Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 20


    "ఈ చనిపోయిన ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు సార్.
    "అదిగో మళ్ళీ...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నన్ను కంగారుపెట్టకండి సార్. పూర్తిగా చెప్పనివ్వండి. మధ్యలో నాకు అడ్డువస్తే చెప్పేది కూడా మరచిపోతుంటాను."
    "అడ్డురాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "నిజంగా ఆ అమ్మాయియెవరో నాకు తెలియదు సార్. కాని, చూశాను. నేను మా యింట్లో కిటికీదగ్గర కూర్చుని ఏమీ తోచక ఈ హోటల్ వైపు చూస్తూ వుండిపోయాను. ఈ హోటల్ లో థర్డ్ ఫ్లోర్ లోని వెనుకవైపు కిటికీలు ఒక రూమ్ ని తెరుచుకున్నాయి. ఆ సమయంలో మా ఫ్లాట్ లో కరెంట్ పోయింది. కిటికీలు పూర్తిగా తెరిచి ఒక అమ్మాయి అక్కడ నుంచొని వుంది. ఆ అమ్మాయే చనిపోయిన ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కిటికీ పట్టుకుని బయటకు చూస్తూ వుంది. ఒకతను ఆమె వెనుకగా వచ్చాడు. భుజాలు పట్టుకుని తనవైపుకి త్రిప్పుకున్నాడు? వారిరువురు అక్కడ నుంచుని పదేపదే ముద్దులు పెట్టుకున్నారు. వాళ్ళని అలా చూడటం తప్పని తెలిసినా ఆ అమ్మాయి అందం నన్ను ఆకర్షించడంతో అలానే చూస్తూ వుండిపోయాను. వెనుక మా ఫ్లాట్ లొ కరెంటు లేకపోవడంవల్ల మనుషులు లేరనుకున్నారో ఏమో, వాళ్ళా కిటికీ దగ్గరనుండి చాలాసేపు కదలలేదు. బాగా చూడటంవల్ల ఆ పిల్లే ఈ పిల్లని గుర్తుపట్టాను. అంతేసార్ నాకేం తెలియదు." గోవిందరావు చెప్పాడు.
    "మీ గదిలో కిటికీదగ్గర నుంచుంటే ఈ హోటల్ రూమ్ లొ జరిగేవన్నీ కనపడతాయా?"
    "ఊహు....రెండు రూమ్స్ మాత్రమే బాగా కనపడతాయి. అదైనా కిటికీ దగ్గరకు బాగా వస్తే రూమ్ లొ మనుష్యులు కనపడరు. పైగా కిటికీలు పూర్తిగా తీసే కనపడతారు. కానీ కిటికీలకు ఎప్పుడు కర్టెన్స్ వేసి వుంటాయి. ఆ అమ్మాయి పూర్తిగా కిటికీలు తెరచి, కర్టెన్స్ తొలగించడం వలన చక్కగా కనపడింది.
    అప్పుడు ఆమె ఏ డ్రస్సులో వుందో వర్ణించగలవా?"
    "అమ్మాయి తెల్లగా మెరిసిపోతున్నది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు. అంతకుమించి ఏమీ చెప్పలేను. అంతా తెల్ల తెల్లగానే వున్నట్లుంది." కాస్త ఆలోచించి చెప్పాడు. గోవిందరావు.
    "అతన్ని వర్ణించగలవా?"
    "మగాడ్ని ఏం వర్ణిస్తాం సార్? నవ్వబోయి ఇన్ స్పెక్టర్ మొహంచూసి ఆగిపోయాడు గోవిందరావు.
    "అతని ఎత్తు, లావు, జుట్టు, రంగు అతను వేసుకున్న దుస్తులు మొదలైనవి ఏమైనా చెప్పొచ్చు. నీకు గుర్తున్నంత వరకూ చెప్పు."
    "మరోసారి చూస్తే గుర్తుపట్టకలను. ఎందుకంటే అతనిక్జి బాగా రింగులు తిరిగిన క్రాఫ్ వుంది. మొహం వున్న దానికంటే కాస్త పొడుగు ఎక్కువ వుంటుంది. మెడ కూడా పొడుగ్గా వుంది. కొందరికి మెడకింద కాయలా లావుగా వుంటుంది. (యాడమ్స్ యాపిల్) అని వుంది. అతనికి పెద్ద పెద్ద పళ్ళు అనుకుంటాను సైడ్ నుంచి కూడా కనిపించాయి. అతను నవ్వుతున్నప్పుడు అతని డ్రస్ ను గుర్తుపట్టలేదు. అతను కూడా తెల్లనివి వేసుకున్నాడనుకుంటాను. ఉన్నట్లుండి మా ఫ్లాటులో లైట్సు వెలిగాయి. కరెంటు వచ్చేసింది. వాళ్ళిద్దరూ గబుక్కున విడిపోయారు. ఆ తరువాత నేను మళ్ళీ వాళ్ళను చూడలేదు. ఇదుగో ఇప్పుడే ఈ అమ్మాయి శవాన్ని చూశాను. నేను చెప్పింది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసింది ఇంతే సార్!" గోవిందరావు చెప్పాడు.
    గోవిందరావు నిజమే చెబుతున్నాడనిపించింది ఇన్ స్పెక్టర్ కి, మరికొన్ని ప్రశ్నలువేశాడు. కాని అతనివద్దనుండి క్రొత్త సాక్ష్యం ఏదీ లభించలేదు.
    గోవిందరావు అడ్రస్ తీసుకుని "అవసరం వస్తే పిలుస్తాను వచ్చి కనపడవలసింది" అని చెప్పి అతన్ని పంపించేశాడు ఇన్ స్పెక్టర్.
    బ్రతుకు జీవుడా అనుకుంటూ గోవిందరావు వెళ్ళిపోయాడు.
    ఆ తరువాత.
    ఇన్ స్పెక్టర్ హోటల్ సిబ్బందిని తదితరులని ప్రశ్నించటం చేశాడు. ఏ చిన్న ఆధారము దొరకలేదు. డెడ్ బాడీకి సంబంధించిన ఏ చిన్న వస్తువూ కానరాలేదు హోటల్ మొత్తం వెదికినా.
    ఆ వుదయం హోటలు నుంచి వెళ్ళిపోయినవారి పేర్లు, అడ్రస్ లు వివరముగా తీసుకున్నాడు. హోటలు వెనుకవైపు ఫ్లాటు "కాదంబరి"లొ గోవిందరావు గదికి ఎదురుగా వున్న గదులు ఏవో తెలుసుకున్నాడు. ఆ గదులను క్షున్నంగా పరిశీలించి 42, 44 నెంబర్లుగల రూమ్స్ కి తాళం వేయించాడు. మిగతా వివరాలు అవసరమైనవి సేకరించుకుని డెడ్ బాడీని అక్కడినుండి తరలింపచేశారు. 42, 44 రూమ్స్ లో దిగింది, వంటరి మొగవాళ్ళు. 42లో దిగింది రాం కుమార్. 44లో దిగింది కిషన్ లాల్ (కిరణ్). అంతవరకే తెలిసింది ఇన్స్ పెక్టర్ కి. ఏ ఆడపిల్లా రూమ్ లో దిగినట్టుకాని, వారితో కలిసి వున్నట్టుకాని ఆధారం దొరకలేదు. కిషన్ లాలు కోసం ఒక అమ్మాయి వచ్చినట్లు, మళ్ళీ అతనితోనే రెండుమూడుసార్లు బయటకు వెళ్ళివచ్చినట్లు, ఇద్దరు ముగ్గురు చెప్పగలిగారు. కానీ ఆ అమ్మాయే ఈ అమ్మాయి కాదని ఆమె బయటకు వెళ్ళి పోయిందని చెప్పారు. వుదయం అతను హోటలుగది ఖాళీ చేసి వెడుతున్నప్పుడు ఆ అమ్మాయి పక్కన వుందని, ఇద్దరూ కలిసివెళ్ళారని రిసెప్షనిస్టు చెప్పాడు గట్టిగా. చివరగా ఇన్స్ పెక్టర్ ఆ రూమ్ కి కాఫీ టిఫిన్ లు సర్వ్ చేసిన రూం బాయ్ ని అడిగాడు.
    "ఆ అమ్మాయి చచ్చిపోయిన అమ్మాయి ఒకటి ఎలా అవుతుంది సార్! వాళ్ళు హోటల్ ఖాళీచేసి వెడుతూ నాకు ఘనంగా టిప్ కూడా ఇచ్చారు" అన్నాడు రూమ్ బోయ్.
    "వాళ్ళెలా వుంటారో వర్ణించగలవా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
    రూమ్ బోయ్, కిషోర్ లాల్ (కిరణ్) ని వర్ణించ గలిగాడు కాని, ఆ అమ్మాయిని వర్ణించలేక పోయాడు.
    కారణం అతను ఎప్పుడు లోపలికి వచ్చినా ముఖా ముఖి ఆమెను చూడక పోవటమే.
    ఇన్స్ పెక్టర్ ఎంత ప్రయత్నించినా, ఏ విధమైన సాక్ష్యాధారాలు లభించలేదు. ఇంతకుమించి.
    కిరణ్ గదిలో అనితను చూసి, అనితను బాగా గుర్తు పెట్టుకున్న సర్వర్, పూర్తిగా నోరుమూసుకున్నాడు. దాంతో ఒక పెద్ద సాక్ష్యం మిస్ అయింది.
    గోవిందరావు సాక్ష్యం ఏమీ ఉపయోగపడదు, అనుకుంటూ ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు తన సిబ్బందిని తీసుకుని కాని ఒకే ఒక వ్యక్తి మాత్రం గోవిందరావు చెప్పింది గట్టిగా మనస్సులో పెట్టుకున్నాడు.
    అతను మరెవరో కాదు.
    ఇన్ స్పెక్టర్ తో వచ్చిన కానిస్టేబుల్ కనకారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS