Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 20

    ఆడదంటే అందులో పెళ్ళాం అంటే కోరల్లేని రాక్షసి అని నిర్వచించి, కట్టుకున్న పాపానికి కన్పిస్తే బ్రహ్మని హత్య చేయాలి తప్ప మరెవరినీ ఏమీ అనకూడదని శాసించుకున్న బుద్దిమంతుడు.

    అలాంటి దేవకమ్మను పిలవకూడదనే పిల్చింది పొరబాటున నిర్లిప్త.

    "ఇప్పటిదాకా వంటచేసి మొగుడ్ని ఆఫీసుకు పంపాను ఏడుగురు పిల్లల స్నానాలు చేయించేసరికి ఇదిగో నడుంవంగిపోయి రోజు రోజుకూ ముసల్దానయి పోతున్నాను ఏమ్మా! మీకేంటి? ఓ పిల్లలా పాడా? మొగుడు లేని ముండకూ, పోరగాళ్ళు లేని గొడ్రాలుకు ఇక పనేముంటుందని...? మీకేమిటి? తీరిగ్గా కూర్చుని కబుర్లాడతారు. నా కవతల పిల్లల ఆలనాపాలనా చూసుకోవచ్చు" అంటూ వచ్చి దీర్ఘాలు తీసింది దేవకమ్మ.

    ఒక్కోమాట ఈటెల్లా వచ్చి తూట్లు పొడిచేస్తే నిర్లిప్త కళ్ళలో జివ్వున నీళ్ళు పొంగాయి. అది సుగాత్రి గుండెను కూడా తీవ్రంగా గాయపర్చినా నిగ్రహంతో ఆమె నిలదొక్కుకుంది. అయినా__

    "ఏమిటండీ అలా అంటున్నారు?" అంది సుగాత్రి కోపంగా.

    "పెళ్ళాం ఇంత్య్దాకా వచ్చినా, కొడుకు కాటిదాకా వస్తాడన్నట్టు ఇవాళ గాకపోయినా రేపయినా అగ్గి పెట్టేవాడు లేకపోతే....ఏ అనాధ పెట్టినా అయిదారు వందలక్కాదు గాని ఆస్థంతా రాసివ్వాలంటారు. మీకంత ఆస్థి వుండీ ఏం లాభం? చివరికి ఎవడికి దక్కాలి అదంతా" అంది దేవకమ్మ అక్కసుతో మెటికలు విరుస్తూ.

    "దేవకమ్మా! ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" కోపంగా అరిచింది సుగాత్రి.

    "మా తెలుసమ్మాయ్...మొగునికి మనసు పంచియ్యాలి, పాపకు స్తన్యం పంచివ్వాలనేకదా ఆడదై పుట్టింది.... పిల్లలే లేనప్పుడు అందాలెందుకు....ఆస్తులెందుకు?" దేవకమ్మలో ఉడుకుమోత్తనం రెచ్చిపోయింది.

    నిర్లిప్త నీళ్ళు నిండిన కళ్ళతో అలాగే నిశ్చేష్టురాలయింది.

    "దేవకమ్మా! ముందుక్కడ్నించి నడు....నేనేం చేస్తానో నాకే తెలియదు" అపరకాళిలా ఆవేశంతో చూస్తున్న సుగాత్రిని చూసి ఆవగింజంత కూడా చలించలేదు దేవకమ్మ.

    "వెళతానమ్మా వెళ్తాను నేనేమీ పనిగట్టుకొని రాలేదు....మీరే పిల్చారు. ఉన్నది ఉన్నట్టు అంటే ఉరుకుమోత్తనమనీ....అంత కోపమెందుకు? ఎదగని కడుపుకు పొదగని మొగుడెందుకని, నాకున్న మొగుడు లాంటి వాడయితే పిల్లలు లేకపోతే మరో పెళ్ళాన్ని తెచ్చుకునేవాడు గంతకు తగ్గ బొంతలన్నట్టు మీ మొగుళ్ళూ మీలాగే వున్నారు మీకేమిటీ? పురిటి నొప్పులు తెల్సా? ప్రేగు కోత తెల్సా?? కబుర్లాడుకోవడం తప్ప. మీలాగా నాకేం పనీ పాటా లేదని రాలేదు. వెళుతున్నాను..." రోషంగా దీర్ఘాలు తీస్తూనే వెళ్ళింది దేవకమ్మ.

    రోజు రోజుకూ కరడుగట్టిపోతున్న వేదన కరిగి కరిగి__కడలి తరంగమై పొరలి పొరలి వస్తే ఒదిగి పట్టలేని దుఃఖాన్ని సుగాత్రి ఒడిలో తలపెట్టి చిన్నపిల్లలా ఏడ్చింది నిర్లిప్త పావుగంట వరకూ.

    "ఊరుకో నిర్లిప్తా! వూరుకో పోయిన జన్మలో మనమేం పాపం చేసుకున్నామో మన తలరాత ఇలా వుంది. పిల్లలు లేరు అన్న బాధకంటే ఫిరంగి గుళ్ళలాంటి వీళ్ళ మాటలే మనల్ని చిత్రహింసలు చేసేవి. నీ బతుకు లాగే నా బ్రతుకు కూడానూ. ఆ బాధ నాకు మాత్రం లేదూ? నిగ్రహించుకో నిర్లిప్తా! ఆడదిఅన్నాక అన్నిటిని ఓర్చుకొని కాపురాన్ని సాగించాలి..."

    ఎంతో ఓదార్చాలని ప్రయత్నిస్తున్నా, అదే బాధతో, అదే వేదనతో ఆమె నోటినుంచి మాటలు పూర్తిగా పెగల్లేక ఒక కన్నీటి చుక్క జారి ఒడిలో వున్న నిర్లిప్త తల వెంట్రుకల్లో పడి ఇంకిపోయింది. సుగాత్రి చేయి ఆప్యాయత నిండిన ప్రేమతో నిర్లిప్త తలను నిమురుతుంటే ధారాపాతమైన కన్నీళ్ళు సుగాత్రి చీరకుచ్చిళ్ళను తడుపుతున్నాయి.

    నిర్లిప్త వెక్కిళ్ళు తప్ప విచిత్రమైన స్థితిలో నిశ్శబ్ధంగానే కూచుండిపోయారిద్దరూ.

   
                              *    *    *    *


    అందాన్ని సైతం అందంగా ప్రదర్శించే ఆడవాళ్ళు అతి తక్కువ. ఉన్న అందాల్ని హుందాగా ప్రదర్సించగలిగే నైపుణ్యం సుగాత్రిలో ఎక్కువ. ఆ వైపున్యం ఆమె చుట్టూ వున్న అరిస్టోక్రాటిక్ సొసైటీ వల్ల వచ్చిందో తెలీదుగాని కొద్దిగా టేబిల్ పైకి ఒరిగి వడ్డిస్తోంటే కన్నార్పకుండా చూస్తున్నాడు శరత్.

    పిడికిలి పట్టేంతటి నడుం పియానో రీడ్స్ లా వంపులు తిరిగి లైట్ బ్లూకలర్ శారీని ఉబికి వస్తే వేల వేల భంగిమలలో వెండిసముద్రం ఉప్పొంగినట్లు ఆమె బరువైన వక్షోజాలు బలంగా కాసిన గెలలతో వంగిన అరటి చెట్టులా వంగి వడ్డిస్తోంది.

    వయసు పైబడుతున్న కొద్దీ మనసు ఎదుగుతుంది. మనసెదిగిన కొద్దీ మనిషిలో ఒక హుందాతనం వస్తుంది. ఆ హుందాతనమే నడక, నడతలో మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి అందమే సుగాతఃరిలో ప్రత్యేకత!
    "ఏమండీ! ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ అంటే ఏమిటి?"
 
    తన్మయత్వంతో తదేకంగా చూస్తూ ఊహల్లో మమేకమై పోతున్న శరత్ ఉలిక్కిపడ్డాడు సుగాత్రి ప్రశ్నకు.

    "నేను చదివింది ఎం.బి.ఎ కాని, ఎం బి.బి.యస్ కాదు" అన్నం కెలుకుతూ నవ్వుతూ అన్నాడు శరత్.

    "అప్పుడప్పుడూ ఆటవిక యుగంనించీ అటామిక్ యుగం వరకు జరిగినా డెవలప్ గురించి బెడ్ రూంలో లెక్చర్లిస్తుంటారుగా....అందుకని తెలుసేమో అని__"

    "ఆటవిక యుగం గురించి అంతంత మాత్రం తెలుసు. అటామిక్ యుగం గురించి మరికొంత తెలుసు. అంతేకాని__మధ్యలో నచ్చిన మధ్యయుగం గురించి నాకేం తెలుసు?"

    సుగాత్రి నవ్వింది మరింకేం తెలుసు అన్నట్లుగా.

    "అంతగా తెలుసుకోవాలనుకుంటే మన ఫామిలీ డాక్టర్ కు ఫోన్ చేసి కనుక్కో.... ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ అంటే ఏమిటో__" అన్నాడు.

    "పోనీలెండి! ఈ రోజు మాత్రం ఇండస్ట్రీ నుండి బాగా రాత్రి రాకండి. నేనొక్కదాన్నే ఈ మధ్య మరీ ఒంటరిగా ఫీలవుతున్నాను" అంది గారంగా శరత్ వెనుక నిల్చుని భుజాల మీద చేతులేసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS