Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 2

   
    ఆ అమ్మాయి బాల్యాన్ని క్రాస్ చేసి యవ్వనంలోకి దూకి సంవత్సరమైంది. ఆమెమీద మనసు పారేసుకున్నాడు సుబ్రమణ్యం. నిజానికి ఆమెతో చెప్పుకోదగ్గ దూరం వెళ్ళలేదు అతను. అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప వాళ్ళిద్దరి మధ్యా ఏంలేదు.

    "అయితే ఆమె తనని చాలా ఇష్టపడుతున్నట్లు మిత్రుల దగ్గర కోతలు కోస్తుంటాడు అతను.

    "వెళ్ళిరా మంచి ఛాన్స్. వెళ్ళి ఏదైనా మాట్లాడిరా" యోగీంద్ర అతన్ని ముందుకు తోశాడు.

    నిజానికి అప్పుడు వెళ్ళి ఆమెతో మాట్లాడాలని లేదు సుబ్రమణ్యానికి. సరిగా మాట్లాడకపోయినా, కోపగించుకున్నా మిత్రులముందు పరువు పోతుంది. అందుకే సందేహిస్తున్నాడు.

    "నీతో ఆ పిల్ల చాలా క్లోజ్ అనీ, త్వరలోనే వలలో పడిపోతుందనీ కోతలు కోస్తుంటావుగదా. వెళ్ళిమాట్లాడు" రంగడు ప్రోత్సహించాడు.

     సుబ్రమణ్యం అహం దెబ్బతింది. ఏదో ఒకటి మాట్లాడి రాకపోతే ఫ్రెండ్స్ ముందు షేమ్ గా ఫీల్ కావాల్సివస్తుంది. అందుకే ధైర్యం చేశాడు.

    చకచకా నడుచుకుంటూ అంగడి దగ్గరికి వెళ్ళాడు.

    మాధురి సోప్ తీసుకుని బయటికి వస్తోంది.

    ఆమెకు ఎదురుగా నిలుచుని "హలో మాధురీ" అని పలకరించాడు.

    "ఏమిటి?" అంది ఆమె విసుగ్గా ముఖంపెట్టి.

    ఫ్రెండ్స్ ఇది గమనించారా అని అతను మిత్రులవైపు తిరిగాడు. మసక వెలుతురులో ఆమె ముఖం అంత దూరానికి కనపడే అవకాశం లేదని గ్రహింపుకొచ్చాక కాస్తంత స్థిమితపడ్డాడు.

    "నువ్వు సినిమా యాక్టర్ మీనాలా వుంటావ్" అన్నాడు ఆరాధనతో చూస్తూ.

    "నువ్వు మాత్రం నాకు బాబూమోహన్ లా అనిపిస్తావ్" అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.

    అతను పూర్తిగా డీలాపడిపోయాడు.

    కానీ మిత్రులు తన ముఖంచూసి తమమధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో పసిగడతారేమోననే భయంతో తనను తానే కంట్రోల్ చేసుకున్నాడు.

    "ఏరా సుబ్రమణీ! ఏం మాట్లాడావ్?" యోగీంద్ర అతను వస్తూనే క్యూరియాసిటీతో అడిగాడు.

    "మామూలే లేరా, నేను 'మీనాలా వున్నావ్ నువ్వు' అన్నాను. దానికి మాధురి 'నువ్వు నాగార్జునలా వుంటావ్' అంది" అంటూ ప్రారంభించి తన కల్పనాశక్తి ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు ఏవేవో కల్పించి చెబుతున్నాడు.
 
    అంతలో అక్కడికి గంగాధరం వచ్చాడు.

    వాడిని వాళ్ళింట్లో తప్ప ఎవరూ ఆ పేరుతో పిలవరు. ఊరు ఊరంతా వాడిని 'శ్రీదేవి మొగుడా' అని పిలుస్తారు. పదిహేడేళ్ళు వున్న వాడికి సినిమా యాక్ట్రస్ శ్రీదేవి అంటే అబ్సెషన్ ఎప్పుడూ ఆమె కబుర్లు తప్ప మరో ఊసు మాట్లాడడు.

    "ఏరా శ్రీదేవి మొగుడా! ఏమిటింత ఆలస్యం? ఎక్కడికెళ్ళావ్?" కూర్చోమని పక్కకి జరుగుతూ ప్రశ్నించాడు సుబ్రమణ్యం.

     "బాధగా వుంది, అందువల్లే ఇల్లు వదిలిపెట్టబుద్దికాలేదు" గంగా ధరం రచ్చబండమీద ఉస్సురుమంటూ కూలబడుతూ చెప్పాడు.

    "ఏమైందిరా?"

    "శ్రీదేవి నిన్న అమెరికా వెళ్శింది. ఈ నెల పదిహేడునే తిరిగి రావడం. అంతదూరంనుంచి వచ్చీరాగానే ముంబాయిలో షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది మొత్తం పదిరోజులు షెడ్యూల్. ఇరవై ఎనిమిది నుంచి మంగుళూరులో మోహన్ లాల్ సినిమా. ఈ సినిమా షూటింగ్ అంతా ఊటీలో. పదిహేను రోజులు షెడ్యూల్. అప్పటికిగానీ రెస్ట్ దొరకదు. ముందే తల్లి అనారోగ్యం ఆపైన షూటింగ్ లు. ఎలా తట్టుకుంటుందో ఏమిటో, అదే దిగులుగా వుందిరా" అన్నాడు నిట్టూరుస్తూ.

    ఇదంతా అతను సినిమా పత్రికలలో చదివించే. అయితే శ్రీదేవే స్వయంగా వచ్చి తన ప్రోగ్రామ్ చెప్పినట్టు ఎంతో గాఢతతో చెబుతుంటాడు.

    ఒకసారి శ్రీదేవి చెవిపోటుగా వుందని వార్తవస్తే అతను గిలగిల్లాడి పోయాడు. చెవిపోటువస్తే గురివిందగింజ ఆకును నూరి ఆ పసరుపోస్తే తగ్గిపోతుందని ఆ ఊర్లో వారి వైద్యం. శ్రీదేవికి చెవిపోటని తెలియగానే అతను గురివిందగింజాకు కోసుకుని శ్రీదేవి చెవిలో పోస్తానంటూ మద్రాసుకు బయల్దేరబోయాడు. ఇలాంటి ఆకుపసర్లు శ్రీదేవి చెవుల్లోనో, నోట్లోనో పోసుకోదంటే నమ్మలేదు. గూర్ఖాలు ఇంట్లోకి రానివ్వరని మిత్రులంతా మూకుమ్మడిగా చెప్పడంవల్ల ఆగిపోయాడు. గూర్ఖాల భయం లేకుంటే అతను తప్పకుండా శ్రీదేవి ఇంటికి వెళ్ళుండేవాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS