Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 1

 

                                                        ప్రేమించండి ప్లీజ్
                                                                   ----మేర్లపాక మురళి    
    

                                 
  

   "చెల్లీ! ఇది దుర్మార్గపు లోకం
    బతుకంటే తీరని శోకం....."
    ఆపాట జైలంతా ప్రతి ధ్వనిస్తోంది. ప్రతి ఖైదీ గతాన్ని తట్టి లేపుతోంది.
    ఓ ముసలి ఖైదీ ఆపాట పాడుతున్నాడు. బతికున్నందుకే సిగ్గుపడే మనిషి పాట పాడితే ఎలా వుంటుందో ఆ పాట అలా వుంది ఆయన గొంతులోని విరక్తీ, వేదనా రాత్రికి మరింత గాఢత్వాన్ని పులుముతున్నాయి. ఆత్మీయులకు దూరంగా, తమకు తామే భారంగా వున్న ఖైదీలకు ఆపాట వూరట కలిగిస్తోంది. జీవన పోరాటంలో ఓడిపోయిన వాళ్ళను సేద తీరుస్తోంది. ప్రేమతో కన్నీళ్ళను తుడుస్తోంది.
    ఆంజనేయులు పదకొండో నెంబర్ సింగిల్ సెల్లో పడుకుని వున్నాడు. అతని కళ్ళు మించవు. కానీ అతనికి వ్యతిరేకంగా కుట్ర జరుపుతున్నట్టు అక్కడక్కడా వెంట్రుకలు తెల్లపడ్డాయి. కండలన్నీ జారిపోయి మొత్తం శరీరంమంతా లూజుగా కొలత తక్కువున్న బస్తాలా వుంది కలలుకని బక్కచిక్కిన కళ్ళు ఆరిపోవడానికి సిద్దంగా వున్న ప్రమిదల్లా వున్నాయి నుదురంతా గీతలు పడడం వల్ల అతనిముఖం కురచగా కనిపిస్తోంది. మాసిపోయిన జైలు యూని ఫారమ్ దుమ్ముతో నేసినట్టుంది.
    ముసలి ఖైదీపాట అతనిలో దూరి రక్తాన్ని జిలకొడుతుంది. తన ఒంటరి బ్రతుకునీ, తన దురదృష్టాన్ని పాట ఎత్తి చూపిస్తుంటే గుండెల్లో మంట రక్తప్రసరణకు అడ్డుతగుల్తోంది. అతని కళ్ళు నీటిపొరతో వుబ్బివికారంగా వున్నాయి.
    పాటతోపాటు అతని ఆలోచనలు ఆగదిలో సుళ్ళు తిరుగుతున్నాయి.
    అయిపోయింది తన బతుకు - రేపు వుదయం వురితీశాక ప్రాణం తన దగ్గర శెలవు తీసుకుంటుంది. రేపు ఆరుగంటలకల్లా ఆంజనేయులు అనే జీవి ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాడు ఆ తరువాత తనే మౌతాడు? పునర్జన్మ వుంటుందా? వచ్చే జన్మలో అయినా తను సంపూర్ణం మానవుడిలా పుడతాడా లేక పోతే ఇప్పట్లాగే దరిద్రంతో ప్రేమ కోసం పరితపించి పోతాడా? ఏమౌతాడు తను?
    ఉరి తీయకముందు కూడా తను బతికున్నట్టుకాదు. తను ఎప్పుడో చచ్చిపోయాడు. పుడుతూనే అమ్మను మింగేసిన ఈ రాక్షసుడు పురుటివాసనలోనే చచ్చిపోయాడు 'ఆకలేస్తోంది- అన్నం పెట్టు' అని అడిగినప్పుడు దరిద్రుడికి ఆకలెక్కువ' అంటూ పిన్ని కర్కశంగా కొట్టిన క్షణంలోనే నాన్న ముఖం చూసినప్పుడంతా తను చచ్చిపోయాడు. ప్రాణప్రదంగా ప్రేమించిన మంజుల పెద్దన్నయ్య' అన్న సర్టిఫికేట్ ఇచ్చిన రోజునే పూర్ ఫెలో ఆంజనేయులు చచ్చిపోయాడు.
    మరిక రేపు జరిగే తతంగం ఏమిటి? జీవచ్చవాన్ని వురితీస్తారు.
    అందుకే వురిశిక్ష జడ్జి ముఖం మీదే నవ్వితే - పాపం ఆజడ్జి కంగారుపడ్డాడు.
    ఆంజనేయులు అలా ఆలోచిస్తూనే పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పటివరకు విషాదం మారిన కన్నీళ్ళు డైల్యూట్ అయి కిందకు జారాయి.
