటికి రెండుగాను, లేనిదీ వున్నట్టు కనపడుతుంది. తలుపు లోపల గడియవేసి వుంది. వాళ్ళెవరో తలుపు నాలుగుసార్లు కొట్టారు. వెళ్ళి తలుపు తీయండి" అంది మీనాక్షి విసుక్కుంటూ.
"తలుపు లోపల గడియ వేసుంటే తలుపు ఎవరైనా కొడతారా?"
"మన కాలింగ్ బెల్ చెడిపోయి నెల అయ్యింది వచ్చిన వాళ్ళు తలుపు కొట్టక చస్తారా! వెళ్ళి తలుపు తీయండి."
"సరీగా నెల అయ్యిందా? నెలమీద ఒకరోజు అటు ఇటు అయ్యిందా?"
"నా బొంద అయ్యింది" అంటూ మధురమీనాక్షి ప్రక్కగదిలో నుండి విసురుగా వచ్చి, తానే వెళ్ళి తలుపు తీసింది.
తలుపు అవతల కానిస్టేబుల్ కనకారావు, మామూలు డ్రస్సుతో నుంచొని వున్నాడు.
"గోవిందరావుగారు వున్నారా?" మర్యాద పూరిత స్వరంతో అడిగాడు.
ఆ పరిచిత వ్యక్తి ఎవరో తెలియక అతన్ని ఎగాదిగా చూస్తూ "వున్నారు" అంది మధురమీనాక్షి.
ఈ లోపలే వీళ్ళ మాటలు విన్న గోవిందరావు ఆ వచ్చింది ఎవరో తెలియకపోయినా, తనకోసం వచ్చారన్నది గ్రహించి కుర్చీలోంచి పైకి లేచాడు. అయితే ఒళ్ళు స్వాధీనంలో లేకపోవడంతో మళ్ళీ తూలి కుర్చీలోనే కూలబడ్డాడు. అక్కడే కూర్చుని "ఎవరది, లోపలికి రండి" అని గట్టిగా అరిచాడు.
మధురమీనాక్షి ప్రక్కకు తొలగడంతో కనకారావు లోపలికి వచ్చాడు. గోవిందరావు తలఎత్తి చూసి కనకారావు మొహాన్ని చూసి గుర్తు పట్టాడు. "ఇతన్ని తను చూశాడు. కాని ఎప్పుడు? ఎక్కడ?" అది మాత్రం గుర్తు రాలేదు. గోవిందరావుకి మనుష్యుల మొహాలు గుర్తుంటాయి కాని, మిగతావేమి గుర్తుండవు. "తనకీ బాగా తెలిసినవాడే కాకపోతే వివరంగా గుర్తులేకుండా వుంది. తెలిసినవాడు కాబట్టే ఇంటికి వచ్చాడు. తను మర్యాద చెయ్యకపోతే బాగుండదు." అనుకున్నాడు.
"ఏమిటీ! భలేవారే రండి, రండి. చాలా రోజులకి వచ్చారు. బొత్తిగా నన్ను మా యింటిని మరచి పోయినట్టున్నారు." అక్కడే కూర్చుని చిరునవ్వుతో ఆహ్వానించాడు గోవిందరావు.
గోవిందరావు అలా అనేసరికి కానిస్టేబుల్ కనకారావు తెల్లబోయాడు. టేబుల్ మీదవున్న సీసాని, గ్లాస్ ని చూసి అరక్షణంలొ గోవిందరావు వున్న పరిస్థితిని గ్రహించాడు. చిరునవ్వుతో వచ్చి గోవిందరావు ఎదుటి కుర్చీలొ కూర్చున్నాడు.
"మీరు కూడా వచ్చి ఇటు కూర్చోండమ్మా!" అన్నాడు కనకారావు మధురమీనాక్షితో.
ఈ అపరిచిత వ్యక్తి ఎవరో తెలియక పోయినా ఇప్పుడు తెలుసుకోవాలనే కుతూహలంతో మోడా లాక్కుని ఒక ప్రక్కగా కూర్చుంది.
గ్లాసు సగానికి నాటు సారాని వంపి "చాలా కాలానికి వచ్చారు. తీసుకోండి" గ్లాసు కనకారావు ముందుకు జరుపుతూ మర్యాదగా అన్నాడు గోవిందరావు.
"నో, థాంక్స్" మర్యాదగా అన్నాడు కనకారావు.
"ఇప్పుడు ఎక్కడ వున్నారు మీరు?" అడిగాడు గోవిందరావు.
"మీ ఇంట్లో, మీ ఎదుట."
"భలే జోక్ వేశారు? నే నడిగేది డ్యూటీ విషయం ఎక్కడ చేస్తున్నారు?"
"మామూలే పోలీస్ స్టేషన్ లో."
గోవిందరావు చటుక్కున కుర్చీలోంచి పైకిలేచి శాల్యూట్ కొట్టి, మళ్ళీ కుర్చీలో కుదేసుకు పోయినట్టు కూర్చుండి పోయాడు. తాగినపుడు అసలే అంతంత మాత్రంగా పనిచేసేబుర్ర ఇపుడు మరింత అయోమయంలో పడింది. పోలీసు ఆ మాట అంటే భయం. మళ్ళీ ఎందుకు భయమో అర్ధం కాలేదు. ఎదురుగా కూర్చున్న వ్యక్తి మొహం తను చూశాడు.
అది పరిచయమైన మొహంలా వుంది. అలా అని పోలీసులలో తెలిసినవాళ్ళు ఎవరూ లేరు. ఈ ఇంద్రజాలం ఏమిటో తెలియక గోవిందరావు బుర్ర మరింత గిర్రున తిరగటం మొదలుపెట్టింది.
కనకారావు తను పోలీస్ స్టేషన్ లొ పని చేస్తున్నా నని చెప్పంగానే ఒక ప్రక్క గుండె దడదడ లాడింది. మరో ప్రక్క బుర్ర పాదరసంలా పని చేసింది. తొందరగా తెలివి తెచ్చుకుని "మీరు పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తుంటారు?" అంది మధురమీనాక్షి.
"నా పేరు కనకారావు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ ని. హోటల్ లో హత్య జరిగినపుడు హత్య చేయబడిన అమ్మాయిని మీవారు చూసినట్టు చెప్పారు ప్రస్తుతానికి ఆ సాక్ష్యం అంతగా ఉపయోగపడకపోయినా, హత్యానేరం బయట పడినపుడు, ఇదే సాక్ష్యం బలంగా ఉపయోగపడుతుందని గ్రహించాము. అప్పుడు ఆయన చెప్పే తొందరలో, కొన్ని విషయాలు చెప్పడంలో ఏమన్నా మిస్ అయారేమోనని అనుమానంతో మళ్ళీ వచ్చాను" ఉన్న విషయం యదార్ధంగా చెప్పాడు కనకారావు.
మధురమీనాక్షి గుండెల్లో పెద్ద బండ రాయి పడింది. "చాదస్తపు మొగుడా! తాగి పడుకోమని" చెపితే, తలకొరివి పెట్టటానికి తయారయ్యావా?" కోపంగా అనుకుంది.
"గోవిందరావుగారూ!" కనకారావు పిలిచాడు.
స్వయంగా పోలీసు ఇంటికొచ్చాడు. ఎదురుగా బ్రహ్మరాక్షసిలా కూర్చొని వుంది. ఆ భయంతో గోవిందరావు గ్లాసులోవున్న మొత్తాన్ని గటగటా తాగేసాడు తాగినందువల్ల ధైర్యం రాకపోగా మరింత మత్తు తలకెక్కింది. బరువుగా వాలిపోతున్న కళ్ళని పైకెత్తా "వేమిటి?" అన్నాడు గోవిందరావు.
"నేను కొన్ని ప్రశ్నలు అడగటానికి వచ్చాను."
"నాకేమీ తెలియదు. అన్నీ మా ఆవిడని అడగండి. దానికైతే అన్నీ బాగా తెలుస్తాయి. అవును కదూ మీనూ!" అంటూ బల్లమీద తలవాల్చి పడుకున్నాడు.