    ఒముసలి ఖైదీ! ఆపాట పాడకు. అది చెవులకు సోకుతుంటే ఇంకా బతికున్న భావన కలుగుతుంది. ఇంకా బాధపడే మనసు వుందన్న నిజం తెలిసిపోతుంది. ప్రేమ కోసం గుండె ద్వారాలు తెరుస్తుంది. ఒద్దు ఖైదీ-పాట పాడకు-ప్లీజ్.
    పాట ఆగిపోవాలని ఆంజనేయులు ప్రార్ధిస్తున్నాడు.
    కానీ పాట ఆగటం లేదు. గుండె తడిలో తడిచివస్తున్న పాట విషాదపు కెరటంలా తగుల్తోంది.
    టైమ్ పదకొండు గంటలైనట్టు దూరంగా చర్చిగంటలు విన్పిస్తున్నాయి. రాత్రి మరింత చీకటిని పూనుకుని చిక్కబడింది గాలిని ఖైదీచేసినట్లు వుక్కగా వుంది తక్కువ క్యాండిల్స్ బల్బులు నీరసంగా వెలుగుతున్నాయి. అప్పుడప్పుడు దగ్గరవుతున్న బూట్లచప్పుడు నిశ్శబ్దపు గొంతును తొక్కేస్తున్నట్టుంది.
    ప్రేమలాగే, మృత్యువూ అతన్ని వూరిస్తోంది తప్ప ఇంకా బడిలోకి తీసుకోలేదు. కోర్టులో వురిశిక్ష పడ్డప్పట్నుంచీ అతను చావు కోసం క్షణాల్ని లెక్కపెడుతున్నాడు. ఇప్పటికి నిరీక్షణ పూర్తయింది తెల్లవారితే అతనిని వురితీస్తారు. అయినా అతను చలించడంలేదు. బాధ ఎప్పుడూ రిలటివ్ గా వుంటుంది. ఒక సమస్యరాగానే ముందున్న సమస్యను మరిచిపోతాడు. అతని పరిస్థితీ అంతే తనుచచ్చిపోతున్నానన్న బాధకంటే ప్రేమను పొందకనే ఈ లోకం విజడిచిపోతున్నా నన్న విషాదం అతన్ని మెలిపెడుతోంది.
    ఆంజనేయులు కళ్ళు మూసుకున్నా మెదడు మాత్రం మరింత యాక్టివ్ అయి ఆలోచనల్ని రంగరిస్తోంది.
    తన తప్పుకు, తన నేరానికి వురిశిక్షే కరక్టయిన తీర్పు ప్రేమను ప్రసాదించని ఈ సంఘం పేచీ పెట్టుకుండా మృత్యువునైనా ఇచ్చింది. తను హంతకుడు. ఒక స్నేహితుడ్ని ధారుణంగా చంపేశాడు. ఏ విరోధం లేకపోయినా, తనకు ఏవిధంగానూ అపకారం చేయకపోయినా అతన్ని డాబామీద నుంచి తోశాడు. ఇరవై అడుగులు ఎత్తునుంచి కిందపడిన అతని తల చిట్లింది నిండా ముఫ్ఫై ఏళ్ళు కూడా లేని ఓయువకుడ్ని బ్రూటల్ గా చంపేశాడు.
    ఎందుకు తను ఆసమయంలో అంత దారుణంగా ప్రవర్తించాడు ఎదుటి వ్యక్తి దగ్గర ముడుచుకుపోయి ప్రవర్తించే తను హత్య చేశాడంటే తనకే నమ్మకం కలగడంలేదు జీవితంలో పశ్చాత్తాపం పడే అంతటి విషాదం మరొకటి లేదు కానీ తను మాత్రం నెలరోజుల్నుంచీ కుంగిపోతున్నాడు చీమను చూసి పక్కకు తొలగిపోబోయే తను సాటి మనిషిని హత్య చేశాడు. ఎందువల్ల.....?
    "రేయ్! ఇంకా నిద్రపోలేదా? మరో ఆరుగంటలకు వురితీస్తానని తెలిసిన మనిషి ఎలా నిద్రపోగలడు నావెర్రిగానీ కనీసం లైట్ ఆర్పెయ్." సెంట్రీ అరవడంతో ఉలిక్కిపడ్డట్లు లేచాడు ఆంజనేయులు.
    గది ముందు ఖైదీ పాట ఎప్పుడు ఆగిపోయిన్ద్జో తెలియదుగానీ జైలంతా తనలో తానే ముడుచుకు పోయినట్టు నిశ్శబ్దంగా వుంది.
    అతను చేతులతో తుడుచుకుంటూ సిమెంట్ దిమ్మవరకు వెళ్ళాడు కంటాన్ని తలగడలా పెట్టుకుని పడుకున్నాడు.
    మళ్ళీ ఆలోచనలు అతన్ని పీక్కుతింటున్నాయి.
    తను హంతకుడిగా మారతాడని ఎప్పుడైనా అనుకున్నాడా తను.
    చంపేసే వరకు గుండెల్లో అంత దానవత్వం వుంటుందని వూహించలేదు. పబ్లిక్కుగా ఓ ఆడపిల్ల సాక్షిగా తను హత్య చేశాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS